సూక్తి

భోగములయందు విముక్తి, ఆత్మ విచారమందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, ఏప్రిల్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 13కులార్ణవము ప్రకారము గురుపాదుకా మహాత్మ్యము

వలయందు సూత్రాదులు ఏవిధంగా నిహితంగా ఉంటాయో ఆ విధంగానే కులాగమ జ్ఞానము గురుపాదుకనందు ప్రతిష్ఠమయి ఉంటుంది. గురుపాదుకా స్మరణ ఫలము కోటిమహాదానములకన్నా, కోటిమహావ్రతములకన్నా, కోటిమహాయజ్ఞములకన్నా, కోటిమంత్రజపములకన్నా, కోటితీర్ధయాత్రలకన్న, కోటిదేవతార్చనలకన్నా ఎక్కువ ఫలమునిచ్చును. మహారోగము, మహాఉత్పాతము, మహాదుఃఖము, మహాభయము, మహా ఆపద, మహాపాపము - వీటినుండి పాదుకా స్మరణము రక్షించును. అధ్యయనము, శ్రవణము, జ్ఞానము, ఇష్టపూజనము నందు ఏ జిహ్వ సదా ఉంటుందో, శ్రీపాదుకా జపము ఎవరు భక్తితో చేస్తారో వారు సమస్త పాపముల నుండి ముక్తి పొంది సద్గతి పొందుతారు. పవిత్ర లేదా అపవిత్ర అవస్థలందు ఎవరు పాదుకా స్మరణము చేస్తారో వారికి అనాయాసముగానే ధర్మ, అర్ధ, కామ, మోక్షములు ప్రాప్తించును. శ్రీనాధుని (స్వగురువు) చరణ కమలమును ఏ దిశయందు ఉంటాయో ఆ దిశనందు ప్రతీరోజు నమస్కారము చెయ్యాలి. పాదుకను మించిన మంత్రము, గురువును మించిన దైవము లేదు. శక్తిమార్గమును మించిన శ్రేష్ఠమైన మార్గము లేదు మరియు కులపూజనము మించిన పుణ్యము లేదు. ధ్యానమూలము గురుమూర్తి, పూజామూలము గురుపదము, శాస్త్రమూలము గురువాక్యము మరియు మోక్షమూలము గురుకృప. ఇందు ప్రతీక్రియకు గురువేమూలము. ఇందువలననే సిద్ధిగురించి గురుసేవ భక్తిసహితముగా ప్రతిదినమూ చెయ్యాలి. ఎప్పటివరకు మనుష్యుడు భక్తవత్సల గురువును శరణువేడడో అప్పటివరకూ అతడిని ఆర్తి, భయము, దుఃఖము, మోహము, శోకము, భ్రమ మొదలగునవి సతాయించును. ఎప్పటివరకు శివస్వరూపుడైన గురువును భక్తి భావముతో భజింపడో అప్పటివరకూ ఆ మనుష్యుడు దుఃఖమలినమైన సంసారము నందు భ్రమిస్తూఉంటాడు. సర్వసిద్ధి ఫలము మంత్ర వృక్షము యొక్క శాఖ. పరతత్త్వమహావృక్షమునకు గురుకృప మూలము. సంతుష్ట, ప్రసన్న, వరదగురు ఏ విధంగా మంత్రాన్ని ఇస్తారో అదేవిధంగా శిష్యుడు గురువునకు భక్తి, ధన, ప్రాణములను యత్నపూర్వకముగా ఇచ్చి సంతుష్టుని చెయ్యాలి. శివస్వరూపుడు, దేశికోత్తముడు అయిన గురువు ఏ శిష్యునకు మంత్ర దీక్షను ఇచ్చునో ఆ శిష్యునకు ముక్తి కలిగి పునర్జన్మ లేకుందును. ఇందువలననే గురువు ఏ విధంగా ప్రసన్నుడవుతాడో ఆ విధంగానే శిష్యుడు ఆరాధించాలి. గురువు ప్రసన్నుడయితే శిష్యుని పాపము వెంటనే తొలగుతుంది. భక్తియుక్తమైన మనస్సుతో కూడా మాన మరియు అనుజీవికా (=గురువు సంబంధితులు) ఆకాంక్షలు ఉండరాదు. భక్తవత్సలుడయిన గురువుకు అన్ని విషయములు తెలియపరచాలి. గురువు సంతుష్టుడయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దేవత, మునులు, యోగులు అందరూ ఆ సాధకుని మీద కృపను చూపుతారు. ఇందు ఎంతమాత్రము సంశయము లేదు. సంతుష్టుడైన ఏ గురువు ఉపదేశమిస్తారో ఆ శిష్యునకు భోగము-మోక్షము రెండూ లభిస్తాయి. సంతుష్టుడైన గురువు శిష్యుడిని స్వీకరిస్తారు. ఇందువలన, శిష్యుడు తన మనసా, వాచా, కర్మణా గురువుకు ప్రియమైన కార్యములు చేయవలెను. ఆవిధంగా పరితుష్టుడైన గురువు శిష్యుని ముక్తి పొందుమని ఆశీర్వదించిన మాత్రముననే ఆ శిష్యుడు ముక్తిని పొందగలదు. అట్లుకాని యెడల, దేవి గురువు రూపములో నిష్ప్రపంచ స్థలము నుండి వచ్చి స్వయముగా పశుపాశ బంధములనుండి విమోచనము కలిగించును. దేవతకు చతుర్వేదముల జ్ఞాని ఇష్టుడు కాదు. ఒకవేళ ఏ చండాలుడు గురువునుండి శిష్యరూపములో మంత్రమును తీసుకుంటాడో ఆ చండాలుడు కూడా దేవీ సమానుడయి పూజ్యనీయుడవుతాడు. గుణయుక్త విప్రుడు గుర్భక్తుడు కాకపోతే అతడు ప్రశస్తుడు కాలేడు. గుణవిహీన  మ్లేచ్ఛుడు గురుభక్తుడయితే అతడు విశిష్టుడవుతాడు. గురుభక్తి విహీనమైన తపము, విద్య, వ్రతము, కులములు నిష్ఫలములు. అటువంటివి కేవలము లోకరంజకములు మాత్రమే. గురుభక్తి అనే అగ్ని యందు దుర్జాతి కల్మషములు దగ్ధమైపోతాయి. నాస్తికుడైన పండితుడు కూడా పూజ్యుడు కాదు. ధర్మ, అర్ధ, కామము తర్వాత ఎవరు చెప్పగలరు? ఎవరికి దేవీ మరియు గురువునందు స్థిరమైన భక్తి ఉంటుందో వారి చేతుల్లోనే  మోక్షము, సర్వార్ధములు ఉంటాయి.

ప్రథమశ్వాస సమాప్తము
[ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ప్రథమశ్వాస సమాప్తము.]  

2 కామెంట్‌లు:

PADMAJA చెప్పారు...

శ్రీ గురుభ్యోంనమః 🙏🙏🙏

RamaKrishna చెప్పారు...

శ్రీగురుభ్యోనమః