కస్మైదేవాయ హవిషా విధేమ - అనునది వేదవాక్యం. ఏ దేవునికి
హవిస్సులు సమర్పించాలని పూర్వమున ఋషులు ప్రశ్నవేశారు. ఈ చరాచర జగత్తు అంతటినీ ఒక
దైవ శక్తి ఆవరించి ఉందని విశ్వాసం కలిగిన భక్తునికి ఈ దేవుడు ఆ దేవుడని ఆలోచన గాని
భేదభావం గాని ఉండదు. సూక్ష్మ ప్రపంచములో ఎన్నో శక్తులు సాధకుడిని అనుగ్రహించడానికై
ఉన్నాయి. వాటిలో కొన్ని దిగువస్థాయి శక్తులు మరియు ఉన్నత స్థాయి శక్తులు ఉంటాయి. దిగువ
స్థాయి శక్తులు సాధకుని చిన్న చిన్న కోరికలు తీరుస్తూ వారిని ఒక రకమైన మాయా ప్రపంచంలోకి
తీసుకొని పోయి, ఏదో
గొప్ప సాధనాభివృద్ధి కలిగినట్టు భ్రాంతిని కలగచేసి చివరికి అతడిని నాశనం చేస్తాయి.
ధర్మగుణముగల, దయాళువులైన దేవతలు మాత్రము సాధకుడిని
సాధనామార్గములో నిలకడగా అభివృద్ధి పరుస్తూ, భద్రముగా, సురక్షితముగా అతడికి నిజమైన బ్రహ్మతత్త్వమును తెలియపరచుతాయి. ఈ చరాచర
ప్రపంచమంతా దేవుళ్ళు మరియు దేవతలతోనే సంపూర్ణముగా నిండి ఉంది. విశ్వమును ఒక
పిరమిడాకృతిగా భావిస్తే ఆ ఆకృతిలో ఆయా దేవతలు ఒక వరస క్రమంలో ఉంటారు. ఆ ఆకృతికి
పైన ముఖ్యమైన - సత్యమే ప్రధాన లక్షణమైన, ఉపనిషత్తులచే
బ్రహ్మముగా తెలుపబడిన ప్రధాన దేవతలు ఉంటారు. ఏ
ఆధ్యాత్మిక శిక్షణలు/ ఉపదేశములు/ క్రమశిక్షణలు/ సాధనలు ఒక సాధకుడిని ఆ
ప్రధాన దేవతల దగ్గరికి తీసుకొని వెడతాయో ఆ ఆధ్యాత్మిక సాధనలనే బ్రహ్మవిద్యలు అని
అంటారు. ఈ విద్యలను మహావిద్యలని, సిద్ధవిద్యలని అంటారు.
ఏ పరమ
సర్వశ్రేష్ట దైవీ శక్తి కలదో ఆ శక్తిని తంత్రములు దశమహావిద్యలుగా వర్గీకరించాయి. ఈ
దశమహావిద్యలలో మూడవదే శ్రీవిద్య. ఈ విద్యాధిష్టాన దేవతయే త్రిపురసుందరి.
త్రిపురసుందరి అనగా మూడు పురములకు (లోకములకు) సాటిలేని అద్భుత సౌందర్యము కలదని
అర్ధము. అయిదవ విద్య అయిన త్రిపురభైరవి మరియు పదవవిద్య అయిన శ్రీకమలాత్మిక
విద్యలకు మరియు శ్రీవిద్యకు కొన్ని దగ్గర పోలికలు ఉండడం వలన ఆ విద్యలను కూడా
శ్రీవిద్యలని అంటారు. ఈ వ్యాసములందు త్రిపురసుందరీ విద్య అయిన శ్రీవిద్యగురించి
చర్చించబడుతోంది.
ఇంకావుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి