సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జూన్ 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 33

 

ముఫైమూడవ భాగము

భువనేశ్వరీత్రిగుణితసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే దేవీ! ఇప్పుడు నీకు భువనానందమందిర అనగా భువనేశ్వరీ విద్యను చెబుతాను. ఈ విద్యను తెలుసుకున్నంతనే మహామహా ఆపత్తులు పారిపోతాయి.

మంత్రోద్దారము: శివ (=హకారము), అగ్ని (=రేఫ), వామ అక్షి (=ఈం), బిందుకళలతో మంత్రము జనించును. ఈ మంత్ర స్వరూపము “హ్రీం”. ఈ మంత్ర ఋషి – వశిష్ఠ| ఛందస్సు – గాయత్రి| దేవత – చిత్కళా పరమేశ్వరీ భువనేశీ| ఈ భువనేశీ పురుషార్థచతుష్టయమును ప్రసాదించును. హ, ఈ లతో షడంగన్యాసం చెయ్యాలి. హృల్లేఖాదులను ఒకసారి న్యాసము చెయ్యాలి. అకారము నుండి క్షకారము వరకు విపరీత క్రమంలో హృదయము, భుజములు మరియు వక్షములందు విలోమ న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత గురువు ఉపదేశించిన ప్రకారం విలోమ స్వర మార్గంలో సంహార మాతృకల న్యాసము చెయ్యాలి. దీనివలన సాధకుడు బ్రహ్మానంద రసానుభూతుడవుతాడు. ఆ తర్వాత షండంగ మంత్రముల ద్వారా అంగుళీయముల న్యాసము చెయ్యాలి. మళ్ళీ అంగన్యాసం చేసి చిత్ (=ఐం), ఆనంద (=ఉ), తేజ (=ఓ) లతో కంఠము, హృదయము, గుహ్యము మరియు పాదములందు న్యాసము చెయ్యాలి. గాయత్రి, సావిత్రి, సరస్వతీలను కంఠము, వామస్తనము, దక్షస్తనములందు న్యాసము చెయ్యాలి.

బ్రహ్మ, విష్ణు, శివలను వామస్కంధము, హృదయము, దక్షిణస్కంధములందు న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత మాతృకా న్యాసము చెయ్యాలి. లలాటము, బాహువులు, వామ పార్శ్వము, దక్షిణకుక్షి, కకుదపార్శ్వము, శిఖాంతము, మూలమంత్రముతో వ్యాపక న్యాసము చెయ్యాలి. సాధకుడు భువనేశ్వరీ మూర్తిని పాశము, అంకుశము, వరద, అభయముద్రలతో తయారుచెయ్యాలి. ఆ విగ్రహమును కుంకుమాదులతో పూజించి ఆ ద్రవ్యములతో మూల మంత్రమును లిఖించి, చదవాలి. ఆచార్యుని ప్రతిమను బంగారము/వెండి/రాగిలతో చెయ్యాలి. తూర్పు, నైరుతి, వాయవ్య కోనములందు గీసిన రేఖల ద్వారా అగ్ని అనగా త్రికోణ మండలమును నిర్మించి దాని మధ్యన సాధ్య నామము మరియు ఆ నామ అక్షర సంఖ్యను బట్టి శక్తి బీజమును లిఖించి నామము చుట్టూ ఠకారములను లిఖించాలి. (ఠః, ఠః, ఠః...). త్రికోణ కోణములందు హ్రీం ను లిఖించాలి. మూడు స్థానములందు ఆ బంధము సిద్ధిదాయకము అవుతుంది.

త్రికోణ రేఖలకు మధ్య భాగమున వ్యంజనములు లిఖించాలి. మూడు కోణములకు లోపల బిందుసహిత  వామనేత్ర (ఈం) ను లిఖించాలి. బయట హర్యర్న్ మరియు హ్ ర్ (=హ్రీం) లిఖించాలి. మళ్ళీ మధ్యన ఈ రెండింటిని విసర్గయుక్త చతుర్థ అక్షరములను లిఖించాలి. దాని చుట్టూ వృత్తమును నిర్మించాలి. ఆ వృత్తము చుట్టూ అష్టదలమును నిర్మించి దాని కేసరముల స్థానములో ప్రతిరోజూ హర్షణ్ హరాంతము (=హ్రీం) లిఖించాలి. దళములు మరియు దళాగ్రాములందు వామనేత్ర (ఈం) ను లిఖించాలి. హీరా/బంగారం/వెండిల మీద లిఖించిన ఈ యంత్రము సర్వవాంఛ ప్రదాయిని, మోక్షదాయిని, రమణీయ మరియు సమస్త ఐశ్వర్యములను ఇచ్చునది.

సర్వాసిద్ధి కొరకు క్రింది శక్తులను పీఠ దిక్కులందు పూజించాలి. ఈ శక్తులు జయా, విజయా, అజితా, అపరాజితా, నిత్యా, విలాసినీ, దోఘ్రీ, అఘోరా. తొమ్మిదవ శక్తి మఘనాత్మిక (సర్వమంగళ)ను పీఠ మధ్యలో పూజించాలి.

ధ్యానం:

ధ్యాత్వా కుండలినీరూపాముద్యద్భాస్వత్సమద్యుతీం|

పాశాంకుశవరాభీతించతుర్బాహుం త్రిలోచనాం||

పైవిధంగా ధ్యానం చేసిన తర్వాత ఉపచారములతో పూజించాలి. ఆవాహన ముద్ర ప్రదర్శించాలి. అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య కోనములు మరియు దిక్కులకు మధ్యన అంగదేవతలను పూజించాలి. ఈ పూజ భోగసిద్ధిని కలిగించును.

ఉ ఊ ఓ గ జ డ ద ల – ఇవి పార్థివ వర్ణములు. ఋ ఋ(2) ఔ ఘ ఝ ఢ ధ భ వ స హ య – ఇవి జల వర్ణములు. ఇ ఈ ఐ ఖ ఛ ఠ థ ఫ ర క్ష – ఇవి అగ్ని వర్ణములు. అ ఆ ఏ క చ ట త ప య ష – ఇవి వాయు వర్ణములు. ఌ ఌ(2) అం ఙ ఞ ణ నా మా శ హ – ఇవి ఆకాశ వర్ణములు. నేత్రములకు పైన సౌమ్యాది ప్రత్యక్షములను పూజించాలి. సాధకుడు సమాచిత్తుడై వర్ణములను పూజించాలి. ఆ తర్వాత హృల్లేఖ హ్రీం ను ఉల్లేఖనము చెయ్యాలి. సిద్ధి కొరకు పృథివ్యాది పంచకములను పూజించాలి. ఐంద్ర, నైరుత్య, వావవ్య కోణములందు క్రమంగా గాయత్రీ, సావిత్రి, సరస్వతీలను పూజించాలి. అగ్ని, వరుణ, ఈశాన కోణములందు బ్రహ్మ, విష్ణు, రుద్రులను పూజించాలి. దళములందు బ్రాహ్మ్యాది మాతృకలను పూజించాలి. ఆ తర్వాత లోకపాలకులను కూడా పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భువనేశ్వరీత్రిగుణితసాధనవిధివివరణం అను ముఫైమూడవ భాగము సమాప్తము.

                                       ఇంకా ఉంది....

కామెంట్‌లు లేవు: