సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, డిసెంబర్ 2020, బుధవారం

సనాతన ధర్మం - 2

 

నిజానికి ఉన్నది ఒక్కటే. అది నిత్యము, శాశ్వతము. "అది" ఎటువంటిమార్పులు లేనటువంటిది. దానినుండే అంతా పుట్టి దానియందే అంతా లీనమైపోతుంది. దానికి వేరుగా మరొకటి లేదు. సముద్రములోని జలము అలరూపములో వచ్చి తిరిగి ఆ జలము ఆ సముద్రములోకే ఎలా కలిసిపోతుందో ఈ చరాచర జగత్తుకూడా "అక్కడి" నుండే పుట్టి అక్కడికే వెళ్లిపోతుంది. ఏ విధముగా సముద్ర జలము అల రూపములో కనబడుచున్నదో "" యొక్క రూపమే జగత్తురూపంలో కనబడుచున్నది. ఇక్కడ సూచించబడిన "అది", ""లను బ్రహ్మము అని అంటారు. అనగా ఈ

చరాచరాజగత్తు అంతా ఆ బ్రహ్మమునుండే పుట్టి తిరిగి అందులోనే లీనమవుతుంది. ఇదే అమ్మవారి శ్రీలలితారహస్యనామాలలో "పంచకృత్యపరాయణ" అను నామానికి అర్ధము. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అను అయిదు కార్యములను పంచకృత్యములు అని అంటారు. సృష్టి నుండి అనుగ్రహము వరకు అన్ని కార్యములు ఆ బ్రహ్మమునందే జరుగుచున్నాయి.

ఈ బ్రహ్మము నిర్గుణము మరియు సగుణము అని రెండు విధములు. ఎటువంటి గుణవిశేషములు లేకపోవడమే నిర్గుణము. అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితిలో కనబడే గుణవిశేషములే సగుణబ్రహ్మము. ఈ వ్యక్త స్థితికి ఈశ్వరుడే సర్వశ్రేష్ఠ పరబ్రహ్మము. ఈ సగుణబ్రహమును రెండవదిగా భావించరాదు. బహుస్యాం ప్రజాయేయ అను వేదప్రమాణమును అనుసరించి నిర్గుణ స్థితిలో ఉన్న బ్రహ్మము సగుణబ్రహ్మముగా వ్యక్తీకరించబడెను. ఆ సగుణబ్రహ్మమును పురుషోత్తముడు అని అంటారు. అతడినుండి మూలప్రకృతి పుట్టెను. వీరే ఈ చరాచర సృష్టికంతటికీ మూలకారణం అయ్యెను. ఒక దీపమునుండి మరికొన్ని దీపములు వెలిగినట్టుగా ఆ మూల పురుషుని నుండి మిగితా జీవులన్నీ పుట్టుచుండెను. ఈ విధంగా మొత్తం జగత్తు అంతా వ్యక్తమవుచున్నది. జీవుల శరీరములో ఉండు బ్రహ్మము యొక్క ఒక అంశమునే జీవ లేదా జీవాత్మ అని అంటారు. ఆ జీవాత్మ చుట్టూ ఒక కోశములాగా చుట్టుకొని ఉండునదే శరీరము. శరీరము వికసించబడిన ఇంద్రియములను గ్రహించగలదు. జీవాత్మ మాత్రము ఇంద్రియములను గ్రహించలేదు. ఎందుకనగా, శరీరమునకు ఒక ఆకృతి అనేది కలదు. జీవాత్మకు ఒక ఆకృతి అనేది లేదు. అదే ఈరెండింటికి గల భేదము. ఈ జీవాత్మ అందరిలోనూ "నేను" అన్న భావంతో ఉంటుంది. ఇది అన్ని జీవులకు ఒక్కటే. సర్వజీవులూ ఒక్కటే లేదా సమానమే అను దానికి అర్ధం ఇదే. అయితే శరీరమునకు గల ఆకృతి సర్వజీవులకు వేరువేరుగా ఉంటుంది. జీవాత్మను కప్పి ఉంచు ఈ ఆకృతి మాయచేత ప్రలోభపడి ఈ శరీరమే నేను అన్న భావనకులోనై సర్వజీవ సమానత్వమును ఒప్పుకొనలేకపోవుచున్నది. ఆ ప్రలోభమే అజ్ఞానము. అదియే చైతన్యము లేకపోవడము. అందుకే అది జడము. అర్ధం చేసుకోవడానికి ఇది కొంచెం క్లిష్టంగా ఉన్నా సూక్ష్మంగా ఆలోచిస్తే సత్యం అవగతమవుతుంది. కనుక జీవాత్మ, శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పయనిస్తూ ఉంటాయి. జీవాత్మ తెలుకోదగినది. ఆకృతిపెట్టు ప్రలోభాలకు లోనుకాకుండా ఉండి జీవాత్మను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. ఉదాహరణకు, ఒక దీపము చుట్టూ ఒక గాజు ఆచ్ఛాదనను భావించండి. దీపము ఆత్మ. ఆచ్ఛాదన శరీరము. గాజుకు అంటుకొనే మసి ప్రలోభాలు. ఆ మసిని తొలగిస్తే దీపం వెలుగు బాగా ప్రసరిస్తుంది. అలాగే శరీరానికి అంటుకొనే మలినాలను తొలగిస్తే ఆత్మ గోచరమవుతుంది.

ఈ మలినాలు ముఖ్యంగా మూడు రకములు. అవి

ఆణవమలము: పరబ్రహ్మమును గూర్చి అప్పుడప్పుడు కలిగెడి జ్ఞానమును మఱుగుపఱచునది. అనగా బ్రహ్మమునీ, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా అడ్డుపడే అహంకారం.  

కార్మికమలము: గురువు బోధించిన పరమార్థమున బుద్ధి చొరనీయనిది.

మాయికామలము: పరతత్త్వ జ్ఞానవాసన నెప్పుడును కలుగనీయనిది.

వీటిని తొలగిస్తే ఆత్మజ్ఞానము సుగమము అవుతుంది.

ఆత్మస్వభావాలు మూడు. అవి సత్, చిత్ మరియు ఆనందము. అదే సచ్చిదానందము. అలాగే శరీరానికి మూడు స్వభావాలు (గుణాలు) అవి సత్త్వ, రజో, తమో. ఈ మూడు గుణాలను త్యజించగలిగితే కలిగేదే సచ్చిదానందము. శరీరానికి గల ఈ మూడు స్వభావాల వలనే శరీర ధర్మాలు నిర్వర్తిచబడుచున్నాయి. కొందరు, రాయి కూడా ఒక ఆకృతే కదా. మరి దానికి ఈ ధర్మాలు ఎలా వర్తిస్తాయి? అని అడగవచ్చు. దీనికి ఆధునిక విజ్ఞానశాస్త్రములోనే సమాధానము కలదు. కొన్ని అణువుల సముదాయమే ఒక రాయిగా పరిణమించబడుతుంది. కంటికి కనబడని ఆ అణువులు ఆ రాతిలో ఒకదానితో ఒకటి రాపిడికి గురియవుచూ ఉండునని ఆధునిక విజ్ఞానశాస్త్రము తెలుపుచున్నది.

ఇప్పుడు పైన చెప్పబడిన మలములను, శరీర గుణములను తొలగించు ఉపాయమును తెలుసుకుందాము. ఆ ఉపాయమునే సాధన అని అంటారు. ఇది నాలుగు తరగతులుగా ఉంటుంది. అదే సాధనా చతుష్టయం.

1. నిత్యానిత్యవివేచనము: ఏది సత్యము? ఏది అసత్యము? ఏది నిత్యము? ఏది అనిత్యము? అనే విషయపరిజ్ఞానము కలిగి ఎల్లప్పుడూ చింతన చెయ్యడం.

2. వైరాగ్యము: భోగ్యపదార్ధాల మీద అసహ్యం కలగడం. భోగానికి మూలం సంకల్పం. ఆ సంకల్పబలాన్ని భోగానికి కాకుండా యోగానికి మళ్లించగలగడం.

3.  షట్సంపత్తి:

       అ) శమము: అంతరింద్రియ నిగ్రహము

       ఆ) దమము: బాహ్యేంద్రియ నిగ్రహము

       ఇ) ఉపరతి:  శాస్త్రవిహిత కర్మలను వైరాగ్య దృష్టితో విడిచిపెట్టడం. దీనిని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఏదో పైపైకి చదివి శాస్త్రంలో ఇలా చెప్పారు కదా అని శాస్త్రవిహిత కర్మలను వదలిపెట్టరాదు. ఆయా కర్మలను ఈశ్వరార్పణ దృష్టితో చేయగా చేయగా మనసులో వాటిమీద వైరాగ్యము జనిస్తుంది. అప్పుడే ఈ సంపత్తి యొక్క ఫలం లభిస్తుంది. లేదంటే ఆధ్యాత్మిక వైపరీత్యము కలగుతుంది.

       ఈ) తితిక్ష: ఓర్పు, సహనము కలిగి ఉండుట. సామర్ధ్యం కలిగి ఉండి కూడా అపకారికి ఉపకారము చేయడము.   

      ఉ) శ్రద్ధ: గురువునందు ఆయన చెప్పేవిషయాలయందు విశ్వాశము కలిగి ఉండుట. ఈవిధంగానే శాస్త్రములందు కూడా.

       ఊ) సమాధి: బుద్ధిని ఎప్పుడూ బ్రహ్మమునందే నిలిపిఉండడం.

4. ముముక్షత్వము: మోక్షం పొందాలనే కోరిక. అహంకారం నుండి బ్రహ్మము వరకు శరీరాన్ని అంతా ఆజ్ఞానంతో కప్పిఉంచేవి బంధనాలే. ఆ బంధనాలను తెంచుకోవడం ద్వారా ఆత్మ జ్ఞానము పొందడం.

కామెంట్‌లు లేవు: