సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జూన్ 2022, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 34

 

భువనేశ్వరీషడ్గుణితయంత్రసాధనవివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే ప్రియే! ఈ విద్యను తెలుసుకున్నంత మాత్రమునే సాధకుడు సమస్త సిద్ధులకు అధికారి అవుతాడు. రెండువైపులా వహ్నిబీజమును లిఖించి మధ్యలో

శక్తిబీజమును లిఖించాలి. శక్తి బీజ రేఫభాగమున సాధ్య నామమును లిఖించాలి. దానిని ఠకారముతో వేష్ఠితము చెయ్యాలి. దాని పైన అయిదుసార్లు శక్తి బీజమును, దాని పైన అదేవిధంగా శ్రీబీజమును, కామబీజమును లిఖించాలి. ఆ తర్వాత షట్కోణమును నిర్మించాలి. షట్కోణ కోణములందు బిందు యుక్త వామనేత్రమును (ఈం) లిఖించాలి. షట్కోణ సంధులందు మళ్ళీ శక్తిబీజము లిఖించాలి. ఈ యంత్రమును స్పర్శించకుండా శక్తిబంధము చేయాలి. సాధకుడు ఊర్ధ్వ మూడు కోణముల మధ్యన సాధకుని నామాక్షరాలు బిందుయుక్తంగా లిఖించాలి. ఆ తర్వత సాధకుడు అక్కడే శక్తి, శ్రీ, కామ బీజములను లిఖించాలి. క్రింద మూడు కోణములందు సాధ్యుని నామాక్షరములను, శక్తి, శ్రీ, కామబీజములను విసర్గయుక్తముగా లిఖించాలి. ఆ తర్వాత కోణముల దగ్గర హరి, హర వర్ణములను లిఖించాలి. వీటికి బయట పూర్ణచంద్రునికి సమానమైన వృత్తమును నిర్మించాలి. వృత్తమునకు లోపల అనులోమ క్రమంలోను బయట విలోమ క్రమంలోను యాభై వర్ణములను లిఖించాలి.

ఆ తర్వాత రెండు భూపురములను నిర్మించాలి. వీటి సంయోగముతో అష్టకోణము ఏర్పడుతుంది. మహా దిశలందు నృసింహ బీజము లిఖించాలి. హే పార్వతీ! క్ష్రౌం ను నృసింహ బీజము అని అంటారు. రక్షస (=క్ష), అగ్ని (=ర), పవన (=య), ఈశాన (=హ) వీటికి చతుర్దశ స్వర (ఓ)ను, బిందువును చేర్చగా క్షౌం, రౌం, యౌం, హౌం అను చింతామణి మంత్రము జనించును. ఈ బీజములను కోణములందు లిఖించాలి. తర్వాత షట్కోణ సంధులలో ప్రణవముతో కలిసిన శూలమును (=ఫట్) ను లిఖించి ద్వాదశదళ కోణమును నిర్మించాలి. ఈ షడ్గుణీత యంత్రము ఐశ్వర్యమును ప్రసాదించును.

     ఈ యంత్రములో హ్రీం ను పూజించి, దేవిని ఆహ్వానించి మనోహర గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములతో పూజించాలి. ఆవాహనాది ముద్రలను ప్రదర్శించి అర్చించాలి. షట్కోణముల అగ్ని, ఈశాన, నైఋత్య, వాయవ్య కోణములు మరియు నాలుగు దిశలందు షడంగములను పూజించాలి. బ్రహ్మతో గాయత్రి, విష్ణుతో సావిత్రి, శివతో సరస్వతి, కుబేరునితో శ్రీ, మదనుతో రతి, కుశలతో పుష్టిలను అర్చించాలి. షట్కోణములలో పూర్వకోణము నుండి ప్రదక్షిణ క్రమంలో పూజ చెయ్యాలి. ఆ తర్వాత ద్వాదశ పత్రములందు పూర్వాది క్రమంలో రక్తాఙ్గ, ఆదికుసుమ (=రక్తకుసుమ), కుసుమాతురా, నిత్యానదా, ఆదిమదనా,మదనాతురా, గౌరి, గగనా, గగనవేగిని, పద్మా, ఆమయప్రమథిని, శశిశేఖరలను పూజించాలి. చతుర్పత్రములను వదలి అష్టదిక్కులందు బ్రాహ్మ్యాదులను పూజించాలి. భూపురమున లోకపాలకులను పూజించాలి. ఇది షడ్గుణిత అర్చన. ఈ అర్చన వలన సాధకునికి వామాది సిద్ధులు ప్రాప్తించును. మళ్ళీ చివర నైవేద్యములతోనూ, పుష్పములతోనూ భగవతి భువనేశ్వరీ దేవిని ఆరాధించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భువనేశ్వరీషడ్గుణితయంత్రసాధనవిధివివరణం అను ముఫైనాల్గవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: