సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, మే 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 3

సమయాచారము

కులార్ణవము ప్రకారము శ్రీగురువునకు, కులశాస్త్రమునకు మరియు పూజ్య స్థానములకు భక్తిపూర్వకముగా "శ్రీ" ను జోడించి ప్రణామము చెయ్యాలి. ఉదా: శ్రీగురుపాదుకాం ప్రణమామి, శ్రీకులశాస్త్రం ప్రణమామి. బ్రహ్మనుండి కీటకము దాకా అన్నీ గురుసంతతి శిష్యులు. అందువలన పృధ్వీనందు ఎవరు పూజ్యులు కారు? జపకాలమునందు గురునాథుని నామమును ఉచ్చరించరాదు. గురుదేవుని  'శ్రీనాధదేవ' అని సంబోధిస్తూ మాట్లాడాలి. శ్రీగురుపాదుకా, ముద్రా, మూలమంత్రము, స్వపాదుక శిష్యునికి తప్ప వేరొకరికి చెప్పకూడదు. పరంపరా, ఆగమము, మంత్రము, ఆచారాదులు మొదలగునవి గురుముఖత ప్రాప్తమవుతేనే సఫలమవుతాయి. అన్యప్రకారముగా సఫలము చెందవు. శ్రీశాస్త్రఆశ్రయ శంభూత పుస్తకము దేవతతో సమానమవుతుంది. కులశాస్త్ర ప్రకారముగా భక్తితో వీటిని నిత్యమూ పూజించాలి. ఆ పుస్తకము పశువల వంటివారికి ఇవ్వకూడదు. తన భార్యతో సమానముగా కులశాస్త్రమునకు సేవ చెయ్యాలి. అన్ని పశుశాస్త్రములను పరస్త్రీ సమానముగా భావించాలి. ద్విజోత్తములకు స్వపచమైయన పాలు ఏవిధంగా తాగడానికి పనికిరావో అదేవిధంగా పశుముఖం నుండి వచ్చిన శ్రుతుల సమ్మతము కాని ధర్మమును కౌలికుడు పాటించరాదు. శాస్త్రానుసారము కులాచారమును ఎవరు చెబుతారో ఎవరు వింటారో వారు యోగినీ మరియు వీరులకు గ్రాసమవుతారు. శాస్త్రములందు కులధర్మము యొక్క వర్ణన శ్రద్ధారహితమయితే ఆశాస్త్రము ప్రళయము వచ్చునంతవరకు నరకమునకు పోయినా సరే వదలిపెట్టదు. ఎవరైతే వివాహిత స్త్రీయందు ప్రీతి కలిగి ఉంటారో వారు మూల్య విహీనులై ఆమెతో సంభోగమునకు త్వరగా తయారవుతారు.

గురుసామానులైన స్త్రీలు అయిదు రకములు: నల్లని వస్త్రములు ధరించిన స్త్రీ, నల్లని వర్ణముగలస్త్రీ, కుమారీ, సన్నని నడుము గల స్త్రీ, మనోహరమైన స్త్రీ - వీరిని దేవతా బుద్ధి చేత అర్చించాలి.

పచ్చి మాంసము, సురాకుంభము, మదమెక్కిన ఏనుగు, సిద్ధలింగము, సహకారము (=?), అశోక (=?), ఆటలాడుకుంటున్న కుమారీలు, ఏకవృక్షము, శ్మశానము, నారీసమూహము మరియు రక్తవస్త్రములు ధరించిన స్త్రీలను చూసిన వెంటనే ప్రణామము చెయ్యాలి. గురుశక్తి, జ్యేష్ఠ-కనిష్ఠ పుత్రుడు, కులదేశిక, కులదర్శన శాస్త్ర, కులద్రవ్య, కౌలిక, ప్రేరక, సూచక, వాచక, దర్శక, శిక్షక, బోధిక, యోగీ-యోగినీ, సిద్ధపురుష, కన్యా, కుమార, నగ్నమత్తనారి వీరిని నిందించకూడదు, ద్వేషించకూడదు. నవ్వులాటకైనా వారిని అవమానపరచకూడదు. కులయోగులకు అప్రియమైన అబద్ధము ఎన్నడూ చెప్పరాదు. కురూపి మరియు అత్యంత నల్లని స్త్రీని కులస్త్రీగా ఉంచరాదు. నగ్న, ఉన్మత్త, ఆచ్ఛాదనలేని స్తనముగల స్త్రీని చూడరాదు. పగటిపూట స్త్రీ సంభోగము చేయరాదు, యోనిని చూడరాదు.

ప్రపంచమందున్న స్త్రీలందరూ మాతృకుల సంభవులు. నూరు తప్పులు చేసినప్పటికీ స్త్రీలను పువ్వులతోనైనా కొట్టరాదు. స్త్రీదోషములను గణించరాదు. వారి గుణములను ప్రకాశింపచెయ్యాలి. కులవృక్షములందు కులయోగినులు ఉంటారు కనుక ఆ వృక్షముల ఆకులు తినరాదు. విశేషించి అర్కపత్రమును (జిల్లేడాకు)ను తినరాదు. కులవృక్షముల కింద శయనించరాదు, ఎటువంటి ఉపద్రవములు చెయ్యరాదు. కులవృక్షములను చూసిన వెంటనే భక్తిసహిత ప్రణామము చెయ్యాలి. వాటిని ఎన్నడూ నరకరాదు. కులవృక్షములు తొమ్మిది. అవి - లిసోడా (నక్కెర), కరంజ (= పులిగోరచెట్టు), వేప, రావి, కదంబ, మారేడు, మర్రి, మేడి, జిల్లేడు.

దేవత-గురు-శాస్త్ర-సిద్ధాచారములను నిందించేవాడు, విద్యాచోరుడు, గురుద్రోహి బ్రహ్మరాక్షసుడవుతాడు. మోహం చేత గురువును అందరిముందు లోకువ చేసేవాడు, వీరపురుషులను నిందించేవాడు, కులశాస్త్రములను వక్రించేవాడు (అటూ ఇటూ తనకనుకూలంగా మార్చుకోవడం) వీరందరూ కూడా బ్రహ్మరాక్షసులవుతారు. ఏకాక్షర మంత్రాన్నిచ్చే గురువును ఎవరు విశ్వసించరో వారు నూరు కుక్క జన్మలెత్తిన తర్వాత చండాలజన్మ ఎత్తుతారు. బుద్ధిమంతులు గురువును గురించి ప్రచారం చేస్తారు. కానీ మంత్రమును మాత్రము బహిర్గతము చేయరాదు. రహస్యంగా ఆ పని చేసినచో సంపదలు మరియు ఆయుష్షు క్షీణించును. కులధర్మాన్ని, ఆచారాన్ని ఎవరు పాటించరో వారు మహాపాపి అవుతారు.

యోగినులు ప్రకోపిస్తే ఆపద, రోగము, దరిద్రము, కలహము, అడుగడుగుకి స్కలనమవడం వంటివి జరుగుతాయి. అతడు మానహీనుడు, ప్రణష్టుడు (= గుర్తింపు పోయినవాడు), తేజహీనుడు, అతిదుఃఖితుడు, నిందితుడు, తిరస్కరించబడినవాడు, విహ్వలుడు (భయపడినవాడు,స్వాధీనము తప్పినవాడు), సంఘవర్జితుడు అవుతాడు. దేశదేశాంతరాలు పోయినా కూడా అతని కార్యములన్నింటియందు హాని కలుగుతుంది. శ్రీదేవి నుండి వరము పొందినవాడు కూడా కులమార్గము నందున్న కులపాలికలు, సాకినిలు అతడిని భక్షిస్తాయి. సదాచారవంతుడు దేవీ మరియు యోగినులకు ప్రియభక్తుడవుతాడు. సదాచారమునందు దేవీ మరియు యోగినులు కలసిఉంటారు. కౌలికాచారమునకు విరుద్ధంగా పయనిస్తే నీచయోనిలందు జన్మిస్తారు. సంస్కార విహీనుడయినా, గురువాక్యమును ఉల్లంఘించినా, ఆచారమును దాటవేసినా కౌలికుడు పతితుడవుతాడు. నిత్య, నైమిత్తిక, కామ్య, మంత్ర, తంత్రాది విషయములందు లోపము జరిగితే ఆ సాధకుడు అనర్హుడు, పశువు, దుఃఖితుడు అవుతాడు. మంత్ర సాంకర్యము (=సంకరం) కూడా అవుతుంది. జ్ఞానాజ్ఞాన విషయములందు రహస్యములు బహిర్గతమవుతుంటాయి. ఈ ప్రకారమైన దోషముల వలన చిన్న, పెద్ద పాపములు తగులుకుంటాయి. దేశ, కాల, వయ, విత్తముల చేత జ్ఞాన ప్రాప్తికొరకు యధావిధి ప్రాయశ్చిత్తము చేసి గురువు అన్ని పాపములనుండి విముక్తి కలిగిస్తారు. శిష్యుడు కూడా చెప్పబడిన ప్రాయశ్చిత్తములు చెయ్యాలి. గురునామ స్మరణ చెయ్యాలి. బంగారము యొక్క మాలిన్యము ప్రాయశ్చిత్తమైతేనే అగ్ని యందు దగ్ధమవుతుంది.

శివుడు పార్వతితో చెబుతున్నాడు. ఓ పార్వతీ! ఇక్కడ ఎక్కువ చెప్పవలసిన అవసరం ఏమున్నది? అసలు రహస్యం చెబుతాను విను. వర్ణాశ్రమం యొక్క అన్ని ఆచారములూ సద్గతి ప్రదాయకములు. హే కులనాయకీ! గురువునుండి మూడుసార్లు ఆచారమును విని, శిష్యుడు అది పాటించకపోతే ఆ పాపమును గురువుకూడా పోగొట్టలేరు. ఏవిధంగా మంత్రి పాపము రాజుకు, పత్నీ పాపము పతికి సంక్రమిస్తాయో అదేవిధంగా శిష్యుని పాపము గురువుకు సంక్రమిస్తుంది.
          ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: