సూక్తి

భోగములయందు విముక్తి, ఆత్మ విచారమందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, ఏప్రిల్ 2018, గురువారం

ఛిన్నమస్త


ఛిన్నమస్తవైశాఖ పౌర్ణమి శ్రీఛిన్నమస్త ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

దశమహావిద్యలలో చాలా ప్రస్తమైన దేవత ఛిన్నమస్త. తన శిరస్సును తానే ఖండించుకున్న దేవతగా ప్రసిద్ది. అలా ఖండించబడిన మొండెమునుండి మూడు రక్తధారలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో మధ్యధారను తానే తన నోటితో త్రాగుతూ ఉంటే ఎడమ, కుడి ధారలను తన చెలికత్తెలైన వర్ణిని, ఢాకినిలు త్రాగుతూ ఉంటారు. ఈ దేవతోపాసన వామాచారమార్గంలో చాలా త్వరగా సిద్ధిపొందుతుంది. ఈ దేవతా మంత్రములో వజ్రవైరోచని అన్న శబ్దము చాలా ముఖ్యమైనది. వజ్రాయుధము ఇంద్రుని ఆయుధము. వజ్రవైరోచని అతని యొక్క శక్తి. ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఇంద్రాణి. ఆమెయొక్క భీషణరుపమే ఛిన్నమస్త. మరికొన్ని కధలప్రకారము, జమదగ్ని భార్య అయిన రేణుకాదేవినే ఛిన్నమస్తగా చెబుతారు.

ఈ దేవతా సాధన చాలా రహస్యంగా చేస్తారు. సాధారణంగా వామాచార తంత్రములన్నీ రహస్యంగానే చేస్తారు. శక్తిదేవతలలో ఈదేవతను మించి భయంకరమైన దేవతలేదని కొందరి సాధకుల అభిప్రాయము. శ్మశానంలోగాని, శవంపై కూర్చొనిగాని ఈ దేవతా మంత్రసాధన చేయాలి. చైనాదేశంలో ఈ సాధకులు ఎక్కువగా కనిపిస్తారు. బౌద్ధమతంలో ఈదేవతోపాసన చాలా ప్రాశస్త్యం పొందింది. ఈ దేవతోపాసన వలన కామమును జయించు శక్తి కలుగుతుంది. కాలజ్ఞానం కూడా కలుగుతుంది. పైన చెప్పబడిన మూడు రక్తధారలను సుషుమ్న, ఇడ, పింగళలుగా భావించాలి. దక్షిణాచారపరులు తమ గృహమునందుగాని, దేవాలయమునందుగాని ఈ దేవతాసాధన చేస్తారు. శ్రీగణపతి మునిగారు ఈ దేవతామంత్ర సాధనలో సిద్ధిపొందిన ప్రసిద్ధులు.

(ఈ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన వైశాఖ పౌర్ణమి. దీనినే బుద్ధపూర్ణిమ అని కూడా అంటారు)

కామెంట్‌లు లేవు: