సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, మార్చి 2022, శనివారం

తత్త్వములు

తత్త్వములు

వేదాంతము ప్రకారము తత్త్వములు 24. కానీ కాశ్మీరీ శైవిజం ప్రకారము తత్త్వములు 36. శివుని గురించి తెలుసుకోవడానికి ఈ 36 తత్త్వములు ఎంతో ముఖ్యమని కాశ్మీరీ శైవిజం చెబుతోంది. ఈ 36 తత్త్వములను ఆరోహణాక్రమములో ఇక్కడ చర్చించబడుతున్నది. భూమి నుండి పరమశివమునకు ఎదగడమే ఈ ఆరోహణాక్రమ ఉద్దేశ్యము. స్థూలమైన భూమి నుండి సూక్ష్మ, సూక్ష్మతర మూల ప్రకృతులను (తత్త్వములు/Elements) అర్థం చేసుకొంటూ సూక్ష్మాతిసూక్ష్మమైన పరమశివుని చేరడమే లక్ష్యము.

ఈ 36 తత్త్వములు ఈ క్రింద చెప్పబడ్డాయి.

పంచమహాభూతములు – పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము (5)

పంచతన్మాత్రలు – గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద (5)

పంచ కామేన్ద్రియములు – ఉపస్థ, పాయువు, పాద, పాణి, వాక్కు (5)

పంచ జ్ఞానేంద్రియములు – ఘ్రాణ, రసన, చక్షు, త్వక్, స్తోత్ర (5)

అంతఃకరణములు – మనస్సు, బుద్ధి, అహంకారములు (3)

(కొన్ని మతముల ప్రకారము చిత్తము కూడా కలిసి ఇవి నాలుగు)

ప్రకృతి, పురుషుడు (2)

షట్ కంచుకములు – నియతి, కాల, రాగ, విద్యా, కళ, మాయా (6)

శుద్ధ తత్త్వములు – శుద్ధవిద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ(5)

పై వాటిలో పంచమహాభూతములను స్థూల మూలప్రకృతులు అని అంటారు. ఈ పంచమహాభూతములలో ఆకాశము మిగతా భూతములలాగా ఒక తత్త్వముగా గ్రహించదగినది కాదు. ఎందుకంటే అది ఒక ఖాళీ ప్రదేశము (రోదసి). ఏదీ ఆక్రమించుకోని ప్రదేశము. నిజానికి దీనిలోనే మిగతా స్థూల పదార్థములన్నీ ఉన్నాయి. ఇది మిగతా మహాభూతములతో నిండి ఉన్న ఒక ప్రత్యేక శూన్యస్థలము. మొత్తం విశ్వమంతా ఈ స్థూలతత్త్వముల మీద ఆధారపడి ఉండడం వలన వీటిని మహాభూతములు అని అంటారు.

       ఈ మహాభూతముల తర్వాత వచ్చేవి మహాతన్మాత్రలు. ఈ మహాతన్మాత్రలు మహాభూతములకు అనుగుణముగా ఉండును. గంధ తన్మాత్ర భూమి నుండి సంభవించుచున్నది. గంధము అనగా వాసన అని అర్థము. నిజానికి ఇది వాసనకు నిలయము. రస తన్మాత్ర జలభూతము నుండి సంభవించుచున్నది.  ఇక్కడ రస అనగా రుచి అని అర్థము. అగ్ని నుండి రూప తన్మాత్ర సంభవించుచున్నది. వాయు భూతము నుండి స్పర్శతన్మాత్ర పుట్టుచున్నది. శబ్ద తన్మాత్ర ఆకాశము నుండి పుట్టుచున్నది.

       పైన చర్చించిన పంచ తన్మాత్రల తర్వాత పంచ తత్త్వములు వచ్చును. వీటినే కర్మేంద్రియాలు అని అంటారు. అవి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్ అనగా మాటలు మాట్లాడుట, పాణి అనగా చేతులు – ఇచ్చి, పుచ్చుకొనుటకు, పాదములు – వీని ద్వారా ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు కదులుటకు, పాయువు – మలవిసర్జన చేయుటకు ఉపయోగపడు అవయము, ఉపస్థ తత్త్వము ద్వారా మూత్ర విసర్జన మరియు మైథున కార్యము జరుగును.

       ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు వచ్చును. సుళువుగా అర్థం చేసుకోవడానికి వీటిని మానసిక అవయములు అని అనవచ్చును. వీటి ద్వారా మనము ఈ చరాచర జగత్తును తెలుసుకొంటున్నాము. వీటిలో మొదటి జ్ఞానేంద్రియము ఘ్రాణ. ఇది నాసికకు సంబంధించినది. నాసిక ద్వారే జీవులు వాసన చూచుట చేయుచున్నారు. ఆ తర్వాతది రసన తత్త్వము. ఇది జిహ్వకు సమబంధించినది. దీని ద్వారా జీవులు రుచులు తెలుసుకొంటున్నారు. ఆ తర్వాత చక్షువు అనగా నయనములు. వీని ద్వారా జీవులు అన్నింటినీ చూడగలుగుతున్నారు. ఆ తర్వాత తత్త్వము త్వక్ అనగా చర్మము. దీని ద్వారా జీవులు స్పర్శను తెలుసుకొంటున్నారు. శ్రోత్ర తత్త్వము ద్వారా జీవులు శబ్దమును వింటున్నారు.

       పైన చర్చించిన 20 తత్త్వములను స్థూల ప్రకృతులని చెప్పబడుచున్నవి. ఇవి వస్తుగత ద్రవ్యములు. ఇప్పుడు అంతఃకరణముల గురించి తెలుపబడుతోంది. మనస్సు తత్త్వము మెదడుకు సంబంధించినది. ఇది ఆలోచనలకు పుట్టినిల్లు. జీవియొక్క సర్వ ఆలోచనలూ ఇక్కడినుండే పుడతాయి. అందుకే దీనిని సంకల్పసాధనా స్థానము అని అంటారు. పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టాలా వద్దా అన్నది నిర్ణయించేదే బుద్ధి తత్త్వము. ఈ బుద్ధి తత్త్వము మేధస్సుకు సంబంధించినది. జీవి యొక్క ఆలోచనల తప్పొప్పులను ఈ మేధస్సు నిర్ణయిస్తుంది. ఇక అహంకార తత్త్వము అహమునకు సంబంధించినది. ఫలానా పని నేను చేశాను, అది నేను అలా చెయ్యవలసింది, నేను అలా చేయకుండా ఉండవలసింది... ఈ విధంగా “నేను” అన్న దానిమీద ఈ అహంకార తత్త్వము పనిచేస్తుంది.

       ఆ తర్వాత వచ్చే ప్రకృతి, పురుష తత్త్వాలు ఒకదానికొకటి అన్యోన్యాశ్రయములు (=interdependent). ప్రకృతి నుండి మూడు ధోరణులు జనించి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ మూడు ధోరణులనే గుణములు అని అంటారు. అవే సత్త్వ, రజ, తమో గుణములు. ప్రకృతి అనేది ఈ మూడు గుణాల కలయికే కానీ ఎటువంటి భేదం లేకుండా ఉంటుంది. ఈ మూడు గుణాలు ప్రకృతి నుండి రావడం వలన వీటిని ప్రత్యేక తత్త్వాలుగా చెప్పబడలేదు. ఈ మూడూ ప్రకృతివలన పుట్టినవి కానీ ప్రత్యేకంగా పుట్టినవి కావు. తత్త్వాలు సృష్టించేవి కానీ సృష్టించబడేవి కావు. ఆ ప్రకృతికి స్పందించేది మరియు ఆ ప్రకృతిని సొంతం చేసుకొనే తత్త్వాన్నే పురుష అని అంటారు.

పైన చర్చించిన 25 తత్త్వాలూ వేదాంతులు అంగీకరించినవి. వారు తత్త్వములు ఈ 25 మాత్రమే అని చెబుతారు. ఈ తత్త్వాలన్నీ మాయా ప్రపంచంలోను, వస్తుగత దృక్పథంలోనూ (= objectivity) ఉంటాయి.

       శైవిజం ప్రకారము పురుష తత్త్వము సిద్ధిపొందిన ఆత్మ కాదు. అహంకార తత్త్వములాగే దీనికి కూడా కొన్ని పరిధులు కలవు. పురుష తత్త్వము నైజవాదమునకు, అహంకారము వస్తుగత దృక్పథమునకు సంబంధించినవి. ఇదియే వీటి మధ్యగల వ్యత్యాసము. పురుష తత్త్వము ఐదు కంచుకలతో ఆవరించబడి ఉంది. నియతి, కాల, రాగ, విద్యా, కలా అనునవే ఆ అయిదు కంచుకలు.

       పురుష ఒక చోటే ఉన్నాడు మరెక్కడా లేడు అన్న భావనని కలిగించడమే నియతి యొక్క కార్యము. నువ్వు విశాఖపట్నంలోనే ఉన్నావు కానీ బెజవాడలో లేవు. నువ్వు అమెరికాలో నివసిస్తున్నావు కానీ భారతదేశంలో నివసించడం లేవు. ఇటువంటి పరిమితులను విధించడమే నియతి యొక్క పని.

       కాలము అనగా సమయము. పురుషుడిని ఒకానొక కాలమునకు మాత్రమే పరిమితం చెయ్యడం ఈ కాలము యొక్క పని. నా వయసు 25 సంవత్సరములు, నీ వయసు 20 సంవత్సరములు....ఈ విధంగా పురుషుడికి కాల పరిమితి విధించడమే కాలము యొక్క పని.

       రాగము అనగా అనుబంధము/మోహము. పురుషుడిని తను పూర్ణుడు కాదు అన్న భావనకు గురిచెయ్యడమే ఈ రాగము యొక్క పని. నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలిలాంటి బంధములు, మోహములలో పడవేయుట రాగతత్త్వము.

       విద్య అనగా జ్ఞానము. పురుషుడిలో జ్ఞాన పరిధిని ఏర్పరచేదే విద్యా తత్త్వము. నా జ్ఞానము పరిమితము, నాకు అన్నింటి మీద అవగాహన/జ్ఞానము లేదు అనే పరిమితులను సృష్టించడమే విద్య యొక్క పని.

       కళా తత్త్వము పురుషుడిలో ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయము మీద మాత్రమే ప్రత్యేక ప్రజ్ఞ/ప్రతిభ ఉంది మరి దేనిమీదా లేదు అన్న పరిమితిని సృష్టిస్తుంది. నటన, నాట్యము, సంగీతము మొదలగు పరిమితులు.

       ఈ అయిదు బంధాలు పురుషుడిలో కలగడానికి కారణం అతడి అజ్ఞానము మాత్రమే. ఈ అజ్ఞానమునే మాయా తత్త్వము అని అంటారు. పైన చెప్పబడిన అయిదు తత్త్వాలనూ మాయ మాత్రమే పురుషుడిలో కలుగచేస్తోంది. మాయచేత ఆవరించబడిన పురుషుడు తన నిజమైన స్వభావమును తెలుసుకోలేక కంచుకముల కబంధహస్తములలో చిక్కుకొని ప్రకృతికి బలి అవుతున్నాడు.

       పైన చెప్పబడిన అయిదు తత్త్వలకు మాయ కూడా కలసి మొత్తం షట్ కంచుకలు అవుతున్నాయి. పురుషుడిని ఆవరించి ఉన్న ఈ కంచుకలు తొలగితినే పురుషుడు పూర్ణుడవుతాడు. కంచుకలు పోవడమన్నది పరమాత్మ వల్ల మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే ఈ కంచుకలు తొలగించబడతాయో అప్పుడు నిజమైన జ్ఞానం అవగతమవుతుంది. అప్పుడు మాయ పురుషిని శక్తిగా మార్పు చెందుతుంది. ఈ ప్రకాశవంతమైన శక్తియే పరమశివునిగా అవగతమవుతుంది.

       పైవిధంగా మాయని జయించిన జీవుడు శుద్ధ తత్త్వములను తెలుసుకోగలుగుతాడు. పురుషుడు తన నిజమైన స్వరూపమును తెలుసుకున్నపుడు శుద్ధవిద్యా తత్త్వమును సాధించగలుగుతాడు. అయితే తను తెలుసుకొన్న నిజ స్వరూప జ్ఞానము ఊగిసలాట ధోరణిలో ఉంటుంది. ఒక్కోసారి దాని ఎరుక ఉంటుంది మరొకసారి దానిని మరచిపోవడము జరుగుతూ ఉంటుంది. “నేను శివుడను. కనిపించే ఈ జగత్తు అంతా ద్వైతము. ఈ జగత్తు నిజము కాదు.” అన్న మనోభావం/అభిప్రాయం ఈ శుద్ధవిద్యలో కలుగుతూ ఉంటుంది.

       ఇక ఈశ్వర తత్త్వములో “ఈ జగత్తు నా యొక్క విస్తరణ మాత్రమే. ఇది భ్రాంతి కాదు. ఇది నా స్వంత విస్తరణ” అన్న గుర్తింపు కలుగుతూ ఉంటుంది. ఈశ్వర తత్త్వములో ఏ జ్ఞానము కలిగిందో అదే జ్ఞానము కూడా సదాశివ తత్త్వములో కలుగుతుంది. కానీ సదాశివ తత్త్వములో “నేనే ఈ విశ్వమును/జగత్తును” అన్న జ్ఞానం ఉంటుంది. ఇదే ఈ రెండు తత్త్వముల మధ్య ఉన్న భేదము. ఈశ్వర తత్త్వములో ఉన్నది విస్తరణ అన్న గుర్తింపు, సదాశివ తత్త్వములో నేనే అది అన్న జ్ఞానము ఉంటుంది.

       ఇక శక్తి తత్త్వము, శివ తత్త్వము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. పైన తెలుసుకున్న ఈశ్వర, సదాశివ తత్త్వములకు ఇంకొంచెం పైన వాటికి భిన్నంగా ఉన్నది నేనే, నాకు భిన్నంగా ఏదీ లేదు, “నేను/ఆత్మ”, “పరిశుద్ధ ఆత్మ” “విశ్వాత్మ” అని తెలుసుకుంటాడు.   

       ఇక చివరగా తెలుసుకోవలసినది, తత్త్వములలో వేరుగా చెప్పబడనిది అయిన తత్త్వము “పరమశివ” తత్త్వము. ఈ తత్త్వము శక్తి లేదా శివ తత్త్వములలోనే కనబడదు. ఇది ఇక్కడ, అక్కడ అనే కాదు. అన్ని చోట్లా ఇది కనబడుతూ ఉంది. కనుక అన్ని చోట్లా లేదు. అన్ని చోట్లా ఉండేది అన్ని చోట్లా ఉండదు.

1 కామెంట్‌:

PADMAJA చెప్పారు...

శ్రీగురుభ్యో నమః
ధన్యవాదములు గురువుగారు
🙏🙏🙏