సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, జులై 2020, మంగళవారం

మహామనుస్తవం 22.    యా శైశవాత్ ప్రభృతి నఃసంకటబహులేషు సంశయపదేషు|
       అవిదితమథవా విదితం పాతాత్ పాతి స్మ గంతుమిహ గమ్యమ్||

మనకు తెలిసినా, తెలియకున్నా మన చిన్నతనము నుండి మనకు కలిగే కష్ట, నష్ట, దుఃఖాలనుండి ఆమె మనలను క్రిందపడకుండా కాపాడుతూనే ఉండి మన గమ్యమునకు చేరుటకు సహకరిస్తూనే ఉన్నది.

దైవశక్తి, జీవుడిని అతడికి తెలియకుండానే రక్షిస్తూవుంటుంది. ఆ శక్తి కృప మరియు స్పర్శ వలన కలిగే కష్ట, నష్ట, దుఃఖాలు మంచి ఆధ్యాత్మిక అవకాశాలుగా మారి దైవశక్తి మీద ఉన్న అనుమానాలు చెరగని విశ్వాసాలుగా మారుతాయి.

పూర్వ జన్మలో చేసుకున్నపుణ్యఫలం కారణంగా ఈ జన్మలో జీవికి శ్రీవిద్యనుపాసించే భాగ్యము కలిగి శ్రీవిద్యామార్గములోకి ప్రవేశపెట్టబడతాడు. అందువలన శ్రీమాత ఆ జీవుని జీవితమును అతడి చిన్నతనము నుండి శ్రీవిద్యోపాసనకు అనుగుణంగా మలుచుతుంది. ఆ సాధకుడు పూర్వజన్మాభ్యాసం  చేత తనకు తెలియకుండానే శ్రీవిద్యాసాధన వైపు ఆకర్శింపబడి సాధన కొనసాగించగలుగుతాడు. తల్లి తన పిల్లలను ఎన్నడూ వదలదు అనుటకు ఇదియే నిదర్శనం.

భగవానుడు ఇదే విషయాన్ని భగవద్గీతలోని ధ్యానయోగంలో  సుస్పష్టం చేసెను. ధ్యానయోగంలో 37వ శ్లోకమునుండి 45వ శ్లోకమువరకు ఈ విషయాన్ని విశదీకరించెను. భ్రష్టుడైన సాధకుడు మళ్ళీ జన్మలో ఉన్నతమైన కుటుంబంలో పుట్టి (అనగా తన పూర్వ సాధనను తిరిగి కొనసాగించేందుకు వీలుగా ఉండే) తన సాధనను కొనసాగిస్తాడు. అతని పూర్వపూర్వములైన జన్మలలో సాధనా సంస్కారం చేత సిద్ధిని పొంది మోక్షాన్ని పొందుతాడని సాక్షాత్ భగవంతుడే చెప్పెను. 
    
ఇక్కడ గమ్యము ఏమనగా సాయుజ్యముక్తి. అనగా అమ్మలో లీనమవుట. ప్రతీ సాధకుడి గమ్యము అదేకావాలి.

శాస్త్రవిదిత క్రమశిక్షణా జీవనవిధానం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అంతేగానీ ఏవో నాలుగు భజనలు, ఆరు సమూహపారాయణాలు చేసినంత మాత్రమున సాధన అనిపించుకోదు. శాస్త్రవిదిత జీవనవిధానమును శ్రీవిద్యార్ణవములో చదివి తెలుసుకోగలరు.
ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: