సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, అక్టోబర్ 2020, గురువారం

సనాతన ధర్మం - 1

                శ్రీమాత్రేనమః

శ్రీమహాగణపతయే నమః

శ్రీగురుభ్యోనమః

ఓం శ్రీగురుస్సర్వకారణభూతాశక్తిః

ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే|

శరణ్యే త్ర్యంబకేదేవీ నారాయణీ నమోస్తుతే||


పరిచయం:

సనాతన ధర్మమనగా శాశ్వతమతము, పురాతన శాస్త్రము. ఇది వేదములనుండి పుట్టినది. ఈ ధర్మమును, మొదటి జాతిగా చెప్పబడు ఆర్యులకు తెలియపరచినట్లుగా ఒక అభిప్రాయము కలదు. అందువలననే ఈ సనాతన ధర్మమును ఆర్యమతముగా చెప్పుట కలదు. ఆర్య అను శబ్దమునకు ఘనమైన, ప్రసిద్ధమైన, దివ్యమైన, ఉత్తమమైన, సదాచారమైన అను మొదలగు అర్ధములు కలవు. వీరి గొప్పదైన జీవనశైలి మరి ఏ ఇతర మతములందు కనబడకపోవుట వలన ఈ మొదటి జాతికి ఆర్య అని పేరు వచ్చిఉండవచ్చును. ఆర్యులు మొదటిగా భూమికి ఉత్తర దిక్కున నివాసము ఏర్పరచుకున్నారు. ఈ భూభాగమునే నేడు భారతదేశము అని పిలుచుచున్నారు. ఈ భూభాగము తూర్పు సముద్రము నుండి పశ్చిమ సముద్రమువరకు, హిమాలయములు మరియు వింధ్యాచలముల మధ్యభూభాగమున విస్తరించుకొని ఉండెను. ఆర్యులు నివసించెను కనుక ఈ భూభాగమును ఆర్యావర్తనము అని పిలిచెడి వారు.

        ఆ తరువాతి కాలములో ఈ పురాతన మతమును హిందూమతముగా పిలువనారంభించిరి. ఈ మతము అన్నింటికన్నా మొదటిది. ఈ మతము అందించినంత గొప్ప గురువులను, గ్రంథకర్తలను, ఋషులను, సన్యాసులను, చక్రవర్తులను, యుద్ధవీరులను, యోధులను, రాజనీతిజ్ఞులను, ఉప(హిత)కారులను, దేశభక్తులను మరియే యితర మతము అందించలేదనుటలో సందేహము లేదు. ఈ సనాతన ధర్మము గురించి ఎంత తెలుసుకుంటే మనము అంతగా ఈ ధర్మమును గౌరవించుతాము మరియు ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు అహంకార రహిత గర్వమును పొందుతాము. కానీ ఈ సనాతన ధర్మమును ఆచరించకపోయినట్లైతే మనకు ఒరిగేది ఏమీ ఉండదని తెలుసుకోవాలి.

        ఈ సనాతన ధర్మము ఒక గట్టి, లోతైన పునాదుల మీద ఆధారపడి ఉన్నది. ఆ పునాదులమీద ఈ గొప్పదైన వ్యవస్థ ఆకృతి దాల్చింది. ఆ పునాదులను మూలము అని భావించాలి. ఆ మూలమే శ్రుతులు. శ్రుతి అనగా వినిపించినది అని అర్ధము. ఆ దాల్చిన ఆకృతియే స్మృతులు. స్మృతి అనగా గుర్తుంచుకున్నది అని అర్ధము.

        శ్రుతులు మొదటిగా మన ఋషులకు వినిపించెను. వారికి సాక్షాత్తు దేవతలే వినిపించారని ప్రతీతి. ఈ శ్రుతులనే వేదములు అని అంటారు. ఈ పవిత్ర పుణ్య ఉపదేశములను ఆధునిక యుగము వరకు గ్రంథస్థము చెయ్యబడలేదు. దేవతలనుండి ఋషులకు, ఋషులనుండి తర్వాతి తరములకు నోటి పాఠములగానే చెప్పబడేవి. ఈ బోధనా పద్ధతిని సంత చెప్పుకొనుట, వల్లెవేయుట అని చెప్పేవారు. విద్యార్ధులు వీటిని తమ (కంఠ)హృదయస్థము చేసి తమ తర్వాతి తరములకు అందిచెడివారు. ఇప్పటికీ కొన్ని వేదపాఠశాలలయందు ఈ పద్ధతి కలదు. అయితే కాలక్రమేణా జీవులలో ధారణాశక్తి సన్నగిల్లగా ఈ ఉపదేశములు గ్రంథస్థమయి భావితరాలకి అందుబాటులోకి వస్తున్నాయి.

        ఈ శ్రుతులు నాలుగు వేద భాగములుగా విభజించబడెను. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణవేదము. వేదము అనగా జ్ఞానము అని అర్ధము. జ్ఞానమే దేనికైనా మూలము. ఈ నాలుగు వేదములు మళ్ళీ మూడు భాగములుగా విభజించబడెను. అవి

        1. మంత్ర లేదా సంహిత భాగము

        2. బ్రాహ్మణములు

        3. ఉపనిషత్తులు

మంత్రభాగమునందు దేవతలకు సంబంధించిన మంత్రములు, ఆ మంత్రములకు సంబంధించిన శాస్త్రము ఉండును. అనగా, ఒక మంత్రములో ఉండు వర్ణములు, వాటి ఉచ్చారణా పద్ధతి, వాటి యొక్క ప్రయోజనము మొదలగునవి ఉండును. మంత్రములో ఉండు వర్ణములనే బీజములు అని అంటారు. ఈ బీజములను ఉచ్చరించుటకు కొన్నిపద్ధతులు కలవు. ఆ పద్ధతులు బాగా తెలిసిన వ్యక్తి దగ్గర తెలుసుకొని ఈ మంత్ర సాధన చెయ్యాలి. ఆ పద్ధతి బాగా తెలిసిన వ్యక్తినే గురువు అని అంటారు. చేసిన సాధనబట్టి మంత్రముల ఫలితము ఉండును.

బ్రాహ్మణ భాగమునందు సంస్కార, ఆచారకర్మలు చేయవలసిన ఆవశ్యకత, వాటిని చేయవలసిన పద్ధతులు, మంత్రభాగము నందు చెప్పబడిన మంత్రములను ఆయా కర్మలకు ఏవిధముగా ఉపయోగించవలెను మొదలగు విషయములు తెలుపబడెను.

ఉపనిషత్తులయందు లోతైన ఆత్మజ్ఞానసంబంధమైన విషయములు, ప్రజ్ఞానఘనరూపమైన బ్రహ్మము గురించి, బంధములు, మోక్షములు మొదలగు విషయముల గురించి తెలుపబడెను. తత్త్వజ్ఞానమునకు ఇవియే మూలము. ఎంతో విద్యావంతులకు మాత్రమే ఇవి అర్ధమవుతాయి. సాధారణ మానవులకు ఇవి కొరుకుడుపడవు అనుటలో సందేహము లేదు.

అయితే పైన వేదములు మూడు భాగములుగా చెప్పబడిననూ, ఉపవేదములు అను మరియొక భాగము కూడా కలదు. ఈ ఉపవేదములను తంత్రములు అని కూడా అంటారు. ఈ తంత్రములు సశాస్త్రీయమైన రహస్యములు. కానీ ఈ రోజుల్లో చాలా కొన్ని నిజమైన తంత్రములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన సనాతన ఋషులు ఎంతో దూరదృష్టితో ఆధునిక మానవులు వీటిని సత్యదృష్టితో అర్ధంచేసుకొని ఆచరించలేరని తెలుసుకొని భావితరాలకు అందించలేదు. కొన్ని తాంత్రిక పద్ధతులను కొంతమంది సాధకులు మరియు కొన్ని పుణ్యక్షేత్రములందును నేటికీ పాటించుట మనము గమనించవచ్చు. ఇప్పుడు లభ్యమవుతున్న తంత్రములను విజ్ఞులు వేదబాహ్యముగానే పరిగణించుచున్నారు.

        శ్రుతులలో ఏ పరమపావనమైన, సర్వోత్కృష్టమైన ప్రమాణమును సూచించబడినదో ఆ ప్రమాణమును భగ్వద్విశాసులు అంగీకరించి పూజించుచున్నారు. ఏ మతమునకైనా, ఏ శాఖా అనుచరులకైనా చివరికి శ్రుతులు మాత్రమే పరమ ప్రామాణికము అవుతున్నాయనుటలో ఎటువంటి సందేహమూ లేదు.

        స్మృతులను ధర్మశాస్త్రములు అని కూడా అంటారు. ప్రామాణిక విషయంలో శ్రుతుల తర్వాత స్మృతులదే అగ్రస్థానము. మన సనాతన ఋషులు నాలుగు స్మృతులను మనకు అందించారు. వీటిలో మానవులు జీవించవలసిన విధానము, క్రమశిక్షణా నియమ నిబంధనములు, సాంఘిక జీవనము మొదలగు విషయములను పొందుపరచెను. హిందూ సమాజము వీటిమీద నిర్మింపబడి, పరిపాలించబడుచున్నది. ఈ నాలుగు స్మృతులూ:

        1. మనుస్మృతి (మానవ ధర్మ శాస్త్రము)

        2. యాజ్ఞవల్క్యస్మృతి

        3. శంఖలిఖితస్మృతి

        4. పరాశరస్మృతి

పైవాటిలో మొదటి రెండు బాగా ప్రాచుర్యము పొందెను. చివరి రెండూ దక్షిణ భారతములో అక్కడక్కడ ప్రాచుర్యము పొందెను.

       సనాతన ధర్మమునకు శ్రుతులు, స్మృతులు ఏవిధముగా పునాదులు మరియు గట్టికట్టడములో, ఆ కట్టడమునకు దన్నుగా పురాణములు, ఇతిహాసములు కలవు. పురాణములందు చరిత్రలు, కధలు, రూపకములు మొదలగునవి ఉండును. ఇవి వేదములు చదువుకొననివారికి బాగా ఉపయోగపడును. ఇవి చదువుటకు చాలా ఆసక్తికరముగా ఉండి అన్ని విషయములమీద సమగ్ర సమాచారమును అందించును.

        ఇతిహాసములు ముఖ్యముగా రెండు. అవి రామాయణము మరియు మహాభారతము. వీటిగురించి చాలా మందికి కొంచెమైన అవగాహన ఉండే ఉంటుంది కనుక వీటిగురించి ఇక్కడ వివరించడం లేదు. ఈ ఇతిహాసములనుండి ప్రాచీన భారతదేశము యొక్క స్థితిగతులు, ప్రజల జీవనవిధానము, సంప్రదాయములు, కళలు, కట్టడములగురించి మనము తెలుసుకొనవచ్చును.

        ఈ సనాతన ధర్మమనే అద్భుతమైన భవంతి ఆధారముగా శాస్త్రజ్ఞానము మరియు ఆధ్యాత్మికజ్ఞానము ఉదయించెను. మనము నేడు ముద్దుగా పిలుచుకుంటున్న సైన్సునే శాస్త్రజ్ఞానము అని అనేవారు. ప్రాచీనకాలములో శాస్త్రవిజ్ఞానమును అధ్యాత్మిక విజ్ఞానమును వేరువేరుగా చూడలేదు.

        శాస్త్రవిజ్ఞానమునకు ఆరు శాఖలు గలవు. అవి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. వీటినే షడంగములు అంటారు. ఈ ఆరింటినీ చదివిన వారిని గొప్ప విద్యావంతులుగా పరిగణించేవారు.

        అదేవిధంగా తత్త్వజ్ఞానమునకు (ఆధ్యాత్మిక) కూడా ఆరు శాఖలు గలవు. వాటినే షట్ దర్శనములు అంటారు. అవి సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంశ, ఉత్తరమీమాంశ. ఉత్తరమీమాంశమును వేదాంతము అనికూడా అంటారు. వీటిలో జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి.  దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఆత్మ అనగా ఏమిటి? ఆత్మస్వరూపమును తెలుసుకొను విధానము ఏమిటి? కర్మ

అనగా ఏమిటి? దేవుని మాయాశక్తి ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి. ఈ దర్శనములందు సూచించిన మార్గములు వేరైనా వీటన్నిటియందు ప్రతిపాదింపబడినది జ్ఞానము మాత్రమే. జీవుల మోక్షమునకు జ్ఞానమే పరమావధి అని వీటియందు చెప్పబడెను.

(గమనిక: ఒకప్రాచీన ఆంగ్ల గ్రంథమాధారముగా)

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: