సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 08

భూతశుద్ధి

పంచభూతములతో నిర్మితమైన ఈ శరీరమునందు ఆ పంచభూతముల శోధనము అవ్యక్తమైన బ్రహ్మ యొక్క సంపర్కముతో అవుతుందని అభిప్రాయము.

సుషుమ్నా మార్గమున ఆత్మను పరమాత్మతో జోడించాలి. యోగయుక్తవిధి, చిన్మంత్రము మరియు ఏకాగ్రత మనస్సు వలన అది సాధ్యమవుతుంది. చిన్మంత్రమును పరమాత్మ మంత్రముగా చెబుతారు.

చిన్మంత్రము: ఓం హ్రీం హంసఃసోహం స్వాహా|

ఈ మంత్రంతో మూలాధారాది షట్ చక్రములను భావించాలి. హృదయచక్రము (=అనాహత) న ఉన్న జీవాత్మను మానసికరూపంలో సుషుమ్నా మార్గము ద్వారా కుండలినీతో బాటుగా బ్రహ్మరంధ్రమున ఉన్న పరమశివ పదమునతో ఈ క్రింది మంత్రముతో జోడించాలి. 

"కుండలినీం జీవాత్మానా సహ బ్రహ్మరంధ్రస్థ పరమశివపదే యోజయామి స్వాహా| ఇదం లింగ శరీరం శోధయామి స్వాహా"

జీవాత్మను మనోదండంతో తాడనం చెయ్యాలి.

హుం బీజముతో అపాన వాయువును సంకోచింపచేసి అధోవహ్నిని వెలిగించాలి. ఆ ఉష్ణముతో జీవాత్మను దగ్ధం చెయ్యాలి.

సుషుమ్నా నాడికి మధ్యన ఉన్న చిత్రనాడి మధ్య మార్గమునుండి ఆరు చక్రములను భేదించుచూ స్థాన - వర్ణ - దేవతలతో బాటుగా సంహార యోగముతో బ్రహ్మరంధ్రమునందున్న సహస్రదళ కమలము యొక్క కర్ణికమున చంద్రమండలమునందున్న పరశివునితో విలీనము అయినట్లుగా భావన చెయ్యాలి.

ఆ తర్వాత పాదములనుండి జాను పర్యంతము (పృధ్వీ స్థానము) పీతవర్ణ, చతురస్రాకార, బ్రహ్మదైవత్వ, నివృత్తికళాత్మక లం బీజముతో పఞ్చోద్ఘాత ప్రయోగముతో జలమునందు విలీనము చెయ్యాలి.

జానువులనుండి లింగము వరకు జలస్థానము. శుక్లవర్ణము, పద్మలాంఛిత అర్ధచంద్రాకార విష్ణుదైవత్త్వ ప్రతిష్ఠాకళాత్మక మధ్యమున "వం" బీజమును అగ్నిలో విలీనము చెయ్యాలి.

లింగము నుండి నాభివరకు అగ్నిస్థానము. ఎర్రవర్ణము, త్రికోణాకారము, రుద్రదైవత్య విద్యా కళాత్మకము మధ్యన "రం" బీజమును వాయువునందు విలీనము చెయ్యాలి.

నాభి నుండి హృదయము వరకు వాయుస్థానము. ధూమ్రవర్ణము షట్ కోణాకారము షట్ బిందు యుక్త ఈశ్వర దైవత్య శాంతి కళాత్మక మధ్యమున "యం" బీజమును ఆకాశమునందు విలీనము చెయ్యాలి.

హృదయము నుండి కంఠము వరకు ఆకాశ స్థానము. స్వచ్ఛ వర్ణము, వృత్తాకారము సదాశివదైవత్త్వము శాన్త్యాతీత కళాత్మక మధ్యన "హం" బీజమును అహంకారములో విలీనము చెయ్యాలి.

కంఠము నుండి భ్రూమధ్యవరకు అహంకారస్థానము. త్రివర్ణము, దండాకారము, ఆదిశివదైవత్త్వసర్వకళాత్మకము దాని మధ్యన హంస బీజమును మహాతత్త్వములో విలీనము చెయ్యాలి.

భ్రూమధ్య నుండి నొసలు వరకు మహాతత్త్వస్థానము. శ్వేతవర్ణము, అర్ధచంద్రాకార ఆనందశివదైవత్వ కళాస్వరూపము మధ్యన "సోహం" బీజమును ప్రకృతినందు విలీనం చెయ్యాలి.

నొసలు నుండి సీమంతం వరకు ప్రకృతి స్థానము. బాలార్కవర్ణము, యోన్యాకారము, ఆనందశివదైవత్త్వ కళాస్వరూపమున "హం" బీజమును పురుష నందు విలీనం చెయ్యాలి.

సీమంతం నుండి బ్రహ్మరంధ్రము వరకు పురుష స్థానము. ఉద్దీప్తవర్ణము, లింగాకారము, చైతన్యదైవత్వనిష్కల మధ్యన నాదాక్షర బీజము పరబిందు స్వరూపమును చిత్శక్తి నందు విలీనం చెయ్యాలి.

బ్రహ్మరంధ్రము చిత్శక్తి స్థానము. కర్పూరవర్ణము, సహస్రార ఆనందదైవత్త్వ నిరాకార స్వరూపము నందు "హ్రీం" బీజమును సంహారధ్యాన ప్రయోగముతో "పరబ్రహ్మశివాత్మకచిదానందఘనం చింతయామి" అని భావన చేసి ఈ క్రింది మంత్రమును పఠించాలి.

"ఓం పృధీవ్యప్తేజో వాయ్వాకాశ గంధరసరూపస్పర్శ శబ్దఘ్రాణరసనా చక్షుత్వక్ శోత్ర పాదో పస్థపాయుపాణివాఙ్మనానందవిసర్గాదానవచనాహంకారమనోబుద్ధిచిత్తివికల్పసంకల్ప వ్యవసాయ నిశ్చయ జీవఆత్మాపరమాత్మాభిదసమస్తతత్త్వాత్మికప్రపంచస్వరూప స్థూల సూక్ష్మశరీరద్వయసంహారక్రమేణపృధివీమప్స్వపస్తేజోవాయౌవాయుః ఆకాశే ఆకాశాహంకారే అహంకారం మహతి మహాన్తంప్రకృతౌప్రకృతింపురుషేపురుషం పరమశివే సంయోజయామి స్వాహా" - ఇది స్థూల దేహం శోధయామి స్వాహా|

స్థానసహిత, అక్షరసహిత, కార్యసహిత, కారణసహిత, సాంగోపాంగదేవతా సహిత, స్థూల,సూక్ష్మ సర్వతత్త్వములూ సంహార క్రమంలో సహస్రదల కమలమందున్న పరమశివునిలో బీజభావంతో లీనమైనట్లుగా భావించాలి. పరమశివుని చిత్ శక్త్యాత్మక ఆనందఘనముతో కలిపి నిర్మలబుద్ధి, నిర్లీన సర్వేంద్రియ యోగి యోగఫలమును ప్రాప్తించుకోవాలి. ఎల్లప్పుడూ నిత్యోదితము, నిష్క్రియము అయిన ఈ క్రమముతో సచ్చిదానందమయుడయి ప్రతీక్షణమూ ఉండాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: