సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, జూన్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 6


వర్ణ విభాగమునుండి యోగ్యతా కాల విశేషము

శారదా తిలకము ప్రకారము, బ్రాహ్మణుడు ఒక సంవత్సరము, క్షత్రియుడు రెండు సంవత్సరములు, వైశ్యుడు మూడు సంవత్సరములు మరియు శూద్రుడు నాలుగు సంవత్సరములు గురు సేవ చేయగా యోగ్యత కలుగుతుంది. ఆ తర్వాత తర్వాత నుండి దీక్ష, యాగ, వ్రతాదులు గ్రహింపవచ్చును.

మంత్రమునందు శూద్రులకు అధికార విహీనత

మహాకపిల పంచరాత్రము ప్రకారము, శూద్రులకు మంత్రమునందు అధికారము లేదు. ప్రణవం లేకుండా వేదము లేదు. మంత్రము వేద సముద్భూతము. ఈ ప్రకారము వేదము పరమంత్రము. ఆగమములు వేదాంగములు. వశ్య-ఆకర్షణాదులు కర్మదృష్టా ఫలప్రదాయకములు. కలియుగమునందు వేదము చేత అన్ని గ్రహయజ్ఞాదులు సాధ్యము. వేదము లేకుండా యజ్ఞము లేదు. యజ్ఞము లేకుండా వేదము లేదు. ఇందువలననే వేదము పరమంత్రము. వేదము నుండి పుట్టని మంత్రము ఏదీలేదు. కనుకనే, మంత్రము నందు శూద్రులకు అధికారము లేదు. ఇది పరమ నియమము.

శాతాతపసంహిత ప్రకారం శూద్రాధికారము

శాతాతాపసంహిత నందు, శూద్రులకు ప్రతిపాదితమైన మంత్రము యొక్క అంతిమ వర్ణము వరకూ బ్రహ్మహత్యా పాపము కలుగుతుందని చెప్పబడినది. ఈ విషయము స్వయంగా ప్రజాపతియే తెలిపెను.

మంత్రమునందు శూద్రులకు అధికారత్వం

భవిష్యపురాణముననుసరించి, యోగినీ తంత్రము నందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు పవిత్రులు మరియు నిర్మలులు. వీరిలో సంకుచిత ధర్మపరులకు మంత్ర దీక్ష ఇవ్వరాదు. చతుర్వర్ణులు అర్చన చేయగా శుద్ధి, బుద్ధిమంతులవుతారు. గురుదేవ మరియు ద్విజుల సేవయందు నిరంతరము తరిస్తే అప్పుడు చతుర్ధులకు మంత్ర గ్రహణాధికారము లభిస్తుందని చెప్పబడినది.

విష్ణు ఆరాధనందు స్త్రీలకు అధికారము

పద్మపురాణము ప్రకారము విప్రులు, వైదికులు మరియు మిశ్రులు అని రెండు రకములు. భక్త విప్రులు మరియు శూద్రులను తాంత్రికులని అంటారు. శూద్రుల ఆగమోక్తవిధి ప్రకారము వారు పూజలు చెయ్యవచ్చు. ఒక భార్య తన మృత భర్తను విష్ణువుగా తలచుచూ శ్రద్ధగా తన హృదయమునందు అతనిని పూజించవచ్చు. ఇందువలననే విష్ణు ఆరాధనందు స్త్రీలకు అధికారము కలదు. పతిప్రియ కార్యమునందు నిరతురాలయిన స్త్రీకి మంత్రాధికారము కలదు. ఇది సనాతనన శ్రుతివిధానము. ఇక్కడ "పతిప్రియ" అనగా సౌభాగ్యవతి, సుహాసిని అని అర్ధము.

మంత్రరాజము ప్రకారము

ద్విజులకు వేదములందు వారు చేయవలసిన సంస్కారములను పూర్తిగా ప్రతిపాదించబడెను. అందు ఏ విధముగా చెప్పబడినో ఆ విధముగానే ఆచారవిధులు నిర్వహించవలెను. విద్యా సహితముగా స్మరణచేస్తూ అన్ని క్రియలను చేయవలెను. సర్వత్ర తన్మయత్వం వలన సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయము. అన్య వర్ణులు కూడా విద్యారూపముగా ఆచారములను పాటించవలెను.

భవిష్యోత్తర పురాణ ప్రకారము

ఏ స్త్రీ తన భర్త ద్వారా పరిపూర్ణము, పవిత్రము మరియు స్వతంత్రము అవుతుందో ఆ స్త్రీ మంత్ర గ్రహణమునకు అర్హురాలవుతుంది. తన పతి దగ్గర ఉండు స్త్రీ తన పతి ఆజ్ఞానుసారము మంత్రమును గ్రహించవచ్చు. తన స్వధర్మమును పాటించకుండా ఏ దేవతారాధన చేసినా ఆ కర్మ కాగితపు ఇల్లు లాగ వెంటనే ధ్వంసమవుతుంది.

కులార్ణవము ప్రకారము

కులార్ణవముననుసరించి రుద్రయామలమునందు ఈ విధముగా చెప్పబడెను. విధవరాలు పుత్రుని అనుజ్ఞ ద్వారా, కన్య తండ్రి అనుజ్ఞ ద్వారా, భార్య తన భర్త అనుజ్ఞ ద్వారా మంత్రమును గ్రహించవచ్చు. స్త్రీలకు మంత్రమును గ్రహించడానికి స్వతహాగా అధికారము లేదు. శూద్రులకు మరియు స్త్రీలకు చివర "నమః" ఉన్న మంత్రములు శుభదాయకములు. ఇది తెలుసుకొని చండాలునికి కూడా దీక్ష ఇవ్వవచ్చును.

రుద్రయామల ప్రాసాద మంత్రము

శుచివ్రతధారీ, ధార్మిక, ద్విజసేవక, ప్రతివ్రతాస్త్రీ, ప్రతిలోమజ (=నిమ్నవర్ణ పురుషునికి-ఉచ్ఛవర్ణ స్త్రీకి పుట్టినది), అనులోమజ (=ఉచ్ఛవర్ణ పురుషునికి- నిమ్నవర్ణ స్త్రీకి పుట్టినది), చండాలునికి, భూమిమీదున్న ప్రతిఒక్కరికి మంత్ర గ్రహణాధికారము కలదు. ఎవరి జాతి ధర్మమును బట్టి ఆయా జాతులకు ఉపదేశము ఇవ్వవచ్చు. శూద్రులు మరియు స్త్రీలు వైదిక మంత్ర జపము ఎన్నడూ చెయ్యరాదు. వీరికి నమోన్త శివ మంత్రము గానీ వైష్ణవ మంత్రము గానీ శుభదాయకము.

శూద్రులకు ప్రణవాది మంత్ర నిషిద్ధములు

ఏ ద్విజుడు స్వాహా మరియు ప్రణవయుక్త మంత్రములను శూద్రులకు ఇచ్చునో ఆ ద్విజుడు నరకమునకు పోవును. విప్ర శూద్రత్వం ప్రాప్తించునని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.

యామలము ప్రకారము

ఐదు సంవత్సరముల వరకు యోగ్యతను పరిశీలించి అప్పుడు గుణవంతుడైన భక్తునకు మంత్రదానము చెయ్యాలి. సంకరజాతునకు కూడా మంత్రమును ఇవ్వవచ్చు. ఈ ప్రకారముగా బ్రాహ్మణుని ఒక సంవత్సరము, క్షత్రియుని రెండు సంవత్సరములు, వైశ్యుని మూడు సంవత్సరములు, శూద్రుని నాలుగు సంవత్సరములు మరియు సంకరుని అయిదు సంవత్సరములు పరీక్షించిన తర్వాత మంత్ర దానము చెయ్యాలి.
                                                                           ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: