సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, జులై 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 12


మంత్రదోషముల శమన ఉపాయము

మంత్రదోషములను తెలుసుకొని ఆ దోషములను గురువు క్రమముగా పరిహారము చెయ్యాలి. అలా చేయకపోతే గురుశిష్యులిద్దరూ అల్పకాలంలోనే నాశనమవుతారని తంత్రరాజమునందు చెప్పబడినది. శివుడు చెప్పుచున్నాడు - కనుక, హేదేవీ! ఆ దోషములను నాశనము చేయు ఉపాయమును ధ్యానపూర్వకముగా వినుము. 
   
షడక్షర మంత్రము దగ్ధమవుతుంది. నిశ్చిత సంఖ్యకన్న ఎక్కువ జపము చేస్తే ఆ మంత్రము త్రస్త అవుతుంది. తక్కువ అక్షరముల మంత్రము బాల, ఎక్కువ అక్షరముల మంత్రము వృద్ధ. కర్మ బాహుల్యము వలన నిర్జిత మవుతుంది. సత్యవర్జిత అసహ్యము. అపూర్ణరూప మంత్రము ఛిన్న అవుతుంది. సానునాసిక మంత్రము స్తంభితము. అకాలవినియోగం వలన అప్రబుద్ధ మంత్రము సుప్త అవుతుంది. అన్యవర్ణముల వలన మంత్రము కీలిత అవుతుంది. విసంధికము రుద్ధ అవుతుంది. వైరి నమన్వితము దుఃఖి అవుతుంది. ఖండీభూతము వలన అంగహీన అవుతుంది. అపూర్ణ ఉపదిష్ట మంత్రము హీనవీర్యమవుతుంది. సదాప్రయోగము వల కుంఠిత అవుతుంది. క్లిష్టత, అతివిలంబిత మరియు ప్రలాపము వలన రుష్ట అవుతుంది. అన్యమంత్రములతో కలిపి జపం చేస్తే సహావిల అవుతుంది. జపకాలమునందు ఉపేక్ష మరియు వైషమ్యము వలన అవమానము అవుతుంది. ఈ 25 దోషాలను శమింపచేసి గురువు మంత్రను దానం చెయ్యాలి. యోనిముద్రా బంధనము చేసి మంత్ర దానము చేస్తే ఆ మంత్రము వీర్యవంతమవుతుంది. ఈ లక్షణముల ఆది-అంతములను గురువు తెలుసుకొని తీరాలి. ఆది-అంత-విహీన వర్ణములు శరదృతువు కాలమున ఉండు మబ్బులతో సమానము. అందువలన ప్రారంభము నుండి గురువు శిష్యునికి ఈ జ్ఞానమును ప్రసాదించాలి. దీని వలన సాధకుడు జ్ఞాని అవుతాడు.

ఏ మంత్రరాజమునకు ప్రారంభమున రెండు హూం లు, మధ్యన రెండు హూం లు, చివరన రెండు హూం లు ఉంటాయో ఆ ఆరు కర్ణికల మంత్రమును దగ్ధ అంటారని త్రిపురార్ణవమున చెప్పబడినది. ఈ మంత్రజపము వలన సిద్ధిరోధకము అవుతుంది. హూం బీజమును కూర్చ బీజమని అంటారు. విద్యాంసులు అందరూ ఈ మంత్రమును త్యజించాలని చెబుతారు. హూం కారమునకు కూర్చ, మాయా, సరస్వతీ, జల, నీర, కర్ణ మరియు కూల అను నామములు త్రిపురార్ణవమునందు చెప్పబడెను. అధిక అక్షరములు గల మంత్రమును త్రస్త అంటారు. ఆ మంత్రమును జపము చేస్తే అది అశుభమవుతుంది. లోపాముద్రా శుభోదయమునకు ముందు హంస చేర్చి మూడు సంవత్సరములు జపము చెయ్యాలి. ఆ తర్వాత, మధ్యమున కూడా చేర్చి మరో మూడు సంవత్సరములు జపము చెయ్యాలి. ఆ తర్వాత ప్రారంభమున శక్తి బీజము చేర్చాలి. ఈ విధముగా జపము చేసిన విద్య ఉతర్తోత్తర ఫలదాయిని అవుతుంది. వేరొక విధముగా ఆ విద్య సాధకుడిని నాశనము చేస్తుంది. శాస్త్రోక్త విధానముగా కాకుండా ప్రాప్తమైన మంత్రము గర్జిత అవుతుంది. ఏ మూర్ఖుడు లోభము వలనగానీ, మోహము వలన గానీ శాస్త్రోక్త విధిని పాటించకుండా మంత్రమును గ్రహిస్తాడో ఆ మంత్రము గర్జిత అవుతుందని త్రిపురార్ణవమునందు చెప్పబడినది. అందువలన, అటువంటి మంత్రదానము లేదా గ్రహించడం సదా సర్వదా వర్జితము.

       వైరికోష్ఠగత మంత్రము శత్రువు అవుతుంది. లఘు అక్షర మంత్రము బాల, గుర్వక్షర (=ఎక్కువ) మంత్రము వృద్ధ అవుతాయి. లఘ్వక్షర మరియు గుర్వక్షర మంత్రముల లక్షణము మాతృకా శ్వాసనందు చూడవచ్చు. కర్మ బాహుళ్యం వలన మంత్రము నిర్జితమవుతుంది. స్వతంత్రోక్త మార్గాన్ని విడచి మంత్ర జ్ఞాన్నాన్ని సంపాదించినట్లయినా లేదా తృప్తి పొందకపోయినా, గురువు నుండి మంత్రమును పొందినా సరే ఆ మంత్రము సిద్ధికి భ్రమకారిణి అవుతుంది. జపము, హోమము, అర్చన, మార్జన విధులు ఎన్ని సార్లు చేసినా కూడా ఆమంత్రము సిద్ధించదు మరియు నిర్జితమవుతుంది. ఈ ప్రకారము మంత్రము నిందితమవుతుంది. ఆ మంత్రము శతకోటి కల్పముల వరకు అనుష్ఠించినా కూడా ఫలము కలగదు. ఇందువలననే తమ తంత్ర ఆచారములను పాటించి సాధన చేయవలెను.

నియమము లేని జపమును అసహా అంటారు. ఇది త్రిపురార్ణవము నందు చెప్పబడినది. పురశ్చరణ వర్జితమును సత్యవర్జిత అంటారు. వీర్యహీనుడు ఏ ప్రకారముగా ఏ పనీ చెయ్యలేడో ఆవిధంగానే పురశ్చరణహీన మంత్రము వీర్యహీనమవుతుంది. నిత్య, నైమిత్తిక, పురశ్చర్యాది ఆచరణముల వలన మంత్రము సత్వగుణోపేతమవుతుంది. సత్త్వగుణ సంపన్న మంత్రము కల్పలత సమానముగా ఫలప్రదాయకము. పల్లవాదుల విలోపము వలన స్వర వర్ణములు విలోపమయి ఛిన్న అవుతుందని త్రిపురార్ణవము నందు చెప్పబడినది.

ఇంకాఉంది


కామెంట్‌లు లేవు: