సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, ఏప్రిల్ 2022, మంగళవారం

షడధ్వములు

షడధ్వములు

శైవిజం ప్రకారము ఈ జగత్తు అంతా మూడు విధములు. ఇది మూడు మార్గములలో (=అధ్వము) కల్పించబడినది. స్థూల, సూక్ష్మ, పరా అనేవి ఈ మూడు మార్గములు. స్థూల మార్గమును భువనాధ్వ, సూక్ష్మ మార్గమును తత్త్వాధ్వ, పరా మార్గమును కళాధ్వ అని పిలుస్తారు. ఇక్కడ మార్గమునకు రెండు రకముల అర్ధములు కలవు. ఒకటి ఆ మార్గములో నడుచుట లేదా ఆ మార్గమును వదలివేయుట. మార్గమును వదలివేయుట అన్నది పరమాత్మ కరుణ వల్ల మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే ఆ కరుణను సాధించి మార్గమును జయిస్తామో (వదలివేస్తామో) అప్పుడు పరమశివ స్థితికి చేరుకుంటాము.

       మార్గములో పయనించడం వలన స్వరూప నిరూపణము అవ్వదు. సంవత్సరాలు, యుగాలనుండి పయనిస్తూనే ఉన్నాము. కనుక ఈ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఈ మార్గాన్ని త్యజించగలుగుతామో అప్పుడు “అధ్వా” అని చెప్పబడుతారు.

       భువనాధ్వ అనగా సర్వ ప్రపంచముల మార్గము అని అర్థము. శైవిజం ప్రకారము ఈ ప్రపంచములు 118. యోగులు తమ సమాధి స్థితిలో మొత్తం 118 విశ్వములు ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ మొత్తం 118 విశ్వములనూ కలిపి భువనాధ్వ అని అంటారు.

       ఇంతకు ముందు చర్చించబడిన 36 తత్త్వములను కలిపి తత్త్వాధ్వము అని చెబుతారు. అదియే తత్త్వ మార్గము.

       తత్త్వాధ్వము కన్నా నిర్మలమైనది కళాధ్వము. కళాధ్వముకు అయిదు ఆవరణలు/కళలు కలవు. ఆవియే నివృత్తి కళ, ప్రతిష్ఠా కళ, విద్యాకళ, శాంతాకళ, శాంతాతీత కళ. ఈ అయిదు ఆవరణలు/కళలు 36 తత్త్వములకు ఆవరణములు. ఈ అయిదు కళలలో మొదటిది నివృత్తి కళ. ఈ నివృత్తి కళలోనే పృధ్వీ తత్త్వము ఉంటుంది. ప్రతిష్ఠా కళలో జల తత్త్వము నుండి ప్రకృతి తత్త్వము వరకు మొత్తము 23 తత్త్వములు ఉంటాయి. విద్యా కళలో పురుష తత్త్వము నుండి మాయా తత్త్వము వరకు మొత్తం 7 తత్త్వములు ఉంటాయి. శాంతా కళలో శుద్ధవిద్య నుండి శక్తి తత్త్వము వరకు మొత్తము నాలుగు తత్త్వములు ఉంటాయి. శాంతాతీత కళలో ఒకే ఒక్కటి అదే “శివ తత్త్వము” ఉంటుంది.

       పై మూడు అధ్వములను కలిపి వాచ్యాధ్వములు అని అంటారు. ఇక్కడ వాచ్య అనగా “గమనించబడినది, మాట్లాడబడినది, తెలుపబడినది” అని అర్ధము. ఈ అధ్వములు దేనివలన సృష్టించబడినవో దానినే వాచకాధ్వ అని అంటారు. ఈ వాచకాధ్వ స్థూల, సూక్ష్మ, పర అని మూడు విధములు.

       స్థూల వాచకాధ్వను పదాధ్వ అని అంటారు. అనగా వాక్యములు. సూక్ష్మ వాచకాధ్వను మంత్రాధ్వ అని అంటారు. అనగా పదములు. పదములు వాక్యములకన్నా సూక్ష్మము అని మనకు విదితమే. అక్షరములను వర్ణాధ్వ అని అంటారు. అక్షరములు పదముల కన్నా సూక్ష్మము అని విదితమే.

పైన వివరింపబడిన ఆరు అధ్వాములనూ షడధ్వములు అని అంటారు.

కామెంట్‌లు లేవు: