సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 31

 

అన్నపూర్ణావిధివివరణం

దేవి అడుగుచున్నది - హే దేవేశ! మీరు ఐదు పంచ మహావిద్యలను సూచనప్రాయంగా చెప్పారు. కానీ వాటి ప్రకాశ వివరణ చేయలేదు. నామీద దయ ఉంచి అది తెలుపవలసిందిగా కోరుచున్నాను.

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఓ దేవీ! ఇప్పుడు నేను సిద్ధవిద్యను చెబుతాను. ఇది తెలుసుకున్నంత మాత్రముననే సిద్ధి లభింపగలదు. ఈ విద్య సమస్త ఐశ్వర్యములను ఇచ్చునది.

మంత్రము: ఓం హ్రీం శ్రీం క్లీం క్లీం భగవత్యై మాహేశ్వర్యై అన్నపూర్ణాయై స్వాహా|

ఈ దేవిని ప్రాతఃకాలమున పూజించాలి. ఈ మంత్రమును స్మరించిన మాత్రముననే సర్వ ఆపత్తులు దూరమైపోవును. ఈ విద్య ఋషి - బ్రహ్మ| ఛందస్సు - షష్టి| దేవత - సిద్ధవిద్య అన్నపూర్ణేశ్వరి| బీజం, శక్తి, కీలకము - హ్రీం| హ్రాం, హ్రీం, హ్రూం, హ్రైం, హ్రౌం, హ్రః లతో షడంగ న్యాసం చెయ్యాలి.

బ్రహ్మరంధ్రము, సీమంతము, లలాటము, భ్రూమధ్యము, నాసికా, ముఖము, కంఠము, హృదయము, నేత్రము, నాభి, లింగము, మూలాధారము, స్ఫిక్ ద్వయము, ఊరు ద్వయము, జంఘ ద్వయము, పాద ద్వయములందు న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత పదన్యాసము చెయ్యాలి. పదన్యాసము నవద్వారములందు చెయ్యాలి. (ముఖము, నేత్రములు, నాసికా రంధ్రములు, కర్ణద్వయము, లింగము, గుదము). దేహ సిద్ధి కొరకు మూలముతో వ్యాపక న్యాసము చెయ్యాలి.

యంత్రము: ఈ యంత్రము భోగ మోక్ష ప్రదాయిని.

త్రికోణ, షోడశదళ, అష్టదళ, భూపుర యంత్రము నిర్మించాలి. త్రికోణ మధ్యలో ఓం ను లిఖించాలి. మూడు కోణములందు హ్రీం, క్లీం, ఐం లను ప్రాదక్షిణ క్రమంలో లిఖించాలి. పూర్వాది కళలను షోడశ దళములలో లిఖించాలి. అష్టదళములలో దీర్ఘ స్వరములను లిఖించాలి.

పీఠపూజ చేసి, పీఠమునకు నమస్కరించాలి. ఆ పీఠమున వశ్యప్రదా దేవీ మరియు సాధారణ ముద్రలను పూజించాలి. గంధ, పుష్పాదులతో సంపూర్ణంగా దేవిని పూజించి సంతోషపరచాలి. అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య మరియు పూర్వ దిక్కులందు అంగ పూజ చెయ్యాలి. ఆ తర్వాత ఈ క్రింది ప్రకారంగా ధ్యానం చెయ్యాలి.

ధ్యానం:

ధ్యాత్వా దేవీం సిద్ధవిద్యాం మహాక్షీరాంతరేఅంబుధౌ|

రత్నద్వీపే లసత్స్వర్ణప్రాకారాభరణోజ్జ్వలే||

కల్పద్రుమవిశోభాఢ్యే సింహాసనసమన్వితే|

ఉద్యత్సూర్యసమాభాసాం విచిత్రవసనోజ్వాలాం||

చంద్రవ్రీడాలసద్దామనిరతాం రత్నభూషితాం|

సువర్ణకళశాకారస్తనభారోన్నతాం పరాం||

రుద్రతాండవసానందోద్ద్విభుజాం పరమేశ్వరీం|

వరదాభయశోభాఢ్యామన్నదానరతాం సదా||

 

మరియొక ధ్యాన శ్లోకం:

దక్షిణేదర్వీ దీర్ఘామ్ ధాయేత్సువర్ణజామ్|

దుగ్ధాన్నభరితం పాత్రం దివ్యరత్నవిభూషితాం||

వామహస్తే మహేశాని ధ్యాత్వైవమ్ పరమేశ్వరి||

 

పైవిధంగా ధ్యానం చేస్తూ తాండవ నృత్యం చేస్తున్న ప్రౌఢ రుద్రుడిని క్లీం బీజంతో పూజించాలి. ఐం బీజంతో విష్ణువును, సౌః బీజంతో బ్రహ్మను పూజించాలి.

షోడశదళముల పైన వారి శక్తులను పూజించాలి. ఆ తర్వాత షోడశదళములందు ఈ క్రింది దేవతలను పూజించాలి.

భవ, మోక్షదాయిని, భయహారిణి, గతిహంసి, చరాక్షి, నృపతీర్థ, మానదా, దేవదా, స్వర్ణదాత్రి, రిపునిక్రుంతనీ, అనర్థధ్వంసిని, నయనానందదాయినీ, పూతమూర్తి, ఋణఘ్ని, స్వామినీ, హరసుందరీ

పై దేవతలను పూజించిన తర్వాత అన్నపూర్ణా దేవిని పూచించాలి. ఆ తర్వాత వర్ణదేవీలను పూజించాలి. అష్టదళములలో బ్రాహ్మ్యాది అష్టమూర్తులను పూజించాలి. భూపురంలో లోకపాలకులను పూజించాలి. మళ్ళీ గంధపుష్పాదులతో అన్నపూర్ణాదేవిని పూజించాలి. నియమములను పాటిస్తూ మూలమంత్రమును ఒక లక్ష జపించాలి. అందులో దశాంశము పాయసము మరియు నెయ్యితో హోమము చెయ్యాలి.

ఈ విధానమైన అనుష్టానము వలన దేవీ అన్నపూర్ణ నిశ్చయముగా సిద్ధిని ప్రసాదించును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన అన్నపూర్ణావిధివివరణం అను ముఫైఒకటవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: