సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 12

 శ్రీచక్రన్యాస కవచం (సంహార న్యాసం)

పై విధంగా షోఢాన్యాసము చేసిన తర్వాత కామరతి న్యాసము చెయ్యాలి. శివతా ప్రాప్తి గురించి శ్రీచక్ర న్యాసము చెయ్యాలి. ఈ న్యాసము శరీర శుద్ధి కారకము అవుతుంది.

రుద్రయామళమునందు ఈ విధంగా చెప్పబడినది -

ముందుగా సాధకుడు తన శరీరమును శ్రీచక్ర రూపముగా భావించాలి. తన శరీరమును జ్వలించుచున్న కాలానలముగా అర్ధం చేసుకోవాలి. ఋషి-ఛందస్సు-దేవతలను స్మరించి న్యాసము చెయ్యాలి. అనులోమ విలోమ మంత్రముతో (ఐంక్లీంసౌఃసౌఃక్లీంఐం) షడంగ న్యాసము చెయ్యాలి. ద్వాదశాంత చిదాకాశమునందు శివశక్త్యాత్మక గురుదేవుని పరమ ప్రకాశమయ రూపముగా ధ్యానం చెయ్యాలి. దీనివలన భోగము-మోక్షము రెండూ లభిస్తాయి. శ్రీరుద్ర యామలమునందు పార్వతి అడిగినందుకు శివుడు ఈ శ్రీచక్ర న్యాసము మరియు కవచమును లోకహితార్థము చెప్పారని చెప్పబడినది.

గురుధ్యానం:

ఆనందమానందకరం ప్రసన్నంజ్ఞానస్వరూపంనిజభావయుక్తం|

యోగీన్ద్రమీఢ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి||

వామజానుని - గణేశ| వామభుజే - క్షేత్రపాలక| దక్షజానునే - యోగిని| దక్షభుజే - బటుకభైరవ| దక్షపాదాగ్రే - ఇంద్ర| దక్షజానుని - అగ్ని| దక్షపార్శ్వే - యమ| దక్షాంసే - నిరృతి| వామాంసే - వరుణ| వామపార్శ్వే - వాయు| వామజానుని - కుబేర| వామపాదాగ్రే - ఈశాన| బ్రహ్మరంధ్రే - బ్రహ్మ| మూలాధారే - అనంతా| చతురస్రాది రేఖలందు నమః| వామ పాదాంగుళి, స్ఫిక్ (=పిరుదులు), కరాగ్ర, అంశకూట చూలీతమ, పృష్ఠభాగములందు వ్యాపక న్యాసము చెయ్యాలి. అంతరాలస్థ సిద్ధి గురించి వ్యాపక న్యాసము చెయ్యాలి. "చతురస్ర మధ్యరేఖాయై నమః" అని కూడా న్యాసము చెయ్యాలి. స్థానములందు బ్రాహ్మీ మొదలగు ఎనిమిది మాతృకల న్యాసము చెయ్యాలి.

కవచపాఠము:

భగవాన్ గణేశుడు నా వామజానువును రక్షించుగాక. క్షేత్రనాయకుడు నా వామ అంశమును రక్షించుగాక. యోగినులు నా దక్షిణ అంశములను రక్షించుగాక. వటుకభైరవుడు నా భుజములను రక్షించుగాక. ఇంద్రుడు నా దక్షపాదాగ్రమును రక్షించుగాక. అగ్ని నా దక్షజానుని రక్షించుగాక. యముడు నా దక్షపార్శ్వమును రక్షించుగాక. నిరుతి నా దక్షఅంసను రక్షించుగాక. వరుణుడు నా వామ అంసను రక్షించుగాక. సమీరణ నా వామ పార్శ్వమును రక్షించుగాక. కుబేరుడు నా వామ జానుని రక్షించుగాక. ఈశ్వరుడు నా వామ పాదమును రక్షించుగాక. బ్రహ్మ నా బ్రహ్మరంధ్రమును రక్షించుగాక. అనంతుడు నా మూలాధారమును రక్షించుగాక.

       పైన చెప్పిన కవచ పాఠము అయిన తర్వాత "చతురస్రాన్తరేఖాయై నమః" అని వ్యాపక న్యాసము చెయ్యాలి. తదనంతరం, కుసుమాంజలి సమర్పించాలి. అలా ప్రార్థన చేసిన తర్వాత, చేతులందు వరద మరియు అభయ ముద్రలను ధరించిన, పద్మరాగమణుల కాంతికి సమానమైన కాంతిగల అణిమాది దేవతలను ధ్యానించి వారు నా యందు ప్రసన్నులవుగాక అని భావించాలి. నా దక్ష అంసమును మరియు పృష్ఠ భాగమును అణిమా రక్షించుగాక. నా చేతుల అగ్రభాగమును లఘిమ రక్షించుగాక. నా దక్ష స్ఫిక్ ను మహిమా రక్షించుగాక. నా పాదముల పై భాగములను ఈశిత్వ రక్షించుగాక. నా వామపాదములను వశిత్వ రక్షించుగాక. స్ఫిక్ యొక్క అన్యస్థానములను ప్రాకామ్య రక్షించుగాక. నా వామ అంసమును ఇచ్ఛాసిద్ధి రక్షించుగాక. నా చేతి అగ్రభాగమును భుక్తి సిద్ధి రక్షించుగాక. నా శిరస్సును రస సిద్ధి రక్షించుగాక. నా శిరస్సు వెనకభాగమును మోక్షదా రక్షించుగాక. పాదముల వ్రేళ్లను బ్రాహ్మిణీ రక్షించుగాక. దక్షపార్శ్వమును మాహేశీ రక్షించుగాక. శిరస్సును కౌమారీ రక్షించుగాక. వామపార్శ్వముము వైష్ణవి రక్షించుగాక. వామజానువును వారాహీ రక్షించుగాక. దక్షజానువును ఇంద్రాణీ రక్షించుగాక. దక్ష అంసమును చాముండా రక్షించుగాక. వామ అంసమును మహాలక్ష్మీ రక్షించుగాక. తదనంతరము, చతురస్రాన్తరేఖాయై నమః అని చెప్పి వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

తమ చేతులందు వరద మరియు అభయ ముద్రలను కలిగి భక్తుల మీద అనుగ్రహము కలిగి, ఆమోద ప్రమోదములను హేతుస్వరూపముగా కలిగిన ముద్రాదేవతలు నా యందు ప్రసన్నులగుదురుగాక. నా పాదముల వ్రేళ్లను సర్వసంక్షోభిణీముద్ర రక్షించుగాక. నా దక్ష పార్శ్వమును సర్వవిద్రావిణీముద్ర రక్షించుగాక. నా మూర్ధమును సర్వాకర్షిణి ముద్ర రక్షించుగాక. నా వామ పార్శ్వమును సర్వవశంకరీ ముద్ర రక్షించుగాక. నా వామ జానుని సర్వోన్మాదినీ ముద్ర రక్షించుగాక. నా దక్ష జానువును సర్వమహాంకుశ ముద్ర రక్షించుగాక. నా దక్ష అంసమును సర్వఖేచరీ ముద్ర రక్షించుగాక. నా వామ అంసమును సర్వబీజ ముద్ర రక్షించుగాక. నా యోని మరియు రెండు అంగుష్ఠములను సర్వత్రిఖండ ముద్ర రక్షించుగాక. నా హృదయ మధ్య భాగమును సర్వసిద్ధి ముద్ర మరియు సర్వముద్రా సమన్విత త్రిపుర రక్షించుగాక. తదనంతరం "సర్వాశాపూరక షోడశారయవై నమః" అని చెప్పి వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

షోడశార పదహారు దేవతలూ పాశాంకుశములను ధరించి, రక్తవర్ణవస్త్రములను ధరించి, సర్వాభరణములతో శోభిల్లుతూ ఉండి నాయందు ప్రసన్నులగుదురు గాక. నా దక్షకర్ణవెనుక భాగమును కామాకర్షిణి రక్షించుగాక. దక్ష అంసమును బుద్ధ్యాకర్షిణి రక్షించుగాక. దక్షిణకూర్పరమును అహంకారాకర్షిణి రక్షించుగాక. దక్షహస్త పృష్ఠ భాగమును శబ్దాకర్షిణి రక్షించుగాక. దక్ష ఊరువును స్పర్శాకర్షిణి రక్షించుగాక. దక్షజానుని రూపాకర్షిణి రక్షించుగాక. దక్షగుల్ఫమును రసాకర్షిణి రక్షించుగాక. దక్షపాదములను గాంధాకర్షిణి రక్షించుగాక. ఎడమపాదమును చిత్తాకర్షిణి రక్షించుగాక. ఎడమపాదము క్రింద నుండి ఎడమ గుల్ఫము వరకు ధైర్యాకర్షిణి రక్షించుగాక. ఎడమజానువును స్మృత్యాకర్షిణి రక్షించుగాక. వామ ఊరువును నామాకర్షిణి రక్షించుగాక. ఎడమ చేతిని, దాని పృష్ఠభాగమును బీజాకర్షిణి రక్షించుగాక. ఎడమ కూర్పరమును ఆత్మాకర్షిణి రక్షించుగాక. వామ అంసమును అమృతాకర్షిణి రక్షించుగాక. వామశ్రోత్రమును శరీరాకర్షిణి రక్షించుగాక. తదనంతరము సర్వసంక్షోభణ చక్రాయ నమః అని చెప్పి వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

       రక్తవస్త్రములను ధరించి, చేతులందు ధనస్సు, బాణములను ధరించి ఉండే అనంగకుసుమాది దేవతలు నన్ను రక్షించుగాక. నా దక్ష శంఖ ప్రదేశమును (= కుడి కణత) అనంగకుసుమ రక్షించుగాక. దక్షజానుని అనంగమేఖల రక్షించుగాక. ఊరువులను అనంగమదనాదేవి రక్షించుగాక. గుల్ఫముల మధ్య భాగమును అనంగమదనాతురాదేవి రక్షించుగాక. వామాంగమును అనంగరేఖాదేవి రక్షించుగాక. ఊరువుల ప్రాంతమును అనంగవేగినీ రక్షించుగాక. వామజాను ప్రదేశమును అనంగాంకుశ రక్షించుగాక. వామశంఖమును అనంగమాలినీ రక్షించుగాక. హృదయభాగమును సిద్ధి మరియు ముద్రా సహిత అనంగసుందరి రక్షించుగాక. తదనంతరము, సర్వసౌభాగ్యదాయక చక్రాయ నమః అని వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

       ఆ తర్వాత, చేతులందు బాణధనస్సులను కలిగి, సమస్త ఆభరణములతో శోభిల్లుచూ ఉండి వైడూర్యమణికాంతి సమానంగా విరాజిల్లుతూ ఉండే శక్తి దేవతలు నన్ను రక్షించుగాక. నా లలాటమును సర్వసంక్షోభిణీ రక్షించుగాక. దక్షగండ స్థలమును సర్వాకర్షిణి రక్షించుగాక. దక్షఅంసమును సర్వాహ్లాదిని రక్షించుగాక. దక్ష పార్శ్వమును సర్వసమ్మోహిని రక్షించుగాక. దక్ష ఊరువు పృష్ఠ భాగమును సర్వస్తంభినీ రక్షించుగాక. దక్ష జంఘమును సర్వజృంభిణీ రక్షించుగాక. వామ జంఘమును సర్వవశంకరి రక్షించుగాక. వామపీఠమును సర్వసంపత్ప్రదాయినీ రక్షించుగాక. లలాట వామ భాగమును సర్వమంత్రమయి రక్షించుగాక. రోమఛిద్రములను సర్వద్వంద్వక్షయంకరి రక్షించుగాక. నా హృదయమును సిద్ధి మరియు ముద్రా సహిత త్రిపురవాసిని రక్షించుగాక. ఆ తర్వాత సర్వార్థసాధక చక్రాయ నమః అని వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

కుంద, మందార పుష్పముల కాంతితో ప్రకాశించుచూ కరకమలములందు వర మరియు అభయ ముద్రలను కలిగి సమస్త సిద్ధులను ప్రసాదించే దశశక్తులు నన్ను రక్షించుగాక. దక్షనేత్ర కోణమును సర్వసిద్ధిప్రద రక్షించుగాక. నాసికామూలమును సర్వసంపత్ప్రదా రక్షించుగాక. ఎడమచేతి కోణమును సర్వప్రియంకరి రక్షించుగాక. కోణసహిత కుక్షిని సర్వమంగళకారిణి రక్షించుగాక. ఎడమకుక్షి ప్రదేశమును సర్వకామప్రద రక్షించుగాక. వామజానుని సర్వదుఃఖవిమోచిని రక్షించుగాక. దక్షజానుని సర్వమృత్యుప్రశమని రక్షించుగాక. అపానప్రదేశమును సర్వవిఘ్ననివారిణి రక్షించుగాక. కుక్షి నైఋతి కోణమును సర్వాంగసుందరి రక్షించుగాక. కుక్షి ఆగ్నేయకోణమును సర్వసౌభాగ్యదాయిని రక్షించుగాక. నా హృదయ ప్రదేశమును సిద్ధి మరియు ముద్రాసహిత త్రిపురాదేవి రక్షించుగాక. ఆ తర్వాత సర్వారక్షాకరచక్రాయ నమః అని చెప్పి వ్యాపకన్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

స్ఫటిక కాంతి సమానమైన కాంతి కలిగి పుస్తకాదులను చేతులందు కలిగి ఉండే అంతర్దశార దేవతలు నాయందు ప్రసన్నలగుదురుగాక. సర్వజ్ఞాదేవి నా దక్షిణ నాసికను రక్షించుగాక. సర్వశక్తి దేవి నా సృక్విణీను (పెదవులు కలియు చోటు) రక్షించుగాక.  సర్వైశ్వర్యప్రదా దేవి నా స్తనములను రక్షించుగాక. సర్వజ్ఞానమయూ దేవి నా ముష్కమును (=వృషణము, అండము, గుహ్యప్రదేశము) రక్షించుగాక. నా సీవనీ ప్రదేశమును సర్వవ్యాధినివారిణి రక్షించుగాక.  వామ వృషణమును సర్వాధార స్వరూపిణి రక్షించుగాక. స్తనములను సర్వపాపహరీ రక్షించుగాక. వామనాసాపుటను సర్వరక్షాస్వరూపిణి రక్షించుగాక. నాసిక అగ్రభాగమును సర్వేప్సితఫలప్రదాయిని రక్షించుగాక. నా హృదయ కమలమును సిద్ధి మరియు ముద్రా సహిత త్రిపురమాలిని రక్షించుగాక. ఆ తర్వాత సర్వరోగహరచక్రాయ నమః అని చదివి వ్యాపకన్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

       సిందూరము మరియు స్వర్ణ రూపములు ధరించి పుస్తక అక్షమాలలను చేతులందు కలిగి ఉండు వాగ్దేవతలు నాయందు ప్రసన్నలగుదురు గాక. నా దక్షిణ చుబుకమును వశినీ దేవత రక్షించుగాక. నా కంఠమును కామేశ్వరి రక్షించుగాక. నా హృదయమునకు దక్షభాగమును మోదిని రక్షించుగాక. నాభి దక్షభాగమును విమల రక్షించుగాక. వామ నాభి భాగమును అరుణ రక్షించుగాక. హృదయమునకు వామ భాగమును జయని రక్షించుగాక. కంఠ భాగమును సర్వేశ్వరీ రక్షించుగాక. చిబుకమును కౌళిని రక్షించుగాక. సిద్ధి ముద్రా సహిత త్రిపురాసిద్ధాదేవి నా హృదయమును రక్షించుగాక. ఆ తర్వాత సర్వసిద్ధిప్రదాంతరాళ చక్రాయనమః అని వ్యాపక న్యాసము చేసి పుష్పాంజలి సమర్పించాలి.

       కామేశ్వరుడు, కామేశ్వరి, బాణము, చాపము, పాశము మరియు అంకుశము క్రమముగా నా హృదయ నాలుగు కోణములను రక్షించుగాక. కామేశ్వర్యాది నిత్యాషోడశీ దేవతలు నన్ను సదా రక్షించుగాక. కామప్రద రుద్రశక్తి నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. మహాయోని యొక్క అగ్రకోణము కామేశ్వరి రక్షించుగాక. జాలంధ్ర ప్రదేశమును వైష్ణవి రక్షించుగాక. యోని దక్షకోణమును వైష్ణవి రక్షించుగాక. యోని వామకోణమును భగమాలిని రక్షించుగాక. యోని మధ్య

భాగమును సిద్ధి మరియు ముద్రా సహిత త్రిపురాంబ రక్షించుగాక. హృదయమును మహాత్రిపురసుందరి రక్షించుగాక. చక్రేశ్వరి త్రిపురభైరవి తన సిద్ధి మరియు ముద్రా శక్తులతో నా పాదములనుండి మస్తకము వరకు రక్షించుగాక.

దీని తర్వాత శ్రీమహాత్రిపురశూన్యాశూన్యవర్జిత శక్తిపరబైందవ చక్రవాసిన్యనాఖ్యాభ్యాసాం శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అని చెప్పి నవ చక్రేశ్వరుల పూజ చెయ్యాలి. 

ఆ తర్వాత కఏఈలహ్రీంహసకహలహ్రీంసకలహ్రీం త్రిపురశూన్యాశూన్యపరబైందవ వాసిన్యనాఖ్యాభ్యాసాం శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః

ఈ కవచము రహస్యము, పరిపూర్ణము మరియు సమస్త కోరికలను సిద్ధింపచేయును. సాధకులు ఈ న్యాసమును తమ దేహమునందు స్థిరమనస్సుతో చెయ్యాలి. మనుష్య భావమును వదలి శివమయ భావములో లీనమవ్వాలి. త్రికాలములు ఎవరైతే చేస్తారో వారు యోగులవుతారు. భూత, ప్రేత, పిశాచాదులు వారిని బాధించలేవు. ఆ సాధకుడు మూడు తాపములనుండి విముక్తుడై సిద్ధిరూపుడై విచారణ చేస్తాడు. యోగి ఎక్కడ దీని స్మరణ చేస్తాడో అక్కడ నుండి పన్నెండు యోజనముల దాకా మండలాకార ధరణి యందు మూడు తాపముల బాధ ఉండదు.

సృష్టిచక్ర న్యాసము

యోగినీ హృదయము ప్రకారము, మూలదేవినుండి ప్రారంభించి అణిమాదాకా న్యాసము చెయ్యాలి. శిరః త్రికోణము నందు పూర్వాది క్రమముగా కామేశ్వర్యాది న్యాసము చెయ్యాలి. నేత్రములందు బాణము, భృకుటి నందు చాపము, కర్ణములందు పాశము, నాసాగ్రాము నందు అంకుశమును న్యాసము చెయ్యాలి. ముండమాలాక్రమములో ఎనిమిది వాగ్దేవతల న్యాసము చెయ్యాలి. బైందవాది చక్రముల న్యాసము నేత్రమూలము, అపాంగ, కర్ణపూర్వోత్తర, జుట్టుకు పైన, క్రింద, కర్ణముల వెనుక, కర్ణమూల బయట, కర్ణమూలము నందు న్యాసము చెయ్యాలి.

సర్వసిద్ధిదాయక న్యాసము కంఠమునందు ప్రదక్షిణ క్రమములో చెయ్యాలి. హృదయము నందు చతుర్దశార దేవతల న్యాసము చెయ్యాలి. నాభియందు అష్టదళ దేవతల న్యాసము చెయ్యాలి. ఉదర వామ పార్శ్వమున మొదటి నాలుగు దేవతా న్యాసము, వంశవామాంతరాళమున మిగిలిన నాలుగు దేవతల న్యాసము చెయ్యాలి. స్వాధిష్ఠానము నందు పూర్వదిక్కునుండి దక్షిణము వరకు న్యాసము చెయ్యాలి. మూలాధారమునందు దశముద్రల న్యాసము చెయ్యాలి. బ్రాహ్మీ మొదలగు ఎనిమిది మాతృకల న్యాసము దక్ష,వామ జంఘములందు చెయ్యాలి. వామ జంఘమునుండి వామాది క్రమములో అష్టసిద్ధులను న్యాసము చెయ్యాలి. మిగిలిని రెండు న్యాసములను పాదములపైన చెయ్యాలి. ఈ విధమైన న్యాసము వలన సాధకుడు దేవీ రూపుడవుతాడు.

సమష్టి రూపంలో మహాచక్ర న్యాసము చేసిన తర్వాత సృష్టిక్రమన్యాసమును మూలదేవి నుండి ప్రారంభించాలి. శిరస్సునందు త్రికోణమును భావించి పూర్వాది క్రమముగా కామేశ్వర్యాది బీజత్రయముతో న్యాసము చెయ్యాలి. లలాటమునందు త్రికోణమును, అష్టారచక్రమును కల్పించుకోవాలి.

జ్ఞానార్ణవమునందు ఈ విధంగా చెప్పబడినది - శ్రీవిద్యా న్యాసము బ్రహ్మరంధ్రము నందు చెయ్యాలి. ఆ తర్వాత గురుదేవుని న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత స్వరమాతృకాయుక్త తిథి నిత్యాదేవిల న్యాసము చెయ్యాలి. సర్వసౌభాగ్యదాయినీ మొదలగు 14 స్వరమాతృకల న్యాసము చెయ్యాలి. అః తో విశ్వమాతృకా శ్రీవిద్యా న్యాసము చెయ్యాలి. కమలనయనీ నిత్యల న్యాసము చెయ్యాలి.

భ్రూమధ్య, హృదయ, నాభి, స్వాధిష్ఠాన, మూలాధారములందు న్యాసముల తర్వాత ఊరువులు, జానువులు, జంఘములు, పాదములందు సానుస్వార న్యాసము చెయ్యాలి.

సాధక శ్రేష్ఠులు అంతఃకరణమునందు సమాహిత చిత్తముతో త్రిపురా ధ్యానము చెయ్యాలి. తర్వాత వ్యాపక న్యాసము చెయ్యాలి.

స్థితిచక్ర న్యాసము

యోగినీ హృదయము నందు ఈ విధంగా చెప్పబడినది - సాధకుడు మూర్ధ, గుహ్య, హృదయ, త్రినేత్ర, శ్రోత్రయుగళ, ముఖ, భుజ, పృష్ఠ, జానువులు, నాభిలందు విద్యా న్యాసము చేసి ఆ తర్వాత కరశుద్ధ్యాది న్యాసములు చెయ్యాలి. ఇక్కడ ఆధార-ఆధేయ భావముతో చక్ర-చక్రేశ్వరీ న్యాసము కూడా చెయ్యాలి. ముందుగా చక్రేశ్వరి విద్యాన్యాసము చెయ్యాలి. ఆ తర్వాత స్థితి న్యాసము చెయ్యాలి. నవయోని నుండి భూపురము వరకు సృష్టి న్యాసము మరియు భూపురము నుండి నవయోని వరర్కు సంహార న్యాసము.

ఈ ప్రకారము కరశుద్ధిన్యాసము, ఆత్మరక్షాన్యాసము, ఆత్మాసనన్యాసము, సర్వమంత్రాసన న్యాసము, సాధ్యసిద్ధాసన న్యాసము, మాయాలక్ష్మీన్యాసము, మూర్తివిద్యా న్యాసము, ఆవాహనీ విద్యా న్యాసము, పరాభైరవీ మూలవిద్యా విఖ్యాత త్రైలోక్యవశకారిణీ న్యాసము చెయ్యాలి. ఈ తొమ్మిది న్యాసములను పూజా సమయమునందు యత్నపూర్వకంగానైనా చెయ్యాలి.

ఈ న్యాసములను క్రమముగా ఈ క్రింది విధంగా చెయ్యాలి -

పాదాగ్రములు, జంఘాములు, జానువులు, ఊరువులు, గుదము, లింగాగ్రములందు చెయ్యాలి. మూలాధారమునందు ఆవాహనీ న్యాసము, మూలమంత్రముతో వ్యాపక న్యాసము, అకులాది పూర్వోక్త స్థానములందు చక్రేశ్వరి సహిత పూర్వోక్త నవచక్ర న్యాసము చెయ్యాలి. చక్రేశ్వరి పేర్లు క్రమముగా - త్రిపురాదేవి, త్రిపురేశ్వరి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధ, త్రిపురాంబికా, మహాత్రిపురసుందరి. పూర్వోక్త నవచక్రములందు వీరిని పూజించాలి.

యోగినీ హృదయము ప్రకారము విషు సంజ్ఞ అకుల సహస్రారము. శాక్తే - మూలాధారము, వహ్ని - స్వాధిష్ఠానము, నాభి - మణిపూరము, హృదయము - అనాహతము, విశుద్ధి - కంఠపద్మము, లంబికాగ్రము - అష్టదళ కమలము, భ్రూమధ్య - ఆజ్ఞాచక్రము. వీటియందు చెప్పబడిన న్యాసములు చెయ్యాలి.

స్వచ్ఛంద సంగ్రహమునందు ఈ విధంగా చెప్పబడినది - సుశుంనకు పైన కింద ఒకొక్క సహస్రదళ పద్మములు కలవు. సహస్రదళములందుండు శక్తులు ఎరుపు మరియు శ్వేతవర్ణము కలిగి ఉంటారు. క్రింద ఉన్న సహస్రదళ పద్మము ఊర్ధ్వ ముఖము. పైన ఉన్న సహస్రదళ పద్మము అధోముఖము. కింద సహస్రదళమునందు కుల శక్తులు, పైన సహస్రదళమునందు అకుల శక్తులు ఉండును. రెండు పంకజములందును శాశ్వతమైన అవ్యయస్థితి ఉంటుంది. దీని మధ్యలో సుషుమ్నాంతమునందు త్రిదశాధార పంకజము ఉంటుంది. శక్తిరూప శివాకార సర్వాణికి అది నిలయము. గుదము మరియు లింగమునకు మధ్యన ఉన్న అయిదు అంగుళముల స్థానములో గుదమునకు ఒక అంగుళము మధ్యలో రెండు అంగుళముల విస్తృత మహాయోని త్రికోణాకార రూపిణీ శక్తి ఉంటుంది. సుషుమ్నా యోని మధ్యన, సుషుమ్నకు మూలమున ఉన్న సహస్రారపద్మ కర్ణికలో రక్తవర్ణముతో ప్రకాశమానంగా ఉంటుంది. ఆ పద్మ దళములు శక్తులకు నివాసములు. ప్రత్యేక కింజల్కమునందు శక్తి సహిత కర్ణికా మధ్యభాగమున కులదేవి ఉంటుంది. ఆ పద్మమునకు పైన సుషుమ్నకు ఒక అంగుళము పైన అష్టదళ అష్టగ్రంథియుక్త పద్మము ఉంటుంది. ఆ పద్మము ఎర్రగా ఉంటుంది. గ్రంథి అగ్రభాగమున త్రిష్టంగమునందు బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలు వారి భైరవులతో సహా ఉంటారు. అష్టపత్ర గ్రంథులందు వర్గాది శక్తులు అన్యశక్తులతో కలిసి సమావృతమై ఉంటారు. వారి మధ్యన వారిచే సేవించబడుచున్న కౌలశక్తిని ధ్యానించాలి. ఈ పద్మమునకు ఒక అంగుళము పైన షట్దళ కులపంకజము ఉంటుంది. ఆధార పద్మముయొక్క వర్ణము పసుపు. దానికి నాలుగు దళములు మరియు సుందర కేసరములుందును. అది అథోముఖముగా ఉండును. దీని మధ్యన కుండలీ పరమేశ్వరి ఉండును. కుండలీ స్వయంభూ మరియు వరదాదులతో ఆవృతమై ఉండును. అది పార్థివ పంకజము. దీని కిందన తేజస పంకజము ఉంటుంది. దీనిలో ఉండే నిష్కలా శక్తులను విద్యుత్పుంజ సమానముగా స్మరించాలి. దీని ఊర్థ్వకర్ణిక మధ్యభాగమున ఊర్ధ్వగామి పీఠముపైన శాకినీ శక్తి ఉంటుంది.  

ఆధారపద్మమునకు రెండున్నర అంగుళములమీద పీతవర్ణ అష్టపత్ర కర్ణిక మధ్యభాగమున అనంగాది సేవిత హృల్లేఖ ఉంటుంది. దీనికి రెండు అంగుళముల మీద షట్ దళ స్వాధిష్ఠానమున ఉంటుంది. అది జలతత్త్వాత్మికము. పూర్వాది క్రమములో బంధినీ శక్తులతో ఆవృతమై ఉంటుంది. దీనియందు కాకినీ శక్తిని ధ్యానించాలి. దీనికి ఎనిమిది అంగుళములపైన నాభికి వెనుకన దశదళ మణిపూర చక్రము/పద్మము ఉంటుంది. ఇందు డామర్యాది శక్తులతో ఆవృతమైన లాకినీ శక్తి ఉంటుంది. మణిపూరమునకు పద్నాలుగు అంగుళములపైన ద్వాదశదళ అనాహత చక్రము ఉంటుంది. దీనియందు రాకిణీ శక్తి ఉంటుంది. రాకిణీశక్తి కాళరాత్ర్యాది శక్తులచేత ఆవృతమై ఉండును. దీనికి మధ్యలో సూర్యబింబమునందు ఓడ్యాణ పీఠము ఉండును. ఈ పద్మమునకు ఒక అంగుళము పైన షోడశదళ విశుద్ధి చక్రము ఉంటుంది. ఈ చక్ర మధ్యన డాకినీ శక్తి ఉంటుంది. పత్రములందు అమృతాది శక్తులుండును. ఈ పద్మము చంద్రప్రభల కాంతితో ఉండును. కంఠమునకు నాలుగు అంగుళములపైన లంబిక ఉండును. అందు అష్టదళ కమలము ఉండును. అది రసికాదులచే ఆవృతమై ఉంటుంది. దీనికి పైన ద్విదళ ఆజ్ఞాచక్రము హ,క్ష వర్ణములతో ఉండును. ఇవియే హంసవతి మరియు క్షమా. వీటి మధ్య హాకినీ శక్తి వుండును. తర్వాత లలాటమునకు పైన బిందు ఆవరణయుక్త వృత్తము ఉండును. అది కోటి సూర్యుల ప్రకాశముతోనూ మరియు మహాగుణములతోనూ సమన్వితమై ఉండును. దాని మధ్యన పదికోట్ల యోజనముల విస్తృతమైన పంకజము ఉంటుంది. ఈ పద్మ కర్ణికమున శాంత్యాతీత ఈశ్వర ప్రభువు ఉండును. ఈయనికి అయిదు ముఖములు మరియు పది చేతులుండును. ఈయన ఆకృతి విద్యుత్ పుంజ సదృశము. ఈయనకు వామభాగమున నివృత్తి ప్రతిష్ఠా విద్యాశాంతి పరివారయుక్త శాంత్యాతీత మనోన్మనీ పంచముఖీ దశభుజి ఇందుభూషణ సుందరీ ఉంటుంది. ఇది బిందు తత్త్వము.

ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన ఆరవశ్వాస సమాప్తము.

కామెంట్‌లు లేవు: