సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, మే 2023, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 62

 

విద్యాప్రయోగబీజసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు చక్రరాజము యొక్క సాధన చెప్పబడుచున్నది. సిద్ధవిద్య వినియోగక్రమము ఈ విధంగా ఉండును.

1.         సిందూరముతో చక్రమును నిర్మించి దాని మధ్యలో సాధ్య స్త్రీ యొక్క గోత్రము, నామము మరియు ఆకృతిని ధ్యానించాలి. ఒక్క క్షణంలో ఆమె భయరహితమై నిర్లజ్జయై సాధకుని చెంతకు వచ్చును.

2.         చక్రములో సాధ్యను సౌభాగ్య సుందర రూపంగా ధ్యానం చెయ్యాలి. యోనిముద్రను ధరించి అరుణ ఉపచారములతో దేవిని పూజించాలి. ఎవరి పేరు మీద ఆ పూజ అవుతుందో వారు సాధకుడు కోరిన విధంగా ప్రవర్తిస్తారు.

3.         సాధకుడు యోనిముద్రను ధరించి అదృష్ట స్త్రీ నామమును చక్రములో లిఖించాలి. దీనివలన దేవకన్య, రాజకన్య, నాగకన్య తీవ్ర ఆకర్షణకులోనవుతారు.

4.         గోరోచనము, కుంకుమ సమభాగం తీసుకొని అందులో సమభాగం చందనము కలపాలి. దానిని మంత్రము పఠిస్తూ 108సార్లు మంత్రించాలి. ఆ మిశ్రమాన్ని తిలకంగా ధరిస్తే సర్వులూ మోహింపబడతారు.

5.         జపము ద్వారా మంత్రించబడిన పుష్పము, ఫలము, జలము, అన్నము, గంధము, వస్త్రము, ఆభూషణము, తాంబూలము ఎవరైనా పురుషునికి ఇచ్చి అతడు వాటిని ప్రయోగించి ఏ స్త్రీని చూస్తాడో ఆ స్త్రీ ఆ పురుషునికి దాసీమాత్రురాలవుతుంది.

6.         ఎర్ర గన్నేరు పుష్పములను త్రిమధురములతో కలిపి పూజ చెయ్యాలి. ఒక నెల వరకు సాధ్య స్త్రీని ధ్యానించాలి. అప్పుడు ఆ స్త్రీ వశమవుతుంది.

7.         సిందూరముతో నిర్మించిన చక్రములో అరుణప్రభా మహేశానిని పూజించాలి. దీనివలన ఒక క్షణంలో రాజు సమ్మోహితుడవుతాడు. ఈ ప్రయోగము వలన సాధకుడు త్రైలోక్యదుర్లభ రంభను కూడా ఆకర్షించగలుగుతాడు.

8.         చితి బొగ్గుతో సాధకుని రక్తము ద్వారా చక్రమును లిఖించాలి. ఆ చక్రమును భుజము లేదా శరీరములో ఎక్కడైనా ధరించినచో జ్వర రోగము నెమ్మనెమ్మదిగా పోతుంది.

9.         జిల్లేడు కొమ్మతో జిల్లేడు, వేప రసముతో చక్రమును నిర్మించి దాని మధ్యలో గాని, బయటగాని శత్రువుల (ఇద్దరవి) రాసి ఆ చక్రమును గోమూత్రములో ఉంచినచో ఒక్క క్షణంలో ఆ ఇద్దరి శత్రువుల మధ్య విద్వేషణము కలుగును.

10.    పైన చెప్పిన యంత్రమునకు రాత్రి సమయంలో చందన ధూపము చూపాలి. యంత్రమును వస్త్రములో ఉంచాలి. 108సార్లు అభిమంత్రించినచో మూడులోకములనూ మోహగ్రస్తము చేయగల శక్తి వస్తుంది.

11.    గోమయముతో భూమిని అలికి దానిమీద గోరోచనముతో యంత్రమును లిఖించాలి. దాని మీద సుందర, సురూప, ఆభూషణములు ధరించిన ప్రతిమను ధ్యానించాలి. ఆ ప్రతిమయొక్క కేశములు, గళము, హృదయము, నాభి, యోని, అంగసంధులందు కామకూటమును లిఖించాలి. సాధ్య ఉండు దిశవైపు ముఖము ఉండునట్లుగా కూర్చొని శరీరమున శ్రీవిద్యా న్యాసము చేసి, క్షోబిణీ బీజము (=మ) మరియు క్షోభిణీ ముద్రా ద్వారా విద్యా (=మంత్రమును) 108సార్లు జపము చెయ్యాలి. దీనివలన త్రైలోక్యసుందరీ (=సాధ్య సుందరి) క్షణములో సాధకుని చెంతకు వచ్చును.

12.    చక్రము చుట్టూ మాతృకలను లిఖించి చక్రమును చక్కగా పూజించాలి. మంత్రించి దానిని ధరించాలి. అది సర్వ దుష్ట వ్యాఘ్రాదులను దూరం చేయును.

13.    చందనము, అగరు, కస్తూరి, కర్పూరము, పుష్పముల ద్వారా సాధకుని నామము లిఖించాలి. మాతృకలను పూర్వ క్రమంలో రాయాలి. దీనితో సాధకుడు అజరామరుడు అవుతాడు.

14.    ఈ విధంగానే గోరోచన, అగరు, కుముమలతో చక్రమును లిఖించి దాని మధ్యలో సాధ్య నామమును రాసి గళము లేదా ఎక్కడైనా ధరించినచో సాధకుడు త్రైలోక్యములను ముగ్ధపరచగలుగుతాడు.

15.    త్రికోణమధ్యలో సాధ్య నామాక్షరములలో ఒకొక్క అక్షరమును కామకూటముతో జోడించి, బయట మాతృకలను చుట్టూ రాసి, బంగారము మీద ఉంచి దానిని శిఖా లేదా అన్యత్ర స్థానాలలో ఎక్కడైనా ధరించినచో లోకపాల రాజు లేదా మూడులోకములలో ఉన్న దుష్ట ఆత్మలు మరియు సన్నిపాత జ్వరములు వశమవుతాయి.

16.    పై విధంగా సాధ్యనామము లేదా సాధ్యనగరనామము సందర్భితము చేసి యంత్రమును నాలుగురోడ్ల కూడలిలో పూర్వాది దిశలో క్రమంగా విసిరేయ్యాలి. దానితో రాజు, కింకరులు సౌభాగ్యవంతులు అవుతారు.

17.    సాధకుడు ఆరు మాసముల వరకు చక్ర మధ్యలో స్ఫురత్తేజోమయి, చరాచరత్తును ప్రజ్వలింపచేయునది ధరతీను ధ్యానం చేసినచో ఆ సాధకుడు కామదేవ సమానముగా సుందరుడవుతాడు. అతడు తన చూపు ద్వారా లోకులను ఆకర్షించ్గలుగుతాడు. ఈ ప్రయోగము విషము మరియు జ్వరమును కూడా నాశనము చేస్తుంది.

18.    సిందూరముతో లిఖించిన యంత్రమును ఏకాగ్రచిత్తముతో రాత్రి సమయంలో పూజించాలి. అది 100యోజనముల దూరంలో ఉన్న వ్యక్తినైనా ఆకర్షించగలుగుతుంది.

19.    దిక్కులు మరియు కోనములలో అఖండ పూజ చెయ్యాలి. దానితో లోకులందరూ వశమైపోవుదురు.

20.    గోరోచనము, అగరు, కుంకుమలతో భోజపత్రము మీద చక్రము నిర్మించాలి. దాని చుట్టూ సాధకుని నామమును లిఖించాలి లేదా భూమి మీద చక్రమును ఉంచాలి. ఆ తర్వాత మంత్రముతో ఆ చక్రమును ధరించినచో అతడు నగరమును క్షుబ్దము చేయగలుగుతాడు.

21.    ధత్తూర రసము, లాక్షా, జిల్లేడు పాలౌ, కుంకుమ, గోరోచనము, కస్తూరి, అలక్తకములను కలిపి యంత్రమును నిర్మించాలి. ఎవరి పేరుమీద యంత్రమును నిర్మిస్తారో అతనికి చోరులు, వ్యాఘ్రములు, శత్రువులు, సింహములు, గ్రహములు, వ్యాధులు, సర్పములు, ఉడుకు నీరు మొదలగు వానివలన భయము కలగదు. అతడు ఒక్క క్షణంలో అందరినీ ముగ్ధులను చెయ్యగలుగుతాడు.

22.    గోరోచనము, కుంకుమలతో చక్రమధ్యన విద్యను (మంత్రమును) లిఖించాలి. అక్కడే త్రికోణము, అభయగామినీని లిఖించాలి. కిందన సాధ్య నామము రాయాలి. ఆ చక్రమును ఎవరు ధరిస్తారో ఒక వారంలో అతడికి సాధ్యుడు కింకరుడు అవుతాడు.

23.    పసుపు ద్రవ్యముతో చక్రమును లిఖించాలి. దాని కింద మంత్రమును లిఖించాలి. సాధ్య నామము లిఖించి యంత్రమును తూర్పు దిక్కు వైపు వెయ్యాలి. దానితో బ్రహ్మ, బృహస్పతి, సర్వజ్ఞకూడా మూగవారైపోతారు.

24.    అదేవిధంగా నీలముతో యంత్రమును నిర్మించాలి. దక్షిణము వైపుగా ముఖము పెట్టి ఆ యంత్రమును అగ్నిలో వేడిచెయ్యాలి. దానితో శత్రువులు కాలిపోతారు.

25.    గేదె మరియు గుర్రముల మలము మరియు గోమూత్రములతో యంత్రమును లిఖించాలి. ఆ యంత్రమును ఆరనాలములో (=దీనితో గంధము ఉత్పన్నమవుతుంది) ఉంచాలి. దీనితో ఒక్క క్షణంలో విద్వేషణము అవుతుంది. గోరోచనముతో యంత్రమును నిర్మించాలి. కాకి ఈకతో యంత్ర మధ్యలో సాధ్య నామము లిఖించాలి. ఆయంత్రమును ఆకాశ మార్గంలో ఎగురవేయాలి. దీనితో శత్రువుకు శీఘ్రంగా ఉచ్చాటన కలుగుతుంది. దీనిని హఠోచాటన అని అంటారు.

26.    నీల రసములో గోరోచనము, పాలు, లాక్షరసము కలిపి చక్రమును నిర్మించాలి. దానిని ధరించిన సాధకునకు నాలుగు వర్ణముల వారూ వశమవుతారు.

27.    పైవిధంగా నిర్మించిన యంత్రమును జలములో ఉంచి ఆ జలముతో స్నానము చేసి, తాగినచో సాధకునకు మహాసౌభాగ్యము కలుగుతుంది. ఇందులో సందేహము లేదు.

28.    పసుపు చక్రమును తూర్పు దిక్కులో పూజించాలి. దీనితో సాధకుడు సమస్త వాదగణమునూ స్తంబింపచేస్తాడు.

29.    సిందూరముతో నిర్మించిన చక్రమును ఉత్తర దిశలో ఉంచి పూజించితే లోకములు వశమౌతాయి.

30.    పశ్చిమదిశలో చక్రమును పూజించితే దేవతాలోకములు సాధకుని వశమవుతాయి.

31.    దక్షిణదిశలో చక్రము పూజించితే సాధ్యునికి మంత్రహాని మరియు మరణము కలుగుతుంది.

32.    అగ్న్యాది కోణములలో చక్రమును పూజిస్తే సాధ్యునకు క్రమంగా స్తంభన, విద్వేషణ, వ్యాధికరణ, ఉచ్చాటన కలుగును.

33.    గోరోచనముతో లిఖించిన యంత్రమును పాలలో ఉంచితే వశీకరణ అవుతుంది.

34.    అదే యంత్రమును అగ్నిలో హోమం చేస్తే సమస్త శత్రువులు నాశనమవుతారు.

35.    అదే యంత్రమును గోమూత్రములో ఉంచితే శత్రువుకు ఉచ్చాటన కలుగుతుంది.

36.    యంత్రమును మజ్జిగలో ఉంచితే విద్వేషణ కలుగుతుంది.

37.    యంత్రమును నిర్జన నాలుగురోడ్ల ప్రదేశములో లిఖించాలి. చక్ర బయటనుండి ప్రారంభించి లోపల మధ్య వరకు మాతృకలను లిఖించాలి. కులాచారానుసారంగా ఆ యంత్రమును రాత్రి సమయంలో పూజించాలి. దీనీతో సాధకునికి ఖేచరీ సిద్ధి కలుగుతుంది. ఇందులో సందేహము లేదు.

38.    చతుర్దశి రోజున శ్మశానములో చక్రపూజ చేసినచో ఆరు మాసములలో సాధకుడు సాక్షాత్ రుద్రుడవుతాడు. అంతేకాకుండా అంజనసిద్ధి, గుటికాసిద్ధి, పాదుకాసిద్ధి, ఖడ్గసిద్ధి, బేతాళసిద్ధి సౌభాగ్యసిద్ధి, యక్షిణీసిద్ధి, చేటకసిద్ధి మరియు ఇతర సిద్ధులూ ప్రాప్తిస్తాయి.

39.    ప్రత్యేకంగా చతుర్దశీ, నవమీ లేదా అష్టమీ తిథులలో 21రాత్రుల బాటు ప్రేతశిలా పైన శ్రీచక్ర పూజ చేసినచో ఆ సాధకుడు దేవతలకు పూజ్యుడవుతాడు.

40.    పైవిధంగా చేసిన సాధకుడు పురుషనిర్మిత పాశము, అంకుశము, ధనస్సు, బాణములతో కామస్వరూపుడై స్వర్గము, పాతాళలోక స్త్రీలకు హర్తా, కర్తా మరియు ఆకర్షకుడు అవుతాడు.

41.    అదే ప్రకారంగా మూడులోకములలో దేవీ స్వరూపుడై కామేశ్వరీ శస్త్రముల ద్వారా లోకులను ఆకర్షిస్తాడు. రాజు అతడి కింకరుడవుతాడు.

హే దేవీ! వాగ్భవ కూటమును ఆరాధించిన మాత్రమున సాధకుడు సారస్వత జ్ఞాని అవుతాడు. శ్వేత వస్త్రములు, శ్వేత ఆభూషణములతో అలంకరించబడి ఉన్న దేవిని శ్వేత పుష్పములతో ఆరాధిస్తే అది వాగ్భవ ఆరాధన అవుతుంది.

హే దేవీ! ఇప్పుడు సమస్త కామకలా గురించి వినుము – కామ, మన్మథ, కందర్ప, మకారధ్వజ, మహాకామ – వీరు పంచ కాములు. మంత్రస్వరూపము – క్లీం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం స్వాహా|

మూలాధారము నుండి సహస్రారము వరకు (సృష్టి[=లింగము] నుండి సంహారము[=మస్తకము]వరకు) తామరతూడులోని దారములాగా సన్నగా కుండలినీ శక్తి ఉంటుంది. త్రికూట త్రిపురా దేవి సమస్త సిద్ధులను ప్రసాదిస్తుంది. ఈ చక్రములో 64కోట్ల యోగినులు ఉండి సజ్జనులకు సిద్ధిని ప్రసాదించును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన విద్యాప్రయోగబీజసాధనవిధివివరణం అను అరవైరెండవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: