పవిత్రారోపణవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పవిత్రారోపణ అనగా అనుష్ఠాన విధి. పవిత్రారోపణమును చేసినచో అన్ని కార్యములు ఫలించును (సత్యమవును) లేనిచో నిష్ఫలమవుతాయి. అన్యవిధులు చేసిన తర్వాత ఏ సాధకుడు ఈ కర్మను ఒక సంవత్సర కాలంలో చెయ్యడో అతడి పూర్వకర్మల ఫలమును దుష్ట గణములు బలవంతంగా అపహరించును. ఈ పవిత్రారోపణ కర్మకు ఆషాఢ మాసము ఉత్తమము. శ్రావణం మధ్యమం, భాద్రపదం హీనము. శుక్ల పక్షము ప్రశస్తము. కృష్ణ పక్షము లాభరహితము అవుతుంది. చతుర్దశీ, అష్టమి, పూర్ణిమ తిథులలో ఈ కర్మ చెయ్యాలి. రేశ్మీ సూత్రము (దారము) విశిష్టము. నూలు దారమును కూడా ఉపయోగించవచ్చును. ఈ సూత్రముకు తొమ్మిది రెట్లు గంగాజలముతో పశ్చిమాస్య మంత్రములతో సూత్రమును శుద్ధి చేసి ఆరబెట్టాలి. మంత్రోచ్చారణ చేస్తూ సుందరమైన పవిత్రమును తయారు చెయ్యాలి. 108అంగుళముల పవిత్రము శ్రేష్ఠము. 54అంగుళముల పవిత్రము మధ్యమము. 27అంగుళముల పవిత్రము కనిష్ఠము.