సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, డిసెంబర్ 2019, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - పరిచయం



శ్రీవిద్యార్ణవ తంత్రము
(శ్రీవిద్యారణ్య విరచిత)
పరిచయం:

శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితామహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్ర శాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదాః అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు.

ఈవిద్య గురించి చాలా గ్రంధాలలో చెప్పబడినది. వాటిలో అరవై నాలుగు తంత్రములు, శుభాగమ పంచకములు ముఖ్యమైనవి. ఇన్ని గ్రంధాలను చదివి, అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టకోవడం ఈరోజుల్లో మనబోటి వారికి చాలా కష్టము. అందువలనేమో శ్రీవిద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీవిద్యారణ్యస్వామి భవిష్యత్తుని ఊహించి భావితరాలవారికి సులభంగా అర్ధమయ్యేటట్టుగా అన్ని తంత్ర శాస్త్రాలను క్రోడీకరించి  "శ్రీవిద్యార్ణవ  తంత్రమును" మనకు అందించారు. సాధకలోకం ఆ పుణ్యపురుషునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండుగాక.

ఈ తంత్రమును నాకు తెలిసినంత వరకు ఎవరూ తెలుగులో అనువదించలేదు. ఈ తంత్రమును కొంతమంది పండితులు, సాధకులు హిందీ భాషలో అనువదించారు. అందరికీ సంస్కృతము, హిందీ భాషలు రాకపోవచ్చును. నేను మొదటి సారిగా మా గురువుగారు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీ శ్రీ శ్రీ శ్రీపాద జగన్నాథ స్వామి గారు) ముఖతః ఈ గ్రంధం గురించి విన్నాను. కానీ అవి తెలుగేతర భాషలో ఉండడం వలన, నాకు ఆయా భాషలు రాకపోవడం వలన కొంత నిరుత్సాహం చెందాను. పూర్ణాభిషేకం అయిన కొన్ని సంవత్సరాల సాధన తర్వాత నాకు శ్రీవిద్య గురించి ఇంకా తెలుసుకోవాలని మనస్సు నందు ఉధృతమైన కోరిక జనించగా, మా గురువు గారి దగ్గర నా మానసిక క్షోభను మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఈ తంత్రము నందు శ్రీవిద్యగురించి సమస్త విషయములు కలవు అని నన్ను ఈ శాస్త్రమును అధ్యయనం చేయమని సలహా ఇచ్చారు. నాకా సంస్కృతం రాదు. హిందీ అంతంత మాత్రము. అక్షరములు మాత్రము గుర్తుపట్టగలను. ఇదే విషయాన్ని గురువుగారికి నిస్సంకోచంగా విన్నవించుకున్నాను. అప్పుడు ఆయన నీవు మొదలు పెట్టు అన్నీ అవే అవగతమవుతాయని ఆశ్వీరదించారు. ఇంకేమి, గురువుగారి ఆశీర్వచనం లభించింది, మనస్సులో అమ్మ ప్రేరణ ఇస్తోంది. ఇంకేమి కావాలి. ఈ శాస్త్రాన్ని తెప్పించుకొని ఒక శుభముహూర్తమున చదవడం ప్రారంభించగా గురువుగారి ఆశీర్వచన బలం, అమ్మ దయా, కరుణా కటాక్షవీక్షణాల దీవెనల వలన నాకు ఈ గ్రంధము కొద్ది కొద్దిగా అర్ధమవడం ప్రారంభించింది. అప్పుడే ఈ గ్రంధాన్ని తెలుగులో రాసుకోవాలని అనిపించగా, గురువుగారికి ఇదే విషయాన్ని విన్నవించుకున్నాను. ఆయన ఎంతో సంతోషించి "తధాస్తు" అని దీవించి తప్పక రాయమని ప్రోత్సహించారు. అమ్మకు, గురువుకు అభేదము. శ్రీవిద్యలో ఇది మొదటి పాఠము. సద్గురువు ఆశీర్వచనము అంతటి బలమైనది. లేకపోతే సంస్కృత, హిందీ భాషలు రాని నేను ఈ గ్రంధమును తెలుగులో అనువదించడం ఏమిటి? కనుక, ఈ అనువాదం నాది కానే కాదు అని సవినయంగా పాఠక లోకానికి తెలియ పరచుకుంటున్నాను. ఇది అమ్మ ప్రేరణ మాత్రమే. ఇందులో తప్పులు మాత్రం నావి. వాటిని పాఠకులు,  పండితులు, సాధకులు సహృదయంతో అర్ధం చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.


శ్రీ ప్రకాశానందనాథ (శ్రీ శ్రీ శ్రీ శ్రీపాద జగన్నాథ స్వామి) గారి శిష్యుడు
భువనానందనాథ (ఆయలసోమయాజుల ఉమామహేశ్వర రవి)

8 కామెంట్‌లు:

RamaKrishna చెప్పారు...

Sri Gurubhyo Namaha

Unknown చెప్పారు...

శ్రీ గురుభ్యో నమః

అజ్ఞాత చెప్పారు...

Please please please write in simple telugu, like the telugu written in Eenadu/Saakshi. Graandhika basha lo raaste chadavatam chala kashtamga untundi. Enno books India nunchi teppistaamu kaani, annee graandhika bashalo undatam valla chadavaleka pothunnaamu. Thank you

అజ్ఞాత చెప్పారు...

Ravi gaaru, VidyanarayanaYati who wrote Srividyarnava Tantram is different from the Vidyaranya who established Vijayanagar Empire.

shrIvishNusharmaNaH shiShyaH pragalbhAcharyapaNDitaH |
tacChiShyeNa mayA prokte granthe.asmin pUrNatAM gate ||

The author of shrIvidyArNava tantra is one vidyAraNya, a disciple of pragalbhAchArya, who in turn is a disciple of viShNu sharman.

Please see this article
https://www.kamakotimandali.com/sringeri/srividyarnava.html

భువనానందనాథ చెప్పారు...

మీరు చెప్పిన విషయము కొద్దిగా వివాదము కలిగి ఉంది. కొందరు ఈ విద్యారణ్యులు ఇద్దరూ ఒక్కటే అని మరికొందరు కాదు అని అంటారు.
ఈ గ్రంధంలోని లక్ష్మణదేశిక వృత్త వర్ణనలో విద్యారణ్య స్వామి శ్రీవిద్యానగరమును నిర్మించారని చెప్పబడింది. పూర్తి కథనం రాబోవు పోస్ట్ లో ఉంటుంది.
ఆ విద్యానగరమును ప్రౌఢదేవుని పుత్రుడు అంబదేవుడు పరిపాలించినట్టుగా చెప్పబడినది.
అయితే ఆ విద్యానగరము, రాయలవారు పరిపాలించిన విద్యానగరము ఒకటో కాదో నాకు తెలియదు.నేను ఈ గ్రంధంలో ఉన్నది మాత్రమే రాశాను.
మీ యొక్క పాయింట్కు నా ధన్యవాదములు.

భువనానందనాథ చెప్పారు...

అయ్యా! వాడుక తెలుగును మాత్రమే రాస్తున్నాను. ముందు రాబోవు విషయములు అన్నీ వాడుక తెలుగులోనే ఉంటాయి.

అజ్ఞాత చెప్పారు...

చాలా థాంక్స్ అండి రవి గారు ��

అజ్ఞాత చెప్పారు...

ధన్యవాదములు రవి గారు.