సూక్తి

భోగములయందు విముక్తి, ఆత్మ విచారమందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, జనవరి 2020, బుధవారం

శ్యామలానవరాత్రులు


మాఘమాసం - శ్యామలా నవరాత్రులు
           దక్షిణాయనంలో కార్తీకం ఎంత పవిత్రమో ఉత్తరాయణంలో మాఘమాసం అంత పవిత్రం. ఈ మాసం సూర్యోపాసకులకు చాలా ముఖ్యమైనది. అయితే, దేవీ ఉపాసకులు అందునా శ్రీవిద్యోపాసకులకు కూడా ఈ మాసం ఎంతో ముఖ్యము. శ్రీలలితా అమ్మవారి మంత్రిణి అయిన శ్రీ రాజశ్యామలా నవరాత్రులు ఈ మాసం శుక్ల ప్రతిపత్తి నుండి నవమి వరకు ఉండును. ఆయా సాధకులు ఈ నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రాజశ్యామలా దేవిని ఉపాసిస్తారు. ఈమెనే మాతంగి అని కూడా అంటారు. ఈమె మంత్రోపాసన, ఆవరణ పూజ, హోమము అధ్బుతమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈమె మంత్రోపాసన వలన "విషంగుడు" అను ప్రాపంచిక విషయాభిలాషి, విషయములందు విషపూరిత దృష్టి కలవాడు నశించును. అనగా, సాధకునిలో ఆయా భావములు నశించి నిర్గుణ బ్రహ్మమైన పరతత్వము తెలుసుకోవడానికి దారి సుగమవుతుందని అర్ధము.

ఈ నవరాత్రుల్లో మరొక ముఖ్యమైన రోజు సప్తమి తిథి ఉన్న రోజు. ఈ రోజునే రథసప్తమి అని అంటారు. సూర్య భగవానుని పుట్టిన రోజుగా చెబుతారు. ఈ రోజు ఆయనకు తర్పణములు వదలడం, సూర్య నమస్కారాలు చెయ్యడం చాలా పుణ్యఫలప్రదం. సూర్య ఆవరణ పూజ చేసి తృచ, సౌరములతో తర్పణములు, తృచ, సౌరము, అరుణములతో నమస్కారములు చేసి, హోమము చేస్తే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది.

ఈ మాసములో మరియొక ముఖ్యమైన రోజు పౌర్ణమి. ఈ రోజును సాక్షాత్ శ్రీలలితా మహాత్రిపురసుందరి ఉద్భవించిన రోజుగా కొందరు చెబుతారు. వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, శ్యామలా నవరాత్రుల యందు ఉపాసనా ఫలితంగా రజోగుణము, తమోగుణము, సత్త్వగుణము నశించబడి ఆ సాధకుడు నిర్గుణ పరబ్రహ్మమైన శ్రీ లలితా పరాభట్టారిక సన్నిధికి ఈ పూర్ణిమ నాడు చేరుకోవడమే ఆయా నవరాత్రుల ఉపాసనా రహస్యము.

(ఈ సంవత్సరం తే 25.01.2020ది నుండి మాఘమాసం ప్రారంభమవుచున్నది.
శ్యామలానవరాత్రులు 25.01.2020 నుండి 03.02.2020 వరకు
రథసప్తమి తే 01.02.2020 ది
పౌర్ణమి: తే 09.02.2020 ది.) 

కామెంట్‌లు లేవు: