ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః
శ్రీ లలితామహాత్రిపురసుందర్యై నమః
శ్రీ మహాగణపతయే నమః
[విజ్ఞప్తి: ఇందు ప్రకటించబడుచున్న మంత్రములు, ఆయా సాధనలూ సద్గురువు ద్వారా నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే సాధన చేయవలెనని పాఠకులందరికీ వినయపూర్వక విజ్ఞప్తి. "విషయము ఇది" అని తెలుపుటకు మాత్రమే ఈ గ్రంథమును ఇచట ప్రచురించడం జరుగుతున్నది. గమనించ ప్రార్థన.]
మొదటి భాగము
ఏకాక్షర లక్ష్మీ పూజావిధానం
ప్రార్థన:
శ్రీమత్
శ్రీకోశహృదయాత్మకము, పంచసింహాసనమును అధిష్టించి ఉండునది, కల్పలతములకు
ఫలము వంటిది, సుందర రత్నములతో దేదీప్యమానంగా ప్రకాశించునది, చతురాయతనములకు ఆనందము చేకూర్చునది, నాలుగు
సంప్రదాయములకు (=సమయ, దక్షిణ, వామ, కౌల ?)జ్ఞాననిధి అయినటువంటిది అయిన నిత్యానంద
పరబ్రహ్మ తేజమునకు సుఖప్రీతి కొరకై నేను నమస్కరిస్తున్నాను.
శివుడిని పార్వతి
అడుగుచున్నది -
హే ఆనందసుందర! హే మహాదేవ! నాయందు కృపను
చూపు. నేను పరబ్రహ్మ ధామము యొక్క తత్త్వమును తెలుసుకోవాలనుకొంటున్నాను. హే దేవా! ఆ
బ్రహ్మము ఏవిధముగా శ్రీసహితము మరియు శ్రీకోశహృదయము? ఆ
బ్రహ్మము అయిదుసింహాసనముల ద్వారా ఏ విధముగా సేవించబడుచున్నది? అది ఏవిధంగా కల్పలతాత్మకము? హే ప్రభూ! అది ఏ విధంగా
ఆమ్నాయ సంసేవ్యము మరియు నిత్యాత్మకము?
పార్వతియొక్క ఈ సవినయ
ప్రార్థన విని శివుడు ఈ విధంగా చెప్పుచున్నాడు -
ఓ పార్వతీ! త్రిపురా
పరమేశ్వరీయే ఆ సర్వాత్మక బ్రహ్మము. ఆమె చతుర్విధలక్ష్ముల ద్వారా సేవించబడుచూ
ఉంటుంది. ఆమె సర్వదా శ్రేష్ఠము మరియు కామప్రపూరిణీ. శ్రీవిద్యా, లక్ష్మీ, మహాలక్ష్మీ, త్రిశక్తి,
సర్వసామ్రాజ్యలక్ష్మీ ఈ అయిదుగురూ ఇందు చెప్పబడ్డారు. వరుణబీజము వ, క అంతము శ, వహ్ని బీజము ర, దీర్ఘనేత్రము
ఈకారము, బిందు, నాదము, అనుస్వారముతో ఆవృతము అయినచో అది శ్రీం బీజము అవుతుంది. ఈ బీజమునే లక్ష్మీ
మంత్రము అని అంటారు.
ఈ మంత్ర ఋషి - బృగు| ఛందస్సు - నిచృత్| దేవత - లక్ష్మీ| శతు - బీజము|
యా - శక్తిః| రేఫ - కీలకం|
షడంగన్యాసము:
ఆం| ఈం| ఊం| ఐం (ఇంద్ర)| ఔం (చంద్రకళ)| అం
(అనుస్వారము) - వీటితో షడంగన్యాసము చెయ్యాలి.
అష్టదలపద్మము, దానికి వెలుపల భూపురము
నిర్మించి ఆ దళ మధ్యన పుష్పమును సమర్పించి పీఠశక్తులను పూజించాలి. ఎనిమిది
దిక్కులందు క్రమంగా విభూతి, ఉన్నతి,
సృష్టి, తుష్టి, కీర్తి-ధృతి, పుష్టి, ఉత్కృష్టి, ఋద్ధిలను
పూజించాలి. మధ్యన సర్వశక్తిమయ సింహాసనమును పూజించాలి. ఆ తర్వాత, విద్వాంసులతో కీర్తించబడుచున్నది, బంగారు వర్ణముతో
శోభిల్లుచున్నది, దివ్యరత్నముల భూషణములు ధరించినది, సమస్త దేవతలచేత నమస్కరించబడుచున్నది, ప్రకాశవంతముగా
ఉండునది, రెండు చేతుల ద్వారా అమృతము మరియు ముక్తారత్నములను పదేపదే
కురిపించునది, శిరస్సున రత్నఖచిత కిరీటమును ధరించునది, శుభ్రమైన పట్టుబట్టలు, అంగరాగములు (చందనాదుల పూత)
ధరించునది, కమలముల వంటి నేత్రములు గలది మరియు విష్ణువు
ద్వారా హృదయమున ధ్యానించబడునది అయిన లక్ష్మిని ధ్యానించాలి. కమలాపుష్పములను ధరించు
దేవిని ఈవిధంగా ధ్యానం చేసి ఆమె పూజ చెయ్యాలి. పూజనీయ దేవి యొక్క స్వరూపము ఈ
క్రింది విధంగా ఉంటుంది -
ఆమె రెండు చేతుల్లోనూ
వరద, అభయ ముద్రలు మరియు మరో రెండు
చేతులందు కమలములు ఉండును. ఈ విధంగా ఆమె నాలుగు చేతులు కలిగి సుందరమైన నేత్రములు
కలిగి ఉండును.
పై విధంగా ధ్యానము
తర్వాత ఆవాహనాది ముద్రలను ప్రదర్శించాలి.
ముద్రా వర్ణన:
అంజలి పైకి క్రిందకి
ప్రదర్శించుట ఆవాహన. ఆవాహనకు వ్యతిరేకంగా ప్రదర్శించుట స్థాపిని. రెండు పిడికిళ్లూ
బిగించి రెండు అంగుష్ఠలను పైకి పెట్టి ప్రదర్శించుట సన్నిధాపిని. రెండు పిడికిళ్లూ
బిగించి రెండు అంగుష్ఠలను లోపలకు పెట్టి ప్రదర్శించుట సన్నిరోధని. రెండు తర్జనీలను
గుండ్రంగా తిప్పుట సకలీకరణం. అంజలీని అర్ఘ్యసమానంగా ప్రదర్శించడం పరమీకరణం.
ఈ సామాన్య ముద్రలను
ప్రదర్శించి సర్వకామ ప్రయోజన సిద్ధికొరకు గంధ, పుష్పాదులతో చాలా చక్కగా పూజచెయ్యాలి.
ఆ తర్వాత బలాక, విమల,
కమలా, వనమాలికా, విభీషికా, మాలికా, శాంకరీ, వసుమాలికా -
ఈ అంగ దేవతలను పూర్వాది దిశలందు ప్రదక్షిణ క్రమంలో పూజించాలి. భూపురమున ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, కుబేర, ఈశాన దిక్పతుల
క్రమంలో అర్చన చెయ్యాలి.
మంత్రమును పన్నెండు
లక్షలు జపించి,
అందులో దశాంశము హోమము చెయ్యాలి. హోమము త్రిమధురముల మిశ్రముతో కమలములతో చెయ్యాలి. ఆ
తర్వాత సాధకుడు పురశ్చరణకర్త అవుతాడు. ఈ ప్రకారంగా సిద్ధి పొందిన మంత్రము
సర్వసామ్రాజ్యమును ప్రాప్తింపచేయును.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస
గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన
ఏకాక్షరలక్ష్మీ పూజావిధి అను ప్రథమ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి