సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, జనవరి 2020, మంగళవారం

బ్రహ్మమును గురించి వివేచన ఎప్పుడు కలుగుతుంది?


శీలము, శుద్ధి మార్గములో సాధన ద్వారా బ్రహ్రమును తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. సంధ్యావందన, ఆరాధన, జప, స్తోత్రపారాయణ అను ఈ నాలుగింటినీ సాధనా సమూహముగా తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఏ జీవుడైతే క్రమశిక్షణతో ఈ సాధన చేస్తాడో అతనికి బ్రహ్మమమును గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ఈ జిజ్ఞాసే ముందు చెప్పబడిన సాధనా ఫలం. అంతేగాని లౌకిక కోరికలు తీరడం సాధనా ఫలం కాదు. అయితే ఈ జిజ్ఞాస కలిగినంత మాత్రముననే ఆ సాధకునికి బ్రహ్మము తెలియబడదు. ఈ జిజ్ఞాస, బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసిన సాధనా చతుష్టయమును సాధించడానికి మార్గమేర్పరుస్తుంది.
నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వము - ఇవి సాధనా చతుష్టయము.
ముందు చెప్పబడిన సంధ్యావందనాది సాధన భక్తి శ్రద్ధలతో చేయగా చేయగా, ఆ సాధకునికి నిత్యానిత్య వివేకము మొదలగు సాధనా చతుష్టయము నందు బుద్ధి నిలుస్తుంది. ముందుగా ఈ సాధనా చతుష్టయము గురించి తెలుసుకుందాము.

1) నిత్యానిత్య వివేకము: ఏది సత్యము, ఏది అసత్యము? ఏది నిత్యము? ఏది అనిత్యము? అనే విషయ పరిజ్ఞానము కలగడం.

లౌకిక కోరికల గురించి గాక నిమిత్తమాత్రులై నిత్యమూ ఎవరైతే పూజాది కర్మలు ఆచరిస్తారో వారికి తప్పకుండా ఈ పరిజ్ఞానము కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో పూజలంటే లౌకిక కోరికలకు మాత్రమే అని ప్రచారం చేయబడుతూ, ఆచరించడం శోచనీయము. ఇటువంటి పూజల వలన ఏమి ప్రయోజనము కలుగదు ఉత్త కాలహరణము, ధనహరణము తప్ప. మరొక్క విషయము. కొంతమంది పూజలే అక్కర్లేదనీ, కర్మ అవసరం లేదనీ ప్రచారం చేస్తూ, తమకు నచ్చిన దేవునిదో లేదో మరెవరిదో నామమును మాత్రం జపిస్తే చాలని బ్రహ్మము తెలిసిపోతుందని, మోక్షం లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. వీరంతా అరుణము లో "నామనామైవ నామమే" అనగా పేరు పేరు మాత్రమే. ఉత్త పేరును జపించడం వలన ఒరిగేది ఏమీ లేదు అని చెప్పబడిన సంగతి విస్మరిస్తున్నారు. కాలమహిమ.

2) వైరాగ్యము: భోగ్య పదార్ధముల మీద అసహ్యం కలగడం.
సాధకుడు విషయవాంఛ లోలితుడైనంత వరకు బ్రహ్మజ్ఞానం కలగదు. నిత్యానిత్య వివేకము చేయగా చేయగా విషయవాంఛలు  ఎంత విషమో తెలుస్తుంది.

3) షట్సంపత్తి: ఇవి ఆరు.
      అ) శమము = అంతరింద్రియ నిగ్రహము
      ఆ) దమము = బాహ్యేంద్రియ నిగ్రహము
      ఇ) ఉపరతి = శాస్త్ర విహిత కర్మలను వైరాగ్య దృష్టితో విడిచిపెట్టడం.
      ఈ) తితీక్ష = ఓర్పు, సహనము కలిగి ఉండడం.
    ఉ) శ్రద్ద = గురువునందు ఆయన చెప్పే విషయాలందు విశ్వాసము కలిగి ఉండడం
     ఊ) సమాధి/సమాధానం = బుద్ధిని ఎల్లప్పుడూ బ్రహ్మము మీదే నిలిపి ఉండడం
ఈ ఆరింటిని కూడా సాధించాలి. కానీ నేడు కాలం ఎలా ఉందంటే వీటిని సాధించకుండానే తాము బ్రహ్మవేత్తలం అయిపోయామని, మేమే దేవుళ్ళమని ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది వారిని గుడ్డిగా అనుచరిస్తూ తమని తాము మోసగించుకుంటున్నారు. పైన చెప్పిన వాటిలో ఉపరతిని కాస్త గమనించండి. శాస్త్రవిహిత కర్మలను ఎప్పుడు వదిలిపెట్టాలి? ఆయా కర్మలను బహుకాలం ఆచరించి, ఆయా కర్మలను అద్వైత సారముగా అవగతము చేసుకున్న తర్వాత వాటిని విడిచిపెట్ట వచ్చు. అంతేగాని మొదటి నుండి కర్మే అవసరం లేదని ప్రచారం చేస్తూ వాటిని విస్మరించడం వలన ఏమాత్రం ఉపయోగము లేక బ్రహ్మజ్ఞాన విఘాత ప్రమాదము ఉంది.
ఇక శ్రద్ధ. ఈ విషయము గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఎవరికీ నిజమైన గురువు అక్కరలేదు. డాబు, దర్పము ఉన్న కుహనా వ్యక్తులే గురువుగా కావాలి. ఎన్ని నీచమైన మాజిక్లు చేస్తే అంత పెద్దగురువు. 
నిజమైన గురువు లక్షణాలు, అలాగే నిజమైన శిష్యుని లక్షణాలు శ్రీవిద్యార్ణవతంత్రము నందు చెప్పబడును.

4) ముముక్షత్వము:  మోక్షం పొందాలనే కోరిక కలిగి ఉండడం. శరీరానికి అహంకారాది అజ్ఞాన బంధనాలెన్నో. ఇలాంటి బంధనాలను వదిలించుకోవాలి.

పైవాటిని సాధించగలిగితే "అథాతో బ్రహ్మజిజ్ఞాసా" అనగా బ్రహ్మమును తెలుసుకొనడానికి వివేచన, విచారణ, అర్హత కలుగుతాయి. అంతేగాని మరేవిధంగానూ తెలియరాదు. 

22, జనవరి 2020, బుధవారం

శ్యామలానవరాత్రులు


మాఘమాసం - శ్యామలా నవరాత్రులు
           



దక్షిణాయనంలో కార్తీకం ఎంత పవిత్రమో ఉత్తరాయణంలో మాఘమాసం అంత పవిత్రం. ఈ మాసం సూర్యోపాసకులకు చాలా ముఖ్యమైనది. అయితే, దేవీ ఉపాసకులు అందునా శ్రీవిద్యోపాసకులకు కూడా ఈ మాసం ఎంతో ముఖ్యము. శ్రీలలితా అమ్మవారి మంత్రిణి అయిన శ్రీ రాజశ్యామలా నవరాత్రులు ఈ మాసం శుక్ల ప్రతిపత్తి నుండి నవమి వరకు ఉండును. ఆయా సాధకులు ఈ నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రాజశ్యామలా దేవిని ఉపాసిస్తారు. ఈమెనే మాతంగి అని కూడా అంటారు. ఈమె మంత్రోపాసన, ఆవరణ పూజ, హోమము అధ్బుతమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈమె మంత్రోపాసన వలన "విషంగుడు" అను ప్రాపంచిక విషయాభిలాషి, విషయములందు విషపూరిత దృష్టి కలవాడు నశించును. అనగా, సాధకునిలో ఆయా భావములు నశించి నిర్గుణ బ్రహ్మమైన పరతత్వము తెలుసుకోవడానికి దారి సుగమవుతుందని అర్ధము.

ఈ నవరాత్రుల్లో మరొక ముఖ్యమైన రోజు సప్తమి తిథి ఉన్న రోజు. ఈ రోజునే రథసప్తమి అని అంటారు. సూర్య భగవానుని పుట్టిన రోజుగా చెబుతారు. ఈ రోజు ఆయనకు తర్పణములు వదలడం, సూర్య నమస్కారాలు చెయ్యడం చాలా పుణ్యఫలప్రదం. సూర్య ఆవరణ పూజ చేసి తృచ, సౌరములతో తర్పణములు, తృచ, సౌరము, అరుణములతో నమస్కారములు చేసి, హోమము చేస్తే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది.

ఈ మాసములో మరియొక ముఖ్యమైన రోజు పౌర్ణమి. ఈ రోజును సాక్షాత్ శ్రీలలితా మహాత్రిపురసుందరి ఉద్భవించిన రోజుగా కొందరు చెబుతారు. వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామలా నవరాత్రుల యందు ఉపాసనా ఫలితంగా రజోగుణము, తమోగుణము, సత్త్వగుణము నశించబడి ఆ సాధకుడు నిర్గుణ పరబ్రహ్మమైన శ్రీ లలితా పరాభట్టారిక సన్నిధికి ఈ పూర్ణిమ నాడు చేరుకోవడమే ఆయా నవరాత్రుల ఉపాసనా రహస్యము.

(ఈ సంవత్సరం తే 25.01.2020ది నుండి మాఘమాసం ప్రారంభమవుచున్నది.
శ్యామలానవరాత్రులు 25.01.2020 నుండి 03.02.2020 వరకు
రథసప్తమి తే 01.02.2020 ది
పౌర్ణమి: తే 09.02.2020 ది.) 

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 4


కాదిమత గ్రంధములు

కాదిమతములో విఖ్యాతములైన గ్రంధములు నాలుగు. అవి తంత్రరాజ తంత్రము, మాతృకార్ణవము, త్రిపురార్ణవము మరియు యోగినీహృదయము. వీటిలో తంత్రరాజ గ్రంధము సుదర్లభము (దొరుకుటలేదు)
ఇవి కాక, కాళీశక్తి మతము కూడా ప్రసిద్ధమైనది.
ఈ రెండు మతముల పరిజ్ఞానమును అందించుటకై శంకరుడు మానవ శరీరమును ధరించెను.
ఈ రెండు మతముల సమన్వయముతోనే ఉర్ధ్వామ్నాయమును క్రమబద్ధీకరించబడినది. గురువు చూపిన మతానుసారముగా సాధక శ్రేష్ఠులు సాధన చేయవలెను. మతములను కల్తీ చేయరాదు. అలా చేసినచో సిద్ధి కలగదు.
కామరాజ విద్య కొరకు కాళీమతానుసారము గురుక్రమమును తెలుసుకొని ఉపాసన చెయ్యాలి. ఈ మతము యొక్క గురుక్రమము క్రింద చెప్పబడుచున్నది.

కామరాజ విద్యయందు కాళీమత గురుక్రమము:

ఈ మతమునందు తొమ్మిది గురువులు కలరు. వారు,
ప్రహ్లాదానందనాథ, సనకానంద, వశిష్ఠానందనాథ, కుమారానంద, క్రోధానంద, శుకానంద, ధ్యానానంద, బోధానంద, సురానంద.

కులగురువుల ధ్యాన మంత్రము:

అన్ని కుల గురువులు ద్వినేత్రులు, ద్విభుజులు. చేతులందు వర మరియు అభయ ముద్రలు ఉండును.
దివ్యౌఘః - చిద్రూప, చిన్మయ, చిత్శక్తి
సిద్దౌఘః - ప్రబోధ, సుబోధ, అనంత
మానవౌఘః - సుధామ, త్రిమూర్తి, ఝింటీస
వీరి మంత్రములకు ముందు ధృవ(=ఓం), త్రితారి, ఆనందనాథ, ఆ తర్వాత పాదుకాం పూజయామి ఉండాలి.
ఉదా: ఓం ఐం హ్రీం శ్రీం చిద్రూపానందనాథ పాదుకాం పూజయామి|
శివ మరియు శక్తి మంత్రములు పదిహేడు అక్షరములు కలిగి ఉంటాయి. ఈ మంత్రములతో కూడా పూజ చెయ్యాలి. ఈ గురు క్రమము:
దివ్యౌఘః - పరప్రకాశానందనాథ, పరశివానందనాథ, పరాశక్తి, కౌలేశ, శుక్లదేవీ, కులేశ్వరానందనాథ, కామేశ్వరి.
సిద్దౌఘః - భోగ, క్లిన్న, సమయ, సహజ.
మానవౌఘః - గగన, విశ్వ, విమల, మదన, భువన, లీలాంబా, స్వాత్మా, ప్రియానంద.
వీరందరూ విశ్వవిగ్రహలు. వీరిపూజ దేవీ పూజ అయిన తర్వాత చెయ్యాలి.
వీరి పూజా మంత్రములు ఈ క్రింది విధంగా ఉండును.
ఉదా: ఓం ఐం హ్రీం శ్రీం పరప్రకాశానందనాథ పాదుకాం పూజయామి|

స్వగురు క్రమము

కపిలుడు నుండి వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. వారు విద్యాగురుక్రమములో చెప్పబడ్డారు. ఆ తర్వాత వరుసగా - కరుణ, వరుణ, విజయ, సమర, గుణ, బల, విశ్వంభర, సత్య, ప్రియ, శ్రీధర, శారద, సాకలేశ, విలాస, నిత్యేశ, విశ్వపురుష, గోవింద, విబుధ, సింహ, వీర, సోమ, దివాకర.
అచల, వాగ్భవ, నాద, మోహన, సులభ, శివ, మృత్యుంజయ, వాసుదేవ, శరణ, సనందన, ఆకాశ, గోప్రియ, హర్ష, భర్గ, కామ, మహీధర, ఈశాన, గణప, శ్రీమాన్, కపాల, భైరవ, దివ
గౌడపాద నుండి శంకరుల వరకు ఏడుగురు విద్యాగురు క్రమములో చెప్పబడ్డారు.
ఈ క్రమంలో ఉన్న గురువులు సాక్షాత్ శివస్వరూపులు. వీరి శిష్యుల గురించి తెలుసుకొని సాధకుడు తన స్వగురువు విధించిన విధాన ప్రకారముగా పూజ, తర్పణ, హోమ, జప, న్యాస మొదలగు సాధనా క్రమమును పాటించాలి. ఈ గురుక్రమ స్మరణ వలన సాధకునకు సిద్ధికలుగుతుంది. ఇందు ఎటువంటి అనుమానము లేదు.

...ఇంకాఉంది

8, జనవరి 2020, బుధవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 3


గ్రంధావతార నిరూపణ

(శ్రీ విద్యారణ్యయతి గారు గ్రంధావతార విశేషమును ఈ క్రింది విధముగా తెలుపుతున్నారు)

ఈ గ్రంధ రచనా పూర్తి అయిన తర్వాత మహామాయ అయిన జగద్ధాత్రి నా ముందర ప్రత్యక్షమయి, ఓ వత్సా! నీకిష్టమైన వరము కోరుకొమ్ము" అని పలికెను. అమ్మ పలుకులు విని అమ్మతో నేను ఇట్లు తెలిపాను.

"అమ్మా ఈ గ్రంధము ఉత్తమమైనది. ఏ సాధకుడు భక్తి పూర్వకముగా గురుక్రమ మంత్రములను తెలుసుకొని, గురు నుండి దీక్షను పొందలేకపోయినా జపము చేస్తాడో అతని వాంఛితములు సిద్ధింపచెయ్యి. ఇదే నాకోరిక".

శ్రీదేవి ఆ కోరికను విని ప్రసన్నురాలై "తధాస్తు" అని పలికి సంతుష్టురాలై అంతర్ధానము చెందినది.

కనుక గురుసంతతి క్రమమును తప్పక తెలుసుకోవలెను. తద్వారా శ్రీదేవి తప్పక సంతుష్టురాలు అగును.

లక్ష్మణదేశిక వృత్త వర్ణన:

జగద్గురు శంకరాచార్య శిష్యులలో లక్ష్మణదేశికులు తపవిద్య మరియు శ్రీ సంపదలందు విఖ్యాతులు. పద్నాలుగు సంవత్సరముల వయస్సులోనే వైరాగి అయి విచారణ చెయ్యసాగారు. ఈ క్రమంలో ఒకనాడు అతడు ప్రౌఢదేవుని యొక్క రాజధానికి వెళ్లారు. ప్రౌఢదేవుడు అతడిని ఆదరించి ఇల్లు, అన్నము, వస్త్రము, సేవకై నౌకరులను ఇచ్చాడు. ఒక సమయంలో ప్రౌఢదేవుని సభయందు లక్ష్మణుడు కూడా కూర్చొని ఉండగా ఒక వ్యాపారి వేరొక ప్రదేశములనుండి తెచ్చిన సుందరమైన వస్తువులను, వస్త్రాలను ప్రౌఢదేవునికి సమర్పించగా, అతడు ఆ వస్త్రములను లక్ష్మణునికి ఇచ్చాడు. లక్ష్మణుడు వాటిని తన ఇంటికి తీసుకు వచ్చి కుండమునందు విధియుక్తముగా అగ్నిని స్థాపించి భక్తిభావంతో ఆ వస్త్రములను శ్రీదేవి కొరకు హోమము చేసెను. ఈ విషయం తెలుగుకున్న రాజు కోపగించి, ఒక దూతను పంపి ఇచ్చిన వస్త్రములకు ధరను కట్టవలసినదని ఆజ్ఞాపించెను. లక్ష్మణదేశికుడు ఇది విని క్రోధము చెందిన వాడై ఆరాజునకు నిర్వంశుడు అగునట్లుగా శాపమిచ్చెను. శ్రీదేవిని కోరుకొని ఆ రాజు ఇచ్చిన వస్త్రములను తిరిగి అతనికి ఇచ్చివేసి ఆ రాజ్యమును వదలి దక్షిణము వైపు వెడలెను. శాపమును విన్న రాజు కంపితుడై లక్ష్మణుడను వెదకుచూ అతని వద్దకు వచ్చి ప్రార్ధనాపూర్వకముగా తనను క్షమించమని, కృపాను జూపమని మిక్కిలి ప్రార్ధేయపడగా, లక్ష్మణుడు అతని ప్రార్ధనలకు ప్రసన్నుడయి "ఓ రాజా! నా శాపము అమోఘము. కానీ నీ ప్రార్ధనను విని నేను సంతుష్టుడయినాను. నీకు పుత్రుడు కలుగుతాడు. కానీ నువ్వు అతనికి తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించలేవు." అని తెలిపాడు. ఇది విని ప్రౌఢదేవుడు తన నగరమునకు తిరిగి వచ్చాడు. కొన్ని రోజులకు రాణి గర్భము దాల్చగా రాజునకు దేహాంతము కలిగెను.

ఇది జరిగిన తర్వాత ప్రజల ప్రార్ధనను మన్నించి శ్రీవిద్యారణ్యయతి రాజ్యభారము వహించెను. పన్నెండు వందల కోట్ల ద్రవ్యములనుండి శ్రీచక్రరసము చేసి ఉజ్జ్వలము, అద్భుతము అయిన శ్రీవిద్యానగరమును నిర్మించుటకై ప్రౌఢదేవుని పుత్రుడైన అంబదేవుడు యువకుడు అయిన తర్వాత పట్టాభిషిక్తుడిని గావించెను.
అంబదేవుడు, విద్వాంసులు, సజ్జనుల ప్రార్ధనలను మన్నించి యంత్ర పూర్వకములైన నానా తంత్రములను మరియు యామళం నుండి కాది విద్య మరియు కాళీమాతమును సమన్వయ పరచి "శ్రీవిద్యార్ణవము" అను పేరుగల ఈ గ్రంధమును లోకోపకారమునకై రచించెను.

మల్లికార్జుని శిష్యులు వింధ్య ప్రదేశము నందు కలరు.
త్రివిక్రముని శిష్యులు జగన్నాధ (= పూరీ?) దేశమునందు కలరు.
శ్రీధరుణి శిష్యులు గౌడ, మైథిలి మరియు బంగళాదేశములందు కలరు.
కపర్దుని శిష్యులు కాశీ మరియు అయోధ్యలందు కలరు.

శంకరాచార్యులు స్థాపించిన సంప్రదాయమునకు మారుగా వేరొక సంప్రదాయము లేదు.
ఇంకాఉంది....

3, జనవరి 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 2

ఊర్ధ్వామ్నాయ కులగురు క్రమము:

దివ్యౌఘః - ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత
సిద్దౌఘః - ఆదినాథ, అనాదినాథ, అనామయ, అనంతానందనాథ, చిదాభాస
మానవౌఘః - పరేశ్వర, విశ్వేశ్వర, హంసేశ్వర, సంవర్తేశ్వర, ద్వీపేశ్వర, నవాత్మేశ్వర
వీరు కులమార్గ గమనులు. కులమార్గ మంత్రములకు జ్ఞాతులు. వీరు కులాసమునందు ఆసీనులయి కులతంత్ర పరాయణలగుచున్నారు. మహారసము యొక్క ఉల్లాసముతో తమోగుణమునందు నిమగ్నులై ఉంటారు.
కులగురువులను ఈక్రింది విధముగా ధ్యానించాలి.

కులగురు ధ్యానం:

1.     దశహస్తాః పంచముఖా ముండమాలా విభూషితాః|
       ఉద్యత్సూర్య సహస్రాభాః పూర్ణాంతః కరణోద్యతాః||
2.    ఖడ్గం ఖేటం కపాలంచ త్రిశూలం ముద్గరం తధా|
       ఖడ్వాంగౌ కరచాపౌచ దధానాశ్చ వరాభయే||
3.    తురీయ యామినీయామే కుండలిన్యామ్ మహౌజసీ|
       తేవిసర్గదదౌభాగే లాక్షారస సమప్రభే||
4.    చింతనీయాః ప్రయత్నేనా విద్యాసంసిద్ధి హేతవే|
       ఏతాన్ కులగురూన్ యత్నాన్న చింతియటతి సాధకః||
5.    తస్యాపూజా జపశ్చైవ స్నానదానాదికమ్ వృధా|
       ఏతాన్ కులగురూన్ ధ్యాయేత్ ఊర్ధ్వామ్నాయ ఊదీరితాన్||
6.    ప్రజ్ఞా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః|
       ఇఛ్ఛా జ్ఞాన క్రియా చైవ కుండలీ మాతృకా పరా||
7.    ఏకాదశైతే దివ్యౌఘ ఆదినాధస్తతః పరా|
       అచింత్యనాధో చింత్యాచ అవ్యక్త్యో వ్యక్తికాతతః||
8.    కులేశ్వరః కులేశీచ సిద్దౌఘా నాగ సంఖ్యకా|
       తూష్ణీసశ్చైవ సిద్ధాచ మిత్రః కుబ్జా తతః పరం||
9.    గగనశ్చాటులీచైవ చంద్ర గర్భ స్తతః పరం|
       వాలిభాగీచ ముక్తశ్చ మహిలాలలితస్తతః||
10.   శంఖా శ్రీ కంఠసంజ్ఞశ్చ శ్రీ కంఠాచ పరేశ్వరః|
       పరేశ్వరీ కుమారశ్చ సహజా రత్న యేవచ||
11.   జ్ఞానదేవీ తతో బ్రహ్మ నాదినీ చాప్యజేశ్వరః|
       మహిలాచ ప్రతిష్ఠశ్చ సహజా శివ ఏవచ||
12.   ప్రతిమాచ చిదానందః సహజాచ తధైవచ|
       శ్రీకంఠానంద విద్యోచ శివశ్చ సహజా తతః||
13.   సోమశ్చ సజాజా చైవ సంవిచ్చ సహజాతతః|
       విబుదో విభుధాచైవ భైరవో భైరవీ తధా||
14.   ఆనందో నందినీ చైవ తతః కామేశ్వరాభిధః|
       కామేశ్వరీచ కమలః సహజాజిన యుగ్మకాః||
మానవౌఘాః స్మృతా ఏతే వరాభయకరామ్బుజాః||

విద్యావతార గురుక్రమము

దివ్యౌఘః - వ్యోమాతీత, వ్యోమేశీ, వ్యోమగా, వ్యోమచారిణీ, వ్యోమస్థా
సిద్దౌఘః - ఉన్మనా, సమనా, వ్యాపికశక్తి, ధ్వని, ధ్వనిమాత్రా, అనాహతా, బిందు, పరమబిందు, ఆకాశ
మానవౌఘః - పరమాత్మా, శాంభవ, చిత్, ముద్రా, వాగ్భవ, లోల, సంభ్రమ, చిత్ప్రసన్న, విశ్వ

విద్యాగురుక్రమం

ఉర్ధ్వామ్నాయ క్రమము నందు షోడశీ ఉపాసకులు దేవీ పృష్ఠ భాగమందు విద్యావతార గురుక్రమములో చెప్పబడిన  ''విశ్వ" తర్వాత నుండి స్వగురు పూజ చెయ్యాలి.

స్వగురు క్రమము

కపిల, అత్రి, వశిష్ఠ, సనక, సనంద, భృగు, సనత్సుజాత, వామదేవ, నారద, గౌతమ, శునక, శక్తి, మార్కండేయ, కౌశిక, పరాశర, శుక, అంగిర, కణ్వ, జాబాలి, భరద్వాజ, వేదవ్యాస, ఈశాన, రమణ, కపర్ది, భూధర, శుభట, జలజ, భూతేశ, పరమ, విజయ, భరత, పద్మేశ, సుభగ, విశుద్ధ, సమర, కైవల్య, గణేశ్వర, సుపాద్య, విబుధ, యోగ, విజ్ఞాన, ఆనంగ, విభ్రమ, దామోదర, చిదాభాస, చిన్మయ, కలాధర, వీరేశ్వర, మందార, త్రిదశ, సాగర, మృడ, హర్ష, సింహ, గౌడ, వీర, అఘోర, ధృవ, దివాకర, చక్రధర, ప్రమధేశ, చతుర్భుజ, ఆనందభైరవ, ధీర, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.

శంకరాచార్య శిష్యులు

శంకరాచార్యుల వారికి ముఖ్య శిష్యులు పద్నాలుగురు. వీరందరూ దేవ్యాత్మన, ధృడాత్మన, నిగ్రహ, అనుగ్రహములు కలిగి ఉండడంలో కడు సమర్ధులు.
1) శంకర, పద్మపాద, బోధ, గీర్వాణ, ఆనందతీర్ధ - ఈ అయిదుగురు సన్యాసులు
2) సుందర, విష్ణుశర్మ, లక్ష్మణ, మల్లికార్జున, త్రివిక్రమ, శ్రీధర, కపర్ది, కేశవ, దామోదర - ఈ తొమ్మిది మంది గృహస్థులు.
వీరందరూ మఠాలకు, ఉపమఠాలకు అధిపతులుగా ఉండేవారు. శంకరాచార్యుల వారి పేరుతో మఠాలను/ ఆశ్రమాలను నిర్వహించేవారు.
దేవ్యాత్మ శంకర శిష్యులు విశ్వవిఖ్యాతులు.
పద్మపాదుల వారి శిష్యులు ఆరుగురు. వారు మండల, పరిపావక, నిర్వాణ, గీర్ధన, చిదానంద, శివోత్తమ. వీరందరూ వివిధ ఆశ్రమాలలో ఉంటూ ధీరులుగా, మౌనులుగా, ఈర్ష్యరహితులుగా ఉండేవారు. ఇప్పటికీ వీరి శిష్య పరంపర ఉన్నారు.
బోధుని శిష్యులు కేరళ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో విద్యావంతులుగా గుర్తింపు పొందారు.
విద్యానగీర్వాణ, గీర్వాణ శిష్యుడు. అతని శిష్యుడు విభుదేంద్రుడు. ఇతని శిష్యుడు సుధీంద్రుడు. ఇతని శిష్యుడు మంత్రగీర్వాణుడు. ఇతనికి చాలా మంది శిష్యులు ఉండేడివారు.
ఆనందతీర్ధుల వారి శిష్యులు గృహవాసులు. వీరందరూ ఆరాధ్యపాదుకా పీఠ మరియు సంప్రదాయములందు జ్ఞానులు.
సుందరాచార్య శిష్యులు వివిధ పీఠములకు మహంతులుగా ఉండేవారు. సన్యాసులు మరియు గృహస్థులు ఈ పీఠములందు ఉండేవారు.
శ్రీ విష్ణుశర్మ శిష్యులు ప్రగల్భాచార్య పండితులు. ఈయన యొక్క శిష్యులు నా (విద్యారణ్యయతి) ద్వారా ఈ గ్రంధమును పూర్తి చేశారు.


ఇంకాఉంది...