శ్రీదక్షిణామూర్తి సంహిత
శక్తిఉపాసనను తెలుపుటకు చాలా తంత్ర గ్రంథములు కలవు. వాటిలో శ్రీదక్షిణామూర్తి
సంహిత ఒకటి. భగవంతుడు శివుని మరొక రూపమైన దక్షిణామూర్తి మరియు పార్వతి సంవాదములో ఈ
తంత్రము సాగుతుంది. తాంత్రిక వాఙ్మయము అత్యంత విశాలము. దక్షిణామూర్తి సంహిత ఆ విశాల
వాఙ్మయమునకు ఒక చిన్న కొమ్మ. అరవైఅయిదు భాగములున్న ఈ తంత్రమునందు శివపార్వతులు విభన్నమైన, నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తులను, వారి స్వరూపములను, వారి ఉపాసనా పద్ధతులను చర్చించారు.
ఏకాక్షర లక్ష్మి, మహాలక్ష్మి, త్రిశక్తి, సామ్రాజ్యప్రదావిద్యా, అష్టాక్షరపరంజ్యోతివిద్యా, మాతృకా, త్రిపురేశ్వరి, పంచకోశ, లలితా, భైరవి, కల్పలతా, మహావిద్యా, నిత్యాదుల మంత్రములు వారి ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము వినియోగములతో బాటుగా న్యాసవిధి, యంత్ర రచన, ధ్యాన, జప, హోమద్రవ్యములు, హోమవిధి మొదలగునవి శాస్త్రోక్తముగా విశదీకరించబడినవి.