మనకు ఇంతమంది దేవ్వుళ్ళెందుకు? ఏ ఒక్క దేవుడినే ఆరాధిస్తే సరిపోదా? అని అప్పుడప్పుడు కొంతమంది నన్ను అడుగుతుంటారు. ఈ విషయం తెలుసుకోవాలంటే మన ఆధ్యాత్మిక విజ్ఞానంమీద కొంచెం లోతైన అవగాహన ఉండాలి. లేదంటే ఈ రహస్యం తెలుసుకోవడం కష్టం. ఈ రహస్యం తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం ప్రయత్నిద్దాం.
మన వేదాలు, శాస్త్రాలు బహ్వీశ్వరమును (పెక్కు దేవుళ్ళను) ఎన్నడూ ప్రతిపాదించలేదు. నిజానికి అవి దేవుడొక్కడే అదే పరబ్రహ్మము అని నొక్కి వక్కాణించాయి. ఓమితిబ్రహ్మ, ఓమితీదగ్ం సర్వం అని వేదమాట. ప్రణవమైన ఓంకారమే బ్రహ్మము, అదియే సర్వస్వము అని అర్ధము. శైవులు, శాక్తేయులు, వైష్ణవులు ఇలా రకరకాల ఆధ్యాత్మిక శాఖలు వారి వారి ఇష్టపూరితమైన దేవునిగా ఈ పరబ్రహ్మను భావించుకుంటారు. నిజానికి బ్రహ్మానికి రూపమేమీ లేదు. సర్వరూపములు అతని/ఆమెవే. సాధకుడు ఏ రూపమున
ఆ పరబ్రహ్మమును భావించునో ఆ రూపమందే పరబ్రహ్మము ఆవిర్భవించును. ఉదాహరణకు, శ్రీమహావిష్ణువు
ప్రహ్లాదునికి ఒకరకంగా, ధృవునికి ఇంకో రకంగా ఇలా రకరకాల దర్శనాలను తన భక్తులకు, శత్రువులకు
కూడా ఇచ్చాడు. ఇంకా నయం ఆ అవతారాలన్నీ వేరువేరు దేవుళ్ళని పెద్దగా ఎవరూ ప్రచారంచేయలేదు.
ఒక కుమ్మరివాడు మట్టితో ఎన్ని రకముల బొమ్మలను తయారుచేయునో, ఆవిధముగానే పరబ్రహ్మమును
తెలుసుకున్న సాధకుడు తన ఇచ్ఛామాత్రమున తనకు కావలసిన మూర్తిని పూజించి ప్రత్యక్షము చేసుకొనుచున్నాడు.
కనుకనే హిందూ శాస్త్రములందు పన్నెండు నెలలయందు ఏదో ఒక దేవతామూర్తిని నిర్మించుకొని
పూజించడం కనిపిస్తున్నది. ఎంతో మంది మన ప్రాచీన సాధకులు ఆ పరబ్రహ్మమును వారి ఇచ్చాపూర్వకమగు
ఎన్నో మూర్తులందు దర్శించి మనకు అందించారు. అందువలనే మనకు ఈరోజు ఎన్నో దేవతారాధనలు
కనిపిస్తున్నాయి. ఇటువంటి అధ్బుతమైన దర్శనాలు మరి ఏ ఇతర మతములందు కనిపించడంలేదు. అల్పబుద్ధికలవారికి
ఈ విషయమునందు అల్పదృష్టి ఉండవచ్చునుకాని, మన ఋషులకు అలాలేదు. కనుకనే వారు బ్రహ్మమొక్కటే
అని ఎలుగెత్తి చాటారు. ఈ విషయాలు అర్ధంచేసుకోక కొంతమంది మన పూజలను ఎగతాళి చేస్తుంటారు.
మరీ ఖర్మమేమిటంటే, మన హిందూ ఔన్నత్యమును అర్ధం చేసుకోలేక కొంతమంది హిందువులే ఈవిధమైన
బహీశ్వర వ్యర్ధవాదములు చేసుకొని కొట్టుకొంటున్నారు. బహుస్యాం ప్రజాయేయ (ఒక్కనేనే అనేకమగుదును)
అని చెప్పిన ఆ ఈశ్వరుని తమయందును, విశ్వమందును, ప్రతిపరమాణువునందును నిర్వికారభావముతో దర్శించినటువంటి మహా పుణ్యాత్ములు నివసించిన ఈ కర్మభూమి యందు పుట్టిన కొంతమంది జనులనుండి
ఇటువంటి మాటలు వినవలసి రావడం నిజంగా మన దురదృష్టం.
(నా పరమేష్టి గురువుగారు శ్రీఈశ్వరసత్యనారాయణ
గారి ప్రవచన అధారంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి