సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, జనవరి 2020, మంగళవారం

బ్రహ్మమును గురించి వివేచన ఎప్పుడు కలుగుతుంది?


శీలము, శుద్ధి మార్గములో సాధన ద్వారా బ్రహ్రమును తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. సంధ్యావందన, ఆరాధన, జప, స్తోత్రపారాయణ అను ఈ నాలుగింటినీ సాధనా సమూహముగా తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఏ జీవుడైతే క్రమశిక్షణతో ఈ సాధన చేస్తాడో అతనికి బ్రహ్మమమును గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ఈ జిజ్ఞాసే ముందు చెప్పబడిన సాధనా ఫలం. అంతేగాని లౌకిక కోరికలు తీరడం సాధనా ఫలం కాదు. అయితే ఈ జిజ్ఞాస కలిగినంత మాత్రముననే ఆ సాధకునికి బ్రహ్మము తెలియబడదు. ఈ జిజ్ఞాస, బ్రహ్మమును తెలుసుకోవడానికి కావలసిన సాధనా చతుష్టయమును సాధించడానికి మార్గమేర్పరుస్తుంది.
నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షత్వము - ఇవి సాధనా చతుష్టయము.
ముందు చెప్పబడిన సంధ్యావందనాది సాధన భక్తి శ్రద్ధలతో చేయగా చేయగా, ఆ సాధకునికి నిత్యానిత్య వివేకము మొదలగు సాధనా చతుష్టయము నందు బుద్ధి నిలుస్తుంది. ముందుగా ఈ సాధనా చతుష్టయము గురించి తెలుసుకుందాము.

1) నిత్యానిత్య వివేకము: ఏది సత్యము, ఏది అసత్యము? ఏది నిత్యము? ఏది అనిత్యము? అనే విషయ పరిజ్ఞానము కలగడం.

లౌకిక కోరికల గురించి గాక నిమిత్తమాత్రులై నిత్యమూ ఎవరైతే పూజాది కర్మలు ఆచరిస్తారో వారికి తప్పకుండా ఈ పరిజ్ఞానము కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో పూజలంటే లౌకిక కోరికలకు మాత్రమే అని ప్రచారం చేయబడుతూ, ఆచరించడం శోచనీయము. ఇటువంటి పూజల వలన ఏమి ప్రయోజనము కలుగదు ఉత్త కాలహరణము, ధనహరణము తప్ప. మరొక్క విషయము. కొంతమంది పూజలే అక్కర్లేదనీ, కర్మ అవసరం లేదనీ ప్రచారం చేస్తూ, తమకు నచ్చిన దేవునిదో లేదో మరెవరిదో నామమును మాత్రం జపిస్తే చాలని బ్రహ్మము తెలిసిపోతుందని, మోక్షం లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. వీరంతా అరుణము లో "నామనామైవ నామమే" అనగా పేరు పేరు మాత్రమే. ఉత్త పేరును జపించడం వలన ఒరిగేది ఏమీ లేదు అని చెప్పబడిన సంగతి విస్మరిస్తున్నారు. కాలమహిమ.

2) వైరాగ్యము: భోగ్య పదార్ధముల మీద అసహ్యం కలగడం.
సాధకుడు విషయవాంఛ లోలితుడైనంత వరకు బ్రహ్మజ్ఞానం కలగదు. నిత్యానిత్య వివేకము చేయగా చేయగా విషయవాంఛలు  ఎంత విషమో తెలుస్తుంది.

3) షట్సంపత్తి: ఇవి ఆరు.
      అ) శమము = అంతరింద్రియ నిగ్రహము
      ఆ) దమము = బాహ్యేంద్రియ నిగ్రహము
      ఇ) ఉపరతి = శాస్త్ర విహిత కర్మలను వైరాగ్య దృష్టితో విడిచిపెట్టడం.
      ఈ) తితీక్ష = ఓర్పు, సహనము కలిగి ఉండడం.
    ఉ) శ్రద్ద = గురువునందు ఆయన చెప్పే విషయాలందు విశ్వాసము కలిగి ఉండడం
     ఊ) సమాధి/సమాధానం = బుద్ధిని ఎల్లప్పుడూ బ్రహ్మము మీదే నిలిపి ఉండడం
ఈ ఆరింటిని కూడా సాధించాలి. కానీ నేడు కాలం ఎలా ఉందంటే వీటిని సాధించకుండానే తాము బ్రహ్మవేత్తలం అయిపోయామని, మేమే దేవుళ్ళమని ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది వారిని గుడ్డిగా అనుచరిస్తూ తమని తాము మోసగించుకుంటున్నారు. పైన చెప్పిన వాటిలో ఉపరతిని కాస్త గమనించండి. శాస్త్రవిహిత కర్మలను ఎప్పుడు వదిలిపెట్టాలి? ఆయా కర్మలను బహుకాలం ఆచరించి, ఆయా కర్మలను అద్వైత సారముగా అవగతము చేసుకున్న తర్వాత వాటిని విడిచిపెట్ట వచ్చు. అంతేగాని మొదటి నుండి కర్మే అవసరం లేదని ప్రచారం చేస్తూ వాటిని విస్మరించడం వలన ఏమాత్రం ఉపయోగము లేక బ్రహ్మజ్ఞాన విఘాత ప్రమాదము ఉంది.
ఇక శ్రద్ధ. ఈ విషయము గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఎవరికీ నిజమైన గురువు అక్కరలేదు. డాబు, దర్పము ఉన్న కుహనా వ్యక్తులే గురువుగా కావాలి. ఎన్ని నీచమైన మాజిక్లు చేస్తే అంత పెద్దగురువు. 
నిజమైన గురువు లక్షణాలు, అలాగే నిజమైన శిష్యుని లక్షణాలు శ్రీవిద్యార్ణవతంత్రము నందు చెప్పబడును.

4) ముముక్షత్వము:  మోక్షం పొందాలనే కోరిక కలిగి ఉండడం. శరీరానికి అహంకారాది అజ్ఞాన బంధనాలెన్నో. ఇలాంటి బంధనాలను వదిలించుకోవాలి.

పైవాటిని సాధించగలిగితే "అథాతో బ్రహ్మజిజ్ఞాసా" అనగా బ్రహ్మమును తెలుసుకొనడానికి వివేచన, విచారణ, అర్హత కలుగుతాయి. అంతేగాని మరేవిధంగానూ తెలియరాదు. 

కామెంట్‌లు లేవు: