సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, మే 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 63

 

దీక్షాదూతీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఇప్పుడు మూడులోకములలోనూ దుర్లభమైన దీక్షా విధానము తెలుపుచున్నాను. సావధానముగా వినుము.

ముందుగా శ్రీచక్రమును నిర్మించి చక్రమధ్యలో పరదేవి త్రిపురాని పూజించాలి. ముందు అంగదేవతలను పూజించాలి. త్రికోణములో రత్యాదులను పూజించాలి. అష్టారపత్రములో అష్టమాతలను, నవయోనులలో వామాదులను పూజించాలి. వీరు క్రమంగా – నిత్యా, నిరంజనా, క్లిన్న, క్లేదినీ, మదనాతురా, మదద్రవా, ద్రావిణీ, రుచిరా, రాగవతీ. ఆ తర్వాత 16కలల దేవిలను పూజించాలి. వారు క్రమంగా – కామేశ్వరీ, కామదీపినీ, కా(వా?)మేశ్వరీ, లలితా, క్షోభిణీ, భద్రా, స్వచ్ఛందలలితా, హుంకారి, భీమచారా, కమలా, కమలేశ్వరీ, నీలగ్రీవా, విశాలాక్షీ, భేరుండా, డామరేశ్వరీ, త్రిపురా.

      ఆ తర్వాత ఇరవై యోనులు – మాయావతీ, మహాక్షీ, సర్వవశంకరి, సమయా, సమయేశానీ, నిత్యానందా, మహోదయా, సర్వసౌభాగ్యదా, నందా, చంద్రికా, చంద్రశేఖర, సర్వేశ్వరీ (ఇక్కడ 12 పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి. మిగిలినవి మూలములో అలబ్దము). అష్టదళములో పీఠములను పూజించాలి. భూపురములో త్రిపురేశీని ఉంచాలి. ఆమెకు సమీపంలో ధ్యాన ఆధారమును నిర్మించి కలశమును ఉంచాలి. విశేష గంధ, పుష్పములు మరియు శ్రేష్ఠ రత్నములతో పూజ చెయ్యాలి. ఆ తర్వాత ఆచార్యుడు చక్రరాజమును స్థాపించి చక్కగా పూజ చెయ్యాలి. దీక్ష్య ఆది అక్షరముతో సాధకునికి, గురువుకు అభేదము భావించి సుందర నామమును కల్పించాలి. సమస్త గురువులను ప్రమాణపూర్వకంగా స్మరించాలి. భూమి మీద మంత్రమును లిఖించి పుష్పాదులతో పూజించాలి. వందసార్లు మంత్రమును జపించి భూమి మీద లిఖించిన మంత్రమును శిష్యునకు చూపించాలి.

---------------- మంత్రమును గురువు ఒకసారి ఉచ్చరించి శిష్యుని కుడి చెవిలో జపము చెయ్యాలి. షోడశీ అను పేరుగల పరావిద్యను రాజ్యమునిచ్చే రాజుకైనా, ప్రాణమిచ్చే పుత్రుడకైనా ఇవ్వరాదు. ఈ విధంగా ఖేచర నామక శాంభవ విద్యను ఉపదేశించాలి. ఉపదేశమును నిర్వచించలేము. గురువు స్పర్శ మాత్రముచేత శిష్యుడు బ్రాహ్మణుడవుతాడు. ఆ తర్వాత కలశములో ఉన్న పల్లవములతో దీక్ష్య శిష్యుడను మూడుమార్లు ప్రోక్షణ చెయ్యాలి. అప్పుడు శిష్యుడు అభిషిక్తుడవుతాడు. ఆ తర్వాత గురువు శిష్యునకు గండూషము (=ముఖము నందు ఉంచే జలము) ఇవ్వాలి. అప్పుడు శిష్యునకు శివార్చనా యోగ్యత కలుగుతుంది. శిష్యుడు గండూమును స్వీకరించే సమయంలో తడబడినా, విముఖత చూపినా, అనుమానపడినా శిష్యునకు ఎన్నటికీ సిద్ధి కలగదు మరియు శ్రీవిద్య కూడా పరాఙ్గ్ముఖమైపోతుంది. గురువు శిష్యుని యొక్క అజ్ఞానమును ప్రక్షాళన చెయ్యడమే దీక్ష.

      శిష్యుడు దీక్షితుడు అయిన తర్వాత దూతీయాగము చెయ్యాలి. ఈ క్రమంలో ముందుగా విశేషార్ఘ్య విధి చెయ్యాలి. అప్పుడు దూతీని తీసుకురావాలి. ఆ దూతీ సమయాచార విధి ప్రకారం అలంకృతమై ఉండాలి. ఆ దూతీ సుందర ముఖము కలది, అష్టక్షేత్ర కులములో జన్మించినది, తరుణి, సుందర నేత్రములు కలది, ఆనందంగా ఉన్నది అయి ఉండవలెను. కురూపి, అంగహీన, వికృతరూపి, అధికాంగములు కలది, వృద్ధ, విధవ, పరిత్యక్తా, భక్తిరహిత, ముమారీ, క్రోధి, దుఃఖి, ద్వేషిణి, అనుష్ఠానరతాను దూతీగా ఆహ్వానించరాదు. “భగమాలా” మంత్రమును ఉచ్చరిస్తూ ఆమె యోనిని పూజించాలి. అక్కడ నవచక్ర క్రమంలో వర్ణించబడిన విధంగా శ్రీవిద్యా పూజ చెయ్యాలి. సాధకుని లింగమున కామశాస్త్రవిశారదా, కామేశ్వరీస్వరూప, షోడశాక్షరీ విద్యా పూజ చెయ్యాలి.

      ఆమె యోనియందు “కామేశ్వరం ప్రవేశ్యామి” అని పలికి ఓంకార పీఠమున పరాపీఠనివాసినీ త్రికూట హృత్కలా మంత్రమును జపించాలి. (హృత్కలా మంత్రము – ఓం ఐం క్లీం ఐం ఓం నమః శివాయ?). తరువాత సాధకుడు నవచక్రేశ్వరీ మంత్రంతో స్వాధిష్ఠానంలో పూజ చెయ్యాలి. మైథున క్రియా సమయంలో ఉత్పన్నమయ్యే శబ్దములు, భాషణములను జపముగా చెప్పబడును. చుంబనము ఆనంద ప్రణామము, కుచమర్దనము శివార్చనము, నఖక్షత, దంతక్షతములు పుష్పమాలాదులు, తాడన హోమము, వీర్య త్యాగము పుష్పావిసర్జనములుగా తెలుసుకోవాలి. యోని మీద పడిన వీర్యమును తీసుకొని విశేషార్ఘ్య పాత్రలో వెయ్యాలి. కులాచారము ప్రకారము ఆ అమృతమును శ్రీదేవికి తర్పణము చెయ్యాలి. అత్యంత మంథనము నుండి ఉత్పన్నమయ్యే మలము, మూత్రము, స్త్రీరజస్సు, నఖము, ఎముక, వీర్యములు ముఖ్య కులద్రవ్యములు. సాధకుడు భైరవుడు అయినచో అతడికి సిద్ధి లభిస్తుంది. ఇందులో సందేహము లేదు.

     నిర్వికల్ప మంత్రవేత్త సాక్షాత్ బ్రహ్మ అవుతాడనుటలో సందేహం లేదు. కామ్య మరియు నైమిత్తిక కర్మలను తెలుసుకొని శ్రీవిద్యను సంతృప్తి పరచాలి. ఇందులో దీక్షితునికి మాత్రమే అధికారము ఉంది. అన్యులకు లేదు. పుస్తకంలో రాసినది చదివి లేదా స్వయంగా అర్ధం చేసుకొని ఎవరు ఈ అనుష్ఠానం చేస్తారో వారికి బ్రహ్మహత్యా, సురాపాన, స్వర్ణచోరత్వము మొదలగు మహాపాపములు చుట్టుకొనును అనుటలో ఎటువంటి సందేహము లేదు. అతడు నరకమునకు పోవును.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన దీక్షాదూతీవిధివివరణం అను అరవైమూడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: