సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, జూన్ 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 8

 మాతృకాపూజాసాధన విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఇప్పుడు అ నుండి క్ష వరకు వర్ణరూపీ అవయవములుకల లోకమాత మాతృకను నీకు తెలుపుచున్నాను. ఈ మంత్ర ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - మాతృక| హల (వ్యంజన) - బీజం| స్వరః - శక్తిః| వ్యక్తి - కీలకం| అనిర్వాచ్య హల వర్ణము శక్తి ద్వారా వ్యక్తమవుతుంది. శక్తి లేకుండా సూక్ష్మ శివ నామము మరియు ధామము లేవు. హల వర్ణము అసత్ రూపము మరియు పరాఙ్ముఖము. అది శక్తితో ఎప్పుడు సంసృష్ట (=బాగా కలుపబడ్డది)మవుతుందో అప్పుడు మంత్రములో చలనము కలుగుతుంది.

విశేషము: మాతృ శబ్దమునకు కన్ ప్రత్యయము కాగా మాతృకా శబ్దము ఏర్పడును. మాతృకల వాస్తవ స్వరూపము లోకులు తెలుసుకోలేరు. అందువలననే మనుష్యులు బంధములలో చిక్కుకుంటారు.

, ఋ(2),, ఌ(2) ఈ నాలుగు వర్ణములను వదలివేసి మిగిలిన పన్నెండు స్వరములతో ఆరు వర్గములను ఏర్పరచాలి. క్రోధ బీజము కలుపగా అవి మొత్తం ఏడు వర్గములు అవుతాయి. ఈ సప్తమ బీజమును ఆరు వర్గములకు ఒకొక్కదానికి చివరన కలిపి షడంగ న్యాసము చెయ్యాలి.

షడంగ న్యాసము:

అంఆంహుం హృదయాయ నమః| ఇంఈంహుం శిరసే స్వాహా

ఉంఊంహుం శిఖాయై వషట్| ఏంఐంహుం కవచాయ హుం|

ఓంఔంహుం నేత్రత్రయాయ వౌషట్| అంఅఃహుం అస్త్రాయ ఫట్|

ఆ తర్వాత పదహారుదళముల కమల కంఠమునందు (విశుద్ధి చక్రము) పదహారు స్వరముల న్యాసము చెయ్యాలి. ద్వాదశదళముల హృదయమున (అనాహత చక్రము) పన్నెండు వర్ణములను, దశదలముల మణిపూర చక్రమునందు (నాభి స్థానం) దశ వర్ణములను, ఆరుదళముల లింగమూల స్వాధిష్ఠాన చక్రమునందు ఆరు వర్ణములను, చతుర్దళ మూలాధార చక్రమునందు నాలుగు వర్ణములను, ద్విదళ భ్రూమధ్య ఆజ్ఞా చక్రమునందు హ మరియు క్ష వర్ణములను న్యాసము చెయ్యాలి. ఈ విధంగా యాభై వర్ణములతో చేసే న్యాసమును అంతర్మాతృకా న్యాసము అని అంటారు.

బ్రహ్మరంధ్రము, వక్త్రము, వేష్టనము (=తలపాగా, చెవి వెలుపల భాగము), నేత్ర ద్వయము, చెవులు, నాసాపుటములు, గండద్వయము, ఓష్ఠద్వయము, దంతపంక్తి, శిరస్సు, ముఖ స్థానములందు పదహారు స్వరములను న్యాసము చెయ్యాలి. భుజద్వయము, పాదద్వయముల సంధి, పార్శ్వద్వయము, పీఠము, నాభి, ఉదర స్థానములందు న్యాసము చెయ్యాలి. త్వక్, రక్త, మాంస, మేదా, అస్థి, మజ్జా, శుక్ర, ధాతువు, ప్రాణము, జీవ - ఈ దశ స్థానములందు ద నుండి ర వరకు న్యాసము చెయ్యాలి.  

వీటిని క్రమంగా న్యాసము చెయ్యాలి. మూలమంత్రంతో హృదయము ఆ తర్వాత కంఠము నందు న్యాసము చేయాలి. ఆ తర్వాత హృదయము నుండి పార్శ్వద్వయము, హస్తద్వయము, పాదద్వయము, ఉదరము మరియు ముఖ స్థానములందు మూలమంత్రముతో వ్యాపక న్యాసము చెయ్యాలి. ఈ వ్యాప్తియోగము ద్వారా మంత్ర సాధకుడు వర్ణరూపుడవుతాడు. ఆ తర్వాత దేవిని ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

ధ్యాయేద్వర్ణస్వరూపాఢ్యాం స్వరవక్త్రాం క్రమేణతు|

కచవర్గకరామ్ రమ్యాం టతవర్గపదాంబుజామ్||

పవర్గచారుపార్శ్వాంగలసత్సాతోదరీమ్ పరాం|

యసవర్గాఙ్గసుభగామ్ పీనోన్నతఘనస్తనీమ్||

నితంబినీంచ గహనాం శుక్లాక్షీం క్షామమధ్యమామ్|

ముక్తామాల్యాంగరాగాఙ్గీమక్షస్రక్కుమ్భశోభితామ్||

చింతాలిఖితసత్పాణిం సమప్రవరదాయినీం||

పైవిధంగా ధ్యానించి, దేవీ పూజ ప్రారంభించాలి.

యంత్రోద్దారము:

వృత్తము, దాని బయట అష్టదలము, దాని బయట మరొక అష్టదలము, దాని బయట చతురస్రమును లిఖించాలి.  వృత్త కర్ణికలో హంసః, మొదటి అష్టదలములో ఒక్కొక్క దళమునందు రెండేసి స్వరములు, రెండవ అష్టదలములో ఒకొక్క దళమునందు క,,,,,,,ళ-క్ష అష్టవర్గములను లిఖించాలి. చతురస్ర దిక్కులందు సిద్ధిదాయి బీజము (=గం?) ను, రేఖలకు లోపల బయట నాలుగు ఠ కారములు, వరుణబీజం వం లిఖించి దేవిని ఆహ్వానించాలి.

ముందు పీఠపూజ, ఆ తర్వాత పూర్వాది దిక్కులందు మేధా, ప్రజ్ఞా, ప్రభా, విద్యా, ధీ, ధృతి, స్మృతి, బుద్ధి లను, మధ్యన విశ్వేశరిని పూజించాలి. మాతృకాదేవిని ఆహ్వానించి గంధపుష్పాదులతో ఉపచార పూజ చెయ్యాలి. అగ్ని, ఈశాన, నైఋతి, వాయు కోణములందును, పూర్వాది దిక్కులందును అంగ పూజ చెయ్యాలి. రెండేసి స్వరములను జోడించి చివరన వేరువేరుగా నమస్కారము చెయ్యాలి. ఉదా: అంఆం నమః| ఇంఈం నమః| ఈవిధంగా అన్ని వర్ణములతోనూ చెయ్యాలి. దీనినే అష్టవర్గ పూజ అంటారు. ఆ తర్వాత బ్రహ్మ్యాది మాతృకలను, లోకపాలకులను క్రమంగా పూజించాలి. ఆతర్వాత ఒక లక్ష జపము చెయ్యాలి. జపంలో దశాంశము త్రిమధు మిశ్రిత పలాస (=మోదుగ) పువ్వులతో హోమం చెయ్యాలి. మితాహారము తీసుకొను సాధకుడు ఈ విధంగా చెయ్యడం వలన పురశ్చరణ ఫలం పొందుతాడు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన మాతృకాపూజాసాధన విధివివరణం అను ఎనిమిదవ భాగము సమాప్తము.

3 కామెంట్‌లు:

PADMAJA చెప్పారు...

శ్రీగురుభ్యోనమః 🙏

ఏ వర్ణము ను 'క్రోధ' బీజము అంటారు.
🙏

భువనానందనాథ చెప్పారు...

హుం ను క్రోధ బీజము అని అంటారు.
మీ ప్రశ్నకు సమాధానం షడంగన్యాసంలోనే ఉంది.

PADMAJA చెప్పారు...

ధన్యవాదములు🙏