సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, జూన్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 7

 రేచక ప్రాణాయామ క్రమము

యోగశాస్త్రములందు రేచక క్రమమును ఈ విధముగా చెప్పబడినది -

రేచక, పూరక, కుంభక క్రమములో ప్రాణాయామము మూడుసార్లు చెయ్యాలి. సహిత మరియు కేవల మునందు కుంభకము రెండు విధములు. సహిత ప్రాణాయామము నందు రేచకము తర్వాత నెమ్మనెమ్మదిగా పూరకము చెయ్యాలి. ఆ తర్వాత కుంభకము చెయ్యాలి. సిద్ధి కలిగేంతవరకు సహిత ప్రాణాయామము అభ్యసించాలి.

        ప్రపంచసారము నందు ప్రాణాయామ క్రమము ఈ విధంగా చెప్పబడినది - ప్రాణాయామము మూడు భేదములలో జరుగును. అవి రేచక-పూరక-కుంభక. దక్షిణ నాసాపుట నుండి శ్వాసను బయటకు పంపి, వామ నాసాపుట నుండి శ్వాసను తీసుకొని లోపల ఉంచి కుంభించాలి. తిరిగి దక్ష నాసాపుట నుండి శ్వాసను వదలాలి. ఇప్పుడు, దక్ష నాసాపుట నుండి శ్వాసను తీసుకొని కుంభించి, వామ నాసాపుట ద్వారా బయటకి వదలాలి. పదహారు మాత్రలతో పూరకము, అరవైనాలుగు మాత్రలతో కుంభకము మరియు ముఫైరెండు మాత్రలతో రేచకము చెయ్యాలి.

పూరక ప్రాణాయామ క్రమము

సముచ్ఛయము నందు పూరక ప్రాణాయామము ఈ క్రింది విధంగా చెప్పబడినది -

చంద్రనాడి ద్వారా నెమ్మదిగా వాయువును ఉదరమందు పూరించాలి. తంద్రా వికారము (=కునికిపాటు) వదలి కాలాగ్నిమూలము నందు చిత్తవృత్తిని అర్పించాలి. తర్వాత, వాయువును అరవైనాలుగు మాత్రలతో కుంభకము చేసి ముఫైరెండు మాతృకలతో బయటకు వదలాలి.

        వామకేశ్వర తంత్రంలో ఈవిధంగా చెప్పబడినది - పూరక, కుంభక, రేచకములను చింతన చేసి మూలాధారమునందు విలీనము చెయ్యాలి. తర్వాత, నెమ్మదిగా వాయువును లోపలికి తీసుకోవాలి. ఆ తర్వాత దానిని ప్రకాశరూపములో మనస్సునందు స్తంభింపచెయ్యాలి. అప్పుడు అక్కడ ముక్తిదాయినీ శుభవిద్యను చింతన చెయ్యాలి. ఆ తర్వాత వాయువును బయటకు వదలాలి. దానితో బాటుగా శరీరములో ఉన్న తమోగుణము కూడా బయటకు వచ్చినట్టుగా భావించాలి. వామనాసిక నుండి వాయువును పూరించి దక్షనాసిక నుండి రేచకము చెయ్యాలి. కుంభకమును చాలా చక్కగా అభ్యసించాలి. సదా కుంభకమును అభ్యసించడంతో ఉత్తమ సిద్ధి లభిస్తుంది. కుంభకమును అధేష్ట మాతృకలతో అభ్యాసము చెయ్యమని తత్త్వదర్శులు చెప్పారు.

        విద్యకు సంబంధించిన పూరకాది-రేచకాది క్రమమును నిత్యాతంత్రమునందు చెప్పబడినది. శ్రుతులను అనుసరించి ప్రపంచసారాది వైష్ణవ తంత్రములందు కూడా వీటి వర్ణన కలదు. శ్రుతివచనము - "ప్రాణాయామత్రయః ప్రోక్తా రేచకపూరక కుంభకాః". కొన్నింటి యందు కేవలము రేచక సాధన కూడా బలవర్ధకమని చెప్పబడినది. పూరకాది క్రమము వైష్ణవములందు కూడా చెప్పబడినది. కనుకననే ఈ ప్రకరణము నందు రెండు పద్ధతులనూ వివరించడం జరిగింది. మహేశ్వరుడు పూరకాది క్రమమును విశేషంగా చెప్పాడు. శ్వాసను లోపలికి తీసుకోవడం పూరక ప్రాణాయామము. శ్వాసను బంధించుట కుంభకము. శ్వాసను బయటకి వదలడం రేచక ప్రాణాయామము.

        దక్షిణామూర్తి ఈవిధంగా చెప్పెను - మూలమంత్రముతో వామనాసాపుట ద్వారా వాయువును పూరించాలి. మంత్రమును మూడు ఆవృతములు జపించేవారకు కుంభకము చెయ్యాలి. తర్వాత దక్షనాసాపుట నుండి వాయువును బయటకు వదలాలి. జ్ఞానార్ణవము నందు మరియు తంత్రరాజమునందు కూడా ఇది నిరూపించబడినది.  

తంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది - మూలాధారము నందు మనస్సును లగ్నం చేసి అక్కడ వరకు వాయువును పూరించాలి. నాడిని చక్రాంతరము వరకు తీసుకొచ్చి అన్ని అంగములందు సంచరిపచెయ్యాలి. సహజ వాయువును యథాశక్తి ఆకర్షించాలి. ప్రకాశాత్మక పరమాత్మనందు ఏ మనస్సు లీనమయి ఉంటుందో ఆ మనస్సును "ప్రకాశాగతమానస" అని అంటారు. దాని ద్వారా స్వప్రకాశ సచ్చిదానంద పరమాత్మ స్వరూపముతో కుంభకము చెయ్యాలి. ఈ అంగత్రయాత్మక ప్రాణాయామమునందు ఏ విద్యను ధ్యానము చెయ్యాలో/చేస్తారో ఆ విద్య మోక్షప్రదాయకము అవుతుంది. ఆ విద్యయే శ్రీవిద్య. ఇది ముక్తిదాయిని మరియు శుభదాయిని. కనుకనే కుంభక కాలమునందు మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు మూలవిద్యను భావించాలి. శ్రీవిద్యయొక్క సూక్ష్మ ధ్యానము పూరకాదులందు చెయ్యాలి. అసక్తులు కేవలము కుంభకమునందు చెయ్యవచ్చును. శ్వాస స్వభావంగా బయటకు వెళ్ళడమే రేచకము. మరియొక విధంగా అది జరగదు. ఆ విధంగా జరిగితే అది దోషమవుతుంది.

        గోరక్షశతకమునందు ఈ విధంగా చెప్పబడినది -

పూరక, కుంభక, రేచక అభ్యాసము వలన సిద్ధి లభిస్తుంది. ఏ విధంగా సింహము, ఏనుగు, పులి మొదలగునవి నెమ్మనెమ్మదిగా మచ్చిక అవుతాయో ఆ విధంగా వాయువు కూడా నెమ్మనెమ్మదిగా వశమవుతుంది. అన్యంగా అది సాధకుడిని నాశనము చేస్తుంది. ప్రాణాయామము చెయ్యడం వలన అన్ని రోగములూ నాశనము అవుతాయి మరియు అయుక్త అభ్యాసము వలన అన్ని రోగములూ ఉత్పన్నమవుతాయి. శ్వాసరోగములు, శిరోరోగములు, కంటిరోగములు మొదలగునవి అయుక్త అభ్యాసము వలన వస్తాయి. అందువలననే శాస్త్రోక్త మార్గములో ప్రాణాయామము చెయ్యాలి.

        వాయువుతో బాటుగా తమోగుణము కూడా దేహము నుండి బయటకు వెళ్ళడమే రేచకము యొక్క అర్ధము. వామనాసిక నుండి వాయువును తీసుకొనుట ప్రథమ ప్రాణాయామము. రెండవసారి దక్షిణ నాసిక నుండి శ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా పూరక, కుంభక, రేచకములను నెమ్మనెమ్మదిగా మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.

        యోగశాస్త్రములందు ఈవిధంగా చెప్పబడినది - సాధకుడు కొంచెం భోజనము చేసి దృఢ ఆసనము మీద కూర్చోవాలి. గురూపదేశము ప్రకారము ప్రాణాయామము చెయ్యాలి. వాయు చలనమునందు చిత్తము చంచలము అవుతుంది. నిశ్చలవాయువు నందు దృఢమవుతుంది. ఈ స్థితి ప్రాప్తి కొరకు యోగి వాయువును నిబంధితము చెయ్యాలి. మలపూర్ణ నాడి కారణంగా వాయువు మధ్యగామి అవాడు. ఆ కారణంగా ఉన్మనీ భావము ఏ విధంగా కలుగుతుంది? కార్యసిద్ధి ఏవిధంగా ఫలిస్తుంది? మలయుక్తమైన అన్ని నాడులనూ శుద్ధపరచి ప్రాణాయామ సాధన చెయ్యాలి. సాత్త్విక బుద్ధితో నిత్యమూ ప్రాణాభ్యాసము చెయ్యాలి. దీనివలన సుషుమ్నానాడికి ప్రక్కన ఉన్న మలము తుడిచి వేయబడుతుంది. పద్మాసనమున కూర్చొని ఎడమ నాసాపుట ద్వారా పూరకము చెయ్యాలి. యథాశక్తి కుంభకము చెయ్యాలి. కుడి నాసాపుట ద్వారా రేచకము చెయ్యాలి. ఇప్పుడు కుడినాసాపుట ద్వారా పూరకము, ఆ తర్వాత కుంభకము, ఎడమనాసాపుట ద్వారా రేచకము నెమ్మదిగా చెయ్యాలి. ఇడానాడి నుండి నిత్యమూ ప్రాణమును పూరించాలి. దానిని ఐక్యభావనతో రేచకము చెయ్యాలి. పింగళా ద్వారా పూరకము, ఇడ ద్వారా రేచకము చెయ్యాలి. ఈ విధంగా సూర్య, చంద్రుల అభ్యాసము వలన మూడు నెలలలో శుద్ధమవుతారు.

        త్రిపురాసారమునందు పైన చెప్పిన దానికి వ్యతిరేక దిశలో చెయ్యమని చెప్పబడినది. ఈ పద్ధతిలో శుద్ధ మనస్సుతో వాయువును నిగ్రహించాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: