సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, ఏప్రిల్ 2020, ఆదివారం

సూక్తులు - 1




తళుకుబెళుకుమెరుపువనితలసొగసుకు
మోసపోయి,శాశ్వతసుఖముకలిగించు
సిరిపధమునుమరుగుపరచినడచిన,
లుగుసుఖములునాకువిషములులలితాంబ!



దేవుడనుచు స్వాముల వెంట తిరిగనేమి
తనకు తాను వరించునా ధాన్య లక్ష్మి
నీమతిస్తుతులెబలమనెరుగలేవ
నిక్కము తెలుసుకోర ప్రణీత మనస




కోవిడు పుట్టినక్షణమె గొల్లునకీటకమంత్రమున్ మనుః
కోవిదుడివ్వగన్ విధిని గోప్యముబెట్టితలంపు లేకనే
ఏ విపులార్ధముల్ తెలియనేరక వెర్రి జనుల్పఠించెనే
ఈవికటార్ధబుద్ధిమతులేలన కన్నులు తెర్వుజీవుడా





భానుని తీక్ష్ణభాసములబాధనుగూడసహింపగల్గగన్
నేనిసుమంతలక్ష్యమిడునెంతవిభాగ్నిశిఖాప్రతాపమున్
ఆనటరాజునర్తనము యాడభువాంతరముల్కకావిక
ల్మైనెడ పొందబోనుభయమైననుతక్కకళత్రచూపుకున్



శ్రీగురు చరణములు శ్రీలలితజపములు
పెద్దలాశీర్వచనములు పిన్నల జత
లివికలిగిన జీవుడె ధన్యుడవని యందు
వినుమిదియె నిక్కము కదర విప్రవర్య



క్ష్యపెట్టడు రవితీక్ష్ణశ్మినైన
యపడడనిలజ్వాలాప్రలుకైన
కానిబెదురునేప్రియసతికంటిసెగకు
వినుమిదియె నిక్కము కదర విప్రవర్య



పెండ్లి పెండ్లియని చెవినిపోరుబెట్టియా
బ్రహ్మచర్యమునుచెరచవధువును
దెచ్చిబెండ్లిచేయ, దేవేరినెత్తికె
క్కితకిటతకిటాడకీలువిరుగు!



వేద విద్యలకై వచ్చి వేదనపడి
గురువు మాటకు విలువ లేకుండ నడచి
నేమిలాభమెంత చదువు నేర్చుకున్న
వినుమిదియె నిక్కము కదరవిప్రవర్య



సంప్రదాయము కన్న శాస్త్రములె మిన్న
శాస్త్రములు కన్న వేదశాసనము మిన్న
వేదములుకన్నసద్గురువేగమిన్న
వినుమిదియె నిక్కము కదరవిప్రవర్య



ముద్దపప్పు, కమ్మని నెయ్యి, ముక్కల పులు
సు, పనసావకూర,పెరుగు సుమధురిమల
పాయసాన్నమామిడిఫలపానకంబు
లన్, తమకెపుడిచెదనొ శ్రీల భ్రమరాంబ!

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 1

పాదుకా మహాత్మ్యము

ఏ సాధకుడు గురువును శివ స్వరూపునిగా మరియు మోక్ష, భోగదాయకునిగా తెలుసుకొని స్మరించుతాడో ఆ శిష్యునికి శీఘ్రంగా సిద్ధి లభిస్తుంది. శివుడు చెప్పుచున్నాడు - హే కులేశ్వరీ! ఎవరికైతో గురు మరియు ఇష్టదేవత యందు సమానమైన భక్తి ఉంటుందో వారికి అర్ధ,ప్రకాశము కలుగుతుంది. నారాయణుడు, మహాదేవుడు, తల్లిదండ్రులు మరియు రాజు నందు ఎటువంటి భక్తి ప్రపత్తులుండునో అటువంటి భక్తిప్రపత్తులు గురువునందు కూడా ఉండడం ఆవశ్యకము. లక్ష్మీనారాయణులు, సరస్వతీ బ్రహ్మ, గౌరీశివులు నందు ఎటువంటి భక్తిప్రపత్తులుండునో అటువంటి భక్తిప్రపత్తులు గురువు మరియు గురుపత్ని యందు కలిగి వారిని తల్లిదండ్రుల సమానముగా పూజించాలి. గురుభక్తి వలన దేవి నుండి ఏ సిద్ధులు కలుగుతాయో ఆ సిద్ధులు యజ్ఞము, దానము, తపము, తీర్ధము వ్రతాడి మొదలగు వాటివలన లభించదు. స్వగురు మీద ఏవిధముగా భక్తి పెరుగుతూ ఉంటుందో ఆ విధముగా సాధకుని విజ్ఞానము కూడా వృద్ధి చెందుతుంది. తీర్ధాదుల వలన మహాప్రయాసలు, వ్రతముల వలన కాయశోషణములు కలుగును. వీటి అవసరమేమున్నది? శారీరిక శ్రమలు మరియు కఠిన తపస్సుల వలన ఏ ఫలము కలుగుతుందో ఆ ఫలము గురుసేవ వలన సుఖపూర్వకముగా కలుగును. ఎవరికి భోగ, మోక్షములందు కోరిక ఉంటుందో, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల పదప్రాప్తి కోరిక ఉంటుందో వారికి గురుభక్తిని మించిన వేరే మార్గము లేదు. ఇది శ్రుతివచనము. అన్ని అశుభములు, మహాపాతకములు గురుభక్తి అనెడి అగ్నియందు భస్మమయిపోవును. విశ్వాసపూర్వకుడు, సర్వసిద్ధిప్రదాయకుడు అయిన గురువుకు ఎవరు నమస్కరిస్తారో వారికి మట్టి, వృక్షము మరియు రాయి కూడా ఫలదాయకములవుతాయి. ఆ ఫలము యోగము వలనగానీ, తపస్సువలనగానీ, అర్చనవలన గానీ లభించదు. ఈ కులమార్గమునందు ఏక భక్తి కూడా విశిష్ఠము. దేవీమయమైన గురువు అన్ని భువనములందు వ్యాపించి ఉండగా, సాధకునకు ఏ క్షేత్రమునందు సిద్ధి కలగదు? ఆ సాధకుడునకు అన్ని క్షేత్రములందు సిద్ధి లభిస్తుందని అర్ధము. ఎవరైతే గురువును మనుష్యునిగా, మంత్రమును అక్షరముగా, దేవతా ప్రతిమను రాయిగా తలుస్తారో వారు నరకానికి పోతారు.

గురువుకు మరణధర్మము తెలియపరచరాదు. అలా తెలియపరిస్తే మంత్రముతో దేవతను అర్చించిననూ అతనికి సిద్ధిలభింపదు. శ్రీగురువుయొక్క స్మరణము సగం ప్రాకృతములోను, సగం సంస్కృతములోను చేసినా, చెప్పినా, అతడి అన్ని సుకృతములూ నశించును. జన్మకారకుడుగా తండ్రి పూజ్యుడు. ధర్మ-అధర్మములను తెలియపరచే గురువు విశేష పూజ్యుడు. శివునికి కోపమొస్తే గురువు రక్షించును. కానీ, గురువుకు కోపమొస్తే ఎవరూ రక్షించలేరు. మనసా, వాచా, కర్మణా గురువుకు హితమైన సాధనను చెయ్యాలి. అహితమైన కార్యము చేసినచో ఆ శిష్యుడు మలపురుగు అవుతాడు. గురువుయొక్క శరీర, ధన, ప్రాణములను ఎవరైతే వంచిస్తారో వారు నరాధములు మరియు క్రిమి, కీట, పతంగములవుతారు. గురువును త్యజిస్తే మృతుడవుతాడు. మంత్రమును త్యజిస్తే దరిద్రుడవుతాడు. రెండింటినీ త్యజిస్తే ఆ శిష్యుడు రౌరవాది నరకములకు పోతాడు. గురుసేవకై ధనమును ఆర్జించాలి. తన ప్రాణము ఇచైనా సరే గురుకార్యమును నిర్వర్తించాలి. గురు కఠోపవచనమును శిష్యుడు ఆశీస్సులవలే స్వీకరించాలి. గురువు వేధింపు కూడా అతని కృపగానే స్వీకరించాలి. భోగ్య, యోగ్య, వస్తువులు గురువుకు అర్పించాలి. గురువుయొక్క ఉచ్ఛిష్ఠమును ప్రసాదముగా తీసుకోవాలి. గురువు ముందు తపస్సు, ఉపవాసము, వ్రతాదులు చేయరాదు. ఆత్మశుద్ధి కొరకు తీర్ధయాత్రలు, స్నానాదులు చేయరాదు. గురువుకు అప్పివ్వడం లేదా తీసుకోవడము, గురువునుండి వస్తువులను కొనడం లేదా అమ్మడం వంటిపనులు చెయ్యరాదు. నాస్తికవాదిని దూరం నుండి చూసిన వెంటనే అతని కంటపడకుండా దూరంగా వెళ్లాలి. అతనితో ఎప్పుడూ కూర్చోనరాదు. గురువు సమీపమున వేరే పూజ ఏమైనా చేస్తే ఆ చేసినపూజ నిష్ఫలమవగా ఆ పూజ చేసినవాడు ఘోరనరకానికి పోతాడు. గురువుపాదాబ్జధారి తన శిరస్సునందు భారము భావించరాదు. గురు ఆజ్ఞానుసారముగా కర్తవ్యపాలన చెయ్యాలి. ఆజ్ఞను గురురూపముగా స్మరించాలి. అన్యత్రా మంత్రాగమము వింటే అది గురువునకు విన్నవించాలి.
                                                                                   
ఇంకాఉంది

21, ఏప్రిల్ 2020, మంగళవారం

భక్తిపద్యాలు -1


మన్మథ శరముల్ గురిచూసి మదిని చేర
శివశివా యని యార్తిచే శిరను వంచ
గప్పున దునిమెన్ వానిని కడు పెరిమపొ
లయమదముపోయెసాధనలయముగాక!



జన్మ జన్మల తపజప సాధనాచ
రింపనేడు కలిగె దయ ఏమనికొలు
చునులలితనీ అమృతదయాసాంద్రతనను
వినుమదియె నిక్కము గదర విప్ర వర్య



రామ రామాయనిపిలువన్ రతిమగనిని
పంపె మనసు రంజింపగ వనిత యందు
తండ్రి రాకసుతుని పంపెతాలుచెయ్య
ఏమని తెలుపుదాతనివింత వేడ్క



శ్రీయనిన సిరియొకటియె శ్రీ యుతులకు
గారవంబదియే పూజ్య ఘనులకైన
మూడు బీజముల రహస్యము బుద్ధులకది
సాధ్య సుభగమదెరిగిన సాధకులకు



జన్మ జన్మలకొక అమ్మ జాతమునన
అమ్మ అమ్మాయనరచినేయమ్మ పలుకు
జననొకతియె జీవులకెన్ని జన్మలైన
భావమిదియె శ్రీమాత సుభాగ్య పదము

ఏమి తెలిసిన మనసు చింతెగిరిపోవు
ఏమి తెలిసిన విద్యలల్లేలవచ్చు
ఏమి తెలిసిన సర్వంబునెరుగవచ్చు
ఏమది లలిత మధుసుధా స్మితము గాక.



వేకువ తొలివెలుగు తొలువేల్పు రూపు
నడిదినము సంధ్య శ్రీమాత నల్లవేల్పు
పడమటి వెలుగు వేళామె భర్గు రూపు
మూడు మూర్తులామె లలిత మూర్తి రూపు



శివుని సరసములన్ తేలి సిగ్గు మొగ్గ
లై చెదిరిన సీమంత తిలకమునన్ న
వారుణముచె దిద్దంగ యాప్రభలనన్ గ్ర
హించి ఉదయించె తూర్పునన్ హిమిక హర్త




భవుని శిరసునుండేతెంచి పతినిజేర
బూనుకొనగన్ బుడమికంపె భువనపావ
నిన్ జనుల దాహమున్ దీర్చ నీలలోహి
కాపురంబునిలుపుకొనె కల్లజూపి



శ్రీపదమోక్షభాగ్యమునె శ్రీలలితాంబనుగోరజూపెనిన్
శ్రీపాద మంత్ర సిద్ధగురు శ్రీగురుగా జగమేలు సామి ఆ
శ్రీపథమున్ విదేహ గతి రీతని దెల్పి సముద్ధరింప మీ
మీ పదమయ్యె నా గణతి శ్రీలలితేశ్వర రక్షజేయుమా





భారతి కచ్చపీ మధుర వాద్య ఝరీ ధ్వని మూగబోయె నీ
ఆ రమణీయ నీరజ సుహాస చిరుస్వని కారణంబు నే
ఆ రవమున్ మనంబున సుయాగము జేయగ బొందు భాగ్యమే
స్వారసికాన్వితాకవన సాగర వెల్లువలే శివాన్వితా





కఠిన కుచధరా! కృష్ణా! దిగంబరా! రు/
ధిరపిపాస! ఛిన్నకపాలధరకరా! సు/
రతజనధ్వంసి! మంత్ర యంత్రాంచిత ప్రియ/
చింతితార్ధదాయినినమచ్ఛిన్నమస్త|



చిక్కటి యడవులందునన్ శిఖరదర్శ
నంబు పాతాళ గంగ గణపతి పంచ
ధారల దరి, శ్రీమల్లన్న దగ్గరున్న
నిన్ను జూచి, ధన్యుడయితిని భ్రమరాంబ




కీచకులు కీటకంబులు క్రిములు బుట్టి
జీవజాలములన్నియు చీదఱ పడు
చుండనీవేమెరుగనట్లుజూడనట్లు
పల్కవేమి? రక్షణజేయవ భ్రమరాంబ




పంచదశి దివ్యమంత్రముపాసనాక
తమున నేడు హృదయమున భ్రమర నాద
ముకలిగెనుకదా నాజన్మ ముక్తి పొందె
నేట్కి, యిదినీ కృపవలననె భ్రమరాంబ

20, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - విషయసూచిక



ద్వితీయ శ్వాస

విషయ సూచిక

1. పాదుకా మహాత్మ్యము
2. సమయాచారము
3. ప్రయోగసారము ప్రకారము సమయాచారము
4. నారదపంచరాత్ర ప్రకారము సమయాచారము
5. జ్ఞానోన్నయము
6. కులార్ణవ ప్రకారము గురుశిష్య పరీక్ష
7. కులార్ణవ ప్రకారము శిష్యుల స్థాయిలు
8. వర్ణవిభాగము నుండి యోగ్యతా కాలవిశేషము
9. మంత్రము నందు శూద్రులకు అధికార - విహీనిత
10. శాతాతపసంహితాయాం శూద్రాధికారము
11. మంత్రమునందు శూద్రులకు అధికారత్వం
12. విష్ణు ఆరాధనయందు స్త్రీలకు అధికారము
       అ) మంత్రరాజము ప్రకారము అధికారము
       ఆ) భవిష్యోత్తర పురాణ ప్రకారము
       ఇ) కులార్ణవము ప్రకారము
       ఈ) రుద్రయామల ప్రాసాద మంత్రము
13. శూద్రులకు ప్రణవాది మంత్ర నిషిద్ధములు
14. యామళము ప్రకారము
15. మంత్రములందు బ్రహ్మ క్షత్రాది భేదములు
16. సౌత్రామణి తంత్రము ప్రకారము
17 కులమూలావతారము ప్రకారము
18. కులప్రకాశ తంత్రము ప్రకారము మంత్రముల లింగ నిర్ణయము
19. నారాయణీయ మంత్ర ప్రబోధ కాలము
20. వృహన్నారాయయణీము
21. శివయామలే
22. కాలీమతము నందు మంత్ర దోషము
23. శారదాయామళము ప్రకారము మంత్ర దోషములు
24. మంత్రములను దోషరహితములు చేయు విధానము
25. యోనిముద్రా లక్షణం
26. మంత్రముల దశ సంస్కారములు
27. కాదిమతమునందు మంత్రదోషము
28. మంత్ర దోషముల శమన ఉపాయము
29. త్రైలోక్యడామర తంత్రము
30. మంత్ర మేలన ప్రకారము
31. రాశి చక్ర విచారము
32. నక్షత్ర చక్ర విచారము
32. సిద్ధారి చక్ర విచారము
33. ఋణ-ధన శోధన ప్రకారము
34. కాళీమత ప్రకారము మంత్రమేలనము
35. నక్షత్రములందు గుణభేదములు
36. కులార్ణవమునందు రాశి చక్రము
37. రాశి చక్ర ఫలము
38. రాశుల వర్ణ భేదములు
39. పాంచభౌతిక చక్రము
40. సిద్ధ సాధ్యాది శోధన ప్రకారము

13, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 13



కులార్ణవము ప్రకారము గురుపాదుకా మహాత్మ్యము

వలయందు సూత్రాదులు ఏవిధంగా నిహితంగా ఉంటాయో ఆ విధంగానే కులాగమ జ్ఞానము గురుపాదుకనందు ప్రతిష్ఠమయి ఉంటుంది. గురుపాదుకా స్మరణ ఫలము కోటిమహాదానములకన్నా, కోటిమహావ్రతములకన్నా, కోటిమహాయజ్ఞములకన్నా, కోటిమంత్రజపములకన్నా, కోటితీర్ధయాత్రలకన్న, కోటిదేవతార్చనలకన్నా ఎక్కువ ఫలమునిచ్చును. మహారోగము, మహాఉత్పాతము, మహాదుఃఖము, మహాభయము, మహా ఆపద, మహాపాపము - వీటినుండి పాదుకా స్మరణము రక్షించును. అధ్యయనము, శ్రవణము, జ్ఞానము, ఇష్టపూజనము నందు ఏ జిహ్వ సదా ఉంటుందో, శ్రీపాదుకా జపము ఎవరు భక్తితో చేస్తారో వారు సమస్త పాపముల నుండి ముక్తి పొంది సద్గతి పొందుతారు. పవిత్ర లేదా అపవిత్ర అవస్థలందు ఎవరు పాదుకా స్మరణము చేస్తారో వారికి అనాయాసముగానే ధర్మ, అర్ధ, కామ, మోక్షములు ప్రాప్తించును. శ్రీనాధుని (స్వగురువు) చరణ కమలమును ఏ దిశయందు ఉంటాయో ఆ దిశనందు ప్రతీరోజు నమస్కారము చెయ్యాలి. పాదుకను మించిన మంత్రము, గురువును మించిన దైవము లేదు. శక్తిమార్గమును మించిన శ్రేష్ఠమైన మార్గము లేదు మరియు కులపూజనము మించిన పుణ్యము లేదు. ధ్యానమూలము గురుమూర్తి, పూజామూలము గురుపదము, శాస్త్రమూలము గురువాక్యము మరియు మోక్షమూలము గురుకృప. ఇందు ప్రతీక్రియకు గురువేమూలము. ఇందువలననే సిద్ధిగురించి గురుసేవ భక్తిసహితముగా ప్రతిదినమూ చెయ్యాలి. ఎప్పటివరకు మనుష్యుడు భక్తవత్సల గురువును శరణువేడడో అప్పటివరకూ అతడిని ఆర్తి, భయము, దుఃఖము, మోహము, శోకము, భ్రమ మొదలగునవి సతాయించును. ఎప్పటివరకు శివస్వరూపుడైన గురువును భక్తి భావముతో భజింపడో అప్పటివరకూ ఆ మనుష్యుడు దుఃఖమలినమైన సంసారము నందు భ్రమిస్తూఉంటాడు. సర్వసిద్ధి ఫలము మంత్ర వృక్షము యొక్క శాఖ. పరతత్త్వమహావృక్షమునకు గురుకృప మూలము. సంతుష్ట, ప్రసన్న, వరదగురు ఏ విధంగా మంత్రాన్ని ఇస్తారో అదేవిధంగా శిష్యుడు గురువునకు భక్తి, ధన, ప్రాణములను యత్నపూర్వకముగా ఇచ్చి సంతుష్టుని చెయ్యాలి. శివస్వరూపుడు, దేశికోత్తముడు అయిన గురువు ఏ శిష్యునకు మంత్ర దీక్షను ఇచ్చునో ఆ శిష్యునకు ముక్తి కలిగి పునర్జన్మ లేకుందును. ఇందువలననే గురువు ఏ విధంగా ప్రసన్నుడవుతాడో ఆ విధంగానే శిష్యుడు ఆరాధించాలి. గురువు ప్రసన్నుడయితే శిష్యుని పాపము వెంటనే తొలగుతుంది. భక్తియుక్తమైన మనస్సుతో కూడా మాన మరియు అనుజీవికా (=గురువు సంబంధితులు) ఆకాంక్షలు ఉండరాదు. భక్తవత్సలుడయిన గురువుకు అన్ని విషయములు తెలియపరచాలి. గురువు సంతుష్టుడయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవత, మునులు, యోగులు అందరూ ఆ సాధకుని మీద కృపను చూపుతారు. ఇందు ఎంతమాత్రము సంశయము లేదు. సంతుష్టుడైన ఏ గురువు ఉపదేశమిస్తారో ఆ శిష్యునకు భోగము-మోక్షము రెండూ లభిస్తాయి. సంతుష్టుడైన గురువు శిష్యుడిని స్వీకరిస్తారు. ఇందువలన, శిష్యుడు తన మనసా, వాచా, కర్మణా గురువుకు ప్రియమైన కార్యములు చేయవలెను. ఆవిధంగా పరితుష్టుడైన గురువు శిష్యుని ముక్తి పొందుమని ఆశీర్వదించిన మాత్రముననే ఆ శిష్యుడు ముక్తిని పొందగలదు. అట్లుకాని యెడల, దేవి గురువు రూపములో నిష్ప్రపంచ స్థలము నుండి వచ్చి స్వయముగా పశుపాశ బంధములనుండి విమోచనము కలిగించును. దేవతకు చతుర్వేదముల జ్ఞాని ఇష్టుడు కాదు. ఒకవేళ ఏ చండాలుడు గురువునుండి శిష్యరూపములో మంత్రమును తీసుకుంటాడో ఆ చండాలుడు కూడా దేవీ సమానుడయి పూజ్యనీయుడవుతాడు. గుణయుక్త విప్రుడు గుర్భక్తుడు కాకపోతే అతడు ప్రశస్తుడు కాలేడు. గుణవిహీన  మ్లేచ్ఛుడు గురుభక్తుడయితే అతడు విశిష్టుడవుతాడు. గురుభక్తి విహీనమైన తపము, విద్య, వ్రతము, కులములు నిష్ఫలములు. అటువంటివి కేవలము లోకరంజకములు మాత్రమే. గురుభక్తి అనే అగ్ని యందు దుర్జాతి కల్మషములు దగ్ధమైపోతాయి. నాస్తికుడైన పండితుడు కూడా పూజ్యుడు కాదు. ధర్మ, అర్ధ, కామము తర్వాత ఎవరు చెప్పగలరు? ఎవరికి దేవీ మరియు గురువునందు స్థిరమైన భక్తి ఉంటుందో వారి చేతుల్లోనే  మోక్షము, సర్వార్ధములు ఉంటాయి.

ప్రథమశ్వాస సమాప్తము
[ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ప్రథమశ్వాస సమాప్తము.]  

6, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 12

(ఈ సంచికలో గురు శిష్యుల లక్షణాలు చెప్పబడుచున్నవి. సాధనలో సిద్ధి పొందడానికి ఈ జ్ఞానము ఎంతో ముఖ్యము)


తంత్రరాజమును అనుసరించి గురుమండల పూజా విశేషదినములు
గురుమండల పూజను ఈ క్రింది విశేష దినములందు చెయ్యాలి.

       - గురుదేవుని జన్మదినము
       - విద్యాప్రాప్తి దినము (పూర్ణదీక్షా దినము)
       - సాధకుని జన్మదినము      
       - నాథవ్యాప్తి దినము.  
       - అక్షరత్రయ సంపాత దినము
       - పూర్ణ దినము
       - ఆరు పర్వదినములు
       - విశిష్ఠ సదర్శ ఏడు పర్వదినములు
       - ప్రతీమాసము లేక ప్రతీ సంవత్సరము చెయ్యాలి.

చివర చెప్పిన అయిదు విశిష్ట రోజులు తాంత్రిక పంచాంగమందుండును.

కాదిమతమునందు గురులక్షణములు

సాధకుల హితార్ధము కాదిమతంలో తంత్రములందు చెప్పబడిన గురు మరియు శిష్యుల లక్షణములు ఇక్కడ చెప్పబడుచున్నాయి.
గురువు సుందరుడు, సుముఖుడు, స్వఛ్చనీయుడు, సులభుడు, బహుమంత్రవిదుడు, అసంశయుడు, సంశయములను తీర్చగలవాడు, గర్వములేనివాడు, సంతోషముతో ఉండువాడు, ధనమునందు ఆపేక్షలేనివాడు, హితవాదము పలికేవాడు అయి ఉండవలెను.
పై గుణములు లేని గురువు శిష్యునకు దుఃఖదాయినుడవుతాడు.

కాదిమతమునందు శిష్యునిలక్షణములు 

సుందరము, సుముఖము, స్వచ్ఛత, సులభత్వం, శ్రద్ధాళువు, సుస్థిరాశయము, అలుబ్ధత్వము, స్థిరగాత్రము, జితేంద్రియత్వము, ఆస్తికత్వము, గురుమంత్రము మరియు దేవతా మంత్రమునందు ధృడ బుద్ధిత్వము అను లక్షణములు కలిగినవాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు. ఈ లక్షణములు లేని శిష్యుడు గురువుకు దుఃఖదాయకుడవుతాడు.  
  
గురు మాటను అంగీకరించువాడు, గురుమాట యొక్క అర్ధమును తెలుసుకొనువాడు, గురువు సన్నిహితమున ఆదరసహితముగా మాట్లాడువాడు (హే నాథ! మీరు ఏవిధంగా చెబుతారో ఆవిధంగానే అవుతుంది - అన్న చందంగా) ఇటువంటి లక్షణములను కలిగిన వాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు.

గురువుకు నమస్కారము చేసి అతని పక్కన కూర్చొని అతని ఆజ్ఞ తీసుకొని వెళ్ళాలి. గురుముఖమును చూస్తూ అతనిని సేవించాలి. గురువుయొక్క ఇష్టాన్ని గౌరవించాలి. గురువు సమక్షమున అనవసరమైన మాటలు మాట్లాడరాదు మరియు ప్రేలాపనలు చేయకూడదు.

కామ, క్రోధ, లోభ, మదము, నవ్వుట, స్తుతీ, జిహ్వచాంచల్యత, కార్యమందు పరివేదనము(=బాధించుట), ఋణము  తీసుకొనుట, ఋణము ఇవ్వుట, వస్తువుల క్రయ విక్రయము ఉత్తమ శిష్యుడు ఎప్పుడూ చెయ్యడు. గురువును సాక్షాత్ శివుని రూపంగానే భావించాలి. ప్రణామము, భజన చెయ్యాలి. దేవత ఎలాగో అలాగే మంత్రము, మంత్రము ఎలాగో అలాగే గురువు, గురువు ఎలాగో శిష్యుడు అలాగే ఉండాలి. ఈ భక్తి క్రమమును పాటించుట ఉత్తమ శిష్యుని లక్షణము. గురువు జన్మ దినమున ఉత్సవము చెయ్యాలి. విశేష పూజ చెయ్యాలి. యోగులకు భోజనం పెట్టాలి. వారి పాదములకు అర్చన చెయ్యాలి. గురువు దేహావసానాంతరము సాధకుడు అగ్రజునికి పూజ చెయ్యాలి. గురుశిష్యులు ఒకేస్థానము నందుంటే గురువునకు నిత్య పూజ చెయ్యాలి. ఒక యోజనము కన్నా ఎక్కువ దూరములో ఉంటే ఆరు నెలలలో ఒకమారు పూజ చెయ్యాలి. ఇంతకన్న ఎక్కువ దూరములో ఉంటే గురువు యొక్క ఆజ్ఞానుసారము ఆచారము పాటించాలి. గురువు యొక్క ఆసనము, శయ్య, వస్త్రము, భూషణము, పాడుకలు, చిత్రపటము, కళత్రము మొదలగునవి స్పర్శించి గురుపూజ చెయ్యాలి. గురుశిష్యులు ఒకే ఊరిలో నివసిస్తుంటే గురు ఆజ్ఞకు భిన్నంగా వేరే పూజ చేయరాదు. పూజ మధ్యలో గురుగారు వస్తే ప్రణామము చేసి ఆసనము మీద ఆసీనులను చెయ్యాలి. గురువుగారు కూర్చున్న పిదప వారి ఆజ్ఞానుసారము శేషపూజను చెయ్యాలి. శేష పూజను నిశ్చల మనస్సుతో చెయ్యాలి. పూజమధ్యలో గురు పూజ కూడా చెయ్యాలి. పూజాంతమునందు గురువు వచ్చినా గురుపూజ చెయ్యాలి. ఎక్కడ పూజ ఉందో అది గురువుకు చెప్పాలి. గురువు మౌనము దాల్చితే ఆ పూజ పూర్తి చేయకూడదు. గురువుకు మృత విషయము చెప్పకూడదు. అలాచేసినచో దేవతార్చన వలన మంత్ర సిద్ధి కలగదు. మంత్ర నిశ్చిత పూజ యథోచితముగా చెయ్యాలి. మంత్రము మరియు మంత్రపటలము (=పుస్తకము?) ఒకేరూపముగా తెలుసుకొని భక్తి పరాయణత్వం కలిగి ఉండాలి.

కాలీ మతమునందు గురుశిష్యుల లక్షణములు ఇవే చెప్పబడ్డాయి. సాధకుల హితార్ధము ఈ విషయములు చెప్పబడ్డాయి.

కులార్ణవము నందు గురు లక్షణములు
శ్రీగురువుని వేషము మనోహరముగా ఉండాలి. సర్వలక్షణ సంయుక్తము మరియు అన్ని అవయములు శోభితముగా ఉండాలి. అన్ని ఆగముల యొక్క అర్ధతత్త్వజ్ఞానము, అన్ని మంత్ర విధానముల జ్ఞానము, లోకులను సమ్మోహితులను చెయ్యగలవాడు, దేవతా సమానమైన ప్రియదర్శనము, సుముఖ, సులభ, స్వఛ్ఛ, శుద్ధ అంతఃకరణము కలవాడు, సంశయము లేనివాడు, ఇంగితాకార జ్ఞానము కలవాడు దుర్జనులకు దూరముగా ఉండువాడు, అంతర్ముఖుడు, బహిర్దృష్టి కలవాడు, సర్వజ్ఞుడు, దేశాకాల జ్ఞానము కలవాడు, ఆజ్ఞాసిద్ధి, త్రికాలదర్శి, నిగ్రహ-అనుగ్రములను పాటించడములో నేర్పరి, వేదవేదాంగముల జ్ఞానము, శాంతము, అన్ని జీవులందు దయ కలవాడు, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుకున్నవాడు, షడ్వర్గవిజయుడు, క్షమకలవాడు, అగ్రగణ్యుడు, అతిగంభీరుడు, పాత్ర-అపాత్ర జ్ఞానము కలవాడు, నిర్మమ, నిత్య సంతుష్టుడు, నిర్ద్వంద్వ, అనంతశక్తి యుక్త, సద్భక్తవత్సల, ధీర, కృపాళువు, నవ్వుతూ మాట్లాడేవాడు, భక్తప్రియ, సర్వసమ, దయాళు, శిష్యులను క్రమశిక్షణలో ఉంచేవాడు, శ్రేష్ఠ, నిష్ఠగురు, ప్రాజ్ఞ, వనితాపూజయందు ఉత్సుకత కలవాడు, నిరాఘాటంగా నిత్య-నైమిత్తిక పూజ చేసేవాడు, కర్మణ్య, అనిందిత, నిర్లోభ, అహింసక, అపక్షపాతి, విచక్షణ, విద్యలయొక్క పూర్ణ జ్ఞానము, మంత్ర-యంత్రాది రహస్యములు తెలిసిఉండడం, సంకల్ప-వికల్ప రహిత, నిర్ణితార్ధ విధాయకుడు, నింద-స్తుతిలందు సమభావము, మౌని, నిరపేక్షి మొదలగు లక్షణాలు కలవాడు గురుశ్రేష్ఠుడు అవుతాడు.

శ్రేష్ఠ శిష్య లక్షణాలు

ఉత్తమ శిష్యుల లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి -
శమాది సాధనాయుక్తుడు, గుణశీల సమన్వితుడు, శుద్ధదేహానుబంధ అంగములున్నవాడు, ధార్మికుడు, శుద్ధమానసకుడు, ధృడవ్రతుడు, సదాచార సంపన్నుడు, శ్రద్ధాభక్తి సమన్వితుడు, కృతజ్ఞుడు, పాపభీతి కలవాడు, సాధుసజ్జనుల చేత సమ్మతింపబడినవాడు, ఆస్తికుడు, దానగుణము కలవాడు, సర్వభూత దయకలవాడు, విశ్వాస-వినయయుక్తుడు, ధనమునందు ఆసక్తి లేనివాడు, అసాధ్యుడు, సాధకుడు, శూరుడు, బలకాంతి సమన్వితుడు, అనుకూల క్రియాయుక్తుడు, అప్రమత్తుడు, విచక్షణాజ్ఞానము కలవాడు, హిత-సత్యా-మితా-స్నిగ్ధ భాషి, ధూషనములను పట్టించుకోనివాడు, తక్షణవచనార్ధగ్రాహి, చతురుడు, బుద్ధిమానుడు, గృహ-తల్ప-ఆసన-ఉచ్ఛుంగ నిర్వికారుడు, సేవకుడు, విమృష్యకారుడు, వీరుడు, మనోదారిద్ర్యరహితుడు, సర్వకార్యములను నెరవేర్చగలవాడు, ధీరుడు, సర్వోపకారి, స్వార్ధము లేనివాడు, పరనిందచెయ్యనివాడు, సుముఖుడు, జితేంద్రియుడు, సుసంతుష్టబుద్ధిమానుడు, బ్రహ్మచారి, ఆధి-వ్యాధి చాపల్యరహితుడు, దుఃశంకా-ఆటంకవర్జితుడు, గురుధ్యాన-స్తుతి-సేవన-భజనమునందు ఉత్సుకత కలవాడు, గురు-దేవతా భక్తుడు, కామినీ భజన యందు ఉత్సుకత కలవాడు, నిత్యమూ గురు సమీపమున నివాసముండెడివాడు, గురువును సంతోషపెట్టువాడు, మనసా-వాచా-కర్మణా నిత్యమూ గురుకార్యమునందు సముత్సుకత కలవాడు, గుర్వాజ్ఞను పాలించేవాడు, గురుకీర్తిని ప్రకాశింపచేసేవాడు, గురువాక్యప్రమాణమును తెలిసినవాడు, గురుసేవనందు నిరతుడు, కులనాయికనందు చిత్తానువర్తుడు, ప్రేక్ష్యకారుడు, అభిమానము, గర్వము మొదలగునవి లేనివాడు, గురువస్తువులందు ఆపేక్షలేనివాడు, గురుకృపకై ఎదురు చూచువాడు, కులధర్మము-శాస్త్రము-యోగీ-యోగినీ-కౌలికలందు ప్రియత్వము కలవాడు, కులార్చనమునందు నిరతుడు, మోక్షమార్గానుగామి.
ఇటువంటి లక్షణములు కలిగిన యుక్తుడిని శిష్యునిగా స్వీకరించాలి.

కులార్ణవముననుసరించి నికృష్ట శిష్య లక్షణములు

దుష్టజాతి యందు పుట్టినవాడు, దుష్టుడు, గుణహీనుడు, కురూపుడు, పాశాండుడు, ధూర్తుడు, పండితమాని, న్యూనాధిక అంగములు కలవాడు, వికృతమైన అంగములు కలవాడు, వికలమైన అంగములు కలవాడు, మందకొడి, అంధుడు, బధిరుడు, మలినుడు, రోగి, ఉచ్ఛిష్టుడు, దుర్ముఖుడు, స్వేచ్ఛావేషధారి, విటుడు, దుర్విదగ్ధుడు, కుచేష్టుడు, చూడడానికి భయంకరముగా ఉండువాడు, నిద్ర-ఆలస్యయుక్తుడు, బద్దకము కలవాడు, జూదవ్యసనపరుడు, ద్వారము-కుడ్యము-స్తంబము మొదలగు వాని వద్ద సంచరించువాడు, సదాశూన్యయుక్త కరుడు, క్షుద్రుడు, గురుభక్తిరహితుడు, ఏకవాది, స్తబ్దుడు, ప్రేషకుడు, చపలుడు, శఠుడు, ధన-స్త్రీ శుద్ధి విహీనుడు, నిషేధవిధి వర్జితుడు, రహస్య భేదకుడు, దేవీ కార్య-అర్ధ ఘాతకుడు, మార్జర-బక వృత్తికుడు, ఛిద్రాన్వేషణ తత్పరుడు, మాయావీ, కృతఘ్నుడు, ప్రచ్చన్నాంతరదాయకుడు, విశ్వాసఘాతకుడు, దేవద్రోహి, పాపి, అనర్ధసిద్ధినందు ఆకాంక్షకలవాడు, నేరస్థులందు ఆదరణ కలవాడు, కూటసాక్షి, సర్వత్రయాచకుడు, సర్వాకృష్ట అభిగామి, అసత్యనిష్ఠుడు, అసక్తుడు, గ్రామ్యాదిబహుభాషి, దుర్విచారకారకుడు, కలహప్రియుడు, వ్యర్ధాపేక్షకుడు, భాంతుడు, భ్రామకుడు, వాగ్విడంబకుడు, పరోక్షమందు ధూషణ చేయువాడు, ప్రత్యక్షమందు ప్రియముగామాట్లాడువాడు, కటుభాషి, విద్యాచోరుడు, ఆత్మప్రశంసకుడు, సద్గుణములంటే పడనివాడు, సద్భీతి-ఆర్తి-క్రోధ సమన్వితుడు, చార్వాకదుర్జన సఖుడు, సర్వలోక విగర్హితుడు, చుగలఖోరుడు (= పీఠము వెనకాల నింద చేసేవాడు), ప్రక్కవాళ్ళకు దుఃఖమును కలిగించువాడు, సర్వప్రాణి భయంకరుడు, స్వక్లేషవాది, మిత్రద్రోహి, భ్రాతువంచకుడు, తస్కరుడు, పశుచేష్టితుడు, అకారణంగా ద్వేషము-హాసము-క్లేశము-క్రోధము మొదలగునవి చేయువాడు, అతిహాస్య సుకర్ముడు, మర్మాంతపరిహాసకుడు, కాముకడు, నిర్లజ్జ (లజ్జ లేనివాడు), మిధ్యాదుశ్చేష్ట సూచకుడు, సహనము లేనివాడు, మద-మాత్సర్య-దంభ-అహంకారయుక్తుడు, ఈర్ష్య, పైశున్య (=కొండెకానితనము; దుర్మార్గము; చాడీలు చెప్పుట), పారుష్య (=పరుసఁదనము; పరుసపు మాట; కఠినము), కార్పణ్య, క్రోధమాని, అధీర, దుఃఖీ, ద్వేష్య, అసక్త, తత్త్వవర్జిత, అప్రసన్నమతి, మూఢ, చింతాకులితమానస, తూష్ణాలోభయుక్త, దీన, అతుష్ట, సర్వయాచక, బహుభోజి, కపటి, భ్రామక, కుటిల, భక్తి-శ్రద్ధా-దయా-శాంతి-ధర్మాచారరహిత, మాతా-పితా-ప్రాజ్నా-శ్రేష్ఠులను అపహాస్యము చేయువాడు, కులద్రవ్యాదులందు ద్వేషము కలవాడు, గురుసేవను చేయవాడు, స్త్రీలను ద్వేషించువాడు, సమయభ్రష్టుడు, గురుశప్తుడు ఇత్యాది దుర్గుణములు కలవాడిని శిష్యునిగా స్వీకరించరాదు. స్నేహవశ్యమునగాని, లోభవశ్యమున గాని అటువంటి వానికి దీక్ష ఇస్తే ఆ గురుశిష్యులిద్దరికీ దేవత శాపమునిస్తుంది. అందువలన, ఈ ప్రకారము దుర్గుణములు కలవానికి ఎట్టిపరిస్థితులలోను దీక్ష ఇవ్వరాదు. ఒకవేళ, మోహవశ్యమున అటువంటివానిని శిష్యునిగా చేర్చుకున్నచో ఆ గురువుకు పాపము చుట్టుకుంటుంది. ఏ విధంగా మంత్రి చేసిన పాపము రాజునకు, స్త్రీ చేసిన పాపము భర్తకు చుట్టుకుంటాయో అదేవిధముగా శిష్యుడు చేసిన పాపము గురువుకు చుట్టుకుంటుంది. వర్ణాశ్రములన్నీ సద్గతి ప్రదాయకములు. గురు, స్త్రీ, వార (=నియతకాల సమయములు), ఆచారము, కులనాయక జ్ఞానము శిష్యునకు తెలిపినా సరే, శిష్యుడు వాటిని గ్రహించలేకపోతే గురువునకు ఆ పాపము అంటదు.

[అ.మా: పైన శిష్యునికి ఉండవలసిన ఎన్నో లక్షణములు చెప్పబడ్డాయి. ఈ రోజుల్లో అటువంటి శిష్యులు ఉన్నారా అన్నది సందేహమే. (లేరు అన్నది నిజం) గురు పూజ సంగతి తర్వాత. గురువుతో మాట్లాడడానికి కూడా ఎన్నో లెక్కలు వేసుకొనే శిష్య పరమాణువులు ఇప్పుడు ఉన్నారు. పర్వదినములందు గుర్వాశీర్వాదము WhatsAppల ద్వారా, చిన్న చిన్న సందేశముల ద్వారా కోరుకుంటారు. ఆ మాత్రం మాత్రం దానికే వారెంతో గొప్ప పని చేసినట్టు గర్వంగా అనుభూతి చెందేస్తారు. మరికొందరు గురువుతో ఏ ఆరు నెలలకో లేదా వారికి ఇచ్ఛ వచ్చినప్పుడు గురువును ఏదో సరదాగా పలకరిస్తుంటారు. మరికొంత శిష్యులు గురువు తమనే బాగా పట్టించుకోవాలని, అందరిలోకి తానే అతనికి దగ్గరవాడిని అని అనిపించుకోవాలాని తహతహలాడిపోతుంటారు. అలాంటివారికి గురు తత్త్వం ఎన్నటికీ బోధ పడదు. ఇక చాటుమాటుగా గురువును అపహాస్యం  చేసుకొనేవారు, శాపాలు పెట్టుకొనేవారి సంగతి వేరే చెప్పుకోనక్కర్లేదు. శిష్యుల వింత చేష్టలు, రకరకాల శిష్యుల గురించి ఈ బ్లాగ్లోనే "శిష్యులందు ఉత్తమ శిష్యులు వేరయా" అన్న వ్యాసము చూడగలరు.]
ఇంకాఉంది