సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, మే 2020, మంగళవారం

బ్రహ్మము అంటే ఏమిటి?


ఇంతకు ముందు మనం బ్రహ్మము గురించి వివేచన ఎప్పుడు కలుగుతుందో తెలుసుకున్నాము. ఆ వివేచన కలిగాక అసలు బ్రహ్మము అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించక మానదు. కొంతమంది బ్రహ్మమును నిర్వచించలేము అని అంటుంటారు. నిర్వచనమే లేకపోతే  దానిని ఎలా తెలుసుకోవడం? తెలుసుకోలేకపోతే మోక్షము ఎలా కలుగుతుంది? అసలు బ్రహ్మమును ఎక్కడా నిర్వచించలేదా? అన్న విషయాలు విచారిస్తూ బ్రహ్మము అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాము.

దేనివలన ఈ జగత్తుకు జన్మ, స్థితి, లయములు కలుగుచున్నవో అదే బ్రహ్మము. అయితే ఈ జన్మ, స్థితి, లయ కార్యములు బ్రహ్మమునకు తటస్థ లక్షణములు. తటస్థ లక్షణము అనగా ఏదైనా లక్షణము (=charactaristic) ఒక వస్తువుకు దూరంగా ఉంటూ ఆ వస్తువును తెలుసుకోవడానికి ఉపకరిస్తూ ఉంటే అది తటస్థ లక్షణము.  జన్మ, స్థితి, లయ కార్యములు జగత్తు యొక్క లక్షణములు. ఇవి బ్రహ్మముతో ఎటువంటి సంబంధము కలిగి ఉండవు. కానీ జగత్తు యొక్క ఈ లక్షణములు కలగడానికి ఏదైతే కారణమో అదియే బ్రహ్మము. జగత్తు దేనివలన పుట్టుచున్నదో, దేనివలన పాలించబడుచున్నదో, దేనివలన లయమవుచున్నదో అదియే బ్రహ్మము. అందువలన ఆయా కార్యములు బ్రహ్మమునకు తటస్థ లక్షణములుగా చెప్పబడుచున్నవి.

"సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ" అనునది సాక్షాత్ వేదవాక్యం. ఇవి బ్రహ్మముయొక్క స్వరూప లక్షణములు. ఈ పదములకు వేరువేరుగా అర్ధములు ఉన్నా, బ్రహ్మము విషయంలో ఇవి ఒకే లక్షణాలుగా చూపబడుచున్నాయి. ఉదా: ఒకే వ్యక్తి తండ్రిగా, కొడుకుగా, భర్తగా వ్యవహరించబడడం.

కనుక బ్రహ్మమును అనుమానమాత్రంగా నిర్వచించలేదు. మన గ్రంథాలలో తటస్థ మరియు స్వరూప లక్షణాలుగా ప్రకటించబడినది. ఈ విధంగా బ్రహ్మమును గ్రంథాల (సద్గురువు) ద్వారా తెలుసుకొని (శ్రవణ), ఆలోచించి (మనన), ధ్యానం చేయగా (నిధిధ్యాసన) అంతర్బుద్ధి (వృత్తి) కలుగుతుంది. ఈ అంతర్బుద్ధి చిత్తమును శుద్ధిపరచును అనగా బ్రహ్మమును గురించిన అజ్ఞానమును తొలగించును. అప్పుడు స్వయంప్రకాశమైన బ్రహ్మము తెలియబడును.
ఇదియే "జన్మాద్యస్య యతః" అను బ్రహ్మసూత్రమునకు అర్ధము.   

1 కామెంట్‌:

Balu చెప్పారు...

Information displayed her truly mirrors the jewels of brahmasutra bhashya! Awesome