సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, జూన్ 2021, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 7

 అజపావిధాన వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే పాపరహిత దేవీ! ఇప్పుడు నీకు అజపా అను పవిత్ర ఆరాధనా విధానము చెప్పుచున్నాను. దీనిని తెలుసుకున్న సాధకుడు పరంబ్రహ్మ అవుతాడు. హే దేవీ! మనుజుడు ప్రతి రోజూ హంస పదమును జపము చేస్తుంటాడు. కానీ మోహవశమున అతడికి ఆ మంత్ర జ్ఞానము కలగదు. శ్రీగురు కృపవలన ఏ సాధకుడికి ఈ మంత్ర జ్ఞానము కలుగుతుందో మరియు ఉచ్ఛ్వాస, నిశ్వాస రూపంలో జపము తెలుసుకుంటాడో అతడికి బంధములనుండి మోక్షము లభిస్తుంది. హం - ఉచ్ఛ్వాసము, సః - నిశ్వాసము. అందువలననే హంసను ప్రాణము అని అంటారు. ఆ ప్రాణము ఆత్మ రూపంలో ఉండును. ఒకజీవి స్పంద, ఆనందమయీ పరాదేవిని ప్రతిదినమూ 21600 సార్లు జపించును. జపారంభము దీని ఉత్పత్తి. జపనివేదన దీని మృత్యువు. ప్రత్యేక జపము చేయకుండానే ఈ మంత్ర జపము జరుగుచుండును. అందువలననే ఈ మంత్రమును అజపా అని అంటారు. భవ అనగా జన్మ లేదా సంసార రూప బంధమును తొలగించే ఈ దేవీ గురు కృపవలననే లభించును. అన్యథా లభించదు.

ఈ ప్రకారమైన ప్రతిరోజూ జపమును గణేశ, బ్రహ్మ, విష్ణు మరియు శివులకు అర్పించాలి. (ఈ అర్పణము నాలుగు భాగములు). గణేషాదులకు 6600, జీవాత్మకు 7000, పరమాత్మకు 7000, గురువుకు 1000 - ఈ విధంగా 21600 జపమును అర్పించాలి. 

      శ్వేతవర్ణ మూలాధార చక్రమున వ,,, స వర్ణములను ధ్యానము చెయ్యాలి. ఈ వర్ణముల వర్ణము బంగారు వర్ణమును కూడా నిరసించేంత బంగారు వర్ణము కలవై ఉండును. పగడ వర్ణములో ఉండు బ,,,,, ల వర్ణములను స్వాధిష్ఠానము నందు ధ్యానము చెయ్యాలి. ఈ వర్ణములు విద్యుత్ సమూహ కాంతులు కలిగి ఉండును. జలకాంతి కలిగే మణిపూరము నందు డ,,,,,,,,, ఫ వర్ణములను ధ్యానము చెయ్యాలి. ఈ వర్ణములు నీలం వర్ణములో ఉండును. పింగవర్ణ అనాహత చక్రమునందు క,,,,,,,,,,, ఠ వర్ణములను ధ్యానము చెయ్యాలి. ఈ వర్ణములు మహాగ్ని యొక్క నిప్పురవ్వకు సమానముగా ఉండును. ధూమ్రవర్ణ విశుద్ధి చక్రమున రక్తవర్ణ పదహారు స్వరములను ధ్యానము చెయ్యాలి. విద్యుత్ కాంతి ప్రభ కలుగు ఆజ్ఞా చక్రమున శుభ్ర వర్ణము హ మరియు క్ష లను ధ్యానించాలి. కర్పూరద్యుతి వర్ణము గల సహస్రదళ పద్మమున (బ్రహ్మ రంధ్రమున) నాదాత్మక బ్రహ్మమును ధ్యానము చెయ్యాలి. ఈ సప్త చక్రములందు ఉండు దేవతల కొరకు అహోరాత్రము జరుగు జపమును అర్పించాలి.

మూలాధారాది ఆరు చక్రములందు క్రమంగా గణేశ, బ్రహ్మ, విష్ణు, శివ, జీవాత్మ, పరమాత్మలకు జపమును అర్పించాలి. ఏడవ చక్రమైన సహస్రారము స్వయం నాద బ్రహ్మ రూపము. అక్కడ సంపూర్ణ జపమును అర్పించాలి.

వినియోగము ఈవిధంగా ఉంటుంది:

ఓం అస్యశ్రీ అజపామంత్రస్య| అవ్యక్తమూర్తిహంసో ఋషిః| గాయత్రీ ఛందః| పరమహంసో దేవతా| హం - బీజం| సం - శక్తిః| సోహం - కీలకం| ప్రణవస్తత్త్వమ్, ఉదాత్తం స్వరః| మోక్షార్థే వినియోగః|

షడంగ న్యాసము:

ఓం సూర్యాయ హృదయాయ స్వాహా|

ఓం సోమాయ శిరసే స్వాహా|

ఓం నిరంజనాయ శిఖాయై స్వాహా|

ఓం నిరాభాశాయ కవచాయ స్వాహా|

అనంతతంత్రః సూక్ష్మచతుర్వర్ణదేవీ ప్రచోదయాత్ నేత్రత్రయాయ స్వాహా|

అవ్యక్తప్రబోధాత్మనే అస్త్రాయ స్వాహా|

ఈ క్రింది విధంగా కూడా న్యాసము చెయ్యవచ్చు:

ఓం సూర్యాయ స్వాహా| హృదయాయ నమః|

ఓం సోమాయ శిరసే స్వాహా| శిరసే స్వాహా

ఓం నిరంజనాయ స్వాహా| శిఖాయై వషట్|

ఓం నిరాభాశాయ స్వాహా| కవచాయ హుం|

అనంతతంత్రః సూక్ష్మచతుర్వర్ణదేవీ ప్రచోదయాత్ స్వాహా| నేత్రత్రయాయ వౌషట్|

అవ్యక్తప్రబోధాత్మనే స్వాహా| అస్త్రాయ ఫట్|

సాధకుడు సంక్షేపంగా చక్కగా ప్రాణాయమము చెయ్యాలి. మూలమంత్రమును ఉచ్చరిస్తూ ఎడమ నాసాపుట ద్వారా శ్వాసను పూరించి మూలమంత్రమును మూడుసార్లు జపిస్తూ కుంభకము చేసి కుడి నాసాపుట ద్వారా రేచకము చెయ్యాలి. కనిష్ఠిక, అనామిక, అంగుష్ఠలతో నాసాపుటలను పట్టుకోవాలి. మధ్యమ, తర్జీనీలను వదలివేయాలి. ఇదే ప్రాణాయమము.

      హే దేవేశీ! ఈ హంసరూప పక్షికి శ్వాస ఉఛ్వాస, నిశ్వాసలే రెక్కలు. తార అనగా ఓం శిరస్సు. మూడు బిందువులు శిఖ మరియు నేత్రము. నాదము ముఖము. శివశక్తులు రెండు పాదములు. కాలాగ్నులు రెండు పార్శ్వములు. ఈ పరమహంస సర్వవ్యాపీ మరియు కోటి సూర్యులకు సమానమైన ప్రకాశము కలిగి ఉండును.  సంహారరూపీ ఈ హంస వివేకాత్మ జ్ఞానమును తెలుపును. ఏ మనుష్యుడు అజపా జపమును నిత్యమూ చేస్తాడో అతడికి పునర్జన్మ ఉండదు. ఈ మంత్రము మోక్షదాయకము.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన అజపావిధాన వివరణం అను ఏడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: