సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, మే 2020, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 2



ఏదైనా మంత్రమును వింటే గుర్వాజ్ఞాను సారముగా దానిని గ్రహించాలి. గురువుకు ఇష్టములేని వాటిని వదిలిపెట్టాలి. గురువు ద్వారా నేర్చిన శాస్త్ర రహస్యాలను ఎవ్వరికీ చెప్పకూడదు. అలాఎవరైతే చెబుతాడో అతడు సమయచ్యుతుడు అవుతాడు. ఇందు ఎంతమాత్రమూ సంశయము లేదు. నిత్యమూ సాధకుడు తనను తన గురు రూపముగానే భావించుకోవాలి. ఇందు ద్వైతభావన చేయరాదు.

అన్ని జీవుల యొక్క కళ్యాణము (=శుభమును) ఆత్మనందు భావించాలి. ఆత్మనందున్న దేవికి భక్తి భావనతో శుశ్రూష చేసినట్టుగా భావించుకోవాలి. మహాత్మ అయిన గురుదేవునికి చేసిన గురుశుశ్రూష దేవీ కృపారూపమవుతుంది. భక్తి సహిత గురుశుశ్రూష వలన సకల కోరికలూ తీరుతాయి. సమస్త పాపములూ క్షయమవుతాయి మరియు పుణ్యరాశి వృద్ధి చెందుతుంది. గురు శుశ్రూష వలన సమస్త కార్యములూ సిద్ధిపొందుతాయి. మీకు ఇష్టమైన వస్తువులందు గురు హితమును మరువరాదు. గురుదేవుని పూజించువాని పుణ్యము గణించశక్యము కానిది. తన శక్తి కొలది ఎవరైతే కొంచెమైనా, ఎక్కువైనా గురుశుశ్రూష చేస్తారో వారి దరిద్రము పోయి ధనవంతులవుతారు. భక్తి రహితముగా గురువుకు ఏమి ఇచ్చినా అది నిష్ఫలమవుతుంది. ఫలము కలగడానికి భక్తి మాత్రమే కారణము. గురుద్రవ్యములందు ఆకాంక్ష చూపరాదు. గురువుకు ఏదైతే అధిక ఇష్టమో దానిని గురువుకు సమర్పించాలి. లోభ, మోహ కారణంగా అలా చేయకపోతే ఆ శిష్యుడు 73 నరకములందు దుఃఖములను అనుభవిస్తాడు. మాంసాదులను భక్షించువారు నీచయోనులందు పుడతారు. గురు ద్రవ్యములందు అభిలాష కలవాడు, గురుపత్నియందు కోరిక కలవాడునకు కలిగెడు అత్యంత పాపమును పోగొట్టుటకు ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. గురు ఆజ్ఞను పాటించనివాడిని, గురువునకు అప్రియమైన కార్యములు చేసేవాడిని, గురు ధనమును తీసుకున్నవాడిని మహాపాతకుడుగా, గురుద్రోహిగా భావించాలి. తన ధనమును గురువుకు నివేదన చేయకుండా ఎవడు ఖర్చు చేస్తాడో వాడు బ్రహ్మఘాతకుడవుతాడు. గురుస్థానమునకు, సంప్రదాయమునకు, ధర్మమునకు ఎవరు నష్టము కలిగింతురో వారు గురువునుండి బహిష్కృతుడయి దండించడానికి మరియు వధించడానికి యోగ్యుడవుతాడు.

గురు శాపానికి/కోపానికి మించిన నాశనము, గురుద్రోహానికి మించిన పాపము మారియొకటి లేదు. గురునిందని మించిన మృత్యువు కూడా లేదు. గురువుకు నచ్చని దానిని మించిన ఆపద లేదు. మనుష్యులు అగ్నియందు ప్రవేశించవలసి వచ్చినప్పుడు గాని మృత్యు సముఖమున ఉన్నప్పుడుగానీ గురువుకు అపరాధము చేయరాదు. ఎక్కడైతే గురునింద జరుగుతుందో అక్కడ నుండి సాధకుడు తన చెవులు మూసుకొని గురునింద వినబడనంత దూరం వెళ్లిపోవాలి. గురునింద చెవినపడిన వెంటనే గురునామ జంపము మొదలు పెట్టాలి. గురువు మిత్రులను, సుహృదయులను, దాసీ జనులను అవమానపరచరాదు. వేదము, శాస్త్రము, ఆగమముల అనుసారము జీవించే వారిని నిందించరాదు. శ్రీగురుపాదుకలు, వస్త్రము మరియు నామముల స్మరణ కూడా జపమే అవుతుంది. గుర్వాజ్ఞను పాటించడం శిష్యుని కర్తవ్యం. గురుసేవ భజనతో సమానము. గురువు నివాస స్థలమును చూసిన వెంటనే శాంతి చిత్తుడయి, వాహనము, వ్యంజనము (నోట్లో ఏదేని నములుతున్నది - తాంబూలము మొదలగునవి), పాదుకలు, ఛత్రము, చామరాము మొదలగునవి వదలి గురునివాస ప్రవేశము చెయ్యాలి. గురుదేవుని వాహనము, పాదుకలు, ఛత్రము, ఆసనము మొదలగువాటికి నమస్కరించాలి. వాటిని స్వయంగా ఎప్పుడూ వాడరాదు. పాద ప్రక్షాళణ, స్నానము, అభ్యంగము (=తలంటుట), దంతధావనము, మూత్రత్యాగము, శౌచము, క్షురము, శయనము, స్త్రీసేవనము, వీరాసనము, దుర్వాక్యము పలుకుట, ఆసనము, హాస్యము, రోదనము, కేశమోచనము, నగ్నత్వం, పాదప్రసరణము, వాద-కలహ-ధూషణములు, అంగభంగాంగ వాద్యములు, చేతులు చరచుట, చేతులు చాచుట, ద్యూతము, మల్లాది యుద్ధములు మొదలగునవి గురు-యోగి-మహాసిద్ధపీఠ క్షేత్రములు, ఆశ్రములందు చేయరాదు. మోహవశమున అలా ఎవరైనా చేస్తే వారికి దేవత శాపమిచ్చును. ఉపచారములకు తప్ప గురుసమీపమునకు పోరాదు మరియు అతని అనుజ్ఞ లేనిదే అతని సమీపమున కూర్చోరాదు. గురుముఖమును చూస్తూ ఉండి అతని వచనానుసారము కార్యమును చెయ్యాలి. గురువు చెప్పిన కార్యములను ఉపేక్షించరాదు. గురువు ఏమి చెప్పిన (సత్ లేదా అసత్) నిస్సంకోచంగా పాటించవలెను. నిగ్రహ-అనుగ్రహాలు ఏమైనా గురువే కారణము. గురుముఖంగా ఏమి పలుకునో అది శాస్త్రమే అవుతుంది. గురుకార్యమును స్వయంగా పూర్తిచెయ్యాలి. వేరొకరికి అప్పచెప్పరాదు. కదలడం, కూర్చోవడం, పడుకోవడం, మాట్లాడడం, హోమము-పూజలు చెయ్యడం అన్నింటయందు గుర్వాజ్ఞను పాటించాలి. అవి తెలిసినా గుర్వాజ్ఞానుసారమే చెయ్యాలి. జాతి, విద్యా, ధనము మొదలగు అభిమానములు వీడాలి. గురు సన్నిధియందు శిష్యుడు ఎల్లప్పుడూ సేవ చెయ్యాలి. భూమి మీద గురు ఛాయకు కూడా దూరంగా ఉండాలి మరియు వినమ్రతతో, భక్తితో ఉండాలి. గురువు మనస్సు ప్రకారం గురుకార్యము చెయ్యాలి. గురువు పార్శ్వమునందుండి వినమ్రత, ప్రఛ్చన్నత కలిగి మితభాషిగా ఉండాలి. గురువాక్యమును అనాదరిస్తే అతడు రౌరవాది నరకములకు పోతాడు. ఆవు, బ్రాహ్మణహత్య వలన ఎటువంటి పాపము కలుగుతుందో గురువు దగ్గర అసత్యమాడితే అంతటి పాపము కలుగుతుంది. గురువునుండి దూరముగా వెళ్లినప్పుడు, ఆర్ధిక ఇబ్బందులున్నప్పుడు, విషమ స్థితులందప్పుడు కూడా గురువును విస్మరించరాదు. గుర్వాదేశాను సారము అతని ఆశ్రమమునందుండాలి. శక్తిఛాయ, గురుఛాయ మరియు దేవఛాయలను లంఘించరాదు. వాటిమీద శిష్యుని ఛాయకూడా పడకూడదు. గురువుకు దగ్గరగా పడుకొనరాదు. గుర్వాదేశము లేకుండా భాషణము, పఠనము, గానము, భోజనము, నిద్రవంటివి చేయరాదు. గుర్వాజ్ఞాపాలనాసరముగా వంద బ్రహ్మ హత్యలైనా చెయ్యవలెను. గుర్వాజ్ఞాలేకుండా నిస్స్వాస కూడా చేయరాదు. గురువుకు ప్రణామము చేసి చేతులు జోడించి కూర్చోవాలి. గురువు, గురు సమానులైన శ్రేష్ఠులు, దేవతా సన్నిధినందు ఆసనము మీద కూర్చోరాదు. గురువుకు సింహాసనము, జ్యేష్ఠులకు ఉత్తమ ఆసనము, కనిష్ఠులకు దేశ్యాసనము ఇతరాలకు సమాసనము ఇవ్వాలి.

ఏ శిష్యుడు జాతివలనగాని, విద్యావలన గానీ ధనవంతుడైతే ఆ శిష్యుడు గురువును చూసిన వెంటనే దూరమునుండైన దండప్రణామములు గావించి మూడు లేదా ఆరు లేదా పన్నెండు సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలి. జ్యేష్ఠులకు ఒకసారి ప్రదక్షిణ చెయ్యాలి. గురువు, పరమగురువు ఒకేచోట ఉంటే ముందు పరమగురువుకు ఆ తర్వాత స్వగురువుకు ప్రణామము చెయ్యాలి. పూజ్యులకు కృతాఞ్జలి ప్రణామము, ఇతరులకు వాక్య వందనము చెయ్యాలి. దేవతలకు, గురువులకు, కులాచార్యులకు, జ్ఞానవృద్ధులకు, తపోధనులకు, విద్యాధికులకు, స్వకర్మ స్థానమునకు మరియు కులనాయికకు ప్రణామము చెయ్యాలి. స్త్రీ ద్వేషులకు గురుశాపము కలుగుతుంది. శఠులకు, పాశండులకు, పతితలకు, వికర్ములకు, కృతఘ్నులకు మరియు ఆశ్రమవాసులు కానివారకు ప్రణామము చేయరాదు. ఒకే గృహమునందున్నప్పుడు గురువుకు నివేదించకుండా ఎవరైతే భోజనము చేస్తారో వారు పంది యోనియందు జన్మిస్తారు. ఒకే గ్రామమునందు గురుశిష్యులు ఉన్నట్టయితే ఆ శిష్యుడు మూడు సంధ్యలందు గురువుకు ప్రణామము చెయ్యాలి. ఒక క్రోసు దూరములో ఉంటే ప్రతిదినము, రెండు క్రోసుల దూరములో ఉంటే అయిదు పర్వములందు (=?) గురువుకు ప్రణామము చెయ్యాలి. ఒక యోజనము నుండి పన్నెండు యోజనముల దూరంలో శిష్యుడు ఉంటే ఆ యోజనముల సంఖ్యను (ఆ సంఖ్యా మాసము) బట్టి గురువు దగ్గరకు వెళ్ళి ప్రణామము చెయ్యాలి. ఉదాహరణ: ఒక యోజన దూరములో ఉంటే ఒకటవ మాసంలో, రెండు యోజనముల దూరంలో ఉంటే రెండవ మాసంలో....... అలా పన్నెండు యోజనముల దూరంలో ఉంటే సంవత్సరానికి ఒక మారు గురువు దగ్గరకు వెళ్ళి ప్రణామము చెయ్యాలి. దూరము, దేశము, స్థితి శిష్యుని భక్తిని బట్టి గురు సాన్నిధ్యము లభిస్తుంది. అత్యంత దూరంలో ఉన్న శిష్యుడు అతని అవకాశమును బట్టి చెయ్యవచ్చు. దేవతా మరియు గురువు దగ్గరకు ఖాళీ చేతులతో వెళ్లరాదు. ఫల, పుష్ప, వస్త్రాదులు యథాశక్తి సమర్పించాలి. ఓ దేవీ! ఎవరు ఈ ప్రకారముగా ఆచరించరో వారు బ్రహ్మ రాక్షసులవుతారు. గురుపత్నీ, పుత్రులు, పెద్దఅన్నయ్య గురువుతో సమానులు. జ్యేష్ఠులు నలుగురు. వారు స్వజ్యేష్ఠుడు, క్రమజ్యేష్ఠుడు, కులజ్యేష్ఠుడు, గురుజ్యేష్ఠుడు. జ్యేష్ఠునికి ప్రణామము చేయవలసిన విషయమై ఇక్కడ క్రమజేష్ఠుని ప్రాప్తిపాదించెను. గురువుకు, కులవృద్ధులకు విధానపరంగా వందనము చేయవలెను. పితా, మాతా మొదలగు పూజ్యులకు బంధువుల సమక్షమున లేచి ప్రణామము చేస్తే వ్యక్తము, అవ్యక్తము అయినటువంటి దోషముల ప్రభావము తగ్గుతాయి. పశువులు (శఠ, పాషండ మొద...) ప్రణామము చేస్తే చేసిన వారిని మహాపశువులంటారు. వారికి దేవతా శాపము కలుగుతుంది. ఎవరికైతే గురుస్థానము లభిస్తుందో వారి పాదుకలు కూడా గురువులవుతాయి. వీరికి జ్యేష్ఠ వందనములు వర్తించవు.
                                                                                   ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: