సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మే 2018, బుధవారం

శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…


బ్రహ్మవిద్యయైన శ్రీవిద్యను నేర్చుకోవాలంటే ఎంతో పుణ్యఫలం ఉండాలి. ఇక్కడ నేర్చుకోవడం అని అనడం కన్నా ఉపాసించడం అనడం సరియైనదని నా అభిప్రాయం. అయినా నా అభిప్రాయాలతో చాలా మందికి అవసరం లేదులెండి.

నేనేదో గొప్ప ఉపాసకుడని కొంతమంది నా దగ్గరకు శ్రీవిద్యను నేర్చుకోవడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. అలా వచ్చిన వారిని నేనడిగే ప్రశ్న ఒక్కటే. మీరు ఎందుకు శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నారని అడుగుతాను. చాలామంది ఇచ్చే సమాధానాలు ఇలా ఉంటాయి. అమ్మవారంటే చాలా ఇష్టమని, అమ్మవారంటే తమకు గొప్పభక్తిఅని, లలితాసహస్రనామాలు చాలా రోజులనుండి చదువుతున్నాము ఇప్పుడు ఇంకా బాగా కొత్తగా అమ్మవారి సేవ చేయాలనిపిస్తోందని, ఏమో ఎందుకో తెలీదుకాని మాకు ఈ విద్య నేర్చుకోవాలని చాలా బలంగా కోరికగా ఉందని, తమ భౌతికమైన/లౌకికమైన కోరికలు తీర్చుకోవడానికి ఈవిద్య ఒక రాజమార్గమని ఇలా రకరకాల సమాధానాలు ఇస్తుంటారు. ఇలాంటి సమాధానాలు విన్న, అలా చెప్పినవారిని చూసిన నాక్కొంచెం జాలిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవేవీ శ్రీవిద్యను ఉపాసించడానికి అర్హతను కలిగించవు.

సరే, అమ్మవారంటే భక్తి అని అంటున్నారు గనుక, వారిని నిరుత్సాహపరచడం ఇష్టం ఉండక వారికి శ్రీవిద్య అంటే ఏమిటో ప్రాధమిక (బేసిక్స్) అంశాలను వివరిస్తాను. వారంతా చాలా శ్రద్ధగా వింటున్నట్టు కనిపిస్తారు (నటిస్తారు). వారి దృష్టిమాత్రం ఈయన ఎప్పుడెప్పుడు మాకు మంత్రాలు ఇచ్చెస్తారా, మనం ఎప్పుడప్పుడు గొప్ప మంత్రవేత్తలమైపోతామా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువ కాలం ఉపాసన చేయలేరని నాకనిపిస్తూనే ఉంటుంది. చాలా సందర్భాలలో అది నిజమైంది కూడా. నా సోది అంతా విన్న తర్వాత వారు ఈ విద్యకు పాటించవలసిన నియమాలేంటని అడుగుతారు. నీతి కలిగి ఉండాలి, సత్యమార్గాన్ని విడువకూడదు, నియమిత సురతమును మాత్రమే చేయాలి, ప్రతిరోజూ మంత్రసాధన చేయాలి, అమ్మవారికి పూజాదికాలు ప్రతిరోజూ చేయాలి, భోజనాదులకు సంబంధించిన నియమాలు పాటించాలి, మద్యము, మాంసము ముట్టకూడదు, స్త్రీల బహిష్టు నియమాలు పాటించాలి, ఆసమయమందు వారికి దూరంగా ఉండాలి, వారి చేతి వంట తినరాదు, త్రికాల సంధ్యావందనాదులు చెయ్యాలి, అతిముఖ్యంగా గురుభక్తి కలిగి ఉండాలి, గురుమాట జవదాటరాదు, గురువును తరచూ సంప్రదించి విద్యకు సంబంధించిన విషయాలను అడగి తెలుసుకుంటూ ఉండాలి, సాధనా సమయంలో ఏర్పడే కష్టనష్టాలకు గురువును గాని, దేవతను గాని బాధ్యులుగా చూడరాదు ఇలా మరికొన్ని నియమాలను చెప్పి అవి మీరు పాటించగలరా? అని అడగ్గానే వారు వెంటనే అన్నీ పాటించేస్తామని మరే ఆలోచనా లేకుండానే సమాధానమిచ్చేస్తారు. నేను ఊహించిన ఆ సమాధానం విన్న వెంటనే నాకు నవ్వువస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్రాధమిక నియమాలను వారు పూర్తిగా అవగతం చేసుకోకుండానే వారు సమాధానం చెబుతారు కనుక.

సరే, నేను నా గుర్వాజ్ఞను అనుసరించి, వారికి విద్యను ఉపదేశించడానికి అంగీకరించి ఫలానా రోజున, ఫలానా టైంకు రమ్మని చెబితే వారు ఠంచనుగా చెప్పిన టైంకు ముందే వచ్చేస్తారు. దానికి కారణం వారి ఆతృత మాత్రమే. అది నేను గ్రహించినా వారు గ్రహించరు. ఆతృత అన్నడానికి కారణమేమిటంటే ఈ విద్యార్ధులను తర్వాత్తర్వాత ఎప్పుడైనా నవావరణ పూజకో లేకా మరియేదైనా పూజకో రమ్మని పిలిస్తే వారు తమకు తీరికలేదనో, లేదా పూజకు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఓ పది నిముషాలో, అరగంటో కూర్చొని మరిక టైం లేనట్టు వెళ్ళిపోతారు. ముందు రోజుల్లో ఉన్న ఆతృత తర్వాత రోజుల్లో ఉండదన్నది తిరుగులేని సత్యము. మంత్రోపదేశం తీసుకోవడానికి పది నిముషాలు పడుతుంది. అదే చక్రోపాసన నేర్చుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ముందు బీరాలు పలికినట్టుగా వారు అంత సమయము వెచ్చించడానికి తయారుగా ఉండరు. కనుక చక్రపూజ నేర్చుకోవడమన్నది నత్త నడక నడుస్తుంది. ఇక వీరి మంత్రోపాసన ప్రహసనం చూద్దాం. మననాన్ త్రాయతి ఇతి మంత్రః అనునది శాస్త్రవచనం కదా. అనగా మననం చేయగా చేయగా అది ఆ సాధకుని రక్షిస్తుందని అర్ధము. మంత్రసాధన చేయగా చేయగా అది సిద్ధిస్తుంది. అది సిద్ధించాలంటే నిరంతరం మంత్రసాధన చెయ్యాలి. ఇక్కడే పెద్ద చిక్కు ఉంది. మంత్రోపదేశం పొందగానే వారు గురువుగారూ ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు చదవాలి? అని అడుగుతారు. మంత్రాన్ని చదవడంకాదు, ఉపాసించాలని చెప్పి, శాస్త్రప్రకారం కనీసం 1008 సార్లు లేక, 300సార్లు లేక 108సార్లు చేయాలని చెబుతాను. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా నిజమైన కారణంచేత 108సార్లు కూడా కుదరకపోతే కనీసం పదిసార్లైనా ఉపాసించండి అని చెబుతుంటాను. వారు ముందువన్నీ ఒదలిపెట్టి చివరదైన పదిసార్లు పట్టుకొని రోజూ ఒక నిముషంపాటు ఏదో తూతూ మంత్రంగా ఆ మంత్రాన్ని అప్పచెప్పినట్టుగా చదివేసి హమ్మయ్య నేను సూపర్ సాధన చేసేస్తున్నానని గొప్పగా ఫీలైపోయి వెళ్ళి టి.వి. ముందో పనికిరాని వార్తాపత్రికముందో కూర్చొని కాలం వెళ్ళబుచ్చుతారు. నిజానికి ఒక మంత్రము సిద్ధించాలంటే ఆ మంత్ర సాధనా పద్ధతి తెలుసుకోవాలి. ప్రాధమిక స్థాయిలో ఏ విద్యార్ధికీ ఆ రహస్యాలు చెప్పబడవు. ఎందుకంటే వారు నిజంగానే పూర్తి నమ్మకంతో, గురుభక్తితో, గురువాక్యమందు విశ్వాసం ఉంచి మంత్రోపాసన చేస్తే కొన్నాళ్ళకి వారికి ఆ మంత్రరహస్యాలు తెలుసుకోవాలని మనసులో బలంగా అనిపిస్తుంది. అప్పుడు వారు గురువుదగ్గరకు పరిగెడుతారు. అప్పుడు మాత్రమే వారికి రహస్యాలు చెప్పబడుతాయి. అప్పటి నుండి వారి ఉపాసన ఫలించడానికి బీజం పడుతుంది. ఇలాంటి శిష్యులు ఎంతమంది ఉన్నారు?

కొంతమంది శిష్యులకు గురువుతో మాట్లాడడనికే తీరిక దొరకదు. ఇక ఆయన దర్శనానికి వారికి టైం ఎక్కడ ఉంటుంది. మరికొందరు గురువుతో విద్యకు సంబంధించిన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతుంటారు. విద్యారహస్యాలను తెలుసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపరు. మరికొందరు గురువు చెప్పిన ప్రాధమిక నియమాలను ఆచరణలో పెట్టలేక గురువుకు దూరమవుతారు. మరికొందరు గురువును ఊరకే పొగడుతూ అలాచేస్తే తమకేదో గురువు ఒరగపెట్టెస్తారన్న భ్రమలో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. మరికొందరు గురువును కలవాలి కలవాలి అని అనుకుంటూనే ఉంటారు కాని వారికి అలా చేయడానికి సమయము, ధనము అందుబాటులో ఉండవు. మరికొందరు గురువుగారు ఇప్పుడు బిజీగా ఉంటారేమో, ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో… పోనీ ఇంకెప్పుడైనా మాట్లాడుదాములే అని వారంతటవారే గురువుగురించి ఊహించేసుకొని సమాధానపడిపోయి మాట్లాడుదామనే కార్యక్రమాన్ని వాయిదా వేసేస్తూ ఉంటారు. మరికొంతమంది ఘనులు గురువు ఫోన్ చేస్తే ఎంతసేపైనా మాట్లాడుతుంటారు కాని వారు మాత్రం తమంత తాము ఆయనికి అస్సలు ఫోన్ చేసి మాట్లాడరు. ఎందుకంటే ఫోన్ బిల్లు ఎక్కువైపోతుందని వారి భయం. తమ ఇటువంటి హిపోక్రటిక్ ప్రవర్తన ద్వారా వారు ఏమి సాధిస్తారు? ఇలా కొన్నాళ్ళు మంత్రాలను చదివి ఛట్…మంత్రాలకి చింతకాయలు రాలవు…ఇదంతా ఉత్త టైంవేస్ట్ పని అన్న భావనకు వచ్చేస్తారు.

డామిట్…ఉపాసన అడ్డం తిరిగింది…..


అందుకే శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా…


3 కామెంట్‌లు:

SAI BABA AARTI చెప్పారు...

తల్లి కి ఎంతమంది సంతానం ఉన్న అందరి మనస్తత్వం తెలుసు .తల్లి కి గురువు కి తేడా లేదుకదా . శిష్యుల గురించి చక్కగా వివరించారు

SAI BABA AARTI చెప్పారు...

ఏ విద్య అయినా నేర్చుకుంటే వస్తుందేమో కానీ శ్రీవిద్య బ్రహ్మ విద్య . సాధన తో ఆచరణ లో అనుభవంతో తెలుసుకునే విద్య .బ్రహ్మమును తెలుసుకునే విద్య శ్రీవిద్య .

ఫణి భాస్కర శర్మ  చెప్పారు...

చలా మంచి విశయములు ప్రచురించినన్దుకు ధన్యవాదములు...