సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 5


నారదపంచరాత్ర అనుసారము సమయాచారము

అన్ని కాలములందు బ్రాహ్మణుడు అందరియందు దయ కలిగిఉంటాడు. ఆ కారణమున అతడు ద్విజశ్రేష్ఠుడు, శాంతాత్ముడు, భగవన్మయుడు అవుతాడు. భావితాత్మా, సర్వజ్ఞ, శాస్త్రజ్ఞ, సదాచారనిష్ఠ, సిద్ధిత్రయ సమాయుక్త ద్విజుడు ఆచార్యునిగా అభిషిక్తుడవుతాడు. క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులందు క్షత్రియుడు అనుగ్రహము ఇవ్వడానికి సమర్ధుడు. క్షత్రియులందు గురుభావము కలిగితే వారు వైశ్యులను అనుగ్రహించరాదు. సజాతీయ శూద్రునకు గురుభావము కలిగితే శూద్రులకు అనుగ్రహ-అభిషేకములను చేయరాదు. వర్ణోత్తమ గురువు దేశవిదేశములందు విఖ్యాతుడయినను అనుగ్రహ-అభిషేకములను ప్రత్యేకంగా శుభార్ధులకు చెయ్యరాదు. అలా చేస్తే అది విపర్యయము (=దోషము) అవుతుంది. దానిద్వారా నాశనము పొందుతుంది.  అందువలననే శాస్త్ర విదిత కార్యములను మాత్రమే చెయ్యాలి. క్షత్ర, లంపట, శూద్ర జాతులకు ప్రతిలోమాను ప్రకారం దీక్షాప్రదానం చెయ్యాలి. అధికంగా భుజించువాడు, అలసుడు, విషయాలోలుడు, హేతువాది, దుష్టవాగ్వాది, గుణనిందకుడు, రోమరహితుడు, ఎక్కువ రోమములు కలవాడు, నిందితుడు, ఆశ్రమసేవకుడు, నల్లని దంతములు కలవాడు, తెల్లని పెదవులు కలవాడు, దుర్గంధమైన వాసన కలవాడు, దుష్టలక్షణములు కలవాడు, అధిక దానమునందు ఆసక్తుడైనవాడు - ఆచార్యుడు, స్వయం ఈశ్వరుడైననూ అతడు గురురూపముగా గ్రాహ్యుడు కాదు. ( = అటువంటి వారిని గురువుగా స్వీకరించకూడదు)

జ్ఞానోన్నయము

జ్ఞానోన్నయమునందు ఈవిధంగా చెప్పబడినది - తండ్రి నుండి, తాతనుండి ప్రాప్తించిన మంత్రము నిర్వీర్యమవుతుంది. హే మహేశ్వరీ! కనిష్ఠ సోదరుడు, వైరిపక్షాశ్రితుడు, భిక్షువు, వనవాసి - వీరినుండి భోగ-మోక్షములను కోరుకొను గృహస్థుడు మంత్రదీక్షను తీసుకోనరాదు.
త్యక్త్యాగ్ని (= అగ్నిహోత్రము చెయ్యనివాడు), క్రియాహీనుడు, పరిగ్రహ (=భార్య), వనములందు నివసించేవాడు, న్యూన (=క్రింది) జాతుల వారికి దీక్షను ఇచ్చే అధికారం లేదు.

భైరవీ తంత్రము ప్రకారము

తపస్వీ, సత్యవాది, గృహస్థ, స్వస్థమానస (తనయందుండువాడు), యతి - వీరికి వైఖానస (=సన్న్యాసికి సంబంధించినది; వానప్రస్థుడు; సన్న్యాసి) గురు అయ్యే యోగ్యత లేదు. వీరు గురువులుగా అయితే మోక్షార్ధి గృహస్థాశ్రమ వర్ణులకు ఉద్వేగం ప్రాప్తిస్తుంది.

కులార్ణవ ప్రకారము గురుశిష్య పరీక్ష
జ్ఞానము వలన గానీ, కృపచేత గాని గురువు శిష్యుని పరీక్షించాలి. ఆ పరీక్ష ఒక సంవత్సరము గానీ, ఆరు మాసములు గానీ, మూడు మాసములు గానీ ఉండాలి. ఉత్తమ-అధమ కార్యముల ద్వారా, నీచ, ఉచ్ఛ కర్మముల ద్వారా, ప్రాణ-ద్రవ్య ప్రదానాది కార్యములు కచ్చితంగా ఆదేశించి పరీక్ష చెయ్యాలి. మర్మవేధి వాక్యములద్వారా, మాయద్వారా, క్రూరచేష్టలద్వారా, పక్షపాత రహితంగా అనేక విధులచేత శిష్యుని పరీక్షించాలి. లాగికొట్టినా శిష్యుడు దుఃఖితుడు కాకపోతే అప్పుడు గురువు అతడియందు కృపను ప్రసరింప చెయ్యాలి. శ్రీగురు స్మరణము నందు, కీర్తనయందు, దర్శనమునందు, వందనమునందు, పరిచర్యమునందు, పిలిచినప్పుడు, పరిగెత్తునప్పుడు ఏ శిష్యునకు కంపనము, రోమాంచితము, స్వరనేత్రాదులు విప్పారునో ఆతడు శిష్య యోగ్యుడవుతాడు. దీక్షా సంస్కారమునకు యోగ్యుడవుతాడు. బోధించడం ద్వారా శిష్యునిగా చేసుకోవాలి. అన్యధా కూడదు.                    
శిష్యుడు కూడా గురువును ఈ క్రింది లక్షణములద్వారా గురువును పరీక్షించాలి. 
జపము, స్తోత్రము, హోమము, అర్చన కార్యములందు గురువు ఆనందంగా ఉన్నాడో లేదో చూడాలి. అతడికి జ్ఞానోపదేశ సమర్ధత ఉందో లేదో చూడాలి. మంత్రసిద్ధి ఉన్నదో లేదో చూడాలి.

కులార్ణవప్రకారము శిష్యుల స్థాయిలు

ఆది, మధ్యమ మరియు అంతము నందు భక్తి నిపాతము చేత యోగ్యతా జ్ఞానము కలుగుతుంది. ఈ విధముగా శిష్యుని యోక్క అధమ, మధ్యమ, ఉత్తమ్ స్థాయి తెలుసుకోవాలి. దీక్షాసమయమునందు భక్తి కలిగిన తర్వాత అది విఘ్నమయితే అతడిని ఆదిభక్తుడని అంటారు. జ్ఞాన-విజ్ఞాన-హీనులకు దీక్షా సమయమునందు భక్తి వలన జడత్వము నష్టమయితే దానిని మధ్య భక్తి అంటారు. ముందు భక్తి హీనత్వము ఉండి మధ్యన భక్తి కలిగినా లేకపోయినా అంతమునందు ప్రచుర భక్తి కలిగితే దానిని అంత భక్తి అంటారు.
                                                                                                                           ఇంకాఉంది     

కామెంట్‌లు లేవు: