సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జూన్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 9

 తొమ్మిదవ భాగము

త్రిపురేశ్వరీసమారాధన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - పంచ సింహాసనము మీద విరాజమానమైన మహేశ్వరీ విద్యను జపించాలి. ఈ విద్యను ప్రముఖ (=పుణ్య?) పురుషుడు మాత్రమే జపించాలి. సామాన్య పురుషునకు ఈ విద్యయందు అధికారము ఉండదు. ఈ విద్యకు సమానమైన విద్య మూడు లోకములందునూ దుర్లభము. ఈ విద్య ఓంవం(=ఐం?)క్లీంసౌః అను బీజములతో ఉండును. ఈ విద్య యొక్క ఋషి = దక్షిణామూర్తి అనగా నేను. ఋషిని శిరస్సు నందు న్యాసము చెయ్యాలి. ఛందస్సు - పంక్తిః. దీనిని ముఖము నందు న్యాసము చెయ్యాలి. హృదయమున వాగ్భవ బీజమును న్యాసము చెయ్యాలి. హ్సౌః - శక్తిబీజము. కామరాజ బీజము క్లీం కీలకము.

మంత్ర న్యాసము విపులంగా:

ఓం దక్షిణామూర్తి ఋషయే నమః - శిరసి| ఓం పంక్తయే చందసే నమః - ముఖే| ఓం ఐం బీజాయ నమః - హృదయే| ఓం హ్సౌః - శక్తయే నమః - నాభౌ| ఓం క్లీం కీలకాయ నమః - సర్వాంగే|

ఈ విద్య పురుషార్థమును ప్రసాదించును. పాదములనుండి నాభి వరకు మొదటి న్యాసము. నాభి నుండి వక్షస్థలము వరకు రెండవ న్యాసము. ఇక్కడ శక్తి బీజమును న్యాసము చెయ్యాలి. కంఠము నుండి మస్తకము వరకు మూడవ న్యాసము చెయ్యాలి. ఎడమ చేయి కరతలమున మరియు కుడి చేతి కరతలమున రెండు న్యాసములు చెయ్యాలి. రెండు చేతులనూ కలిపి ఒక న్యాసము చెయ్యాలి. ఈ ప్రకారం చేతులందు రెండు న్యాసములు అవుతాయి.

ఆ తర్వాత సంపుటిత మాతృకా న్యాసము చెయ్యాలి. సాధకుడు నవయోన్యంతిక న్యాసము చెయ్యాలి. రెండు చెవులు, చిబుకము, శంఖము (=నొసలు), ఆస్య (=ముఖము, నోరు), నేత్రములు, నాసిక, భుజద్వయము, హృదయములందు న్యాసము చెయ్యాలి. కూర్పర (=మోచేయి), కుక్షి, జానుద్వయము, పాదద్వయము, గుహ్యములందు క్రమంగా న్యాసము చెయ్యాలి. పార్శద్వయము, హృదయము, స్తనద్వయము, కంఠములందు క్రమంగా న్యాసము చెయ్యాలి. మూడు బీజములతో క్రమంగా తొమ్మిది సార్లు న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత ద్రాం న్యాసము చెయ్యాలి. కూం, భూం, నూం, లూం, హంసః బీజములతో లలాటము, కంఠము, హృదయము, నాభి మరియు మూలాధారములందు న్యాసము చెయ్యాలి. మళ్ళీ ఆ స్థానములందు క్లీంక్లీంక్లీం, ఐం, ద్రాం, స్త్రీంస్త్రీంస్త్రీంస్త్రీంస్త్రీం, క్లీం బీజములతో న్యాసము చెయ్యాలి.

ఆ తర్వాత ప్రాణాయామము చేసి దేవిని ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

ధ్యాయేద్దేవీమ్ మహేశాని కదంబవనమధ్యగామ్|

రత్నమండపమధ్యే తు మహత్కల్పలతాంతరే||

మాతృకాపత్రచ్ఛాయాయామ్ రత్నసింహాసనస్థితాం|

అనర్ఘ్యరత్నఘటితముకుటాం రత్నకుండలామ్||

హారగ్రైవేయసద్రత్నచిత్రితాం కంకణోజ్జ్వలామ్|

పాశాంకుశౌ మహేశాని దక్షవామకరేణ వై||

వరదాభయశోభాఢ్యామ్ సమ్యక్సారస్వతప్రదాం|

పై విధంగా దేవిని ధ్యానించిన తర్వాత, సమస్త కామ్యముల సిద్ధికై మంత్రమును ఆరు లక్షలు జపించాలి. ఈ విద్య భోగ, మోక్షములను రెండిటినీ, గురు కృప వలన కలిగిస్తుంది.

సర్వకామార్థ సిద్ధి కొరకు పద్మరాగ మణి ప్రభలు కలిగిన, రక్త వస్త్రములు, రక్తాభరణములు ధరించి ఉండు హకారార్ధస్వరూప, మూడు బిందువులతో యుక్తమై ఉండు కామకలా దేవిని ధ్యానించాలి. జపంలో దశాంశము హోమము అందులో దశాంశము తర్పణము చెయ్యాలి. తర్పణము వర్ణానుక్రమయోగము లేదా గంగాజలముతో చెయ్యాలి. ఇక్కడ వర్ణానుక్రమయోగము అనగా బ్రాహ్మణులు తీర్థ జలముతో, క్షత్రియులు నదీ జలముతో, వైశ్యులు వాపీ జలము (నుయ్యి)తో, శూద్రులు కూపజాలముతో తర్పణములు వదలాలి. తర్వాత, కర్పూరవాసిత జలముతో మూడుసార్లు తర్పణము వదలాలి. హోమము త్రిమధురమిశ్రిత పలాస (=మోదుగ) పుష్పములతో చెయ్యాలి.

ఇప్పుడు సర్వార్తసిద్ధిప్రద యంత్రము గురించి చెప్పబడుచున్నది. ముందు శక్తి అని లిఖించి దానిమీద అం లిఖించాలి. దానిని కొంచెం విస్తృతపరచి అగ్నిబీజం రం ను లిఖించాలి. సంధులను ఈ విధంగా భేదించగా నవయోనులు అవుతాయి. కమలమునందు హ్సౌః లిఖించాలి. ఎనిమిది కోష్ఠములందు కామాఖ్య బీజము ఘం ను లిఖించాలి. బయట ఒక వృత్తమును నిర్మించి అష్టదల పద్మమును నిర్మించాలి. అష్టదల పద్మ కేసరములందు రెండేసి స్వరములగా మొత్తం పదహారు స్వరములను లిఖించాలి. కచగరసతపయ - ఇవి ఎనిమిది వర్ణ సంస్కారములు. వీటిని ఎనిమిది దళములందు లిఖించి ఎనిమిది శూలములను రచించాలి. ఆ తర్వాత పత్రముల అగ్రభాగమున వర్ణములను క్రమంగా లిఖించాలి. శూలములందు పూర్వదిశనందు కఖగఘ అగ్ని కోణమునందు ఙచఛజ, దక్షిణదిశనందు ఝఞటఠ, నిరుతి కోణమున డఢణత, పశ్చిమ దిశనందు థదధ, వాయవ్య కోణమునందు నపఫబ, ఉత్తర దిశనందు భమర, ఈశాన కోణమున లవశ లను లిఖించాలి. ఆ తర్వాత మళ్ళీ మాతృకా బీజములతో వృత్తమును నిర్మించాలి. ఆ తర్వాత చతుర్ద్వార భూపురమును నిర్మించాలి. ఆ తర్వాత పీఠపూజ చెయ్యాలి. వామ, జ్యేష్ఠ, రౌద్రి, అంబికా, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను పీఠమునందు పూజించాలి. ఆ తర్వాత కుబ్జిక, విశ్వదేవి, విషఘ్నిక, ఇతర, ఆనందా దేవతలను కూడా పూజించాలి. వీరిని ముందు పూజించాలి. మళ్ళీ సింహాసమును పూజించి మధ్యన మాతృకాబీజమును పూజించాలి. సింహాసన పూజగురించి సదాశివమహాప్రేతపద్మాసనాయ నమః అని పూజించాలి.

      దేవికి సమీపంలో మోతీ (=ముత్యము) ఛత్రము, శరత్చంద్ర మరియు అగ్ని ఆకారములు నిర్మించాలి. వట్టివేళ్లతో (=సువాసన ఉండు ఒక రకమైన గడ్డి) చంద్ర కళా మరియు రెండు వ్యంజనములు నిర్మించాలి. తీరము/గట్టున ముత్యములు ఉంచాలి. స్వర్ణము మరియు దర్పణములతో పీఠమును అలంకరించాలి. పీఠము పైన కర్పూరము ఉంచాలి. ఒక చిన్న గిన్నెలో కర్పూర చూర్ణము వేసి ఉంచాలి. బంగారు దువ్వెన, పుష్పములు ఉంచిన పాత్ర దేవతలకు దగ్గర ఉంచాలి. ఆ తర్వాత దేవిని ఆహ్వానించాలి. ఉపచారములతో పూజ చేసి తర్పణములు వదలాలి. శరీరమున నవాంగములు చూపించాలి. ఆ తర్వాత ముద్రలు కూడా చూపించాలి. అగ్ని, ఈసాన, నిరృతి, వాయవ్య కోణములందు మరియు దిశలందు అంగపూజ చేయాలి.

      ఆ తర్వాత క్రమంగా రతి, ప్రీతి, కామదేవులను త్రికోణము చివరన పూజించాలి. వీరికి బయట బాణ దేవతలను అనగా పంచ దేవతలను పూజించాలి. దేవతకు కుడివైపున ఇద్దరిని, సమీపమున ఒకరిని, ఎడమవైపున ఇద్దరిని పూజించాలి. అనంగ, అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, సుభగా, భగా, భగసర్పిణీ, ఆనంగమాలినీ దేవతలను పూర్వ దిక్కున ప్రారంభించి ప్రదక్షిణక్రమంలో పూజించాలి. అష్టకోణము మరియు అష్టపత్రము లందు క్రింద చెప్పబడిన యుగ్మములను పూజించాలి.

అసితాంగభైరవ-బ్రాహ్మీ| రురుభైరవ-మహేశ్వరి| చండభైరవ- కౌమారి| క్రోధభైరవ - వైష్ణవి| ఉన్మత్తభైరవ - వారాహి| కపాలీశభైరవ - మాహేంద్రి| భీషణభైరవ - చాముండా| సంహారభైరవ - మహాలక్ష్మి| ఈ యుగ్మములను రెండేసి స్వరములతో పూజించాలి. ఆ తర్వాత, కామరూప, మలయ, కోల్లగిరి, కులాచల, చౌహార, జాలంధర, ఉడ్యాన, దేవకోల అను ఎనిమిది పీఠములను పూజించాలి.

బాహ్యవృత్తములో భైరవాదులను అర్చించాలి. వారు, హేతుక, త్రిపురాంతక, బేతాళ, అగ్నిజిహ్వ, కాలాంతక, కపాలీ, ఏకపాద, భీమరూప, మలయ, హాటక. వీరిని క్రమంగా పూర్వదిక్కునుండి ప్రారంభించి పూజించాలి. ఆతర్వాత, క్రింద-పైన నాలుగు దిక్కులందు ఇంద్రాదులను పూజించాలి. వీరికి ఎడమవైపున బటుక యోగిని, క్షేత్రపాల, గణేషులను పూజించాలి. ఆ తర్వాత పూర్వాది నాలుగు దిక్కులందు, ఆ తర్వాత అగ్న్యాది నాలుగు కోణములందు అష్టవసువులను పూజించాలి. ఏకాదశ రుద్రులు మరియు భూతములను పూజించి మళ్ళీ దేవిని పూజించాలి. ఐంక్లీంసౌః వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యో గంధ ఉత్తమః| ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం|| అని ధూపము సమర్పించాలి. ఐంక్లీంసౌః సుప్రకాశో మహాదీపః సర్వతస్తిమిరాపహః| సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోయం ప్రతిగృహ్యతాం|| అని దీపము సమర్పించాలి. ఐంక్లీంసౌః సమస్తచక్రసద్రస్మిమండలే వర్ణరూపిణి| ఆరార్తికం గృహాణేదం త్రిపురే మమ సిద్దయే|| అని హారతి సమర్పించాలి.

ఆ తర్వాత హేమపాత్రగతం దివ్యం పరమాన్నం సుసంస్కృతం| పంచధా షడ్రసోపేతం గృహాణ పరమేశ్వరి|| అని ఉపహారము సమర్పించాలి.

ఆ తర్వాత యథాశక్తి జపము, నిత్యహోమము చెయ్యాలి. మూలమంత్రంతో అయిదు ఆహుతిలు లేదా షడంగ హోమము చెయ్యాలి. ఈ నిత్య హోమము వలన విఘ్నములు దూరముగా పారిపోవును.

ఇప్పుడు సమస్త విఘ్నముల నివృత్తికి అన్య ఉపాయము చెప్పబడుచున్నది -

మంత్రవేత్త అగ్ని, నైరుతి, వాయవ్య, ఈశాన కోణములందు త్రికోణ, వృత్త, భూపురయుక్త మండలములను నిర్మించాలి. ఆ నాలుగు మండలములందు నాలుగు పాత్రలను ఉంచాలి. మండలములను అర్ఘ్య జలముతో వం వటుకాయ నమః| గం గణపతయే నమః| అం యోగినీభ్యో నమః| క్షం క్షేత్రపాలాయ నమః| అను మంత్రములతో పూజించాలి.

బ్లౌం వటుకాయ నమః| ఏహ్యేహి దేవీ పుత్ర వటుకనాథ కపిల జటాభారభాసుర, త్రినేత్ర జ్వాలాముఖ సర్వవిఘ్నాన్ నాశయ నాశయ సర్వోపచారసహితం బలిం గృహ్ణగృహ్ణ స్వాహా|  అని బలి సమర్పించాలి.

యోగినులను ఈ క్రింది విధంగా స్తుతించాలి -

ఊర్ధ్వే బ్రహ్మాండతో వా దివి గగనతలే భూతలే నిష్కలే వా

పాతాలే వా వనాన్తే సలిలపవనయోర్యత్ర కుత్ర స్థితా వా|

క్షేత్రే పీఠోపపీఠాదిషు కృతపదో ధూపదీపాదికేన

ప్రీతా దేవాః సదా నః శుభబలివిహితా వీరదేవేంద్రవంద్యాః||

యాం యోగినీభ్యః స్వాహా సర్వయోగినీభ్యో హుంఫట్ స్వాహా| - ఇవి యోగినుల మంత్రము.

ఇప్పుడు క్షేత్రపాలక మంత్రము చెప్పబడుచున్నది -

క్షాం క్షీం క్షూం క్షైం క్షౌం క్షః హుం స్థాన క్షేత్రపాల బలిం గృహ్ణగృహ్ణ సర్వకామం పూరాయ స్వాహా|

గణేశమంత్రము:

గాం గీం గూం గణప వరవరద సర్వజనం మే వశమానయ సర్వోపచారహితం బలిం గృహ్ణగృహ్ణ స్వాహా|

గణేశ మంత్రముతో కూడా బలిని సమర్పించాలి.

వటుకభైరవునికి తర్జనీ, అంగుష్ఠములతో బలిని సమర్పించాలి.

క్షేత్రపాలకునికి ఎడమ అంగుష్ఠ, అనామికలతో బలిని సమర్పించాలి.

బలిదాన సమయంలో యోని ముద్రను ప్రదర్శించాలి.  దేవిని స్తుతించి ప్రణామము చేసి ఆమెను సాధకుని హృదయములో స్థాపించినట్లుగా భావించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్రిపురేశ్వరీసమారాధన విధివివరణం అను తొమ్మిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: