సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, మే 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 61

జపహోమవివరణం

పార్వతి మహాదేవుడిని అడుగుచున్నాది – హే దేవ! మీరు హోమాదులను సంకేతమాత్రంగా సూచించారు. కానీ విస్తారంగా చెప్పలేదు. సాధకుల హితముకొరకు మరియు వారి సిద్ధి కొరకు హోమాదులను విస్తారంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

పార్వతీ దేవి అడిగిన దానికి మహాదేవుడు ఈ క్రింది విధంగా సమాధానం చెప్పుచున్నాడు.

      సాధకుడు సమాహితుడై శమీ, దూర్వా, కుశా, రావి, మదార (జిల్లేడు) ఆకులతో చేయబడిన శ్రీచక్రమును ఒక మాసం పూజించాలి. ఆ విధంగా చెయ్యడం వలన అతడు ఒక జన్మలో చేసుకున్న పాపముల నుండి విముక్తుడవుతాడు. బంగారు వర్ణ చంప పుష్పములతో పూజిస్తే రాజు అవుతాడు మరియు కోటిజన్మల పాపము నుండి విముక్తుడవుతాడు. సముద్రమంత పృథ్వీ లభించి సుఖవంతుడవుతాడు. వెండి వర్ణ చంప పుష్పములతో పూజిస్తే అతడు బుద్ధివంతుడై సర్వత్ర విజయీభవుడవుతాడు.

      నంది లేని స్వయంభూ బాణశివలింగ మందిరంలో కూర్చొని మంత్ర జపం చెయ్యాలి. ముత్యము, రుద్రాక్ష, కమలగట్ట (=?), స్పటిక, మాణిక్య, పద్మరాగములతో చేయబడిన మాలతో ఒక లక్ష జపం చెయ్యాలి. అప్పుడు భూచర రాక్షస గణము విఘ్నములను సృష్టించును. సాధకుడు ఎంతమాత్రమూ చలించకుండా ఉండి నియమపూర్వకంగా మూడు లక్షలు జపము చెయ్యాలి. జపము మానసిక లేదా వాచిక లేదా ఉపాంశు రూపంలో చెయ్యవచ్చు. మానస ఉచ్చారణ కోటిరెట్లు ఫలమును ఇచ్చును. ఉపాంశు ఉచ్చారణ వాచిక ఫలమునకు నూరు రెట్లు ఫలమునిచ్చును. వాచిక జపము స్వమాత్ర అనగా ఎంత జపసంఖ్య ఉంటుందో అంతే ఫలమునిచ్చును. శ్రీగురు ఆజ్ఞానుసారముగా జపములో పదవవంతు త్రిమధు మిశ్రిత మోదుగ పువ్వులు గానీ కుసుంభ పుష్పములతో గానీ హోమం చెయ్యాలి. దీనివలన అవిద్య నాశనమయ్యి విద్యా సిద్ధి కలుగుతుంది.

      హోమకుండమును యోని/భగ/గోళ/అర్ధచంద్రాకార/ నవత్రికోణ చక్రము/చతురస్రము, పద్మముగా నిర్మించాలి. ఒకొక్క కుండమునకు ఫలితము ఈ క్రింది విధంగా ఉండును.

యోని కుండము – వాక్పతి| భగ కుండము – ఆకర్షణ శక్తి| గోళ కుండము – లక్ష్మీ ప్రాప్తి| అర్ధచంద్ర కుండము – పై మూడు సిద్ధులు| నవకోణము – ఖేచరి సిద్ధి| చతురస్రము – శాంతి, పుష్టి, లక్ష్మి, ఆరోగ్యము, సుఖము మొదలగు సమస్త శుభఫలములు. పద్మ కుండము – దశ సిద్ధుల ప్రాప్తి|

త్రిమధురయుక్త మల్లికా, మాలతీ పువ్వులతో హోమం వలన సాధకుడు పృథ్వికి స్వామి అవుతాడు. నేతితో తడిపిన కరవీర (=గన్నేరు) లేదా జపాకుసుమ పువ్వులతో హోమం వలన స్త్రీలు వశమవుతారు. కర్పూరము, కుంకుమ, కస్తూరి కలిపి హోమమ చేస్తే కామ సౌభాగ్యవంతుడు అవుతాడు. చంపా, పాటల పుష్పములు, మామిడిపండు మరియు ఇతర ఫలములతో ఒక వారము గానీ ఒక మాసము గానీ హోమం చేసినచో లక్ష్మీ దేవి స్వయంగా వచ్చును.

      చందనము, అగరు, కర్పూరము, గుగ్గులములతో హోమం వలన సమస్త సుందరీమణులూ లభించును. త్రిమధురయుక్త మాంసముతో హోమం వలన ఖేచర రత్నము లభిస్తుంది. పెరుగు, పాలు, నెయ్యి, మధువు, పేలాలతో హోమం చేస్తే అకాలమృత్యువు కలగదు. సాధకుడు సమాహితుడై విద్యను తొమ్మిది లక్షలు జపించాలి. జపములో దశాంశము హోమం చేస్తే ఆ సాధకుడు స్వర్గము, భూలోకము, పాతాళలోకములను వశపరచుకోగలడు. ఆవాలు, ఉప్పుతో హోమం చేసిన సాధకుడు పృథ్విని క్షోభింపగలుగుతాడు. పెరుగుతో 108సార్లు హోమం చేస్తే అకాలమృత్యును దూరం చేయును. నెయ్యి మరియు పాలతో హోమం వలన ఆయుస్సు పెరుగుతుంది. మధువు, నెయ్యి, గుగ్గులంతో హోమం వలన రాజు వశీకరమవుతాడు.

      నెయ్యి, దూర్వలతో 108సార్లు హోమం చేస్తే ఆరోగ్యము లభిస్తుంది. గుగ్గులము, ఎర్ర గన్నేరు, మధువు, నెయ్యి కలిపి ఒక లక్ష ఆహుతులిస్తే 20రాజులు వశమవుతారు. మధువులో కలిపిన గన్నేరు పుష్పములతో హోమం వలన పరివారసహితంగా రాజు వశమవుతాడు. ఏడు రాత్రులవరకు శశి(=కర్పూరము) తో హోమం చేస్తే ముందు చెప్పబడిన ఫలితం లభిస్తుంది. పాటల, జూహీ (=జాజిమల్లే), కుంద, కమల, జాయ, మాలతి, నవవల్లి, మల్లి, పద్మ, మోదుగ పువ్వులను కలిపిగానీ వేరువేరుగా గానీ పూజ, హోమము చేస్తే సాధకుడకు సమస్త సౌభాగ్యములు లభిస్తాయి మరియు బుద్ధిలో బృహస్పతి అవుతాడు. ముచకుంద(=?), మారేడు పత్రములు -ఫలములు, నీలకమలములు, తగరు(=నందివర్ధనము), రాజచంపాలతో హోమం చేస్తే అష్టసిద్ధులు లభిస్తాయి. కొబ్బరి, ఖర్జూరము, ద్రాక్ష, మామిడిపళ్లతో హోమం వలన సాధకుని మనోభిలషిత కార్యము సిద్ధిస్తుంది. పూజ మరియు హోమంతో శ్రీవిద్యను సంతృప్తి పరచాలి. కుమారీలను, గురువును, సుందరీమణులను, సజ్జనులకు, సాధుజనులకు ధనము ఇచ్చి సంతృప్తిపరచాలి.

      హోమకార్యములో పువ్వులను పూర్తిగా, గుమ్మడికాయను ముక్కలుగా సమర్పించాలి. ప్రసన్న మనస్సుతో కొబ్బరినీళ్లు, మామిడి, రేగుపండులను హోమంలో సమర్పించాలి. పనసపండు లోపల ఉండు తొనలను మధువులో కలిపి హోమము చెయ్యాలి. నేరేడు మరియు ఎండుద్రాక్షలను పూర్తిగా (ముక్కలు చేయకుండా) హోమం చేయాలి. అరటిపండు మరీ చిన్నది కాకపోతే ముక్కలు చేసి హోమం చెయ్యవచ్చు. చిన్నపళ్లను పూర్తిగా హోమం చెయ్యాలి. కస్తూరి, కుంకుమ, కర్పూరము, గురువింద ఫలములతో కూడా హోమము చెయ్యవచ్చును. తిలలు మరియు ఆవాలను తక్కువులో తక్కువ 100సార్లు (ఒకొక్క పిడికిలి చొప్పున)హోమం చెయ్యాలి. అదేవిధంగా ఉప్పు మరియు పేలాలను ఒక పిడికిలి హోమం చెయ్యాలి. ఉడికించిన అన్నమును కూడా ఒక పిడికిలి హోమం చెయ్యాలి. బెల్లము, నెయ్యి ఒకే పరిమాణంలో హోమం చెయ్యాలి. వీటికి నాలుగురెట్లు అధికంగా పెరుగు మరియు పాలతో హోమం చెయ్యాలి. సమస్త ఆహుతుల పరిమాణము మనస్సుకు ఆహ్లాదంగా ఉండాలి.

     ఇప్పుడు మహావిఘ్ననాశక పూజా పద్ధతి తెలుపబడుచున్నది. కుండము 24అంగుళముల విస్తారము, పొడవు, లోతు ఉండాలి. ఒక అంగుళము వదలి మూడు మేఖలాలను నిర్మించాలి. అవి క్రమంగా ఆదిత్య (12), వాసు (8), వేదములు (4) అంగుళముల ఎత్తులో ఉండాలి. కుండమునకు పశ్చిమభాగంలో సులక్షణ యోనిని నిర్మించాలి. అది 12 అంగుళముల పొడవు, 8 అంగుళముల వెడల్పు ఉండాలి. మధ్యలో 6 అంగుళముల గుహ్య విద్యను నిర్మించాలి. అన్ని కుండలములనూ ఇవే పరిమాణంలో నిర్మించాలి.

      నీళ్ళు లేదా గోమయముతో అలికిన ఈ కుండములో తూర్పు నుండి పశ్చిమం వరకు మూడు రేఖలు, దక్షిణం నుండి ఉత్తరం వరకు మూడు రేఖలు గీయాలి. ప్రణవముతో అభ్యుక్షణ చేసి మధ్యలో యాగవిష్టరమును (=ఆసనము) ఉంచాలి. దానిపైన ఇసుక జల్లాలి. దానిపైన ఒక త్రికోణమును, దానిపైన అష్టదళమును, దానిపైన భూపురమును నిర్మించాలి. ఆ తర్వాత పీఠపూజ చెయ్యాలి. ఆ తర్వాత మండూక, కాలాగ్నిరుద్ర, ఆధారశక్తి, కూర్మ, అనంత, వారాహ, పృథివీ, కంద, నాల, పద్మ, కర్ణిక, పత్ర మరియు కేసరముల ఆయా స్థానములలో పూజ చెయ్యాలి. నాలుగు దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యలను పూజించాలి. పీఠ శేష భాగములలో ఆపూర్వములను పూజించాలి. మళ్ళీ ఓంకారముతో పూజించాలి. మధ్యలో యజ్ఞమయీ, వేదమస్తక, పురుషాధిష్టిత విశ్వమాతను ధ్యానం చెయ్యాలి. ఒక చిన్న అంగారమును తీసుకొని అగ్నికుండము చుట్టూ తిప్పి బయటకు విసిరివేయాలి.      

      అస్త్రమంత్రముతో సమస్త భూతములనూ దూరంచేసి జ్ఞానాగ్నిని సంక్రమణ చేసి అగ్నిని ప్రజ్వలించాలి. దీపాద్ దీపాంతర న్యాయముతో సర్వతోముఖ అగ్నిని శ్వాసమార్గము నుండి యోనిమార్గము ద్వారా కుండములో వెయ్యాలి. కుండ మధ్యలో ఉన్న త్రికోణ మధ్యలో అగ్నిని ఉద్దీప్తము చెయ్యాలి. ముందుగా సప్తవ్యాహృతి మంత్రములతోనూ, ఆ తర్వాత అగ్నిమంత్రముతోనూ అగ్నిని ఉద్దీప్తము చెయ్యాలి. ఆ తర్వాత “చిత్పింగళ హన హన దహ దహ పచ పచ సర్వజ్ఞా జ్ఞాపయ స్వాహా” అను మంత్రముతో అగ్నిని ప్రార్థించాలి.  “అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం| సువర్ణవర్ణమమలం సమిద్దం విశ్వతోముఖం|” అను మంత్రంతో ఉపస్థానము చేసి జిహ్వాఙ్గ న్యాసము చెయ్యాలి. స్రూం, ష్రూం, శ్రూం, వ్రూం, ళూం, రూం, యూం – ఇవి జిహ్వాంగములు. పద్మరాగ, సువర్ణ, భద్రలోహిత, లోహిత, శ్వేతా, ధూమిల, కరాళిక – వీటికి క్రమంగా పైన చెప్పిన బీజములతో జోడించి పాదములు, లింగము, గుదము, మూర్ధా, ముఖము, నాసిక, నేత్రములందు పరమేశ్వరి న్యాసము చెయ్యాలి.

     పైన చెప్పబడిన సప్తజిహ్వలందు దేవతా, పితర, గంధర్వ, యక్ష, పన్నాగ, పిశాచ, రాక్షసులను ధ్యానం చెయ్యాలి.

ఆ తర్వాత షడంగన్యాసం ఈక్రింది విధంగా చెయ్యాలి.

ఓం సహస్రార్చిషే నమః – హృదయాయ నమః| ఓం స్వస్తిపూర్ణాయ నమః – శిరసే స్వాహా| ఓం ఉత్తిష్ఠపురుషాయ నమః – శిఖాయై వషట్| ఓం ధూమవ్యాపినే నమః – కవచాయ హుం| ఓం సప్తజిహ్వాయ నమః – నేత్రత్రయాయ వౌషట్| ఓం ధనుర్ధరాయ నమః – అస్త్రాయ ఫట్|

ఆ తర్వాత అష్టమూర్తుల న్యాసము చెయ్యాలి.

జాతవేద, సప్తజిహ్వ, హవ్యవాహన, విశ్వోదర, వైశ్వానర, కౌమారతేజ, విశ్వముఖ, దేవముఖ – వీరిని క్రమంగా మూర్ధా, అంస, పార్శ్వద్వయ, కటి, గుహ్య, కటిపార్శ్వ, కటి అంస, సర్వాంగములందు న్యాసము చెయ్యాలి. ఈ విధంగా న్యాసములు చేసిన తర్వాత అర్ఘ్యజలముతో ప్రోక్షణ చేసి నాలుగు దిక్కులందు దర్భలను పరచి అభిషేచనము చెయ్యాలి. ఆ తర్వాత “ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష తారవక్త్ర చిత్పింగళ సర్వకర్మాణి సాధాయ స్వాహా” అను మంత్రముతో అగ్నిని, సప్తజిహ్వలను పూజించాలి.  కుండ మధ్యన, షట్కోణములలోను అంగ పూజ చెయ్యాలి. అష్టపత్రములలో మూర్తులను, భూపురములో అష్టదిక్పాలకులను పూజించాలి. ఆ తర్వాత వైశ్వానరుడిని ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

వైశ్వానరం యష్ట్వా త్రినేత్రమరుణాప్రభం|

శుక్లాంబరం రక్తరత్నభూషణం పద్మసంస్థితం||

వరం శక్తిం స్వస్తికంచాభీతం హస్తైశ్చ బిభ్రతం|

అనేకహేమమాలాభిరంకితా సంస్మరేత్తతః||

ఆ తర్వాత అర్ఘ్యోదకముతో పాత్రలను ప్రోక్షణ చేసి శుద్ధి చెయ్యాలి. పాత్రలను అధోముఖంగా ఉంచి వాటి స్థానములలో ఉంచాలి. ప్రణీతా మరియు ప్రోక్షణీ లో జలమును, ఆజ్య పాత్రలో నెయ్యి ఉంచాలి. మిగిలిన పాత్రల్లో హోమ ద్రవ్యములను ఉంచాలి.

      సృక్కు, సృవము మరియు జలపాత్రలో రెండేసి పువ్వులను ఉంచాలి. అన్నింటికీ ధూపమును చూపించాలి. అన్ని మేఖలలందు కుండము యొక్క నాలుగు దిక్కులలలో దీపములను ఉంచాలి. ఆ తర్వాత వ్యాహృతలను ఉచ్చరిస్తూ హోమం చెయ్యాలి. దక్షిణమున బ్రహ్మను పూజించి అగ్నిగణముల కొరకు హోమము చెయ్యాలి. సిద్ధికొరకు అగ్ని గర్భాదానాది సంస్కరణములను ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా అగ్నిని పూజించిన తర్వాత అగ్నికుండములో శ్రీచక్రమును ధ్యానం చెయ్యాలి. ఆ చక్రమునకు లోపల సమస్త చక్రచక్రేశ్వరీ సహితా త్రిపురసుందరీని ఆవాహన చేసి నేతితో పదిసార్లు హోమం చెయ్యాలి. ఆ తర్వాత పూజ చేసి సమస్త చక్రచక్రేశ్వరి, ప్రకటాది యోగినులకు ఒకొక్క ఆహుతినివ్వాలి.

      ఆ తర్వాత పరాదేవి కొరకు హోమము చెయ్యాలి. ద్రవ్యములు వాటివల్ల కలుగు ఫలితములు ఈ క్రింది విధంగా ఉండును.

పద్మరాగము – సర్వసిద్ధిప్రదాయకము| రుద్రరక్త మరియు బంగారము – సర్వకామఫలప్రదము| లోహితములు – శాంతి, స్తంభనము| ధూమినీ (=?) – ఉచ్చాటన| కరాలినీ – మారణ|

ఈ విధంగా దివ్య, ఉత్తమ హోమలక్షణము తెలుపబడినది.

      దీప స్థానము వద్దకు వెళ్ళి జపము, హోమము చెయ్యాలి. ఇప్పుడు దీపస్థానమును తెలుపబడుచున్నది – ఎనిమిది కొష్ఠముల కూర్మచక్రమును నిర్మించాలి. అందులో రెండేసి స్వరములను పూర్వాది క్రమంలో లిఖించాలి. ఆ తర్వాత కవర్గాది సప్తవర్గములను పూర్వాది క్రమంలో లిఖించాలి. ల-క్ష వర్గమును ఎనిమిదవ కొష్ఠములో లిఖించాలి. ఇదియే కూర్మచక్రము. స్థాన అక్షరమును తాబేలు ముఖముగా భావించాలి. పార్శ్వములో ఉండు రెండు అక్షరముల సమూహము తాబేలు యొక్క చేతుల్లాగా భావించాలి. అక్కడ చేసే జప, హోమములు నిష్ఫలములు. రెండు కోష్ఠములలో (తాబేలు ఉదరము) జపము, హోమము చేస్తే అది మృత్యు హేతువు అవుతుంది. పశ్చిమం వైపు ఉండు రెండు కోష్ఠములు తాబేలు రెండు పాదములు. అవి రోగములను, హానిని కలుగచేయును. ఈ రెండు కోష్ఠములకు మధ్యన ఉండు కోష్ఠము తాబేలు తోక. ఈ కోష్ఠము దరిద్రమును పోగొట్టి సుఖమును ప్రసాదించును. అందువలననే చక్రములో చక్కగా కూర్చొని జపహోమాదులు చెయ్యాలి. అనుష్ఠాన స్థానము గ్రామము, నగరము, దేశము కావచ్చును. ఎక్కడైనా దీపస్థానములో కూర్చోవాలి. గుర్వాజ్ఞానుసారంగా చేసిన సాధన వలన సిద్ధి లభిస్తుంది.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన జపహోమవివరణం అను అరవైఒకటవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: