సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 4


ప్రయోగసారము ప్రకారము సమయాచారము

దేవస్థానము, గురుస్థానము, శ్మశానము, నాలుగురోడ్ల కూడలి వీటికి దగ్గరలో మల-మూత్ర విసర్జన మరియు మైథునము చేయరాదు. దేవతా, గురు, గురుస్థానము, క్షేత్రము, క్షేత్రదేవత, సిద్ధ, సిద్ధదివస - వీటిముందు"శ్రీ" ను చేర్చి పలకాలి.

ప్రమత్త (తాగినమైకంలో ఉన్న స్త్రీ), అంత్యజా, కన్య, రజస్వల, పతితస్తని, కురూపి, జుట్టువిరబోసుకొని ఉన్న స్త్రీని నిందించరాదు. కన్యాయోని, పశుక్రీడ, నగ్నస్త్రీ, స్తనములను బహిర్పరచు స్త్రీని చూడరాదు. వేరేవాళ్ళ ధనమును, స్త్రీను గ్రహించకూడదు. ధాన్యము, ఆవు, గురువు, విప్రుడు, అగ్ని, విద్యా, కోశము, గృహము వీటికి ఎదురుగా కాళ్లుజాపరాదు మరియు వీటిని లంఘించరాదు. ఆలస్యము, మదము, సమ్మోహనము, మూర్ఖత్వము, ఈర్ష్య, ఆత్మస్తుతి, పరనింద, గొడవలు పడుట మొదలగునవి చేయరాదు. లింగధారులను, ధార్మికపరులను, విప్రులను, వేదములను, వేదాంగములను, సంహితములను, పురాణములను, ఆగమములను, శాస్త్రములను, కల్పమును (=పూజా పద్ధతి) ధూషించరాదు.

సుత్తి మొదలగు పనిముట్లు, జంతువులను కట్టడానికి ఉపయోగించే తాడు, వంటపొయ్యి, త్రాసు, వంటపాత్రలు, ధ్వజము, వైఢూర్యము, ఆయుధము, కలశము, చామరము, ఛత్రము, కంటిఅద్దములు, వస్త్రములు, భోగ యోగ్యమైన ఇతర ద్రవ్యములు, వస్తువులు, మహాస్థానమునకు చెందిన వస్తువులు, దేవాలయము, దివ్యమైన పదార్ధములు, భూతావిష్ట వస్తువులు మొదలగునవి దారియందు కనబడితే వాటిని దాట రాదు మరియు పాదముల చేత స్పర్శించరాదు. లోకాచార విరుద్ధమైన ఇష్టాగోష్ఠులు, వ్యక్తిగత ఆచార సంబంధమైన భాషా, పరహింసాత్మక భాష మొదలగునవి ఎల్లప్పుడూ చేయరాదు. తన భోగమునకు ఎల్లప్పుడూ దానమును స్వీకరించరాదు. దేవతా మరియు గురుపూజకు ప్రయత్నపూర్వకంగా ధనార్జన చెయ్యాలి. సత్యము, సౌశీలము, సమత, ధైర్యము, క్షాంతి, దయ మనస్సునందు ఉంటే దివ్యశక్తి ఎల్లప్పుడూ తేజరిల్లుతుంది. లిసోడా, అర్క, కరంజ వృక్షముల నీడనందు కూర్చోరాదు. కారణము, దేవతాదేవ శాస్త్రములను నిందించరాదు. గాడిద, గుర్రముల ధూళికి దూరంగా వెళ్ళాలి. గురు, శిష్య మరియు లింగ ఛాయలను లంఘించరాదు. గుర్వాజ్ఞను ఎల్లప్పుడూ ఉల్లంఘించరాదు. గురువుకు ఎదురు సమాధానము ఇవ్వరాదు. పగలు, రాత్రి గుర్వాజ్ఞను పాటించాలి. అసత్యమును, బహువాదమును, అశుభమును పరిత్యజించాలి. గురువు ముందర కామ, క్రోధ మరియు అప్రియ వచనములను ఎల్లప్పుడూ మాట్లాడరాదు. ధన, ధాన్య మరియు శ్రమకు సంబంధించిన అభిమానము వీడవలెను. గురుద్రవ్యములను ఎన్నడూ వాడరాదు. గురువు ఇచ్చిన వస్తువులను ప్రసాదంగా స్వీకరించాలి. ఏ వస్తువులను లోభంతో స్వీకరించరాదు.

గురువు ముందు అద్వైత దేవపూజ పరిత్యజించాలి. గురుపాదుకులకు, గురుచిత్ర పటము మొదలగు చిహ్నములకు సాదరముగా ప్రాణమము చెయ్యాలి, వాటిని లంఘించరాదు మరియు స్పర్శించరాదు. గురువు సన్నిధిలో మంచం మీద పడుకొనరాదు. పాదములను/కాళ్ళను జాపరాదు. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు గురుపాదుకలకు నమస్కరించాలి. ఆయన ఛాయను లంఘించరాదు. ఆయన సమీపమునకు వెళ్లరాదు. గురువుకు ప్రణామము చేసిన తర్వాత మాత్రమే గురుగృహమునుండి బయటకు వెళ్ళాలి. గురువు ముందు శిష్యుని యొక్క గొప్పతనమును చెప్పుకోకూడదు. అహంకారము కలిగి ఉండరాదు. శరీరమున ఇనుపవస్తువులు ధరించరాదు. పరమగురు సన్నిధి యందు స్వగురువుకు ప్రణామము చేయరాదు. నమస్కారము కొరకు గురు దృష్టి నుండి తప్పించుకొనరాదు. గురువు మీద అభియోగము మోపరాదు. గురువును ఎన్నడూ "నువ్వు" అని ఏకవచన సంభోదన చెయ్యరాదు. ఉపయుక్తమైన (=తనకు తగిన) పరామంత్రము నందు దీక్షితుడైన తర్వాత గొడుగు, పావుకోళ్ళు, వస్త్రము మొదలగునవి దానము గ్రహించరాదు. పేదరికము మరియు ఆపదలయందు గురువునందు దోషము ఆపాదించరాదు. తన కులములో ఉన్న దీక్షితులైన ఆచార్యులనుండి ధనమును తీసుకోవడంలో ఎటువంటి దోషము లేదు. మంత్రోపభుక్త, అన్నాదులు, సంస్కృత యంత్ర మంత్రాదులు అధికముగా లభించిననూ వాటికి శిరస్సు వంచి ప్రణామము చెయ్యాలి. అడవుల యందు ఉరుకు జలపాతముల లాగ నీళ్ళను చిమ్మరాదు. ఆపద కాలమునందు, శపధము భంగపడు సమయమునందు కూడా గురు పేరును తెలుపరాదు (=గురువును ఆయా విషయములందు ఇరికించరాదు). ప్రమాదవశాత్తూ అలా జరిగితే ప్రాయశ్చిత్తార్ధం ప్రయత్నపూర్వకంగా పూజ-జప-హవనము చెయ్యాలి. తలపెట్టిన కార్యమును నిర్వహించలేనప్పుడు ప్రాయశ్చిత్తార్ధము దేవీ మంత్ర జపమును ఒక వెయ్యిసార్లు చెయ్యాలి. లోకఉద్వేకకారకము, మర్మఘాతి (కొట్లాట), స్థితిఉద్వేగకారి అయినటువంటి భాషణము చెయ్యరాదు. రమ్యమైన, మనఃపసంద, ఉజ్జ్వలమైన వస్త్రములను ధరించాలి. లోక విద్వేషణ కలిగించు వస్త్రములము ధరించరాదు. ఎవరైతే వారికి సంబంధించిన ఆచార-విచారములను పాటిస్తారో ఆ దీక్షితులకు శాంతి చేకూరుతుంది. స్త్రీలకు విశేషంగా నిర్మలమైన సమయాచారమును ఇవ్వవలెను. సమయాచారమును పాటించడం వలన శీఘ్రంగా సిద్ధిలభిస్తుంది. సమయాచారి ముఖమునందు మంత్రదేవత ప్రకటితమవుతుంది. సమయాచారికి అన్ని సిద్ధులూ కలుగుతాయి మరియు అంతమున మోక్షము కలుగుతుంది. అయన (=ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యకాలము), విషువ (= రేయి, పగలు సమానమైన కాలము. ఒక సంవత్సరములో రెండుసార్లు వస్తుంది. సాధారణంగా మార్చి20 మరియు సెప్టెంబరు22), చంద్రగ్రహణ, అష్టమీ, పూర్ణిమ రోజులందు నైమిత్తిక జపము చెయ్యాలి. నిత్యమూ మూడుసార్లు పూజ మరియు జపము చెయ్యాలి. న్యాయంగా సంపాదించిన సాధనములతో (వస్తువులు) దానము, హవనము, అర్చన చెయ్యాలి.

శివుడు చెబుచున్నాడు - హే ఈశ్వరీ! ఎవరు భక్తిపూర్వకంగా పై విధంగా చెయ్యరో వారు అధోఃగతి పాలవుదురు.
                                                                             ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: