సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 8

ప్రాణాయామ మాత్రా లక్షణం

నారదుని ప్రకారము, శ్వాస యొక్క మాత్ర ఈ ప్రకారము ఉంటుంది - ఎంత సమయంలో చెయ్యి జానుమండలమును స్పర్శిస్తుందో అంత సమయమును ఏక మాత్ర అంటారు. ఆ మాత్రాకాలంలో శ్వాసను లోపలికి తీసుకోవాలి.

ఫేత్కారిణీ తంత్రము ప్రకారము, సామాన్యరూపంగా జానువుల చుట్టూ ప్రదక్షిణకు ఎంత సమయము పడుతుందో లేదా చిటికలు వెయ్యడానికి ఎంత సమయము పడుతుందో ఆ సమయమును మాత్రా అంటారు.

కాత్యాయినీ తంత్రము ప్రకారము, మధ్యవ్రేలి మూలము నుండి పై భాగము వరకు బొటనవ్రేలితో రాయడానికి పట్టే సమయమును మాత్రా అంటారు. మంత్ర ఉచ్చారణ కూడా మాత్ర అవుతుంది.

        గౌతమీయ తంత్రము ప్రకారము, దక్షణాసాపుట నుండి రేచకము, వామనాసాపుట నుండి పూరకము చెయ్యాలి. ముఫైరెండు మాత్రాకాలము కుంభకము చెయ్యాలి. ఇదే ప్రాణాయామము. దక్షిణామూర్తి కల్పము నందు ప్రాణాయామమును సువిధానముగా కుంభకము చేయాలని చెప్పబడెను. హృదయ పంకజమునందు దేవుని ధ్యానము చెయ్యాలి. అగస్త్య సంహితనందు యథాశక్తి శ్వాసను నియంత్రించుచూ మంత్రజపము చేయాలని చెప్పబడినది. ఒక నిర్ధిష్ట మంత్ర జప సంఖ్య లేనిచో అక్కడ వైష్ణవులు యథాశక్తి మంత్ర జపము చెయ్యాలి. ఈ విధంగానే ఎల్లప్పుడూ చెయ్యాలి. వామకేశ్వర తంత్రము నందు శ్రీవిద్య గురించి చెబుతూ, కుంభక ప్రాణాయామమును విద్వాంశులు ముక్తిదాయినీ విద్యగా భావించాలని చెప్పబడినది. వాస్తవానికి ఇక్కడ సగర్భ ప్రాణాయామములో కేవల కుంభకము నందు కుంభకము చెయ్యాలి. సహితా కుంభకములో మూడు కూటములతో కుంభకము చేయడానికి అశక్తులైతే కేవలము కుంభకముతో జపము, ధ్యానము చెయ్యాలి. మూలమంత్రము లేదా బాలామంత్రము లేదా ప్రణవముతో జపము చెయ్యాలి. ప్రణవోచ్చారణకు అనధికారి అయిన వ్యక్తి ప్రణవమునకు బదులుగా సార్థత్రిమాత్రిక ఓం కారమును జపము చెయ్యాలి. కాళికా పురాణము ప్రకారము పద్నాల్గవ మాతృక అయిన ఔ సార్ధమాతృక. తంత్రరాజము నందు శ్వాసను ముఫైరెండు మాతృకలతో పూరించి, అరవైనాలుగు మాతృకలతో కుంభించి, పదహారు మాతృకలతో రేచకము చేయాలని చెప్పబడినది. కాది మతము నందు దీనికి వ్యతిరేకముగా చెప్పబడినది. పైన చెప్పిన విధానమునకు అశక్తులైనచో ఫేత్కారతంత్రోక్త విధి ప్రకారము రేచకము చెయ్యాలి. ఏ విధముగా అనగా 12 మాతృకలతో కుంభకము, 24 మాతృకలతో రేచకము చెయ్యాలి. దీనికి కూడా అశక్తులైనచో సుభగోదయము నందు చెప్పిన విధంగా చెయ్యాలి. దీని ప్రకారము, ఒకసారి మంత్ర ఉచ్చారణ కాలము కుంభకము, రెండుసార్లు మంత్ర ఉచ్చారణ కాలములో వామ నాసిక నుండి రేచకము చెయ్యాలి. దీనికి కూడా అశక్తులైతే జ్ఞానార్ణవము మరియు దక్షిణామూర్తి తంత్రములందు చెప్పబడినది పాటించవచ్చు.

కేవలకుంభకము

యోగశాస్త్రములందు ఈ విధంగా చెప్పబడినది - రేచకము, పూరకములను వదలి, ముఖమునందు ఏ వాయువు ధారణ అవుతుందో ఆ వాయువును కేవల కుంభకము అంటారు. కేవలకుంభకము సిద్ధి అయితే ఆ సాధకునికి మూడు లోకములందు దుర్లభమయినది ఏదీ ఉండదు. కేవలకుంభకము వలన రాజయోగ లాభము కలుగుననుటలో ఎటువంటి అనుమానము లేదు. రాజయోగము లేక హఠసిద్ధి కలగదు. అందువలన యుగ్మనిష్పత్తి అభ్యాసము చెయ్యాలి. కుంభక ప్రాణమును రేచకము చేసిన తర్వాత చిత్తమును నిరాశ్రయము చెయ్యాలి. ఈ విధమైన అభ్యాసయోగము వలన రాజయోగ పదమునందు స్థిరము కలుగుతుంది. కుంభకము వలన కుండలినీ జాగృతము అవుతుంది. కుండలినీ జాగృతి అవడం వలన సుషుమ్నా ద్వారము తెరుచుకొని హఠసిద్ధి కలుగుతుంది. హ - సూర్యుడు, ఠ - చంద్రుడు. సూర్య-చంద్ర అనగా దక్షిణ-వామ, పింగళ-ఇడా ద్వారా ప్రాణ వాయువును మూలాధారాదులందు యోగించగా హఠయోగము అవుతుంది. ఆ ప్రాణాయామము రాజయోగము. సుషుమ్నా మార్గము ద్వారా షట్చక్రభేదనము శివశక్తి సామరస్యము. ఆ లక్షణము తంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది.-

కంపశ్చపులకానందోవైమల్య స్థైర్యలాఘవాః| తద్వత్కాంతి ప్రకాశౌచ యోగసిద్ధస్య లక్షణం||

ఈ సంబంధంతో యోగశాస్త్రములందు ఈ విధంగా చెప్పబడినది -

వపుఃకృశత్వం వదనప్రసన్నతా నాదస్ఫుటత్వం నయనే సునిర్మలే|

అరోగితాబిందుజయోగ్నిదీపనం నాడీవిశుద్ధేర్హఠ సిద్ధిలక్షణం||

ప్రాణాయామము గర్భ-నిగర్భ భేదముతో రెండు ప్రకారములని రుద్రయామలమునందు చెప్పబడినది. దీనికి సంబంధించి యోగినీ తంత్రమునందు ఈ ప్రకారముగా చెప్పబడెను.

అయం ప్రాణాయామః సకలదురితద్ధ్వమ్ సనకరోవిగర్భః ప్రోక్తోసౌ శతగుణఫలో గర్భకలితః|

జపధ్యానాపేతఃసతునిగదితోగర్భరహితః సగర్భస్తద్యుక్తోమునిపరివృఢైర్యోగనిరతేః||

ఈ ప్రాణాయామము ఉత్తమ, మధ్యమ, అధమ అను మూడు ప్రకారములుగా ఉంటుంది. తంత్రరాజము నందు ఈ విధంగా చెప్పబడినది -

ప్రాణాయామస్త్రిధాప్రోక్త ఉత్తమాధమమధ్యతః| లాఘవో భూతలత్యాగ ఉత్తమే చిత్తనివృత్తిః||

సర్వాంగన్వేదసంవృద్ధిరధమే మధ్యమేతథా| సర్వాంగకంపనం ప్రోక్తమభ్యాసాత్ కాలసంయుతాతౌ||

తేప్యుత్తమగుణా భూయురభ్యాసాత్ కాలయోగతః| తస్మాత్సంభ్యసేత్ప్రాతః సాయంచ నియమేనవే||

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: