సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, ఏప్రిల్ 2023, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 58

 

ధ్యానాదియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు –

చక్రమును చందనము లేదా రక్తచందనము లేదా కమల పత్రముల మీద ఉంచాలి. మరోవిధంగా ఉంచరాదు. ఇంతకు ముందు చెప్పిన విధంగా న్యాసములు చేసిన తర్వాత బ్రహ్మాండమండలమును ధ్యానం చెయ్యాలి. ఆ మండలము పృథ్వీ,జలము, అగ్ని, ఆకాశము మరియు చైతన్యముల ప్రకాశికము. అది చతురస్రము, ధనుషాకార త్రికోణము. అది మేరుమండల నిరాలంబముగా చెప్పబడినది. దానిమీద వాగ్బీజ రూపి, భ్రమరముతో యుక్తమైన వ్యాపక చక్రము ఉంది. శ్రీ శాంభవ జ్ఞానములో పరావాక్, వనస్పతి సంబంధించిన దానిలో మధ్యమా, సర్వ జంతువులందు పశ్యంతి, జ్ఞానయోగినులందు వైఖరీ - వాక్కులు. ఈ ప్రకారంగా సహస్రదళ కమలము వాక్పదముతో సంపన్నము. దీని మీద పరమపీయూష ఆశ్రయమున చక్రము కలదు. ఆ చక్రము చతురస్రము, షోడశదళము, 64 దళములు,100 దళములు, 1000 దళములు, లక్ష దళములు, కోటి దళములు, ఆకాశతలముల మీద శోభాయుక్తముగా, దేదీప్యమానముగా ఉంటుంది. దాని కర్ణికాపీఠ మధ్యమున చక్రేశ్వరీ ధ్యానము చెయ్యాలి. ఆ చక్రము మహా షడధ్వ జనకము మరియు విశ్వతోముఖము, దేదీప్యమానము.

      ఇప్పుడు షడధ్వములను తెలుపబడుతున్నవి. చక్రపత్రములందు పదాధ్వ, మూడు సంధులందు భువనాధ్వ, సర్వమంత్రవిజృభిత మాతృకాపీఠమున వర్ణాధ్వము ఉండును. ఈ చక్రము 36 తత్త్వములతో వ్యాప్తమై ఉన్నది. కళాధ్వము శ్రీచక్ర పంచసింహాసనమున ఉండును. అంత్య మరియు పరాతో యుక్తమై అది తొమ్మిది ప్రకారములుగా అవుతున్నది. ఆ షోడశవర్ణరూప కళా చక్రమునందు వ్యాప్తమై విస్తృతమైనప్పుడు అప్పుడు దానిని మంత్రాధ్వము అని అంటారు. ఈ విధంగా శ్రీచక్రమును షడద్ధ్వ సంచారీ రూపంలో ధ్యానం చెయ్యాలి.

     బిందు స్థానములో ముఖమును, ఆ కిందన రెండు స్తనములను, వాని కింద హకార, ఈకారములను ధ్యానము చెయ్యాలి. బిందు స్థానములో “మహాకోశేశ్వరీ బృందమండితాసన సంస్థితా సర్వసౌభాగ్యజననీ పాదుకాం పూజయామి” అని పరంజ్యోతి కోశాంబాను పూజించాలి. ఈ ప్రకారంగానే సాధకుడు పంచసుందరీలను పూజించాలి. సమస్త విషయములూ పరవస్తువునందు లీనమైపోయినట్లుగా భావించాలి. ఆమె సాత్మక వృత్తి మరియు సౌభాగ్యసుందరీ. మూడు బిందువుల సంయోగముతో ఆ బిందువులనందు త్రిపుర ఉండును. పై బిందువును త్రిపుర ముఖముగా, క్రింద ఉండు రెండు బిందువులనూ ఆమె స్తనములుగా భావించాలి. ఆ కింద పరాదేవిని అధోముఖ రూపంగా ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా కామకలా రూపం అవుతుంది. ఆమె సాక్షాత్ అక్షరరూపిణి. మూడు బిందువులు, ఒక అర్థబిందువులతో విశ్వమాతృకా అవుతున్నది. అందువలననే ఈ బిందువులను త్రిపురా శక్తిగా చెప్పబడుచున్నది. ఈ త్రిపురసుందరి ఇచ్ఛవలన సృష్టి అవుచున్నది మరియు లీనమవుచున్నది. ఆమెయే మహేశానీ. సాధకుడు ఈవిధంగా స్వయం చింతన చెయ్యాలి.

దేవిని ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

      అజాంతక మతంగ నామక ప్రకాశ పీఠమున ఉండు, 15 పడగలు కల సర్పమధ్యన కమలముమీద బైందవ పీఠమున, 16 దళముల కమలము మీద కామేశ్వరీ పీఠమున శివునితో కూర్చొని ఉన్న త్రిపురసుందరిని ధ్యానించాలి. ఆమె స్వరూపము ఈ విధంగా ఉంటుంది – ఆజ్ఞాచక్ర ఆలోకముతో పరిపూర్ణమై, బ్రహ్మ-విష్ణు- శివుల సాక్షిణి, ఆకారము నుండి క్షకారము వరకు వర్ణ అవయవ రూపిణి, మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు సన్నని తీగలాగా, ఉదయించు సూర్యుని కాంతికలిగి, జపాపుష్పమునకు సమానమైన రక్తవర్ణము కలిగి, అప్పుడే కాచిన బంగారు సదృశము కలిగి, దానిమ్మ పువ్వులకు సమానమైన ఉజ్జ్వలము కలిగి, చిన్న చిన్న సుగంధ పుష్పముల మాలతో శోభిల్లుతూ, కేతకీ పుష్పములు ధరించి, నీల భ్రమరము వంటి నల్లని కురులు కలిగి, మోతీ-మాణిక్య తిలకముతో శోభిల్లుతూ, రత్న రమణీయ ముకుటము, చంద్రబింబము వంటి ముఖము మీద అలక్తకము ధరించినది, చంద్రకలా వంటి సుందర తిలకమును ధరించినది, ధనస్సు వంటి కనుబొమ్మలు కలది, ఆకర్ణాంత నీలవర్ణ కన్నులు కలిగిన సుందరమైన దేవిని ధ్యానించాలి. 

2) హీరముక్తావళీరాజత్స్వర్ణతాటంకరాజితామ్|

కర్ణభూషణతేజోభిః కపోలస్థలమంజరీమ్||

ముఖాచంద్రోజ్జ్వలచ్ఛుకాకారమౌక్తికనాసికాం|

స్మితమాధుర్యవిజిటబ్రహ్మవిద్యారసప్రభాం||

రాక్తోత్పలదళాకారసుకుమారకరామ్బుజాం|

కరాంబుజనఖజ్యోత్స్నావితానితనభస్తలామ్||

సువృత్తనిబిబిడోత్తుంగకుచభాగశశిప్రభామ్|

నవముక్తామహాహారపదకోన్నతవక్షసం||

శాతోదరీమ్ నిమ్ననాభి క్షామమధ్యమసుందరీమ్|

అనర్ఘ్యరత్నఘటితమేకలాలగ్నకింకిణీం||

నితంబబింబసుభగామ్  రోమరాజివిరాజితామ్|

రక్తాంశుకస్ఫురత్తేజోవ్యాప్తత్రైలోక్యమండలీమ్||

దివ్యకంచుకసంరాజద్రత్నచిత్రవిచిత్రితాం|

కదలీలలితస్తంభసూక్ష్మోదరవిరాజితామ్||

నవరత్నస్ఫురత్తేజోమంజరీవ్యాప్తదేవతాం|

బ్రహ్మవిష్ణుమహేశానస్ఫురన్మౌలిపదాంబుజామ్||

కర్పూరశకలోన్మిశ్రతాంబూలాపూరితాననామ్|

ప్రవాళవల్లీఘటితపాశక్షౌమగుణాన్వితామ్||

ద్వితీయాచంద్రలేఖాఙ్కసృణిమాకర్షణక్షమామ్|

సద్విద్యాభ్రమరీభూతగుణాభిక్షుశరాసనామ్||

కమలాకారసమ్రాజత్పంచబాణాంశ్చ బిభ్రతీం||

3) మహామృగమదోదారకుంకుమారుణవిగ్రహామ్|

సర్వాభరణశోభాఢ్యామ్ సర్వాలంకారభూషితామ్||

సర్వదేవమయీం దేవీం సర్వమంత్రమయీం పరాం|

సర్వవర్ణమయీం దేవీం సర్వయంత్రమయీమ్మ్ పరాం||

సర్వతీర్థమయీం దేవీం సర్వశాస్త్రమయీం ప్రియే|

సర్వదేవ(వేద?)మయీం దేవీం సర్వాచారస్వరూపిణీం||

సర్వసౌభాగ్యజననీం సర్వసౌభాగ్యసుందరీమ్|

ఏవం ధ్యాయన్ మహాదేవీం కదంబవనమధ్యగామ్||

వహన్నాడీపుటాద్వాయోర్నిఃసృతాం చితయేత్తథా|

కామేశ్వరీం శివస్యాంకే స్థాపయేత్కులసుందరి||

పైవిధంగా ధ్యానం చేసి ముద్రలను మూడుసార్లు ప్రదర్శించి మూడుసార్లు తర్పణములు వదలాలి. తర్వాత మానసికంగా మరియు బాహ్యంగా ధూప, దీప, నైవేద్యములు మొదలగు సమస్త శుభ ఉపచారములతో దేవిని పూజించి మళ్ళీ ముద్రలను ప్రదర్శించాలి. ఆ తర్వాత దేవేశ్వరికి తర్పణములు సమర్పించి తిథి నిత్యా దేవతలను పూజించాలి. ఆ సమయంలో ఏ తిథి నిత్య ఉండునో ఆమెను పూజించాలి.

పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉన్న నిత్యలను ఏ సాధకుడైతే పూజిస్తాడో అతడు సౌభాగ్యవంతుడు మరియు మహాఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈ తిథి నిత్యలను వృద్ధి మరియు క్షయ క్రమంలో పూజించాలి. (శుక్లపాడ్యమి నుండి పౌర్ణమి మరియు కృష్ణ పాడ్యమి నుండి అమావాస్య). 16 స్వరములను ఐదేశీ చొప్పున మహాత్రికోణముగా భావించి పూజించాలి. మధ్యలో 16 నిత్య అయిన మహానిత్యను పూజించాలి. కామేశ్వరీ నిత్యతో మొదలుపెట్టి విచిత్రా నిత్య వరకు పూజించాలి. విమల మరియు జయిని (వాగ్దేవతలు) మధ్యలో గురు మండలమును పూజించాలి. దివ్యగురువులు పర, సిద్ధగురువులు పరాపర, మానవ గురువులు అపర అని చెప్పబడుతారు. వీరు వరసగా సప్తఋషులు, చతుర్వేదములు మరియు అష్టవసువులు. పురుష గురువులు పేరుకు చివర ఆనందనాథ, స్త్రీ గురువుల పేరుకు చివర అంబ అని చేర్చాలి.

కామరాజ గురువులు – పరాప్రకాశ, పరశివ, పరశక్తి, కౌలేశ, శుక్ల, దేవ్యంబిక, కులేశ్వర, కామేశ్వర్యంబిక, యోగ, క్లిన్న, సమయ, సహజ, గగన, విశ్వ, విమల, మదన, భువన, లీలాప్రియ|

లోపాముద్ర మరియు అగస్త్యుల గురువు పరంపర ఈ విధంగా ఉంటుంది. ప్రథమ గురువు శివ. వారి తర్వాత కామేశ్వర్యంబిక, దివ్యౌఘ, మహౌఘ ఉంటారు. ఇప్పుడు ప్రజ్ఞాదేవీ ప్రకాశకలను తెలుపబడుతున్నది. – దివ్య, చిత్ర, కైవల్య, దేవ్యంబా మహోదయ. చిదీశ్వర, విశ్వేశ్వర, శక్తీశ్వర, కమల, మనోహర, పర, ఆత్మా, ప్రతిభా – వీరు మానవౌఘ గురువులు.

ఆ తర్వాత ప్రకాశ మరియు పరవిమర్శ ఉండును. ఆ తర్వాత కామేశ్వరీ అంబ ఉండును. మోక్ష, అమృత, పురుష – వీరు అఘోరలు. వామ, సద్గురు, సిద్ధౌఘ – వీరు క్రమంగా ఉత్తములు. ఉద్భవ, పరమ, సర్వజ్ఞ, స్వస్థ, సిద్ధ, గోవింద, శంకర – వీరు మానవౌఘ గురువులు. గురుపరంపరా రహితంగా పూజ చేసిన సాధకునకు మహా హాని కలుగుతుందనటులో ఎటువంటి సంశయము లేదు. సిద్ధికొరకు గురువుకు మూడుసార్లు అలిపాత్రతో పూజచెయ్యాలి. గురుమంత్రము మరియు గురునామముతోనూ గురువును పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ధ్యానాదియజనవిధివివరణం అను యాభైఎనిమిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: