సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, మే 2022, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 32

 

ముఫైరెండవ భాగము

మాతంగేశ్వరీరత్నవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

మంత్ర స్వరూపం: ఐం క్లీం సః జూం హ్రీం శ్రీం ఓం నమో భగవతి మాతంగేశ్వరి సర్వజనమనోహరి సర్వరాజవశంకరి సర్వముఖరంజని సర్వస్త్రీపురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వలోకకార్యాది వశంకరి హ్రీం శ్రీం క్లీం|

ఈ విద్య సమస్త విద్యలకు రాజ్ఞి వంటిది. ఈ విద్య మోక్షము, అర్థము, సిద్ధిని ఇచ్చును. ఈ విద్యకు ఋషి – భగవాన్ మతంగ| ఛందస్సు – గాయత్రి| దేవత – నాదమూర్తి పరమేశ్వరి మాతంగి| క్లీం – బీజం| ఐం – శక్తిః| శ్రీం – కీలకం|

ధ్యానం:

అంభోజార్పితదక్షాఙ్ఘ్రిమ్ శ్యామాం ధ్యాయేత్మాతంగినీమ్|

కరాద్వీణాలసన్నాదశ్లాఘాందోలీతకుండలాం|

దంతపన్నప్రభాం రమ్యాం సర్వసర్వాంగసుందరీమ్|

కాదంబముండమాలాఢ్యాం వీణావాదనతత్పరాం|

శ్యామాంగీం శంఖవలయాం ధ్యాయేత్సర్వార్థ సిద్ధయే||

యంత్రోద్దారము

త్రికోణము, పంచకోణము, అష్టదళము, షోడశదళము, అష్టదళము, చతుర్దళము, నాలుగు ద్వారముల భూపురము.

పై విధంగా యంత్రమును నిర్మించిన తర్వాత అందులోకి మాతంగినీ దేవిని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి. ఆ తర్వాత అగ్ని, ఈశాన, నిరుతి, వాయవ్య కోణములందు, దిశలకు మధ్య భాగమున అంగదేవతలను పూజించాలి.

ఇప్పుడు ద్వారముల పూజ ఈ క్రింది విధంగా చెయ్యాలి.

అగ్ని ద్వారముతో ప్రారంభించి నాలుగు ద్వారములను దక్షిణ క్రమంలో పూజించాలి. ఈ ద్వారములలో సరస్వతి, లక్ష్మీ, శంఖ, పద్మనిధిలను పూజించాలి. కోణములందు వటుక భైరవ, గణేశ, క్షేత్రపాలక, యోగినీలను క్రమంగా పూజించాలి. చతుర్దళములో సిద్దమాతంగినీ, మహాలక్ష్మి, సిద్దలక్ష్మీ, మాతంగినీ, మహామాతంగినీలను ప్రాదాక్షిణ్య క్రమంలో పూజించాలి.

అష్టదళములో అసితాంగభైరవ, రురుభైరవ, చండభైరవ, క్రోధభైరవ, ఉన్మత్తభైరవ, కపాలీభైరవ, సంహారభైరవలను పూర్వదిశనుండి ప్రారంభించి ప్రదక్షిణ క్రమంలో పూజించాలి.

షోడశదళములో వామా, జ్యేష్ఠా, రౌడ్రీ, శాంతి, శ్రద్ధా, వాగీశ్వరీ, క్రియాశక్తి, లక్ష్మి, వృద్ధి, మోహినీ, ప్రథమా, విద్యా, బిందుమాలినీ, సూరా, ఆనందా, నాగధుంధీలను తూర్పు దళమునునుండి ప్రారంభించి ప్రదక్షిణ క్రమంలో పూజించాలి.

అష్టదళములో లక్ష్మి, సరస్వతీ, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టిలను పూజించాలి.

పంచకోణములో ద్రావిణీ, శోషిణీ, స్తంభినీ, మోహినీ, ఆకర్షిణీలను పూజించాలి.

త్రికోణములో రతి, ప్రీతి, కామదేవలను ప్రదక్షిణక్రమంలో పూజించాలి.

ఆ తర్వాత మళ్ళీ దేవీ మాతంగినిని పూజించాలి. పురశ్చరణ సమయంలో క్షేత్రపాలకుని పూజించాలి. జపము పగడము మాలతో చెయ్యాలి. జపములో దశాంశము హోమము చెయ్యాలి. హోమము తేనె మరియు కదంబ పుష్పములతో చెయ్యాలి. ఈ హోమమును శుద్ధ పవిత్ర త్రికోణ కుండములో చెయ్యాలి. 

ఇప్పుడు కామ్య ప్రయోగ హోమము గురించి చెప్పబడుచున్నది.

రాజ్యమునకు మల్లికా, చంపా, నాగకేసర పుష్పములతో, ధనమునకు మారేడు ఫలములు మరియు పత్రములతో లేదా శుద్ధ శ్వేతకమలములు లేదా ఎర్రకలువలతో లేదా చంపాపుష్పములతో, భోగకామి ఎర్రపుష్పములతో, వశ్యకర్మలకు మందారములు, మోదుగ పువ్వులతో, వశీకరణమునకు మధుమిశ్రిత మధుక పుష్పములతో లేదా కదంబ పుష్పములతో లేదా కుంకుమ మరియు చందనముతో, ఆకర్షణ కార్యమునకు ఉప్పు, తిలలను త్రిమధురములలో కలిపి, వృష్టికొరకు అంజుల, ఖర్జూర, అగర సమిధలతో, ఆయుష్యు కొరకు దూర్వాలతో, ధాన్యమునకు ధ్యాన్యతండులముతో, అన్నమునకు నెయ్యికలిపిన అన్నముతో, సౌభాగ్యమునకు గంధ ద్రవ్యములతో, ప్రియప్రాప్తమునకు తగర పుష్పములతో, సంపత్తుల కొరకు నాగచంపా పుష్పముతో, తేజస్సునకు పలాస పుష్పములతో, శ్వాసకాస (దగ్గు) పోవడానికి కపిల గోవు నేతితో, శత్రువును పిచ్చివాడుగా చేయుటకు ఉమ్మెత్త పువ్వులతో, శత్రువుల నాశనమునకు విషవృక్షము (=వచ్ఛనాగ), వేప, లసోడా (= జిగురు కండగల కాయ, బొటుకు చెట్టు, నక్కెర చెట్టు, ఇరికి చెట్టు), విభీతక (=తాండ్ర చెట్టు, కరక చెట్టు) – వీటి తైలములో గుడ్లగూబ, గద్ద మరియు కాకిల ఈకలను ముంచి హోమం చెయ్యాలి.

హోమమును దక్షిణ దిక్కు వైపుగా నగ్నంగా కూర్చొని, కళ్ళు ఎర్రగా చేసి చెయ్యాలి. ఉచ్చాటన కార్యమునకు వాయవ్య వైపు, విద్వేషణకు నైఋతి వైపు, స్తంభనకు పశ్చిమం వైపు, తుష్టి, శాంత్యాది కర్మలకు ఉత్తరం వైపు కూర్చోవాలి. బెల్లం పాయాసం, బెల్లం ముక్కలు, వెదురు రసం, చెరుకు రసములతో హోమము పిత్తప్రకోపములను శాంతింప చేస్తాయి. దగ్గు మరియు దమా (ఆస్తమా) రోగ శాంతి కొరకు నెయ్యి కలిపిన పాయసం, తిలల నూనిలతో కలిపిన మిరియాలతో హోమం చెయ్యాలి. నిర్గుండి (వావిల) పుష్పములతో హోమం చేసినచో వాత దోషములు శమించును.  

ఆకర్షణ కొరకు ఉపాయములు ఇప్పుడు చెప్పబడుచున్నది. మూడు ఆహుతులు శీఘ్రంగా ఇవ్వాలి. ఆ తర్వాత ముక్తా (=వేశ్య) లేదా కుమ్హార గృహమునకు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ చేసి మద్యము, ఉప్పు కలిపి సాధ్యుని ఆకృతి చెయ్యాలి. దాని మీద దాని నామము సంకల్పము చేసి నెమ్మదిగా ఆ ఆకృతి చెవిలో చెప్పాలి. ఆ ఆకృతికి ఏడు అంగుళముల క్రింద వర్ణమాలా మేఖలను నిర్మించాలి. త్రికోణము పైన మాక్షిక (=తైలవర్ణము గల తేనె) పుత్తలీ తయారు చేసి వ్రేలాడదీయాలి. ఉప్పును, తేనెతో కలుపుతూ సాధ్య సుందరీ పేరుతో హోమము చెయ్యాలి. ఆ హోమమును కుడి పాదముతో ప్రారంభించి ఎడమ పాదము వరకు చెయ్యాలి. ఈ హోమము మనుష్యులకు. స్త్రీలకు వ్యతిరేక క్రమంలో అనగా ఎడమ పాదం నుండి ప్రారంభించి కుడి పాదం వరకు చెయ్యాలి. ఇలా ఏడు రాత్రులవరకు హోమము చేసినచో సాధ్య స్త్రీ విరహవేదన చెంది భయము, లజ్జ వదలి సాధకుని చెంతకు వచ్చును.

     ఉప్పు, తిల తైలము కలిపి హోమము చేసినచో శతృనాశనము అవుతుంది. పసుపు పొడిలో ఉప్పు కలిపి హోమము చేసినచో స్తంభనము కలుగుతుంది. శుభ కార్యములకు పూర్ణిమా రాత్రి ప్రథమ ప్రహరములో హోమము చెయ్యాలి. ఉచ్చాటనాదులకు రాత్రి రెండవ ఝాము లేదా మధ్య రాత్రి హోమము చెయ్యాలి. సమస్త కార్యములు స్వయం మాతంగీ దేవిగా భావిస్తూ చెయ్యాలి. కర్మ సమాప్తి అయిన తర్వాత కన్యలను పిలచి వారికి భోజనము పెట్టాలి. కన్యా పూజ, వేశేషంగా యోగినీ పూజ చెయ్యాలి. వీరిని ఎనిమిది – ఎనిమిది సంఖ్యలో పూజించి మాతంగీ దేవిని తృప్తీ పరచాలి. ఆ తర్వాత మాతంగీ దేవికి బలి సమర్పించాలి.

బలిదాన మంత్రము: దేవి శక్యా నమశ్యన్తి. భగవతి మాతంగి చండాలి సర్వజనమ్మే వశమానయ స్వాహా.

పై మంత్రంతో బలిప్రదానము చేసినచో మాతంగీ దేవి సిద్ధిని ప్రసాదిస్తుంది.

ఈ విధంగానే వటుకాదులకు మరియు మాతృకలకు కూడా బలిని సమర్పించి సాధకుడు సమస్త కర్మలను సిద్ధించుకొంటాడు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన మాతంగీశ్వరీరత్నవిద్యావిధివివరణం అను ముఫైరెండవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: