సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, జూన్ 2018, సోమవారం

అంతర్యాగ షోడషోపచార పూజ


అంతర్యాగ షోడషోపచార పూజ
(శ్రీగణపతిముని విరచిత ఉమాసహస్రం నుండి)

కావ్యకంఠ గణపతిమునిగారు ఆధునికకాలంలో ఎంతో ప్రసిద్ధిపొందిన మరియు సిద్ధిపొందిన ఉపాసకులు. భగవాన్ శ్రీరమణమహర్షిని లోకానికి పరిచయం చేసిన మహనీయులు. వారు రచించిన ఎన్నో గొప్ప రచనలలో ఉమాసహస్రం చాలా ప్రాశస్త్యమైనది. అందు వారు ప్రతిపాదించిన అంతర్యాగ షోడషోపచారపూజను సాధకుల సౌకర్యార్ధమై ఇచ్చట ఇస్తున్నాను. (ఇందు కొన్ని భావనలను శ్రీరమణాశ్రమువారు ప్రచురించిన ఉమాసహస్రమునుండి తీసుకొనబడినవి). అంతర్యాగమును సాధించుటకు ముందు సాధకులు బహిర్యాగములో నిష్ణాతులు కావలెను. ఔత్సాహికులు గమనించగలరు.

ఓం శ్రీగణాధిపతయే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః
1)   ధ్యానంః
కృతేన సా నిసర్గతో ధృతేన నిత్య మాననే।
సితేన శీతశైలజా స్మితేన శం తనోతు మే॥

(సహజసిద్ధమై సర్వదా ముఖమున ప్రకాశించు తెల్లని నవ్వుతో హిమాచలపుత్రియగు ఉమాదేవి నాకు శుభమును కలిగించుగాక)

ప్రతిక్షణం వినశ్వరా నయే! విసృజ్య గోచరాన్।
సమర్చయేశ్వరీం మనో! వివిచ్య విశ్వశాయినీమ్॥

(ఓ మనసా! అనుక్షణం నశించునట్టి శబ్దాది విషయములను విడిచిపెట్టి చిత్తవృత్తులను వేరు పరచి చిత్తవృత్తులకు, విషయములకు ఆధారముగానున్న చిద్రూపిణియగు పరమేశ్వరిని అర్చించుము)
2)   ఆవాహనంః
విశుద్ధదర్పణేన వా విధారితే హృదామ్బ మే।
అయి! ప్రయఛ్చ సన్నిధిం నిజే వపుష్యగాత్మజే॥

(అమ్మా! పార్వతీదేవీ! నా హృదయస్థానమునకు నిన్ను ఆహ్వానిస్తున్నాను. అనగా నా హృదయమున నీవు నిలువుమని అర్ధము)

3)   ఆసనంః
పురస్య మధ్య మాశ్రితం సితం య దస్తి పంకజం।
అజాణ్డమూల్య మస్తు తే సురార్చితే తవాసనం॥

(దేవతలచేత పూజించబడు ఓ మాతా! నా నిర్మలహృదయారవిందమును నీకు ఆసనముగా చేయుచున్నాను)

4)   పాద్యంః
 అఖణ్డధారయా ద్రవ న్నవేన్దుశేఖరప్రియే।
మదిఇయభక్తిజీవనం దధాతు తేఽమ్బ! పాద్యతాం॥

(అమ్మా! అవిచ్ఛన్నధారగా ప్రవహించు నా భక్తియే నీపాదారవిందములకు పాద్యమగుగాక)
   
5)   అర్ఘ్యం
వివాసనౌఘమానసప్రసాదతోయమమ్బ! మే।
సమస్తరాజ్ఞి హస్తయోరనర్ఘమర్ఘ్యమస్తుతే॥

(అమ్మా! సమస్తవాసనారహితమైన నా మనోనైర్మల్యమను జలము నీ చేతులకు అర్ఘ్యముగుగాక)

6)   ఆచమనీయంః

మహేంద్రయోనిచింతనాద్భవన్ భవస్య వల్లభే।
మహారసో రసస్త్వయా నిపీయతాం విశుద్ధయే॥

(శివుని ప్రేయసీ! ఇంద్రయోని ధ్యానమువలన స్రవించు అమృతరసమే నీకు ఆచమనీయము.)
(ఇంద్రయోని మానవ శరీరంలోని అంగుటి దగ్గర ఉండును. సాధకుడు తీవ్రమైన సాధన చేయగా చంద్రమండలమునుండి జాలువారు అమృతము ఈ ఇంద్రయోని ద్వారా స్రవించును. దీనినే అంతర్యాగ పూర్ణదీక్ష అని అందురు)

7)   అభిషేకంః

సహస్రపత్రపంకజద్రతత్సుధాజలేన సా।
సహస్రపత్రలోచనా పినాకినోభిషిచ్యతే॥

(పైవిధముగా స్రవించబడు అమృతధారతో నిన్ను అచిషేకించుదును)

8)   పంచామృత స్నానం

మమార్జితం యదింద్రియై స్సుఖం సుగాత్రి! పంచభిః।
తదంబ తుభ్య మర్పితం సుధాఖ్యపంచకాయతామ్॥
(అమ్మా! పంచేద్రియములచేత దర్శనాదులవలన నేను పొందిన సుఖము నీకు పంచామృతము అగుగాక)

9)   వస్త్రంః

వసిష్ఠగోత్రజన్మనా ద్విజేన నిర్మితం శివే।
ఇదం శరీర మేవ మే తవాస్తు దివ్య మంశుకం॥
(మంగళరూపిణీ! జననీ! ఈ నా దేహమే నీకు దివ్యవస్త్రము అగుగాక. ఇక్కడ సాధకుని శరీరమే అమ్మవారికి వస్త్రముగా భావించుకోవాలి.)

10)                ఉపపవీతంః

విచిత్రసూక్ష్మతన్తుభృ న్మమేయ మాత్మనాడికా।
సుఖప్రబోధవిగ్రహే మఖోపవీత మస్తుతే॥

(అమ్మా! కుండలిరూపమైన నిన్ను ఆసరాచేసుకున్న సుషుమ్నా నాడియే నీకు ఉపవీతము)

11)                చందనంః

మహద్విచిన్వతో మమ స్వకీయతత్త్వవిత్తిజమ్।
ఇదం తు చిత్త సౌరభం శివే తవాస్తు చందనమ్॥

(అమ్మా! ఆత్మతత్త్వజ్ఞానము వలన నా మనస్సుకు కలిగిన సువాసనయే నీకు చందనం)

12)                పుష్పార్చనః

మహేశనారి నిశ్స్వసన్ తథాయ ముచ్ఛ్వసన్ సదా।
తవానిశం సమర్చకో మమాస్తు జీవమారుతః ॥

(మహేశ్వరీ! ఉచ్ఛ్వాస నిశ్శ్వాసరూపమగు నా ప్రాణవాయువు నీకు పూజాపుష్పమగుగాక)

13)                ధూపంః

విపాకకాలపావకప్రదీప్తపుణ్యగుగ్గులుః।
సువాసనాఖ్యధూపభృద్భవ త్వయం మమాంబతే॥

(అమ్మా! నా పుణ్యపరిపాకమువలన కలిగిన నా చక్కని సంస్కారవిశేషములే నీకు ధూపమగుగాక)

14)                దీపంః

గుహావతారమౌనినా మయీశ్వరి ప్రదీపితా।
ఇయం ప్రబోధదీపికా ప్రమోదదాయికాస్తుతే॥

(అమ్మా! నాలో వెలిగిన జ్ఞానదీపమే నీకు దీపోపచారము)

15)                మహానైవేద్యముః

ఇమామయి ప్రియాత్ప్రియాం మహారసా మహంకృతిమ్।
నివేదయామి భుజ్యతా మియం త్వయా నిరామయే॥

( ఆరోగ్యస్వరూపిణీ అమ్మా! నా అహంకరమునే నీకు నైవేద్యముగా సమర్పించుచున్నాను)

16)                తాంబూలంః

సరస్వతీ సుధాయతే మనో దధాతి పూగతామ్।
హృదేవ పత్ర మంబికే త్రయం సమేత్యతేర్ప్యతే॥

(అమ్మా! నా వాక్కును సున్నముగా, మనస్సును పోకగా, హృదయమును తమలపాకుగా జేసి నీకు తాంబూలముగా సమర్పించుచున్నాను)

17)                నీరాజనం

వినీలతోయదాన్తరే విరాజమానవిగ్రహా।
నిజా విభూతి రస్తుతే తటిల్లతా ప్రకాశికా॥

(నా ఆజ్ఞాచక్రమున మెరుపుతీగవలే ప్రకాశించు వెలుగులే నీకు నీరాజనము)

18)                మంత్రపుష్పంః

స్వరోయ మన్తరంబికే ద్విరేఫవత్స్వరన్ సదా।
మమాభిమంత్ర్య ధీసుమం దదాతి దేవి తేంఘ్రియే॥

(అమ్మా! నాలోపల శుద్ధప్రాణరూపమైన స్వరము అవ్యక్తనాదమై నా బుద్ధియను పుష్పమును అభిమంత్రించి నీకు సమర్పించుచున్నాను)

19)                ఉద్వాసనం

తవార్చనం నిరంతరం యతో విధాతు మస్మ్యహం।
న విశ్వనాధపత్ని తే విసర్జనం విధీయతే॥

(అమ్మా! పార్వతీ! నేను అవిచ్చిన్నముగా నిన్ను అర్చించవలసి ఉన్నందున నీకు ఉద్వాసనము చెప్పుటలేదు. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయమునందే నిలుపుకుందును అని భావం)

20)                ప్రార్ధనః

జడే ష్వివాలసే ష్వివ ప్రయోజనం న నిద్రయా।
విహర్తు మేవ యాచ్యసే హృదీశసద్మరాజ్ఞి మే॥

(అమ్మా! పరమేశ్వరీ। అజ్ఞానులందువలె, సోమరులందువలె నిద్రవలన ప్రయోజనములేదు. నా హృదయమునందు నీవు (ఎల్లప్పుడూ) సంచరించవలెనని ప్రార్ధిస్తున్నాను. సాధనచేయని వారు అజ్ఞానులు. వారియందు కుండలినీశక్తి జాగృతమవదు. సాధనవలన కుండలినీశక్తి జాగృతమవుతుంది. తత్ఫలితంగా ఆత్మస్వరూపము తెలుసుకొనదగును. అందువలనే పూజాఫలముగా అమ్మను నిరంతరము తన హృదయకమలమందు సంచరించమని సాధకుడు ప్రార్ధిస్తున్నాడు.)


కామెంట్‌లు లేవు: